Jump to content

బ్రహ్మాస్త్రం (పౌరాణిక ఆయుధం)

వికీపీడియా నుండి
(బ్రహ్మాస్త్రము నుండి దారిమార్పు చెందింది)

ఇదే పేరుగల తెలుగు సినిమా కోసం బ్రహ్మాస్త్రం (సినిమా) చూడండి

బ్రహ్మాస్త్రం, పురాణేతిహాసాలలో అనేక మార్లు ప్రస్తావింపబడిన ఒక అస్త్రం. రామాయణం యుద్ధకాండలో రావణ సంహారానికి రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ఘట్టం వర్ణన ఇలా ఉంది - "రామ���! ఇలా కాదు. బ్రహ్మాస్త్రాన్ని సంధించు" అని మాతలి అన్నాడు. అప్పుడు రాముడు తనకు అగస్త్యుడిచ్చిన బ్రహ్మాస్త్రాన్ని తీశాడు.

అది బుసలు కొడుతున్న సర్పంలా ప్రకాశిస్తున్నది. పూర్వం బ్రహ్మదేవుడు దీనిని ఇంద్రునికొరకై నిర్మించి ఇచ్చాడు. దాని వేగ సాధనములైన రెక్కలలో వాయువు, ములికిలో అగ్ని సూర్యులు, బరువులో మేరు మందర పర్వతాలు అధిష్టాన దేవతలుగా ఉన్నారు. దాని శరీరం బ్రహ్మమయం. దాని దేహము మంటలతో నిండి ఉంది. బంగారముతో అలంకరింపబడిన దాని పొన్ను ప్రకాశిస్తుంది. అది సకలభూతములలోని తేజస్సుతో నిర్మింపబడి సూర్యునివలె ప్రకాశిస్తున్నది. ధూమముతో కూడిన ప్రళయకాలాగ్నివలె ప్రజ్వలిస్తున్నది. అది నరులు, గజములు, అశ్వముల సముదాయమును, బ్రద్దలుకొట్టినది. ఎన్నో ద్వారములను, కోట గడియలను, పర్వతములను బ్రద్దలుకొట్టినది. దాని శరీరము రక్తము చేత, క్రొవ్వు చేత పూయబడి భయంకరముగా ఉండెను. వజ్రమువంటి సారము కలది. భయంకరమైన ధ్వని చేయునది. యుద్ధ��ులో డేగలకు, గ్రద్దలకు, నక్కల గుంపులకు, రాక్షసులకు ఆహారమునిచ్చునది. గరుత్మంతుని విచిత్ర వర్ణములు గల అనేక విధములైన రెక్కలు కట్టబడి మంచి వేగము ఉండునట్లు చేయబడినది.

ఆ అస్త్రం రాక్షసులకు వినాశకరం. వానరులకు ఆనందహేతువు. మూడు లోకములలో ఉత్తమమైనది. ఇక్ష్వాకువంశీయులకు శుభకరం. రాముడు ఆ దివ్యాస్త్రాన్ని వేదోక్తంగా అభిమంత్రించి, ధనుస్సును బాగుగా లాగి సావధాన చిత్తుడై విడచాడు. వజ్ర సంకల్పంతో, రాముని వజ్ర హస్తాలనుండి విడువడిన వజ్రసమానమైన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను చీల్చి, అతని రక్తంతో పూయబడినదై, ఉపశమనం కోసం భూమిలో ప్రవేశించి, సావధావంగా తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. రాముడు ఎరుపెక్కిన కన్నులతో, శరదళితదేహంతో, కోటి సూర్యుల ప్రకాశంతో, ధనుస్సును నేలకానించి, మరో చేత బాణాన్ని త్రిప్పుతూ వీరశ్రీబంధురాంగుడై త్రిదశపతినుతుడై శోభిల్లాడు. సకలదేవతలు రామునకు అంజలి ఘటించారు. సుగ్రీవ విభీషణ అంగదాదులు, లక్ష్మణుడు, ఇతర సహమిత్రులు విజయోత్సాహంతో రణాభిరాముడైన రాముని యధావిధిగా పూజించారు.


రామాయణంలోనే బ్రహ్మాస్త్రం ప్రస్తావన మరికొన్ని చోట్ల ఉంది (1) హనుమంతుని బంధించడానికి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని విడిచాడు. కాని బ్రహ్మాస్త్రం వలన హనుమంతునికి ప్రభావం లేదని అంతకు ముందు బ్రహ్మ వరమిచ్చాడు. అయినా బ్రహ్మపట్ల గౌరవం వలన హనుమంతుడు మూర్ఛిల్లినట్లు నటించాడు. వేరే బంధాలు ఉన్న చోట బ్రహ్మాస్త్రం బంధఁ ఉండడు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన తరువాత ఇతర అస్త్రాలను ప్రయోగించడం సాధ్యం కాదు (2) యుద్ధంలో ఒకసారి లక్ష్మణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతే రాముడు వారించాడు. ఎందుకంటే అది లోక వినాశానికి దారి తీస్తుందని (3) యుద్ధంలో ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. సమస్త వానరసేన అపుడు మూర్ఛిల్లాయి. రామలక్ష్మణులు కూడా బ్రహ్మాస్త్రాన్ని మన్నింపక తప్పలేదు. తరువాత హనుమంతుడు ఓషధీపర్వతాన్ని తెచ్చి వారందరినీ సృహలోకి తెచ్చాడు. మహాభారతం చివరిఘట్టంలో బ్రహ్మాస్త్రం ప్రయోగం ఉంది. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు కాని దానిని ఉపసంహరించడం అతనికి తెలియదు.

మూలాలు, వనరులు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]
  • సుందరకాండము - రచన: శ్రీమాన్ ఎస్.టి.పి. కోనప్పాచార్యులు - ప్రచురణ: రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి