Jump to content

బ్రహ్మాండ పురాణం

వికీపీడియా నుండి
(బ్రహ్మాండ పురాణము నుండి దారిమార్పు చెందింది)
అధ్యాత్మ రామాయణ శ్లోకాలు 1.1 – 1.14 లలో బ్రహ్మాండ పురాణం రాత ప్రతి (దేవనాగరి లిపిలో)

బ్రహ్మాండ పురాణము (Brahmanda Purana) ఒక హిందూ ధార్మిక గ్రంథము. ఇది ముఖ్యమైన పురాణాలలో ఒకటి. సంఖ్యాపరంగా దీనిని 18వ పురాణంగా చెబుతారు. ఈ గ్రంథంలో ఆధ్యాత్మ రామాయణము అంతర్గతమై ఉంది.

బ్రహ్మ తెలిపిన విశ్వతత్వము (బ్రహ్మాండము) గురించి ఇందులో ఉన్నందున దీనికి "బ్రహ్మాండపురాణము" అనే పేరు వచ్చింది. ఇందులో విశ్వము లేదా సకల జగత్తు ఒక హిరణ్యమయమైన అండము (బ్రహ్మాండము) నుండి ఉద్భవించినట్లుగా తెలుపబడింది. ఆధ్యాత్మ రామాయణము, రాధాకృష్ణుల విశేషములు, పరశురామావతారము వంటి కథలు ఈ పురాణంలో ఉన్నాయి. ఇందులో మొత్తం 12,000 శ్లోకాలున్నాయి. ఒక బ్రాహ్మణునికి బహుమతిగా ఇవ్వడానికి ఇది ఉచితమైన గ్రంథమని చెబుతారు.

ముఖ్యాంశాలు

[మార్చు]

వాయుదేవుడు తనకు చెప్పనట్లుగా తాను ఈ విషయాలను ఋషులకు చెబుతున్నానని సూతుడు ఈ పురాణంలోని విషయాలను తెలిపాడు.

యుగములు, వాని ప్రమాణములు

[మార్చు]

దేవతల కాల ప్రమాణము మన (మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.

  • కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
  • త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
  • ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
  • కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు

మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు - ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము). ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి. ఈ రాత్రిని ప్రళయము అంటారు. పగలు గడిచిన తరువాత బ్రహ్మ విశ్రమించును. అప్పుడు సృష్టి నశించి ప్రళయం సంభవిస్తుంది.

యుగ ధర్మములు

[మార్చు]

కృతయుగంలో స్త్రీపురుషులంతా బహుచక్కనివారు, ఆరోగ్యవంతులు, దీర్ఘాయువులు, ధర్మకార్య తత్పరులు. దురాశ, దంభము, మచ్చరములెరుగరు. సద్యోగర్భమున సంతానము కంటారు. జనులు చెట్ల తొఱ్ఱలయందును, గుహలయందును, భూబిలంబులందును నివసింతురు. అందరిదీ ఒకే జాతి.

త్రేతాయుగంలో జనులకు రజోగుణము ప్రధానముగా ఉంటుంది. వర్షములు పుష్కలముగా కురియును. జనులు సత్యమును తప్పరు. వారిలో క్రమంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులేర్పడును. మానవులలో హర్షము, ద్వేషము వంటి ద్వంద్వగుణములు రూపుదిద్దుకొనును. స్త్రీపురుషులకు భోగేచ్ఛ అధికమగును. తపస్సు పట్ల బద్ధకము పెరుగును. వ్యాపారమునందు ఆసక్తి పెరుగును. గ్రామములు, పట్టణములు ఏర్పడును. కొలతలు ఇతర ప్రమాణములు ఏర్పడును. పెక్కు ధాన్యములు లభించును. వృత్తుల ప్రాధాన్యత పెరుగును.

ద్వాపరయుగంలో జనులకు లోభగుణమతిశయించును. ధనము పట్ల కోరిక పెరుగును. ధర్మ సంఘము, వర్ణ సంకరము కూడా కలుగుతాయి. ఈ బుద్ధిమార్పులను గ్రహించి వ్యాసుడు వేదములను విభజించును. అనావృష్టి, అకాల మరణములు ప్రబలనారంభించును.

కలియుగంలో అసత్యము, హింస, అసహనము అతిశయించును. జనులకు రోగబాధలు, ఈతి బాధలు అధికమగును. దుర్వృత్తులు అవలింబింతురు. వ్యభిచారము పెరుగును. జనులందరు వర్తకముపైనే అత్యధికంగా ఆసక్తి చూపెదరు. పుణ్యకార్యఫలితములు అమ్ముకొనసాగెదరు. అతిథి అభ్యాగత ఆదరణ నశించును. జనులు అల్పాయుష్కులగుదురు. ప్రజలకు ఆయువు తక్కువ అగుట వలన కొద్దిపుణ్యకార్యములకే అధిక ఫలములు లభించునట్లు భగవంతుడు చేయును. త్రేతాయుగంలో తపమువలన జనించిన ఫలము ద్వాపరంలో ఒక్క మాసమునందు, కలియుగంలో ఒక్కరోజునందు లభించును.

రాక్షసులు సూర్యుని అడ్డగించుట

[మార్చు]

ప్రళయకాలంలో జలార్ణవంలో మునిగిన భూమిని తేల్చుటకై జలములనింకించుటకు ఆదిపరబ్రహ్మమూర్తి సూర్యభగవానుని సృజించెను. ఇలా ఉండగా మందేహాసురులనే రాక్షసులు మూడుకోట్లమంది సూర్యుని కిరణాలను మింగివేస్తూ ఉదయాస్తమయకాలాలలో సూర్యుని నిరోధింపసాగారు. అప్పుడు ఆదిత్యునకు, ఆ రాక్షసులకు యుద్ధాలు జరిగేవి. ఋషులు, మునులు గాయత్రిని జపించి బ్రహ్మాస్త్రముగా చేసి, అర్ఘ్యప్రదానము అనే వింట సంధించి ఆ రాక్షసులను నిర్జింపడానికి సహాయపడ్డారు. తరువాత సూర్యకిరణములు నిరాటంకంగా ప్రసరిస్తున్నాయి.

సూర్య గమనం వలన కాలం ఏర్పడుతున్నది. ఆ కాలం కొలమానం ఇలా ఉంది.

  • 15 నిముషములు ఒక కాష్ఠ; 30 కాష్ఠలు ఒక కల; 30 కలలు ఒక ముహూర్తము; 30 ముహూర్తములు ఒక దినము.
  • సంధ్య యనగా ఒక ముహూర్త కాలము. సూర్యోదయం మొదలు మూడు ముహూర్తములు ప్రాతఃకాలము. తరువాతి మూడు ముహూర్తములు సంగమకాలము. ఆపై మూడు ముహూర్తములు మధ్యాహ్నము. పిమ్మట మూడు ముహూర్తములు అపరాహ్ణము. ఆ వెనుక వచ్చు మూడు ముహూర్తములు సాయంకాలము.
  • ఇలా దినానికి పగలు 15 ముహూర్తములు, రాత్రి 15 ముహూర్తములు ఉంటాయి.

వాలి వృత్తాంతము

[మార్చు]

వాలి బలం గురించి విన్న రావణుడు బలాబలాలు తేల్చుకోవడానికి అతనితో పోరుకు బయలుదేరాడు. సంధ్యావందనం చేసుకొంటున్న వాలిని వెనుకనుండితన బాహుబంధంలో ఇరికించబోయాడు. రావణుని అలాగే వడిసిపట్టుకొని వాలి అన్ని సముద్ర తీరాలకు వెళ్ళి తన సంధ్యావందన కార్యక్రమం ముగించుకొన్నాడు. గర్వం హరించిన రావణుడు వాలిని ప్రశంసించి అతనితో సంధి చేసుకొన్నాడు.

అహల్యకు ఇంద్ర, సూర్యులవలన జనించిన వాలి, సుగ్రీవులను ఖడ్గరాజు అనే వానరరాజు పెంచాడు. దుందుభి అనే రాక్షసునితో వాలి యుద్ధం చేసినపుడు (కిష్కింధ కాండ చూడండి) సుగ్రీవుడు అకారణంగా వాలి ఆగ్రహానికి గురయ్యాడు. వాలి సుగ్రీవుని తరిమివేశాడు. సుగ్రీవుడు రామునితో మైత్రి చేసుకొన్నాడు. అప్పుడు రాముడు చెట్టుమాటునుండి వేసిన తన బాణంతో వాలిని చంపేశాడు. అనంతరం రాముడు వాలికి అగ్ని సంస్కారములు చేయించి సుగ్రీవుని వానర రాజుగా అభిషేకింపజేశాడు.

శ్రాద్ధక్రియ, విమర్శనదినము

[మార్చు]

చనిపోయినవాఱికి శ్రాద్ధక్రియ ఎందుకు చేయాలని మునులు అడుగగా సూతుడు ఇలా వివరించాడు - మరణించిన జీవుడు ప్రేతరూపంలో ఒక సంవత్సరకాలం ఉండును. అందులో మొదటి పదిరోజులు ఆజీవుని పంచప్రాణాలలో ఒకటి చనిపోయిన స్థలంలోను, మరొకటి శ్మశానంలోను, మూడవది కర్తయందును, నాలుగవది వాయసములందును, ఐదవది వాయువునందును ఉండును. ఎత్తిపోతలు (సంచయము) అయ్యేదాకా ఆ ప్రాణములు దుర్భరమైన తాపము అనుభవించుచుండును. యథోక్తముగా కర్మలు చేసిన తరువాత ఆ ప్రాణములన్నియు తాపము శమించి, ఒకచోట చేరి యాతనా శరీరము ధరించును. ఆ యాతనాశరీరము (ప్రేతాత్మ) నరకమునకు పోవుటకు ఒక సంవత్సరము కాలము పట్టును. మనకొక మాసము వారికి ఒక దినము. కనుక ప్రతినెల మాసికము పెట్టవలయును. యమలోకమునకు పోవు మార్గములో 18 తావుల ఆగుదురు కనుక 18 మాసికములను పెట్టి, సంవత్సరాంతమున సాహపిండము పెట్టవలెను. ఆ నాటితో మృతులు ప్రేతరూపమును చాలించి పితృదేవతలగుదురు. పితృదేవతలు కూడా దేవతా సమానులే.

సంవత్సరాంతమున - సాంవత్సరికము జరిగిన మరుదినము అయిన విమోకము నాడు - యాతనా శరీరములో నున్న జీవుని యమభటులు యమధర్మరాజు వద్ద ప్రవేశపెట్టుదురు. చిత్రగుప్తుని ఖాతాను కాలము, సూర్యచంద్రుల సాక్ష్యముతో సరిచూచెదరు. జీవులు శిక్షలేమైనా ఉంటే అనుభవించి ఆపైన వారు పుణ్యలోకమునకు పోవుదురు. కర్మ జరుగని జీవులు ప్రేతరూపములోనే ఉండవలసివచ్చును. అట్టివారికి గయలో పిండప్రదానము చేసినట్లయితే వారి ప్రేతరూపము పోయి పుణ్యలోకములు ప్రాప్తించును.

సంవత్సరికము పెట్టిన మరుసటి దినమున తిథి ప్రయోజనము (ఆబ్దికము) పెట్టవలెను. తదాధి ప్రతి సంవత్సరము మృతనమాసమున పితరులను, విశ్వేదేవతలను అర్చించవలెను.

మృగమృగీ సంవాదము

[మార్చు]

సాక్షాత్తు పరమేశ్వరానుగ్రహం పొందిన పరశురాముడు అగస్త్యుని వద్దకు వెళ్ళి ఉపదేశం ఎందుకు పొదవలసివచ్చిందని మునులు ప్రశ్నించారు. అందుకు సూతుడు ఇలా వివరించాడు.

పరశురాముడు ఈశ్వరునికి శిష్యుడై పాశుపతాది దివ్యాస్త్రాలను, వాసుదేవ మంత్రమును, త్రిలోక విజయము అనబడు శ్రీకృష్ణకవచమును ఉపదేశంపొందాడు. పుష్కరతీర్ధమున తపస్సు చేయసాగాడు. ఆ సమీపంలో ఒక లేళ్ళ జంట నీరు త్రాగి విశ్రమించాయి. వాటిని చంపడానికి ఒక వేటగాడు వచ్చి, పరశురామునికి భయపడి, ఒక పొదమాటున దాగి ఉన్నాడు. వాటిలో మగలేడి పూర్వజన్మలో ఒక విప్రబాలకుడు. పరశురాముని దర్శనభాగ్యం వలన దానికి పూర్వజన్మ వృత్తాంతము, జ్ఞానము అవగతమయ్యాయి. ఆడులేడి, మగలేడి మధ్య జరిగిన సంభాషణ సారాంశం ఇది -

"పరశురాముడు గొప్పతపస్వి. ఈశ్వరునినుండి కృష్ణకవచం ఉపదేశంపొంది నూరు సంవత్సరాలు జపించినా ఆ మంత్రము సిద్ధింపలేదు. దైవమునకు భక్తి ప్రదానము. శివుడు, నారదుడు, శుకుడు, అంబరీషుడు, బలి, విభీషణుడు, ప్రహ్లాదుడు ఉత్తమ భక్తులు. వశిష్ఠాది మహామునులు, అష్టమనువులు, పరశురాముడు మధ్యతరగతికి చెందినవారు. పరశురాముడు అగస్త్యాశ్రమమునకు పోయి అక్కడ శ్రీకృష్ణామృతస్తోత్రమును ఉపదేశము పొందిన యెడల అతనికి మంత్రము సిద్ధించును."

ఈ సంభాషణ విని పరశురాముడు అగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆయనతో కూడా లేళ్ళు కూడా వెళ్ళాయి. అగస్త్యునికి నమస్కరించి పరశురాముడు అతనినుండి శ్రీకృష్ణస్తోత్రకదంబును విని మంత్రసిద్ధిని పొంది, తన ఆశ్రమమునకు వచ్చి తన శపథమును (కార్తవీర్యార్జునుని నిర్జించుట) నెరవేర్చుకొనెను. హరిణముల జంట కూడా ఉపదేశవాక్యములను విని, దివ్యశరీరములు పొంది, వైకుంఠమునకు వెళ్ళెను.

పరశురాముడు, గోకర్ణ క్షేత్రము

[మార్చు]

స్వాయంభువు మనువు సంతతి

[మార్చు]

జల స్థల విభాగము

[మార్చు]

సూతుడు ప్రపంచములోని భూభాగములు, జలభాగముల గురించి ఇలా చెప్పాడు - స్వాయంభువమనువు కొడుకు ప్రియవ్రతుడు. ప్రియవ్రతునికి 10 మంది కుమారులు, ఇద్దరు కుమార్తెలు. స్వాయంభువ మనువు తన మనుమలలో ఏడుగురిని ఏడు ద్వీపములకు చక్రవర్తులను చేసెను. వారు తమ తమ సంతానానికి ఆయా ద్వీపాలను పంపకం చేయడం వలన అనేక రాజ్యాలు ఏర్పడినాయి. అలా ముందుగా వివిధ ద్వీపాలకు చక్రవర్తులైన మనువు మనుమలు

  1. జంబూద్వీపం - అగ్నీంద్రుడు
  2. ప్లక్షద్వీపం - మేధాతిథి
  3. శాల్మలీద్వీపం - వపుష్మంతుడు
  4. కుశద్వీపం - జ్యోతిష్మంతుడు
  5. క్రౌంచద్వీపం - ద్యుతిమంతుడు
  6. శాకద్వీపం - హవ్యుడు
  7. పుష్కరద్వీపం - సేవనుడు.
  • జంబూద్వీపం - నేరేడు పండ్లు ఎక్కువగా ఉంటాయి. జంబూద్వీపము 9 వర్షాలు లేదా భాగాలుగ విభజించబడింది. అవి (1) ఇలావృత (హిమాలయాలు, టిబెట్ ప్రాంతము) - (2) భధ్రవర్ష (హిమాలయాల తూర్పు ప్రాంతము) - తూర్పు (3) హరి (అరేబియా) - దక్షిణము (4) కేతుమాలం (ఇరాన్, టర్కీ ) పశ్చిమం (5) రమ్యక (రష్యా, సైబీరియా) ఉత్తరము (6) హిరణ్మయ (మంచూరియా) ఉత్తరము (7) కురు (మంగోలియా) ఉత్తరము (8) కింపురుష / కిన్నర (హిమాలయాల దక్షిణ ప్రాంతాలు) దక్షిణము (9) భరత (భారత ఉపఖండము) - ఈ ద్వీపము చుట్టు లవణాంబుధి యున్నది. ఈ ద్వీపంలో 6 పర్వతాలు - హిమాలయము, మేరు ప��్వతము, నీలాచలము, హిమాచలము, శ్వేతాచలము, మాల్యవంతము, గంధమాదనము, వింధ్యపర్వతము.
  • ప్లక్షద్వీపం - ఇది జంబూద్వీపంకంటే రెండురెట్లు పెద్దది. ఇందు ప్లక్ష (జువ్వి) చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ ద్వీపానికి ఒకవైపు ఉప్పునీటి సముద్రము, మరొకవైపు రససముద్రము ఉన్నాయి; పర్వతాలు - గోమోదకము, నారదాచలము, దుందుభి పర్వతము, సోమకాచలము, సుమనోపర్వతము; నదులు - అనుతప్త, సుఖి, విపాశము త్రివిక్రము, అమృత, సుకృత
  • శాల్మలీద్వీపం - ఇది ప్లక్ష ద్వీపంకంటే పెద్దది. ఇందులో ఒక మహోన్నతమైన శాల్మలి (బూరుగు) వృక్షం ఉంది. ద్వీపానికి ఒక ప్రక్క ఇక్షుసముద్రము, మరొక ప్రక్క సురసముద్రము ఉన్నాయి; ఇందులో పర్వతాలు - కుముద, వలాహక, ద్రోణ, మహిష; ఔషధులు - సంజీవకరణి, విశల్యకరణి, సంధానకరణి వంటి దివ్యౌషధాలున్నాయి; నదులు - జ్యోతిస్సు, శాంతి, తుష్కచంద్ర, శుక్ర, విమోచన, నివృత్తి.
  • కుశద్వీపం - ఇది శాల్మలీ ద్వీపంకంటే రెట్టింపు పెద్దది. ద్వీపానికి ఒక ప్రక్క ఘృతసముద్రము, మరొక ప్రక్క సురసముద్రము ఉన్నాయి. పర్వతాలు - విద్రుమాద్రి, హేమాద్రి, మృతిమంతము, పుష్పకాద్రి, కులేశయము, హరిగిరి, మందరము; నదులు - ధూత, పాఫ, శివ, పవిత్ర, సంతతి, విద్యుమ్న, దంభ, మాహీ.
  • క్రౌంచద్వీపం - ఈ ద్వీపానికి ఒక ప్రక్క ఘృతసముద్రము, మరొక ప్రక్క దధిసముద్రము ఉన్నాయి.; పర్వతాలు - క్రౌంచాచలము, వామనపర్వతము, అంధకాచలము, దివావృతాద్రి, ద్వివిధగిరి, పుండలీకాద్రి, దుందుభిస్వనగిరి.; నదులు - గౌరి, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజన, ఖ్యాతి, పుండరీక.; దేశములు - కుశల, వామన, గోష్ఠ, పవరము
  • శాకద్వీపం - ఇది క్రౌంచ ద్వీపంకంటే రెట్టింపు పెద్దది. వలయాకారంలో ఉంది. కేతువు అనే మహావృక్షం ఉంది. ద్వీపానికి ఒక ప్రక్క మంచినీటి సముద్రము, మరొక ప్రక్క పెరుగు సముద్రము ఉన్నాయి; పర్వతాలు - ఉదయాద్ర్రి, జలధార, రైవతకాద్రి, శ్యామలాద్రి, హస్తాద్రి, అంబికేయాద్రి, కేసరాద్రి; విషయములు -జలదము, సుకుమారము, కౌమారము, మణీవకము, మహాద్రుమము; నదులు - సుకుమారి, కుమారి, నళిని, రేణుక, ఇక్షువు, గభస్తి.
  • పుష్కరద్వీపం - ఇది శాక ద్వీపంకంటే రెట్టింపు పెద్దది. ద్వీపానికి ఒక ప్రక్క మంచినీటి సముద్రము, మరొక ప్రక్క క్షీర సముద్రము ఉన్నాయి. పర్వతాలు - చిత్రసాను, మానసోత్తర; నదులు లేవు.

విశ్వే దేవతలు

[మార్చు]

అశ్వినీ దేవతలు

[మార్చు]

అశ్వినీ దేవతలు పురాణ పురుషులు కవలలు. వీరు సూర్యునికి, సౌజ్న్యా దేవికిదేవికి అశ్వరూపంలో ఉండగా సంభోగించుట మూలంగా జన్మించారు. మహాభారతంలో వీరివలన పాండురాజు పత్ని మాద్రికి మంత్ర ప్రభావము వలన నకులుడు సహదేవుడు జన్మించారు. వీరు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుండి నేర్చుకొని ఇంద్రునికి నేర్పినట్లు చెబుతారు. వీరిసోదరి ఉష. ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుందట.

ఆ తరువాత వారు రథాన్ని అధిరోహించి తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని తూర్పుదిక్కు నుండి పడమటి దిక్కుకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన. వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం. అది హిరణ్యయానమనే దోవలో వాయువేగ మనోవేగాలతో ప్రయాణిస్తుంది. ఆ రథం చాలా బృహత్తరమైనది. అది బంగారంతో నిర్మించబడింది. ఆ రథాన్ని మూడు గుర్రాలు నడుపుతుంటాయి. అద్వరాశ్వాలనే ఆగుర్రాలు తెల్లగా నున్నగా ఎల్లప్పుడూ యవ్వనంతో అత్యంత ఉత్సాహంతో ఉంటాయి.

చిత్రమైన ఈ రథానికి చక్రాలూ మూడే. సారథి కూర్చోవడానికి త్రిఫలకాలు త్రిబంధురాలు అనే పేర్లు కలిగిన మూడు ఆసనాలు ఉంటాయి. ఆ రథంలో ఒకవైపు ధనం మరొకవైపు తేనె, సోమరసం మరొకవైపు ఆయుధాలు ఉంటాయి. రథం పైభాగంలో వేయిపతాకాలు సుందరంగా రెపరెపలాడుతూ ఉంటాయి. అశ్వినీ దేవతల కంఠద్వని శంఖనాదంలా మధురంగా ఉంటుంది. ఈ దేవతలను అంతా వేదమంత్రాలతో ఆహ్వానిస్తుంటారు. ఉపాసకుల మంత్రాలలోని సత్యాన్ని మాత్రమే గ్రహించి వారిని అనుగ్రహిస్తుంటారు.

వీరి చేతిలో తేనె, సోమరసం మంచుతో అద్దిన బెత్తంతో యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను యజ్ఞ ద్రవ్యాలను బెత్తంతో సుతిమెత్తగా తాకి వారిని అనుగ్రహిస్తుంటారు. వేదాలలో అశ్వినీ దేవతల వర్ణన ఉంది. వేదాలలో వీరి గురించి నూరు దాదాపు సూక్తాల వరకు ఉంది. వీరిని ఆది వైద్యులుగా పురాణాలు వర్ణించాయి. ఈ దేవతలు దయార్ధ హృదయులు, ధర్మపరులు సత్యసంధులు. వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన మహా ఔషధాలు ఉంటాయి.

వీరు ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళను అనేక సమయాలలో ఆహ్వానంపై వచ్చి శస్త్ర చికిత్సలు సైతం చేసినట్లు పురాణ వర్ణన. వైద్య శాస్త్రానికి అధిపతులైన ఈ దేతలు కుడిచేతిలో అభయముద్ర ఎడమచేతిలో ఆయుర్వేద గ్రంథం కుడిపక్కన మృత సంజీవిని, విశల్యకరణి లాంటి ఔషధీ లతలు ఎడమవైపు అమృతకలశాన్ని పట్టుకున్న ధన్వంతరీ కలిగి ఉంటారని పురాణాలలో వర్ణించబడింది.ఈ దేవతలు విరాట్పురుషుని నాశికాభాగంలో ఉంటారు.

అశ్వినీదేవతలు దేవతలైనా వారికి యజ్ఞయాగాదులలో భాగం ఉండేది కాదు. వృద్దుడైన చ్యవనమహర్షికి సందర్భానుసారంగా యవ్వనవతియైన సుకన్య భార్యగా లభించింది.సుకన్య భర్తను భక్తి శ్రద్ధలతో సేవించగా ఆమె సేవలకు తృప్తి చెందిన చ్యవనమహర్షి ఆమెను సంతోష పెట్టడానికి యవ్వనం కావాలని అనిపించింది. అనుకోకుండా వారింటికి విచ్చేసిన అశ్వినీ దేవతలకు ఆయన తనకు యవ్వనం ప్రసాదించమని కోరాడు.బదులుగా వారికి యజ్ఞయాగాదులలో హవిర్భాగం ఇప్పించగలనని చెప్పాడు.

అశ్వినీ దేవతలు పేరిట నక్షత్రములు ఉన్నాయి. కాని అవి వారి అనంతరము వారి పేరిట పెట్టబడిన జ్ఞాపక చిహ్నములని గుర్తించవలెను.మిథునరాశి లోని కేస్టర్‌, పోలక్స్ అనే నక్షత్రాల జంటకీ అశ్వినులకీ పోలికలు ఉన్నాయి.అశ్వినిలు నాటి దేవ ప్రజా సమూహమునకు, అనగా ప్రాచీనార్యజాతికి వైద్యులుగా, ఓడలతో వ్యాపారముజేయువారుగా ఉండి ప్రజాసేవ చేయుచుండినట్లు ఋగ్వేదమున ఈ క్రింద దృష్టాంతరమున కన బడుచున్నది.

వీరు పశువైద్యము గూడ చేయుచుండిరి.శయుడను ఋషియొక్క గోవు ఈనలేని స్థితిలో నుండగా, వీరు దానిని ఈనినట్లు సాయపడిరి.రేభుడు, నందనడని ఋషులను రాక్షసులు బడద్రోయగా వారిని రక్షించిరి. ఇట్లే తుభ్యుడు, అంతకుడు అను వారలను గూడ రక్షించిరి.పరావృజుడను ఋషికి కాళ్ళు పోగా నూతనముగ నిర్మించిరి.

ౠజాశ్వుడను వానికి అంధత్వమురాగా, నాతని కన్నులు బాగుచేసి దృష్టి వచ్చునట్లు చేసిరి. ఖేలుని భార్యయగు విశ్వలాయువతికి యుద్ధమునందు కాళ్ళు విరిగిపోగా, లోహపు కాళ్ళు ఏర్పరిచిరి. కణ్వపుత్రుడగు పృధుమహారాజునకు మంచి గుర్రములను ఇచ్చి పేరొందిరి.అత్రి ఋషిని రక్కసులు గొంపోయి యొక యంత్రగృహమున బడవేసి వేధించుచుండగా, ఆతనిని చెరనుండి విడిపించిరి.శయుడు, శర్యుడు, శర్యాతుడను వారలకు కావలసిన సాయములిచ్చిరి.విమదుని భార్యను, భుజ్యుని, అద్రిగుని, ఋతస్తుపను, సుభరను, కుత్సుని, తుర్వీచిని, దభీతిని, ధ్వసంతిని, పురషంతిని, చ్యవనుని వైద్యము చేసి రక్షించిరి.

ఇందులో భుజ్యుడు సముద్రమున ఓడలో నుండి మునిగిపోవుచున్నపుడు వీరు కాపాడిరట.చ్యరనుకి నూత్నయవ్వనము వచ్చునట్లు చేసిరట.కక్షివంతుడనువాని కూతురు ఘోషకు కుష్టురోగమును కుదుర్చిరి.వృషదుని కుమారుడు చెవుడుచే బాధ పడుచుండగా, దానిని నయముచేసిరి. కణ్వఋషి కన్నులు కానరాక ఉండగా బాగుచేసి దృష్టివచ్చునట్లు చేసిరి.వేదుడను రాజును శత్రువులు యుద్ధమున బాధించునపుడు ఆతనిని రక్షించిరి.ఈ దృష్టాంతములను బట్టి అశ్వినిలు శరీరధారులైన పూర్వకాలపు దేవజాతి అనబడు నరులలో పుట్టి పేరొందిన వారైనట్లు స్పష్టము.

కాని ఈ కార్యములు మొదట అశ్వినిలిరువురే చేసిరని అనజాలము.వారి సంతతి వారందరును కొన్నాళ్ళవరకు అశ్వినులనియే పిలువబడినట్లు గ్రహించినచో కాల వ్యత్యాసము లేకుండపోవును. ఎందువలన అనగా, పైన పేర్కొనిన వారందరును ఒకేకాలపు మానవులనుటకు వీలులేదు. ఈ అశ్వనిలు మొదట కంచర గాడిదలపై ఎక్కి తిరుగుచుండిరట.తరువాత ఋభువులను వడ్రంగులు వీరికొక రథమును చెక్కి బహూకరింపగా దానిపై కూర్చొండి తిరుగుచుండిరి.ఈ రథమునకు క్రమముగా ఎడ్లు, గుర్రములు, మొసళ్ళు, కట్టినట్లు కొన్ని ఋక్కులలో ఉంది. సముద్రముపై ప్రయాణముచేసి తర్వాత రథ మెక్కి ఆకాలపు ప్రజలకు సాయపడుటకై వీరు వచ్చుచున్నట్లు కొన్ని ఋక్కులలో ఉంది.

అందు వలన వీరు పలు దేశములు తిరుగుచుండిరైరి.ఋగ్వేదము 1 వ మండలములోని 16వ అనువాకము 112 మొదలు 117 వరకు గల సూక్తములు పై విషయములను తెలుపుచున్నవి. ఈ అశ్విని దేవతలు విశ్వకర్మ వారసులు దేవ వైద్యులు చాలా చోట్ల పురాణ పురుషులుగా చెబుతున్నారు కానీ వారి చరిత్ర వేదములలో ఋగ్వేదంలో చెప్పబడినది వీరు వేదక్తమైన దేవతలు.

వైవస్వత మనువు

[మార్చు]

సుద్యుమ్నుడు

[మార్చు]

ధన్వంతరి

[మార్చు]

ధన్వంతరి హిందూ ఓషధం దేవుడు విష్ణువు అవతారం. అతన్ని పురాణాలలో ఆయుర్వేద దేవుడిగా పేర్కొన్నారు. అతను, సముద్ర మదనం సమయంలో పాలు మహాసముద్రం నుండి అమరత్వం అమృతంతో ఆవిర్భావం చెందారు. ఆరాధకులు తమకు / లేదా ఇతరులకు, ముఖ్యంగా ధంతేరాస్ లేదా ధన్వంతరి త్రయోదశిలో మంచి ఆరోగ్యం కోసం తన ఆశీర్వాదం కోరుతూ ధన్వంతరిని ప్రార్థించడం హిందూ మతంలో సాధారణ పద్ధతి. ప్రతి సంవత్సరం ధన్వంతరి త్రయోదశి కుమారను "జాతీయ ఆయుర్వేద దినోత్సవం"గా జరుపుకుంటామని భారత ప్రభుత్వం ప్రకటించింది

రామాయణ బాలకాండ భగవత పురాణం ప్రకారం, ధన్వంతరి పాల మహాసముద్రం నుండి ఉద్భవించి, సముద్ర (లేదా) సాగర మథాన కథలో అమృత (అమరత్వం కోసం అమృతం) కుండతో కనిపించింది, అదే సమయంలో సముద్రం దేవతలు అసురులు, మందారా పర్వతం పాము వాసుకిని ఉపయోగిస్తున్నారు. అమృత కుండను అసురులు లాక్కున్నారు, ఈ సంఘటన తరువాత మోహిని అనే మరో అవతారం కనిపిస్తుంది అసురుల నుండి అమృతాన్ని తిరిగి తీసుకుంటుంది. ధన్వంతరి ఆయుర్వేద అభ్యాసాన్ని ప్రోత్సహించిందని కూడా నమ్ముతారు. ధన్వంతరి-నిఘంటు అనే గ్రంథం ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించబడింది, ఇది ధన్వంతరి మొక్కల ఓషధ మొక్కలను పూర్తిగా విశదీకరిస్తుంది.

పురాతన సంస్కృత రచన విష్ణుధరమోత్తర ప్రకారం, ధన్వంతరి ఒక అందమైన వ్యక్తి సాధారణంగా నాలుగు చేతులతో చిత్రీకరించాలి, వారిలో ఒకరు అమృత పాత్ర తీసుకువెళతారు. ధన్వంతరిని నాలుగు చేతులతో విష్ణువుగా చిత్రీకరించారు, శంఖా, చక్ర, జలౌకా (జలగ) అమృతము కలిగిన కుండను పట్టుకున్నారు. అతన్ని తరచూ లేఖనాల కంటే చేతిలో జలగతో చూపిస్తారు.

కొన్ని గ్రంథాలు అతన్ని శంఖం, అమృత, ఓషధ మూలికలు ఆయుర్వేద పుస్తకాన్ని కలిగి ఉన్నాయని వివరిస్తాయి.

ॐ शंखं चक्रं जलौकां दधदमृतघटं चारुदोर्भिश्चतुर्मिः।

सूक्ष्मस्वच्छातिहृद्यांशुक परिविलसन्मौलिमंभोजनेत्रम॥

कालाम्भोदोज्ज्वलांगं कटितटविलसच्चारूपीतांबराढ्यम।

वन्दे धन्वंतरिं तं निखिलगदवनप्रौढदावाग्निलीलम॥

सूक्ष्मस्वच्छातिहृद्यांशुक परिविलसन्मौलिमंभोजनेत्रम॥

ధన్వంతరి పుట్టినరోజును ఆయుర్వేద అభ్యాసకులు ప్రతి సంవత్సరం, ధంతేరాస్‌లో, దీపావళికి రెండు రోజుల ముందు, హిందూ దీపాల పండుగగా జరుపుకుంటారు. దీనిని భారతదేశంలో జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు 2016 నుండి ప్రారంభమయ్యాయి.

ధన్వంతరి ఆలయాలు:

మహారాష్ట్రలోని ధన్వంతరి ఆలయం:

కొంకణ్‌లో మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా దపోలి వద్ద ధన్వంతరి ఆలయం ఉంది. ఇది డోంగారే కుటుంబానికి చెందినది వైద్య అనిరుద్ద డోంగారే యాజమాన్యంలో ఉంది. కొంకణ్ మహారాష్ట్రలోని చాలా మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి తమ ప్రార్థనలు చేస్తారు.

దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కేరళ తమిళనాడులలో ధన్వంతరికి కొన్ని ప్రత్యేక దేవాలయాలు ఉన్నాయి, ఇక్కడ ఆయుర్వేదం అధికంగా అభ్యసించబడుతుంది పోషించబడుతుంది. కేరళలోని తోట్టువ ధన్వంతరి ఆలయం ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందిన ఆలయం, ఇక్కడ ధన్వంతరి విగ్రహం దాదాపు ఆరు అడుగుల పొడవు తూర్పు వైపు ఉంది. కుడి వైపున స్వామి అమృత్ని, ఎడమ చేతితో గోధుమలు, శంకు, చక్రాలను పట్టుకున్నాడు. 'గురువాయూర్ ఏకాదశి' అదే రోజున వచ్చే 'ఏకాదశి ' దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

తమిళనాడులో, శ్రీ రంగనాథస్వామి ఆలయం (శ్రీరంగం) ప్రాంగణంలో, ధన్వంతరి మందిరం ఉంది, ఇక్కడ ప్రతిరోజూ దేవుణ్ణి పూజిస్తారు. ఈ ఆలయం ముందు 12 వ శతాబ్దానికి చెందిన చెక్కిన రాయి ఉంది. రాతిపై రాసిన రచనల ప్రకారం, గొప్ప ఆయుర్వేద వైద్యుడు గరుడ వహానా భట్టార్ ఆలయం లోపల విగ్రహాన్ని స్థాపించారు. సందర్శకులకు ప్రసాదా లేదా తీర్థం, మూలికా కషాయాలను ఇస్తారు. ఈ మందిరం రాష్ట్రంలోని పురాతన ధన్వంతరి మందిరం. కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయం రెండవ ఆవరణలో మరో ధన్వంతరి మందిరం ఉంది.

కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలోని ధన్వంతరి దేవాలయాలు:

నెల్లూవై ధన్వంతరి ఆలయం, వడక్కంచెరి, త్రిస్సూర్, కేరళ శ్రీ ధన్వంతరి ఆరోగ్య పీఠం, వాలాజపేట, వెల్లూరు జిల్లా, తమిళనాడు తేవలక్కడు శ్రీ ధన్వంతరి ఆలయం, కులశేఖరంగళం పోస్ట్, వైకోమ్, కొట్టాయం, కేరళ అనక్కల్ ధన్వంతరి ఆలయం, తనియతుకును, త్రిసూర్ శ్రీ ధన్వంతరి ఆలయం, రామనాథపురం, కోయంబత్తూర్, తమిళనాడు శ్రీ ధన్వంతరి ఆలయం, మారుతోర్వట్టం, చెర్తాలా, కేరళ శ్రీ ధన్వంతరి ఆలయం, ప్రయాకర, మావెలికారా, అలెప్పీ, కేరళ శ్రీ ధన్వంతరి ఆలయం ఎలంతూర్, పతనమిట్ట, కేరళ శ్రీ ధన్వంతరి ఆలయం కనక్కూర్, అలప్పుజ, కేరళ శ్రీ ధన్వంతరి ఆలయం, గోపబంధు ఆయుర్వేద మహావిద్యాలయ క్యాంపస్, పూరి, ఒడిశా జిప్మెర్ క్యాంపస్‌లోని సంజీవి వినాయకర్ ఆలయంలోని శ్రీ ధన్వంత్రి స్వామి సానిధి మలప్పురం జిల్లాలోని పెరింటల్మన్న తాలూకాలోని అంగడిప్పురం పంచాయతీలోని ఎరంతోడ్ గ్రామంలో శ్రీ ఆల్కాల్మన్న ధన్వంతరి ఆలయం ఉంది. కొల్లం జిల్లా (బూతకుళం) పరవూర్ లో శ్రీ ముర్రారీ ధన్వంతరి మూర్తి క్షేత్రం కూడా ఉంది. ఇది తుండ్విల్లా అనే కుటుంబానికి చెందినది, ఇది కుటుంబ సభ్యుల సొంతం నడుపుతుంది. ప్రజలు అక్కడ ప��రియమైనవారి కోసం ప్రార్థన చేస్తారు దేవునికి పాల్పాయసం చేస్తారు. శ్రీ ధన్వంతరి ఆలయం, పల్లూరుతి, కొచ్చి, కేరళ గౌడ సరస్వత్ బ్రాహ్మణ సంఘం చేత నిర్వహించబడుతున్న ఒక చిన్న ఆలయం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి సంస్కృత విశ్వవిదాలయలో, ధన్వంతరి విగ్రహం విశ్వవిద్యాలయ మ్యూజియంలో ఉంది. రెండు విగ్రహాలు ఆయుర్వేదం లోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ప్రధాన కార్యాలయంలో న్యూ ఢిల్లీలో సిద్ధ వద్ద ఉన్నాయి. ఆయుర్వేద మహా సమ్మెలన్ కార్యాలయం లోపల మరో విగ్రహం, న్యూ ఢిల్లీలోని ధనవంతరి భవన్, హరిద్వార్లోని మోహయల్ ఆశ్రమం వద్ద ధన్వంతరి విగ్రహం ఉన్నాయి.

కాశీపుర నిర్మాణము

[మార్చు]

విష్ణువునకు భృగుశాపము

[మార్చు]

జయంతి, శుక్రుడు, బృహస్పతి

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు, వనరులు

[మార్చు]
  • అష్టాదశ పురాణములు - (18 పురాణముల సారాంశము) - రచన: బ్రహ్మశ్రీ వాడ్రేవు శేషగిరిరావు - ప్రచురణ, సోమనాథ్ పబ్లిషర్స్, రాజమండ్రి (2007)

బయటి లింకులు

[మార్చు]