Jump to content

శకుంతల

వికీపీడియా నుండి
రాజా రవి వర్మ చిత్రించిన శకుంతల చిత్తరువు
రాజా రవి వర్మ చిత్రించిన అలోచలనలతో కూడి ఉన్న శకుంతల సన్నివేశం కలిగిన చిత్తరువు

శకుంతల మేనక, విశ్వామిత్రుల సంతానము. దుష్యంతుని భార్య, భరతుని తల్లి.

జన్మ వృత్తాంతం

[మార్చు]
ఆశ్రమములో శకుంతల

విశ్వామిత్రుడి తపస్సు భంగం చేయడానికి ఇంద్రుడు మేనకను పంపిస్తాడు. మేనక చేత ఆకర్షితుడైన విశ్వామిత్రుడు తపస్సు నుండి రతిక్రీడ లోకి మారతాడు. రతిక్రీడ ఫలితంగా మేనక గర్భవతి అవుతుంది. విశ్వామిత్రుడు బయటి వాతావరణం చూసి శిశిర ఋతువు అవడం గ్రహించి తపోభంగం జరిగిందని గ్రహించి, మేనకను అక్కడ నుండి పంపివేస్తాడు. మేనక ఆడబిడ్డను ప్రసవించి, ఇసుక దిబ్బ మీద విడిచి, వెళ్ళిపోతుంది. అలా విడిచిన బిడ్డను పక్షులు తమ రెక్కలతో రక్షిస్తాయి. ఆ మార్గములో వెళ్ళుతున్న కణ్వ మహర్షి ఆ బిడ్డను చూసి పక్షుల రెక్కల చేత రక్షింపబడడం వల్ల శకుంతల అని పేరు పెట్టి, తన ఆశ్రమంలో పెంచి పెద్దచేస్తాడు.

శకుంతల-దుష్యంతులు ఒకరికొకరు తారస పడడం[1]

[మార్చు]

దుష్యంతుడు రోజున జింకను వేటాడుతూ, కణ్వ మహర్షి ఆశ్రమము వైపు వస్తాడు. అక్కడ శకుంతలను చూసి మోహితుడై పరిచయం అడుగుతాడు. శకుంతల తన తండ్రి తనకు చెప్పిన జన్మ వృత్తాంతం చెబుతుంది. అప్పుడు దుష్యంతుడు ఆమెను గాంధర్వ వివాహం చేసుకొని గర్భ దానం చేస్తాడు. తన రాజ్యానికి వెళ్ళి సకల సంభారాలతో, రాచ మర్యాదలతో తాను ఆహ్వానిస్తానని చెప్పి వెళ్లిన దుష్యంతుడు ఎంతకూ రాడు. శకుంతల గర్భవతి అన్న విషయం కణ్వ మహర్షికి తెలుస్తుంది. కణ్వ మహర్షి దివ్యదృష్టితో జరిగినది తెలుసుకొని శకుంతల భరతుడిని ప్రసవించాక, ఆమెకు కొందరు ఋషులను తోడిచ్చి, హస్తినాపురానికి, దుష్యంతుని వద్దకు, భరతునితో సహా పంపిస్తాడు. శకుంతలను దుష్యంతుడు గుర్తించడు. భరతుడిని తన కొడుకుగా అంగీకరించడు. కాని తరువాత ఆకాశవాణి పలికిన మాటలు విని జరిగిన వృత్తాంతం గుర్తుకు తెచ్చుకొని, శకుంతలను తన భార్య గాను, భరతుని తన కుమారుడిగాను అంగీకరిస్తాడు.

వేరే ఇతిహాసం ప్రకారం కథ

[మార్చు]

దుష్యంతుడు తన రాజ్యానికి వెళ్ళి సకల సంభారాలతో రాచ మర్యాదలతో తాను ఆహ్వానిస్తానని చెప్పి అభిజ్ఞాతము (గుర్తు) గా తన అంగుళీయకాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు. రాజ్యానికి వెళ్ళిన దుష్యంతుని నుండి ఎప్పటికీ ఆహ్వానం రాదు. ఆమె ఎప్పటికీ దుష్యంతుడి తలచుకొంటూ ఆలోచిస్తూ ఉంటుంది.

దూర్వాసుని శాపం

[మార్చు]
శకుంతల దుష్యంతుడికి లేఖ రాస్తున్న సన్నివేశం. (రాజా రవివర్మ)

ఇలా ఉండగా ఒకరోజున దూర్వాసుడు కణ్వమహర్షి ఆశ్రమానికి వస్తాడు. శకుంతలను దూర్వాసుడికి సపర్యలు చేయడానికి నియోగిస్తారు. కాని శకుంతల దుష్యంతుడిపై తలపుతో ఎప్పుడూ పరధ్యానముగా ఉంటుంది. అది చూసిన దూర్వాసుడు కోపించి, ఎవరి గురించి ఆలోచిస్తున్నావో వారు నిన్ను మరుస్తారు అని శపిస్తాడు. అప్పుడు శకుంతల ప్రార్థించగా, నిన్ను మరిచినవారు నీకిచ్చిన గుర్తును చూస్తే నిన్ను గుర్తిస్తారు అని శాపవిమోచనం చెబుతాడు. ఇలా శాపగ్రస్తురాలైన శకుంతల ఒకరోజు నది దాటుతూ తన చేతిని నీళ్ళలో పెడుతుంది. అప్పుడు దుష్యంతుడు ఆమెకు ఇచ్చిన అంగుళీయకం నీళ్ళలో పడిపోతుంది. శకుంతల ఇది గమనించదు. మరి కొన్నాళ్లకు భరతుడిని ప్రసవిస్తుంది.

కణ్వ మహర్షి తన దివ్యదృష్టితో జరిగినదంతా గ్రహిస్తాడు. శకుంతలను కుమారునితో సహా దుష్యంతుని వద్దకు, తన శిష్యులను తోడు ఇచ్చి పంపిస్తాడు. శాప ప్రభావము వలన, దుష్యంతుడు శకుంతలను గుర్తించడు. గుర్తు చూపుదామని, వేలి ఉంగరం కోసం చూస్తే, అది కనిపించదు. అప్పుడు శకుంతల అసత్యమాడుతోందని దుష్యంతుడు భావిస్తాడు. శకుంతల వేలినుంచి జారి, నదిలో పడిన ఉంగరాన్ని ఒక చేప మింగుతుంది. ఆ చేప ఒక జాలరి వల��ో చిక్కుతుంది. జాలరి ఆ చేపను కోయగా దానికడుపులో నుంచి ఉంగరం బయటకు వస్తుంది. జాలరి తన అదృష్టానికి సంతసించి, ఆ ఉంగరాన్ని అమ్ముదామని వర్తకునికి చూపుతాడు. ఆ ఉంగరం రాజాంగుళీయకమని గ్రహించిన వర్తకుడు, జాలరిని దొంగగా భావించి రాజభటులకు అప్పచెబుతాడు. జాలరిని రాజభటులు రాజ సముఖానికి, శిక్షించేనిమిత్తం తీసుకొని వెడతారు. రాజు ఆ ఉంగరాన్ని చూసి, జరిగిన వృత్తాంతాన్ని గుర్తుకు తెచ్చుకొని, దూర్వాస శాపఫలితంగా ఇది జరిగిందని తెలుసుకొని, శకుంతలను, భరతుని ఆదరిస్తాడు.

మరికొన్ని విశేషాలు

[మార్చు]

కాళిదాసు రచించిన అభిజ్ఞానశాకుంతలం నాటకానికి ప్రేరణ శకుంతల-దుష్యంతుల వృత్తాంతం

ఇవి కూడా చూడండి

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూలాలు

[మార్చు]
  1. వ్యాసమహాభారతం ఆది పర్వం తృతీయ అశ్వాసము
"https://te.wikipedia.org/w/index.php?title=శకుంతల&oldid=4150539" నుండి వెలికితీశారు