సద్గురు
సద్గురు జగ్గీ వాసుదేవ్ | |
---|---|
జననం | |
జాతీయత | ఇండియన్ |
వృత్తి | యోగి, గురువు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | మార్మికుడు(Mystic), యోగి, గురువు |
జగ్గీ వాసుదేవ్, "సద్గురు" గా ప్రసిద్ధులైన యోగి, మార్మికులు, ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈ సంస్థ ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలలో ప్రపంచ వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థ అనేక సామాజిక ఆభివృద్ధి కార్యక్రమాలలో కూడా పాల్గొంటుంది, అందువల్లే ఈ సంస్థ ఐక్యరాజ్యసమితి ఆర్ధిక, సామాజిక సంస్థకి ప్రత్యేక సలహాదారుగా నియమించబడింది. ఇతని సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరంలో పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.
బాల్యం
[మార్చు]కర్ణాటక రాష్ట్రం, మైసూర్ లో 1957 సెప్టెంబర్ 3న తెలుగు కుటుంబంలో శ్రీమతి. సుశీల, డా. వాసుదేవ్ గార్లకు జన్మించారు. వారికి ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, జగదీష్ వారి నలుగురి సంతానంలో ఆఖరివాడు. పిల్లవాడి భవిష్యత్ గురించి జ్యోతిష్యుని అడిగితే, పిల్లవాడికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పి, జగదీష్ ( జగత్తుకు ఈశ్వరుడు) అని నామకరణం చేశారు. సద్గురు తండ్రి రైల్వేశాఖలో కంటి వైద్య నిపుణులు. ఉద్యోగంవల్ల అనేక చోట్లకు తరచూ బదలీ అవుతుండేది. అందరిచే జగ్గీ అని పిలవబడే ఈ జగదీష్ ప్రకృతిపై ఉండే ఆసక్తివల్ల తరచూ దగ్గరలోఉన్న అడవులకు వెళుతుండేవాడు.ఇవి ఒక్కోసారి మూడు రోజులవరకూ కొనసాగేవి. 11 సం. వయసులో పరిచయమైన మల్లాడి హళ్ళి శ్రీ రాఘవేంద్ర స్వామి ఇతనికి కొన్ని యోగాసనాలు నేర్పారు. ఆ ఆసనాలను జగ్గీ ప్రతిరోజూ సాధన చేసేవాడు. "ఒక్క రోజు కూడా విరామం లేకుండగా యోగసాధన జరగడం వల్ల, ఆ సాధనే తరువాత ఎంతో లోతైన అనుభవాలకు దారితీసింది" అని సద్గురు అంటాడు.స్కూలు చదువు పూర్తి అయ్యాక, మైసూర్ యూనివర్సిటీ నుంచి ఆయన ఇంగ్లీషు భాషలో డిగ్రీ పొందారు. కాలేజీ రోజుల్లో మోటారు సైకిళ్ళపై మక్కువ పెంచుకున్న అతను తరచూ స్నేహితులతో మైసూర్ దగ్గరలోని చాముండీ కొండల పైకి షికారుకి వెళుతుండేవాడు. మోటారు సైకిల్ పై దేశంలో అనేక దూర ప్రాంతాలకు కూడా పయనించాడు. ఒక సారి అలా వెళుతుండగా, భారత్- నేపాల్ సరిహద్దు వద్ద అతని దగ్గర పాస్ పోర్ట్ లేని కారణం వల్ల ఆపేశారు. ఆ అనుభవంతో అతనికి త్వరగా కొంత డబ్బు సంపాదించాలని అనిపించింది. కాలేజీ చదువు అయ్యాక పౌల్ట్రీ ఫాం, ఇటుకల తయారీ, భవన నిర్మాణం వంటి అనేక లాభదాయకమైన వ్యాపారాలు ప్రారంభించాడు.
ఆధ్యాత్మిక అనుభవాలు
[మార్చు]25 సంవత్సరాల వయసులో 1982 సెప్టెంబర్ 23న, మధ్యాహ్నం మోటారు సైకిల్ పై చాముండి కొండ పైకి వెళ్ళి, ఒక రాయి పై కూర్చున్నప్పుడు, ఒక ఆధ్యాత్మిక అనుభవం కలిగింది. అప్పుడు అతనికి కలిగిన ఆధ్యాత్మిక అనుభవాన్ని ఆయన మాటలలో - " ఆ క్షణం వరకు ఇది నేను, అది వేరొకరు అనుకునే వాడిని, కాని ఆ క్షణంలో మొదటి సారిగా, నేను ఏదో, నేను కానిదేదో నాకు తెలియ లేదు.అంతా నేనే అనిపించింది, నేను పీలుస్తున్న గాలి, నేను కూర్చున్న బండ, నా చుట్టూ ఉన్న వాతావరణం, ప్రతిదీ నేనుగా అయిపోయింది. నాకు మామూలు స్పృహ వచ్చే సరికి పది, పదిహేను నిముషాలు పట్టినట్టు అనిపించింది. కాని నాలుగున్నర గంటలు గడచింది, కళ్ళు తెరచుకునే ఉన్నాయి, పూర్తి తెలివిగానే ఉన్నాను కాని సమయం మాత్రం అలా గడచి పోయింది". ఆ అనుభవం పొందిన ఆరు వారాల తరువాత, సద్గురు తన వ్యాపారాలన్నీ స్నేహితులకు వదిలేసి తనకు వచ్చిన ఆధ్యాత్మిక అనుభవ అంతరార్ధాన్ని తెలుసుకోవడానికి ఎక్కడెక్కడో తిరిగాడు. అలా ఒక సంవత్సరకాల ధ్యానమూ, ప్రయాణాల తరువాత, సద్గురు తన అంతర్గత అనుభవాలను అందరితో పంచుకోవటానికి యోగా బోధించాలని నిర్ణయించుకున్నాడు. .
1983లో, మైసూర్ లో ఏడుగురితో మొదటి యోగా క్లాస్ ను మొదలు పెట్టాడు. కాలక్రమంలో , కర్ణాటకాలోనూ, హైదరాబాదులోనూ క్లాస్ నుండి క్లాసుకి మోటార్ సైకిల్ పైతిరుగుతూ తరగతులు నిర్వహించాడు. తన పౌల్ట్రీ ఫారంపై వచ్చే అద్దెతో జీవితం గడుపుతూ, తరగతులకు పారితోషికం తీసుకోవడానికి నిరాకరించాడు. క్లాసులలో పాల్గొనేవారు ఇచ్చే డబ్బును తరగతి ఆఖరి రోజున ఏదైనా స్ధానిక స్వచ్చంద సంస్ధకి విరాళంగా ఇవ్వడం అతని రివాజు అయ్యింది. . ఈ క్లాసుల ఆధారంగానే తరువాత ఈశా యోగా క్లాసులు రూపొందించబడ్డాయి.
1989 లో కోయంబత్తూర్ లో తన మొదటి క్లాసుని నిర్వహించాడు. దీని సమీపంలో కొన్ని రోజుల తరువాత ఈశా యోగ సెంటర్ ఏర్పాటు చేయబడింది. క్లాసులను సహజ స్ధితి యోగా అనే వారు. ఈ క్లాసులలో ఆసనాలు, ప్రాణాయామ క్రియలు, ధ్యానం భోధించేవాడు. 1993 లో సద్గురు పెరుగుతున్నఆధ్యాత్మిక సాధకులకు సహాయపడటం కోసం ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, గోవా చుట్టూ వివిధ స్ధలాలు పరిశీలించినప్పటికీ, వాటిలో ఏది నచ్చలేదు. చివరకు కోయంబత్తూరు నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న వెళ్ళంగిరి పర్వత పాదాల చెంత పదమూడు ఎకరాల భూమిని ఎంచుకున్నాడు. 1994 లో ఈ భూమిని కొనుగోలు చేసి ఈశా యోగ సెంటర్ ని ఏర్పాటు చేశాడు.
ధ్యానలింగం
[మార్చు]1994లో సద్గురు ఆశ్రమ ప్రాంగణంలో మొదటి యోగా క్లాస్ నిర్వహించబడింది. ఆ సమయంలోనే ధ్యానలింగం గురించి ప్రస్తావించాడు. ధ్యానలింగం ఒక యోగాలయమని, ధ్యానం కోసం నిర్దేశించబడిన స్ధలమని, ధ్యానలింగం ప్రతిష్ట తన గురువు తనకు నిర్దేశించిన తన జీవిత లక్ష్యం అని సద్గురు చెప్పాడు. 1996లో లింగానికి కావలిసిన రాయిని కొనడం, అది ఆశ్రమానికి చేరడం జరిగింది. మూడు సంవత్సరాల నిర్విరామ కృషి తరువాత ధ్యానలింగం 1999 జూన్ 23 న పూర్తి కావింపబడినది. ఆ సంవత్సరం నవంబర్ 23 నుంచి ఆలయంప్రజల సందర్శనార్ధం తెరువబడినది.
ఏ ప్రత్యేక మతానికీ, విశ్వాసానికీ చెందని ద్యానలింగ యోగాలయం ధ్యానానికి మాత్రమే నిర్దేశించబడిన స్థలం. కాంక్రీటు, స్టీలు ఉపయోగించకుండా ఇటుకరాళ్ళూ, సున్నంలతో నిర్మించబడిన 76 అ.ల గోపురం, గర్భగుడిని కప్పుతోంది. గర్భగుడిలోని ధ్యానలింగం 13 అ.ల 9 అంగుళాల ఎత్తైన అధిక సాంద్రత కలిగిన నల్లగ్రానైట్‌తో చేయబడింది. ప్రవేశ ద్వారం వద్ద ఉన్న సర్వధర్మ స్థంభం, హిందూ, ఇస్లాం, క్రైస్తవ, జైన్, టావో, జొరాష్ట్రియన్, జుడాయిజం, షింటో, బౌధ్ధ మతాల గుర్తులతో, అన్ని మతాల ఏకత్వాన్ని చాటుతూ, అందరికీ స్వాగతం పలుకుతుంది.
ఈశా ఫౌండేషన్
[మార్చు]సద్గురు మతాతీతంగా , లాభాపేక్షరహితంగా, పూర్తి స్వచ్చందంగా కార్యకర్తలచే నిర్వహింపబడే "ఈశా ఫౌండేషన్" అనే ఒక సంస్థను స్థాపించాడు. కోయంబత్తూర్ సమీపంలో ఈశా యోగ సెంటర్ 1992 లో స్థాపించబడింది. ఈ సెంటర్ మానవుని అంతర్గత చైతన్యాన్ని పెంచే అనేక కార్యక్రమాలకు ఆతిధ్యం ఇస్తుంది. ఈ ఫౌండేషన్ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ వంటి అం��ర్జాతీయ సంస్థలతో కలిసి ఒక జట్టుగా పని చేస్తోంది.
సామాజిక కార్యక్రమాలు
[మార్చు]ప్రాజెక్ట్ గ్రీన్ హాండ్స్
[మార్చు]సద్గురు ప్రాజెక్ట్ గ్రీన్ హాండ్స్ (PGH) అనే మొక్కలు నాటే పర్యావరణ సంరక్షక కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఈ కార్యక్రమానికి జూన్ 2010 లో భారతదేశ ప్రభుత్వం దేశంలో సర్వోత్తమ పర్యావరణ అవార్డైన 'ఇందిరా గాంధీ పర్యావరణ్ పురస్కార్' ను ఇవ్వడం జరిగింది. తమిళనాడులో 10 శాతం పచ్చదనం పెంచాలనేది ప్రాజెక్ట్ గ్రీన్ హాండ్స్ (PGH) లక్ష్యం. ఇంతవరకూ 20 లక్షల కార్యకర్తలచే 82 లక్షలకు పైగా మొక్కలు నాటబడ్డాయి
గ్రామీణ పునరాభివృధ్ధి కార్యక్రామాలు
[మార్చు]ఈశా ఫౌండేషన్ ఆగష్టు 2003 నుంచి ఈ గ్రామీణ పునరాభివృధ్ధి కార్యక్రామాలు (ARR) ప్రారంభించింది. ఈ కార్యక్రమాలు పేద గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని, జీవన ప్రమాణాన్ని పెంచడానికి రూపొందించబడినవి. వైద్య శిబిరాలు, యోగా కార్యక్రమాలు, పర్యావరణ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, సామూహిక క్రీడలు నిర్వహించి భారతదేశ గ్రామాల పునరాభివృధ్ధికి ఈ కార్యక్రమం ప్రయత్నిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా 54,000 గ్రామాల్లోని 7 కోట్ల మంది గ్రామీణులకు ప్రయోజనం కల్పించాలనే ప్రయత్నం జరుగుతోంది.ఈ కార్యక్రమం ఇంతవరకూ 4200 గ్రామాలలో 70 లక్షల మందిని చేరుకుంది ఈశా విద్య గ్రామీణ భారతదేశంలో అక్షరాస్యతా, చదువు స్థాయిని పెంచే లక్ష్యంతో ఈశా ఫౌండేషన్ ప్రారభించిన కార్యక్రమం ఇది. ఏడు పాఠశాలలో సుమారు 3000 మంది విద్యార్థులను విద్యావంతులను చేస్తున్నాయి
ఈశా విద్య
[మార్చు]సామాజిక అభివృధ్ధి కోసం సునిశిత దృష్టితో సద్గురు రూపొందించిన ఈశా విద్య కార్యక్రమం గ్రామీణ పిల్లలకు ప్రపంచ స్థాయి విద్యనందించే ప్రయత్నం చేస్తోంది. మెట్రిక్యులేషన్ సిలబస్ తో కంప్యూటర్స్, సంగీతం, కళలు, యోగా, వృత్తి విద్యలు కూడా నేర్పిస్తుంది. ప్రస్తుతం ఏడు విద్యాలయాల్లో 3000 మంది పిల్లలు చదువుకుంటున్నారు
యోగా కార్యక్రమాలు
[మార్చు]ఆశ్రమం స్థాపించాక సద్గురు ఆశ్రమంలో యోగా క్లాసులు తీసుకోవడం ప్రారంభించారు. ఆయన 1996 లో జాతీయ హాకీ జట్టుకు ఒక యోగా క్లాస్ నిర్వహించారు. 1997 నుంచి అమెరికాలో, 1998 నుంచి తమిళనాడు జైళ్ళలోని జీవితఖైదీలకు యోగా తరగతులు నిర్వహించడం ప్రారంభించారు.సద్గురు అందించే ఈ కార్యక్రమాలు ఈశా యోగా అనే పేరు కింద అందిస్తున్నారు. ఈశా అనే పదానికి అర్ధం దివ్యమైన నిరాకార స్వరూపం. ఈశా యోగ యొక్క ప్రధాన కార్యక్రమం 'ఇన్నర్ ఇంజనీరింగ్'. ఈ కార్యక్రమంలో వ్యక్తులకు ధ్యానం, ప్రాణాయామం, శాంభవి మహాముద్రను నేర్పించటం జరుగుతుంది. వీరు కార్పొరేట్ నాయకత్వం కోసం కూడా యోగా తరగతులు నిర్వహిస్తూ, వాటి ద్వారా “ఇంక్లూసివ్ ఎకనామిక్స్” ని పరిచయం చేస్తున్నారు. “ఇంక్లూసివ్ ఎకనామిక్స్ నేటి ఆర్థికరంగంలోకి కరుణను, అందరూ మనవారే అనే భావనను తీసుకవస్తుందని సద్గురు అంటారు.
సద్గురు తమిళనాడు, కర్ణాటకలలోమహా సత్సంగాలు కూడా నిర్వహిస్తారు. వీటిలో ప్రవచనాలు,ధ్యానాలు, శ్రోతలతో సంభాషణలు, ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఈ మహా సత్సంగాలను చెట్లు నాటడాన్ని ప్రోత్సబించే వేదికల లాగా కూడా ఉపయోగిస్తారు. . ప్రతి సంవత్సరం సాధకులను కైలాస మానస సరోవర, హిమాలయాల యాత్రలకు తీసుకు వెళతారు. 2010 లో 514 మందితో సద్గురు చేసిన యాత్ర అతి పెద్ద కైలాస మానస సరోవర యాత్రలలో ఒకటి.
2005 మార్చ్ లో అమెరికా లోని టెన్నిసీ రాష్ట్రంలో ని మాక్ మినవిల్ లో ఈశా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్నర్ సైన్సెస్ నిర్మాణాన్ని ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేశారు. ఈ ఐ.ఐ.ఐ.ఎస్ ని ప్రపంచ పశ్చిమార్ధగోళంలో ఆధ్యాత్మిక చైతన్యం తేవడానికి నెలకొల్పారు. 2008 నవంబర్ 7న, 39000చదరపు అ. వైశాల్యమున్న మహిమ ధ్యాన మందిరాన్ని ఇక్కడ నెలకొల్పారు. 2010 జనవరి 30 న ఈశా యోగ సెంటర్‌లో దైవం యొక్క స్త్రీతత్వానికి ప్రాతినిధ్యం వహించే లింగ భైరవిని స్ధాపించారు.
ప్రపంచ వేదికలపై ప్రాతినిధ్యం
[మార్చు]సద్గురు 2001 లో ఐక్య రాజ్య సమితి ప్రపంచ శాంతి సమావేశాలలో, 2006, 2007, 2008, 2009 లలో ప్రపంచ ఆర్ధిక సమావేశాలలో ప్రసంగించారు..పర్యావరణ రక్షణ రంగంలో, పర్యావరణ సమస్యలలో ప్రజా భాగస్వామ్యానని ప్రోత్సహించినందుకు 2012లో భారత దేశపు 100 అత్యంత ప్రముఖ వ్యక్తులలో ఒకరిగా సద్గురు గుర్తింపు పొందారు. 2006 లో ఒక డాక్యుమెంటరీ చిత్రం ONE: The Movie లో పాల్గొన్నారు
మూలాలు
[మార్చు]ఇంగ్లీషు
[మార్చు]- Encounter the Enlightened, ISBN 81-86685-60-X
- Mystic's Musings, ISBN 81-86685-59-6
- Joy 24x7, ISBN 978-81-7992-914-8
- Pebbles of Wisdom, ISBN 978-81-7992-952-0
- The Mystic Eye, ISBN 81-7992-883-7
- Essential Wisdom from a Spiritual Master, ISBN 81-7992-882-9
- Flowers on the Path, ISBN 81-87910-05-4
- Himalayan Lust, ISBN 978-81-8495-076-2
- Eternal Echoes: The Sacred Sounds Through the Mystic, ISBN 81-87910-02-X
- Dhyanalinga: The Silent Revolution, ISBN 81-87910-00-3
- Dhyanalinga: The Eternal Form, ISBN 81-87910-12-1
- Circus of The Mind, ISBN 81-87910-10-0
- Unleashing The Mind, ISBN 81-87910-08-9
- Good And Bad Divides The World, ISBN 81-87910-07-0
- Enlightenment: What It Is, ISBN 81-87910-06-2
- Sacred Space For Self-transformation, ISBN 81-87910-09-7
- Ancient Technology For The Modern Mind, ISBN 81-87910-11-9
తెలుగు
[మార్చు]- జ్ఞాని సన్నిధిలో ISBN 978-81-879100-01-5
- సద్గురు సుభాషితాలు ISBN 978-93-80409-77-1
- మౌనంతో రహస్యం ISBN 978-93-80409-48-1
- పూలు పరచిన బాట ISBN 978-98-82203-51-3
ఇవి కూడా చూడండి
[మార్చు]ఇతర లింకులు
[మార్చు]- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- 1957 జననాలు
- ఆధ్యాత్మిక గురువులు
- కర్ణాటక వ్యక్తులు
- ISBN మ్యాజిక్ లింకులను వాడే పేజీలు