Jump to content

మహాప్రస్థానిక పర్వము

వికీపీడియా నుండి
(మహాప్రస్ధానిక పర్వము నుండి దారిమార్పు చెందింది)

శ్రీకృష్ణుడు, బలరాముడు నిర్యాణము చెందారు. యాదవులు అందరూ మరణించారు. అర్జునుడిని వ్యాసుడు మహాప్రస్థానికి సిద్ధమవమని చెప్పాడు. అదే విషయాన్ని అర్జునుడు ధర్మరాజుకు చెప్పాడు. ఆ మాటలు విన్న ధర్మరాజు అర్జునుడితో " అర్జునా ! అన్నిభూతములను కాలుడు కాల్చకమానడు. మనము కూడా ఈ శరీరాన్ని వదలవలసిన కాలము ఆసన్నము అయింది. మనము కూడా అన్ని కర్మలను త్యజించవలసిన కాలము సమీపించింది. నీ అభిప్రాయము అదేకదా ! " అని అడిగాడు. అర్జునుడు " అన్నయ్యా ! మీరు చెప్పినది నిజము. కాలానికి సాటి కాలమే. మనము కూడా కాలముతో పయనించక తప్పదు " అన్నాడు. వెంటనే ధర్మరాజు భీమ, నకుల, సహదేవులను పిలిపించాడు. వారికి అన్ని విషయములు చెప్పాడు. వారు కూడా ధర్మరాజు మాటలకు అంగీకారము తెలిపారు.

ధర్మరాజు కురుసామ్రాజ్య వారసులను నిర్ణయించుట

[మార్చు]

ధృతరాష్ట్రుడి వారసులలో యుయుత్సుడు ఒక్కడే మిగిలాడు. ధర్మరాజు యుయుత్సుడిని కురుసామ్రాజ్యానికి పట్టభిషిక్తుడిని చేసాడు. పరిక్షిత్తుని యువరాజుగా పట్టభిషిక్తుడిని చేసాడు. యుయుత్సుడికి రాజ్యపాలన గురించిన విషయములు అన్నీ వివరించాడు. తరువాత సుభద్రతో " అమ్మా సుభద్రా ! ఈ భరత సామ్రాజ్యానికి నీ మనుమడు ఉత్తరాధికారి అయ్యాడు. శ్రీకృష్ణుడి మనమడు వజృడు ఇంద్రప్రస్థానికి రాజు అయ్యాడు. ఈ విధముగా కురువంశము, యాదవవంశము వర్ధిల్లుతాయి. ఈ రెండు వంశాలను నీవే రక్షించాలి " అని సుభద్రను రెండు వంశాలకు సంరక్షకురాలిగా నియమించాడు. తరువాత భారతయుద్ధములో మరణించిన వీరుల కుటుంబాలకు అగ్రహారాలు, గ్రామాలు, ధనము ఇచ్చి వారి పోషణకు తగు ఏర్పాట్లు చేసాడు. బ్రాహ్మణులకు గోదానములు, భూదానములు, సువర్ణ దానములు విరివిగా చేసాడు. పరీక్షిత్తును కృపాచార్యుడికి శిష్యుడిగా అప్పగించాడు. తరువాత హస్థినాపురప్రజలతో ఒక సభ ఏర్పాటు చేసాడు.

పాండవులు మహాప్రస్థానికి తరలుట

[మార్చు]

ధర్మరాజు హస్థినాపుర వాసులను పిలిచి ఏర్పాటు చేసిన సభలో హస్థినాపుర వాసులతో " హస్థినాపుర వాసులారా ! మా అయిదుగురికి బదులుగా అభిమన్యుడి కుమారుడిని మహారాజుగా నియమించాను. అతడి మీద కూడా మీరు మీ ప్రేమ అభిమానము చూపండి " అని చెప్పాడు. హస్థినపుర వాసులకు పాండవులు వెళ్లిపోతున్నారన్న విషయము అర్ధము అయింది. వారు " మహారాజా ! ఏమిటిది ? మమ్ములను ఇలా వదిలి పెట్టి వెళ్ళడము మీకు ధర్మమా ! నీవు ప్రేమమూర్తివి, కరుణామూర్తివి అంటారే ఇదేనా మీ కరుణ. మేమంతా నిన్ను చూసుకుని కదా బ్రతుకుతున్నది. మీరు లేక మేము ఎలా బ్రతుకగలము. మమ్ము వదిలి వెళ్ళడము భావ్యమా " అని ప్రార్థించారు. వారిని ధర్మరాజు అనునయ వాక్యాలతో అనునయించాడు. తరువాత పాండవులు, ద్రౌపది తమ వస్త్రములను మార్చుకుని నారచీరలను, నారవస్త్రాలను, జింకచర్మాలను ధరించారు. ఆభరణములను తీసివేసారు. తరువాత అగ్ని కార్యములు నెరవేర్చి అగ్నిని నీటిలో నిమజ్జనము చేసారు. అందరూ అంతఃపురమును విడిచి బయలుదేరారు. పాండవులు ముందు నడువగా ద్రౌపది వారిని వెంబడించింది. వారి వెంట ఒక కుక్క కూడా వెంబడించింది. హస్థినాపురవాసులు వీధులకు అటూ ఇటూ నిలబడి వారికి కన్నీటితో వీడ్కోలు పలుకుతున్నారు. పాండవులు అలా వెళుతున్నప్పుడు హస్థినాపురవాసులకు జూదములో ఓడి అడవులకు వెళుతున్న దృశ్యము గుర్తుకు వచ్చింది. వారి వెంట యుయుత్సుడు సైన్యముతో నడుస్తున్నాడు. అతడి వెంట విచారవదనముతో పరీక్షిత్తు నడుస్తున్నాడు. అందరూ హస్థినాపుర పొలిమేరలకు వచ్చారు. ధర్మరాజు హస్థినాపుర వాసులతో ఇక ఆగమని చెప్పాడు. వారంతా పాండవులకు ప్రదక్షిణలు చేసారు. పాండవులు ద్రౌపదితో ముందుకు సాగారు. యుయుత్సుడు, పరీక్షిత్తు వెనుదిరిగి హస్థినాపురము చేరుకున్నారు. అర్జునుడి భార్య ఉలూపి తన పుట్టిల్లు అయిన నాగలోకము చేరింది. చిత్రాంగద తన కుమారుడు అయిన బభ్రువాహనుడి వద్దకు చేరింది. కృపాచార్యుడు, ధౌమ్యుడు ధర్మరాజు ఆదేశానుసారము హస్థినాపుర బాధ్యతలను స్వీకరించారు.

అర్జునుడు గాండీవమును వరుణదేవుడికి ఇచ్చుట

[మార్చు]

పాండవులు ద్రౌపది అలా ప్రయాణిస్తూ ముందుకు సాగి గంగానదిని దాటి తూర్పు సముద్రతీరానికి చేరుకున్నారు. వారి వెంట కుక్క కూడా వారిని అనుసరించి పోసాగింది. అప్పుడు వారికి అగ్నిదేవుడు ప్రత్యక్షమై " అర్జునా ! శ్రీకృష్ణుడి సుదర్శనచక్రము ఎప్పుడో వైకుంఠము చేరింది. నీవు ఇంకా ఈ గాండీవము వదలక ఉన్నావు. దుష్టసంహారణార్ధము నేను ఈ గాండీవాన్ని వరుణుడి వద్ద నుండి తీసుకువచ్చి నీకు ఇచ్చాను. ఇది నీకు ఇచ్చిన కార్యము నెరవేరింది కనుక దీనిని ఇక వరుణదేవుడికి అప్పగించు " అన్నాడు. అర్జునుడు అందుకు అంగీకరించి గాండీవమునకు నమస్కరించి దానిని సముద్రపునీటిలో వదిలాడు. గాండీవము వరుణుడిని చేరింది. తరువాత అగ్నిదేవుడు అదృశ్యము అయ్యాడు.

పాండవులు ఒకరి తరువాత ఒకరు పడిపోవుట

[మార్చు]
నడవలేక పడిపోయిన ద్రౌపది

పాండవులు దక్షిణ దిక్కుగా ప్రయాణించి అక్కడ నుండి పడమరగా ప్రయాణించి పడమర సముద్రతీరము చేరుకున్నారు. నీటిలో మునిగిన ద్వారక సమీపముకు వెళ్ళారు. తరువాత వారందరూ ఉత్తర దిక్కుగా ప్రయాణించి హిమవత్పర్వతము చేరుకున్నారు. అక్కడ నుండి ప్రయాణించి మేరుపర్వతము చేరుకున్నారు. ఇప్పుడు వారు యోగసమాధిలో ఉన్నారు కనుక వారికి నడకశ్రమ తెలియడము లేదు. ముందుగా ద్రౌపదికి యోగసమాధి సడలింది. ద్రౌపది ఇక నడవలేక నేలమీద పడిపోయింది. అది భీముడు చూసి ధర్మరాజుకు చెప్పాడు. ధర్మరాజు భీముడితో " భీమా ! పాంచాలరాజపుత్రి ద్రౌపదిని అర్జునుడు మత్స్య యంత్రము కొట్టి గెలుచుకున్నాడు కనుక ఈమెకు అర్జునుడంటే అధికమైన ప్రేమ, అనురాగము. ఈమె ప్రేమలో పక్షపాతము ఉన్నది కనుక ఈమె చేసిన పుణ్యములు ఫలించక ఇలా పడి పోయింది " అన్నాడు. భీముడు ద్రౌపది వంక చూసాడు. అప్పటికి ఆమె మరణంచింది. ధర్మరాజు నిర్వికారముగా ఆమె శవమును అక్కడే వదిలి ముందుకు సాగాడు. మిగిలిన నలుగురు ధర్మరాజును అనుసరించారు. ఇంతలో సహదేవుడు నేల మీద పడ్డాడు. సహదేవుడు పడి మరణించడము చూసిన భీముడు ధర్మరాజుతో " అన్నయ్యా ! సహదేవుడు కింద పడిపోయాడు. సహదేవుడు అహంకారము అంటే ఏమిటో తెలియదు. నిన్ను సదా భక్తితో సేవించాడు. మా అందరిలో సన్మార్గచరితుడు. అతడిలా పడిపోవడానికి కారణము ఏమిటి ? " అని అడిగాడు. ఆ మాటలకు ధర్మరాజు " అతడికి తన కంటే ప్రాజ్ఞుడు ఈ లోకములోనే లేడన్న గర్వము ఉంది. ఆ గర్వాతిశయముతోనే అతడు కింద పడిపోయాడు " అని చెప్పాడు. ఆ తరువాత ధర్మరాజు సహదేవుడిని కూడా ద్రౌపదిలాగానే అక్కడే వదిలి నిర్వికారముగా ముందుకు నడిచాడు. నకులుడు, అర్జునుడు భీముడు ధర్మరాజును అనుసరించారు. కుక్క మాత్రము వారిని వదలకుండా వెన్నంటింది. మరి కొంత దూరము పోయాక నకులుడు కింద పడి మరణించాడు. అది చూసి భీముడు తట్టుకోలేక పోయాడు. ధర్మరాజుతో " అన్నయ్యా ! నకులుడు కూడా పడిపోయాడు. అతిసుందరుడు, మంచితనముకు మారుపేరు, అత్యంత శౌర్యవంతుడు, సుగుణాలఖని, ధైర్యవంతుడు ఇటువంటి మంచి గుణములు ఒక్కటిగా రాశిపోసినట్లు ఉండే వాడు. ఇతడిలో ఏ దుర్గుణము ఉందని ఇలా పడిపోయాడు ? " అని అడిగాడు. ధర్మరాజు " భీమా ! నువ్వు చెప్పినది నిజమే ఇతడికి లేని సుగుణములు లేవు. కానీ ఈ లోకములో తన కంటే అందగాడు లేడని గర్వము ఉంది. ఆ కారణముగా ఇతడిలా పడి పోయాడు " అని చెప్పి తిరిగి ధర్మరాజు నిర్వికారముగా ముందుకు సాగాడు. కుక్క కూడా వారిని వదలక వెంబడిస్తుంది. అప్పటివరకు జరిగినది మౌనంగా గమనిస్తున్న అర్జునుని మనసు బాధతో మునిగిపోయింది. తరువాత వంతు తనదేనా అని అనుకున్నాడు. అలా అనుకునేంతలో అర్జునుడు కూడా కిందపడి మరణించారు. అది చూసి భీముడు " అన్నయ్యా ! అర్జునుడు కూడా పడి పోయాడు. ఎన్నడూ అబద్ధము ఆడి ఎరుగడు, అతడికి ఉన్న సుగుణములు, శౌర్యపరాక్రమములు ఎవరికి లేవు. అర్జునుడు పడిపోవడానికి కారణము ఏమిటి ? " అని అడిగాడు. ధర్మరాజు కొంచెము ఆలోచించి " అవును ఇతడు అత్యుత్తమ ధనుర్ధారి. అదే అతడి గర్వముకు మూల కారణము. పైగా ఇతడు ఒక్క రోజులో కౌరవులందరినీ చంపుతానని అతడు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చ లేదు. అది నెరవేర్చ లేదు. అందుకే ఆడినమాట తప్పిన వాడు అయ్యాడు. అందుకే అతడికీ దురవస్థ " అని అర్జునుడిని అక్కడే మిగిలిన వారిలా వదిలి నిర్వికారముగా ముందుకు నడిచాడు. అది చూసి భీముడికి కూడా భయము పట్టుకుంది. భయం భయంగా నడుస్తూనే నేలమీద కూలిపోతూ " ధర్మరాజా ! నేనుకూడా పడిపోయాను. నాలో ఉన్నలోపము ఏమిటి ? నాకు తెలియచెప్పు " అని అడిగాడు. ధర్మరాజు " భీమసేనా నీవు అత్యుత్తమ గదాధారివి, పరాక్రమవంతుడవు కాని తిండి పోతువు. అనవరంగా మాట్లాడతావు. నీకు అనవసరమైన విషయాలన్ని మాట్లాడతావు. అందుకే నీకు ఈ దురవస్థ " అని నిర్వికారముగా భీముడిని వదిలి ముందుకు సాగాడు. కుక్క మాత్రము అతడిని వెన్నంటి వెళుతూనే ఉంది.

ఇంద్రుడు ధర్మరాజును కలయుట

[మార్చు]

అలా ధర్మరాజు నిర్వికారముగా ముందుకు పోసాగాడు. కొంత దూరము పోయిన తరువాత మహేంద్రుడు ధర్మరాజు ముందు రథముతో వచ్చి నిలిచాడు. ఇంద్రుడిని చూసి ధర్మరాజు వినయముతో నమస్కరించాడు. ఇంద్రుడు ధర్మరాజును తన రథము మీద కూర్చోమని చెప్పాడు. ధర్మరాజు బాధతో " మేము అయిదుగురు అన్నదమ్ములము ద్రౌపది బయలుదేరాము. నా నలుగురు తమ్ములు ద్రౌపది నేలకూలారు. వారు లేనిది నేను ఎక్కడకు రాను. వారు కూడా నాతో వచ్చేలా చెయ్యి " అన్నాడు. అప్పుడు ఇంద్రుడు " ధర్మనందనా ! వారందరూ వారివారి శరీరమును వదిలిపెట్టి స్వర్గలోకము చేరుకున్నారు. వారిని అందరిని నీవు స్వర్గలోకములో చూస్తావు. వారు మానవ దేహాలను వదిలారు కనుక తిరిగి ఆ దేహమును పొందడము అసాధ్యము కనుక నాతో నీవిప్పుడు స్వర్గానికి రా " అని అన్నాడు. ధర్మరాజు ఇంద్రుడితో " మహేంద్రా ! మేము హస్థినాపురము నుండి బయలుదేరినప్పటి నుండి ఈ శునకము నన్ను వెన్నంటి వస్తుంది. దీనిని వదిలి పెట్టి నేను మాత్రము స్వర్గానికి ఎలా రాగలను కనుక నాతో పాటు ఈ శునకాన్ని కూడా స్వర్గానికి తీసుకుని వెడదాము " అన్నాడు. ఆ మాటలకు ఇంద్రుడు నవ్వి " ధర్మనందనా ! అది ఎలా సాధ్యము. నీ వెంట వచ్చిన కారణముగా శునకానికి ఎలా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. దీనిని స్వర్గానికి తీసుకు పోకూడదు కనుక నీవు మాత్రము రధము ఎక్కు " అన్నాడు. ధర్మరాజు " మహేంద్రా ! లోకపాలకుడవు అయిన నీకు తెలియనిది ఏమున్నది. ఈ శునకము అత్��ంత భక్తిశ్రద్ధలతో నన్ను వెన్నంటి వచ్చింది. ఇప్పటి వరకు నన్ను వెన్నంటి వచ్చి నన్ను సేవించిన ఈ శునకమును వదిలి నేను మాత్రము ఎలా స్వర్గానికి రాగలను. నన్ను భక్తితో సేవించిన ఈ శునకమును వదిలి నేను మాత్రము స్వర్గ సుఖములను అనుభవించగలను " అని అన్నాడు. ఇంద్రుడు " ధర్మనందనా ! కుక్కలకు స్వర్గలోక ప్రాప్తి లేదు. నీకు శుభము కలుగు తున్నప్పుడు దీనిని వదిలి పెట్టడము న్యాయమే. ఇందులో దోషము ఏమి లేదు " అన్నాడు. ధర్మరాజు " భక్తితో సేవించిన వారిని వదిలిరావడము బ్రహ్మహత్యాపాతకముతో సమానము అంటారు. నీవు అన్ని ధర్మములను తెలిసిన వాడివి కనుక నీకు చెప్పే పని లేదు కదా ! " అన్నాడు. కనుక కేవలము స్వర్గసుఖాలను అనుభవించడానికి నన్ను భక్తితో సేవించిన ఈ శునకమును వదిలి స్వర్గానికి రాజాలను " అన్నాడు. ఇంద్రుడు " ధర్మనందనా ! ఏదైనా వ్రతము చేసేవాడు కుక్కను ముట్టుకుంటే వ్రతభంగము అయినది అనుకుంటాడు. మహాపాపమని అనుకుంటాడు. అలాంటి సమయాన నీవు ఈ కుక్క గురించి ఎందుకు పట్టుబడుతున్నావు. దీనిని వదిలి వచ్చి హాయిగా స్వర్గసుఖములను అనుభవించు. అయినా ధర్మనందనా ! నీ భార్య ద్రౌపది, నీ నలుగురు తమ్ములు నీ కళ్ళ ఎదుటే మరణించినా చలించని వాడివి ఈ కుక్కను మాత్రము ఎందుకు వదలనంటున్నావు ? " అని అడిగాడు. ధర్మరాజు " మహేంద్రా ! నీవు సకలలోకపాలకుడవు. అన్ని ధర్మములు ఎరిగిన వాడవు, ధర్మదేవతవు. నీతో వాదించగల అర్హత కలిగిన వాడిని కాదు నేను. అయినా నాకు తోచిన ధర్మము నేను చెప్తాను. నాకు తోచిన ధర్మము చెప్పడము తప్పు కాదు. ద్రౌపది, భీమార్జున, నకులసహదేవులు నా కళ్ళెదుటే చనిపోయారు. వారి కొరకు ఎంత ఏడ్చినా వారు తిరిగిరారు. అది లోకధర్మము, జగమెరిగిన సత్యము. మమ్ము వెన్నంటి వచ్చిన ఈ కుక్కమాత్రము మరణించ లేదు. కనుక దీనిని వదిలిరావడము ధర్మమా ! శరణు వేడిన వారిని వదలడము, మంచి మిత్రుడికి ద్రోహము చెయ్యడము, స్త్రీలను చంపడము, బ్రాహ్మణుల ధనము అపహరించడము వలన ఏ పాపము వస్తుందో నన్ను నమ్మి వెన్నంటి వచ్చిన ఈ శునకమును వదిలిన ఆ పాపము వస్తుంది. ఆ పాపమును నేనిప్పుడు ఎలా మూట కట్టుకోను. నేను అనుభవించవలసిన స్వర్గ సుఖముల విషయము వదిలి పెట్టండి. నేను ఇంత వరకు సంపాదించిన పుణ్యము ఈ శునకమును ఆదరించిన కారణముగా నశించినా ఫరవా లేదు నాకు స్వర్గసుఖములు వద్దు. నన్ను ఇలా వదిలిపెడితే ఈ అరణ్యములో తపస్సు చేసుకుంటాను. నాకిది చాలు " అన్నాడు.

యమధర్మరాజు

[మార్చు]

అప్పటి వరకు శునకరూపములో ఉండి ధర్మరాజు చెప్పేది వింటున్న యమధర్మరాజు తన నిజరూపమునుదాల్చి అతడి ముందు సాక్షాత్కరించాడు. ధర్మరాజు సంభ్రమాశ్చర్యాలతో తన ముందు నిలచిన యమధర్మరాజుకు నమస్కరించాడు. యమధర్మరాజు " నాయనా ధర్మతనయా ! నీ పుణ్యచరిత్ర, నీ ధర్మనిరతి, నిర్మలమైన బుద్ధి, భూతదయ, నీ దయాగుణము నాకు ఎంతగానో నచ్చాయి. భూలోకములో నీ వంటి వారు ఉంటారా అని నాకు సందేహము కలుగుతుంది. ఇందుకు ముందు నీవు ద్వైతవనములో ఉండగా నీ యొక్క ధర్మనిరతిని నేను పరీక్షించాను. నీకు గుర్తుందా ! నీ తమ్ములు నీటి కొరకు వచ్చి నా ఆధీనములో ఉన్న సరసులో నా ప్రశ్నలకు సమాధానము చెప్పకనే దిగి స్పృహతప్పి పడిపోయారు. అప్పుడు వారిని వెతుకుతూ నీవు వచ్చావు. అప్పుడు నేను వారిలో ఒకరిని బ్రతికిస్తాను నీకు ఎవరు కావాలో కోరుకొమ్మని అన్నప్పుడు నీవు చెప్పిన సమాధానము నాకు ఎంతగానో నచ్చింది. కుంతీ తనయులలో నీవు బ్రతికి ఉన్నావు కనుక మాద్రీ తనయులలో నకులుడిని బ్రతికించమని అడిగావు. అలా ధర్మనిరతిని ప్రదర్శించడము లోకములో ఎక్కడైనా ఉంటుందా ! నిన్ను విశ్వాసముతో వెన్నంటి వచ్చిన కుక్క కొరకు సాక్షాత్తు ఇంద్రుడు దిగి వచ్చి రథము ఎక్కమని చెప్పినా నిరాకరించిన నీ ధర్మనిరతి కొనియాడ తగినది. నీకు సాటి అయిన వాడు స్వర్గలోకములో లేడు. నీ ధర్మనిరతిని ఇంద్రుడు గమనిస్తూనే ఉన్నాడు. ఇంక నీవు ఈ శరీరముతో సిద్ధ పధములో పుణ్యలోకాలకు వెళ్ళు. అక్కడ నీకు సకలసౌఖ్యాలు లభిస్తాయి " అని అన్నాడు యమధర్మరాజు. ఆ సమయములో అక్కడకు గంధర్వులు, దేవఋషులు, మరుత్తులు, అశ్వినులు, వసువులు పరమానందముతో వచ్చారు. వారంతా ధర్మరాజును ఇంద్రుడు తీసుకు వచ్చిన రధము మీద కూర్చుండబెట్టారు. రధము కదిలింది. వారంతా వెంటరాగా ధర్మరాజు పుణ్యలోకాలకు వెళ్ళాడు.

నారద మహర్షి ధర్మరాజును స్వర్గములో కలయుట

[మార్చు]

స్వర్గలోకములో ధర్మరాజును చూసి నారదమహర్షి " దానాలతో, ధర్మాలతో, తపస్సులతో పుణ్యాన్ని అర్జించిన వారిని గురించి విన్నాను. కాని ధర్మరాజు కీర్తి కాంతుల ముందు అవి వెల వెల పొతున్నాయి. ఆ రాజులలో ఎవ్వరూ కూడా శరీరముతో స్వర్గానికి రాలేదు. ఆ గౌరవము కేవలము ధర్మరాజుకు మాత్రమే దక్కింది " అని ధర్మరాజును ప్రశంసించాడు. ధర్మరాజు నారదుడిని చూసి " నారదమునీంద్రా ! నేను నా తమ్ములను చూసే వరకు సుఖాలు అనుభవించ లేను. ఇంతకూ వారు ఎక్కడ ఉన్నారు. అది ఎంత దుర్గమమైనా నాకు చూపించండి. నన్ను అక్కదకు తీసుకు వెళ్ళండి. నాకు నా తమ్ములను యుద్ధములో నా కొరకు పొరాడిన రాజులను చూడాలన్న కోరికగా ఉంది " అని అడిగాడు. ఇంద్రుడు " ధర్మనందనా ! నీవు చేసిన పుణ్యకార్యముల వలన నీవు సశరీరముగా స్వర్గానికి రాగలిగావు. స్వర్గానికి వచ్చినా నీవు మానవమాత్రులకు ఉండే స్నేహభావాన్ని వదలలేక ఉన్నావు. అదుగో అటుచూడు దేవఋషులు, గంధర్వులు, దేవతలు ఎంత ఆనందముగా ఉన్నారో. వారిని చూసి అయినా నీ మనసులో దుఃఖమును వదిలి సుఖముగా ఉండు. నీవు చేసిన పుణ్యవిశేషము చేతనువ్వు పొందిన ఈ పదవిని నీ తమ్ములు ఎలా పొందగలరు. మానవలోకమును వదిలి దేవలోకము వచ్చిన నీవు మానవ సంబంధాల కొరకు ఇలా తపించడము తగనిపని. ఇప్పుడు నువ్వు దివ్యరూపములో ఉన్నావన్న విషయము మరువ వద్దు " అన్నాడు. ఆ మాటలు ధర్మరాజును సమాధానపరచ లేకపోయాయి. " మహేంద్రా ! మీరు ఎంతచెప్పినా నేను నా సోదరులను బంధు మిత్రులను ద్రౌపదిని చూడకుండా ఉండలేను. ఒక్కసారి వారిని అందరిని చూసిన తరువాత మీరు చెప్పినట్లు చేస్తాను. నాకు అదే ఆనందాన్ని కలుగచేస్తుంది " అని అన్నాడు. " అని వైశంపాయనుడు జనమేజయుడికి మహాప్రస్థాన కథ వినిపించాడు.

బయటి లంకెలు

[మార్చు]