ఇల్లినాయిస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇల్లినాయిస్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్రం అమెరికాలో చేరిన 21వ రాష్ట్రం. ఇల్లినాయిస్ అమెరికాలో అయిదవ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం. ఇల్లినాయిస్ నది మీదుగా మిస్సిస్సిప్పి నదిని మహా సరస్సులతో కలిపే కీలకమయిన ప్రాంతంలో ఉన్న కారణాన ఈ రాష్ట్రం రవాణా వ్యవస్థకు నెలవైంది.

అమెరికా విప్లవ సమయానికి ఈ రాష్ట్రంలో దాదాపు 2000 మంది స్థానిక ఆదివాసీలు కొద్దిమంది ఫ్రెంచి గ్రామస్థులు నివాసముండేవారు. అమెరికా వాసులు కెంటకీ నుండి 1810లో వలస రానారంభించారు. అటు మీదట యాంకీలు వచ్చారు. భవిష్యత్తులో చికాగోగా పిలువబడే నగరాన్ని స్థాపించింది వారే. 1850 లలో ఏర్పడిన రైలు రవాణా వ్యవస్థ అత్యంత లాభదాయకమైన వ్యాపారానికి దా���ి తీసింది. ఇది జెర్మనీ, స్వీడన్ వాసులను ఆకర్షించింది. 1900 కల్లా అనేక కర్మాగారాలు ఇక్కడ స్థాపించబడ్డాయి. దక్షిణ, మధ్య ప్రాంతాలలో అనేకమైన బొగ్గు గనులు కూడా బయటపడ్డాయి. ఈ పారిశ్రామికీకరణ తూర్పు దక్షిణ ఐరోపా దేశాలనుండి అనేకమందిని వలస రావడానికి ప్రేరేపించింది. అమెరికా అంతర్యుద్ధంలో ఈ రాష్ట్రం తమ రాష్ట్రానికే చెందిన అబ్రహాం లింకన్, యులిసిస్ గ్రాంట్లకు మద్దతు ఇచ్చింది. ప్రపంచ యుద్ధాలలో ఇక్కడి ఆయుధ కర్మాగారాలు అమెరికాకు ముఖ్య ఆయుధ ఉత్పత్తిదారులుగా నిలిచాయి. యూరోపియన్ వలసదారులతో పాటు దక్షిణాది నుండి పారిపోయి చికాగో వచ్చిన నల్లజాతివారి సంస్కృతుల మేళవింపువలన ప్రపంచ ప్రసిద్ధమయిన జాజ్ సంగీత సంస్కృతి ఆవిర్భవించింది.