Jump to content

ద్రోణాచార్యుడు

వికీపీడియా నుండి
(ద్రోణుడు నుండి దారిమార్పు చెందింది)


ద్రోణాచార్యుడు లేదా ద్రోణుడు భరద్వాజ మహాముని పుత్రుడు.[1] మహాభారతంలో ఈయనది కీలకమైన పాత్ర. చిన్నతనంలో తండ్రి దగ్గర వేదవేదాంగాలతో పాటు విలువిద్యను కూడా నేర్చుకున్నాడు. ఈయనతో పాటు పాంచాల దేశపు రాజకుమారుడు ద్రుపదుడు కూడా అవే విద్యలు నేర్చుకున్నాడు. వీరిద్దరికీ గాఢమైన స్నేహం కుదిరింది. ఆ కారణంగా ద్రుపదుడు తాను రాజయ్యాక ద్రోణుడికి సగం రాజ్యం ఇస్తానని అంటూ ఉండేవాడు.[2] ఆశ్రమవాసం పూర్తి చేసుకున్న తరువాత కృపాచార్యుడి చెల్లెలు కృపిని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుని పేరు అశ్వత్థామ. అశ్వత్థామ జననానంతరం అతనిని పోషించటం కూడా వీలుకాని దుర్భర దారిద్ర్యంతో బాదపడుతుంటాడు. పరశురాముడు తన ధనమంతా బ్రాహ్మణులకు దానం ఇస్తున్నాడని విని అతని వద్దకు దానం స్వీకరించడానికి వెళ్తాడు. ద్రోణుడు అక్కడకు చేరే సమయానికి పరశురాముడు ధనమంతా దానం చేసాడు. పరశురాముడు ద్రోణుని చూసి నాదగ్గర ఉన్న ధనమంతా దానం చేసాను ఇప్పుడు నా దగ్గర నా శరీరం అస్త్రవిద్య మాత్రమే ఉన్నాయి కాబట్టి అస్త్రవిద్య కావాలంటే నేర్పుతానని చెప్పాడు. ద్రోణుడు అందుకు సమ్మతించి అతని వద్ద అస్త్రవిద్య నేర్చుకున్నాడు. అది తరువాతి కాలంలో హస్థినాపురంలో కౌరవులకు పాండవులకు అస్త్రవిద్య నేర్పటానికి దారితీసింది. తరువాత బాల్య మిత్రుడు ద్రుపదుడు విద్యాభ్యాస సమయంలో ఇచ్చిన మాటను పురస్కరించుకుని ఆతని సహాయం కోరటానికి వెళతాడు. ద్రుపదుడు అతనిని అవమానించి రిక్త హస్తాలతో వెనుకకు పంపించాడు. ఆ అవమానాన్ని సహించ లేని ద్రోణుడు అతనిని ఎలాగైనా తిరిగి అవమానించాలని పంతం పట్టి తన శిష్యుడైన అర్జునుని సహాయంతో ద్రుపదుని పట్టి బంధించి అతనికి బుద్ధి చెప్పి తిరిగి పంపించటం భారతంలో ఒక ప్రధాన ఘట్టం.

భారతంలో ద్రోణాచార్యుడు

[మార్చు]

భరద్వాజ మునికి పాంచాల దేశ రాజు అయిన వృషతుడు స్నేహితుడు. వృషతుడు తపస్సు చేస్తూ సమీపంలో పూలు కోస్తున్న మేనకను చూసి రేతఃస్ఖలనం అయ్యింది. అప్పుడు జన్మించిన వాడే ద్రుపదుడు. ద్రుపదుడికే యజ్ఞసేనుడని కూడా పేరు. వృషతుడు ద్రుపదుణ్ణి తన రాజ్యానికి తీసుకెళ్ళకుండా భరద్వాజ ముని దగ్గరే ఉంచుతాడు. భరద్వాజుడు తన కొడుకైన ద్రోణునికి స్నేహితుడి కొడుకైన ద్రుపదుడికి కలిపి వేదవేదాంగాలు, విలువిద్య నేర్పించాడు. కొన్నాళ్ళకు వృషతుడు మరణించడంతో ద్రుపదుడు పాంచాల రాజ్యానికి రాజవుతాడు. వెళుతూ వెళుతూ తన స్నేహితుడైన ద్రోణుని కూడా తన రాజ్యానికి ఆహ్వానిస్తాడు.

అశ్వత్థామ జననం

[మార్చు]

ద్రుపదుడు వెళ్ళిపోయిన తర్వాత ద్రోణుడు అగ్నివేశుడు అనే మహాముని దగ్గర మరల ధనుర్విద్యనభ్యసించాడు. ఆయన దగ్గర ఆగ్నేయాస్త్రం లాంటి దివ్యాస్త్రాలను సంపాదించాడు. చదువు కొంత పూర్తయినందున ద్రోణుని పెళ్ళి చేసుకోమని అతని తండ్రి కోరతాడు. అప్పుడు ద్రోణుడు కృపాచార్యుడు చెల్లెలైన కృపిని పెళ్ళి చేసుకుంటాడు. వీరిరువురికీ అశ్వత్థామ అనే పుత్రుడు జన్మించాడు.

ద్రోణాచార్యుడు పేదరికంలో ఉంటాడు. కుటుంబ పోషణకు ధనం సంపాదించాలనుకుంటాడు. జమదగ్ని మహర్షి కుమారుడైన పరశురాముడు విరివిగా దానాలు చేస్తున్నాడని తెలుసుకుంటాడు. మహేంద్ర పర్వతంపై తపస్సు చేసుకుంటున్న పరశురాముడి దగ్గరకు వెళ్ళి తన కోరికను వెల్లడిస్తాడు ద్రోణుడు. కానీ పరశురాముడు అప్పటికే తన సంపదనంతా దానం చేసేశాననీ, తన దగ్గరున్నది శరీరం, ధనుర్విద్య మాత్రమేననీ, ఆ రెండింటిలో ఏమి కావాలో కోరుకోమంటాడు. ధనుర్విద్యను ప్రసాదించమని కోరుకుంటాడు ద్రోణుడు. అలా పరశురాముడు తన దగ్గరున్న ధనుర్విద్యనంతా ద్రోణుడికి నేర్పిస్తాడు. దివ్యాస్త్రాలన్నింటినీ సంపాదిస్తాడు.

ద్రోణాచార్యుడు కౌరవులకూ, పాండవులకు రాజగురువు. దేవశాస్త్రాలతో సహా యుద్ధ విద్యలలోనూ, అస్త్ర శస్త్ర విద్యలలోనూ ఆరి తేరిన వాడు. అర్జునుడు అతనికి ప్రియ విద్యార్థి. ద్రోణుడికి అర్జునుడి కన్న ప్రియమైన వారు ఎవరున్నా ఉన్నారంటే అది తన కుమారుడు అశ్వథ్థామ.

మూలాలు

[మార్చు]
  1. కె. ఎస్., రామమూర్తి (1983). ద్రోణాచార్యుడు (PDF). తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం. p. 11.[permanent dead link]
  2. Hari, Sri (2019-03-02). Drona (in ఇంగ్లీష్). Samskruthi Prakashana. ISBN 978-81-940185-5-1.