Jump to content

కృష్ణాష్టమి

వికీపీడియా నుండి
(శ్రీకృష్ణ జన్మాష్టమి నుండి దారిమార్పు చెందింది)
కృష్ణాష్టమి
కృష్ణాష్టమి
యశోదమ్మతో బాలకృష్ణడు
యితర పేర్లుజన్మాష్టమి,గోకులాష్టమి,అష్టమి రోహిణి
జరుపుకొనేవారుహిందువులు
వేడుకలునాట్యం-నాటకం, పూజలు,ఉపవాసం

కృష్ణ జన్మాష్టమి (సంస్కృతం: कृष्ण जन्माष्टमी) హిందూ ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడి జన్మదినం.[1] కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు

తిథి

[మార్చు]

శ్రీకృష్ణుడు దేవకి-వసుదేవులకు 8 వ సంతానం గా, శ్రావణ మాసములో కృష్ణ పక్షం లోఅష్టమి తిథి రోజున జన్మించాడు.తన చెల్లెలు దేవకి కడుపున పుట్టిన బిడ్డ వల్ల తనకు ప్రాణహాని ఉంటుందని తెలిసిన కంసుడు (శ్రీకృష్ణుని మేనమామ) ముందు జాగ్రత్తగా తన చెల్లెలు దేవకిని చెరసాలలో బంధించి పుట్టిన ఒక్కో బిడ్డను పుట్టిన వెంటనే హతమారుస్తూ ఉంటాడు. అలా ఏడుగురు తర్వాత శ్రీకృష్ణుడు కూడా కంసుని చెరసాలలోనే జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రం నక్షత్రం కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది.

కృష్ణాష్టమి పండుగ విధానం

[మార్చు]

చేతవెన్న ముద్ద చెంగల్వపూదండ
బంగారు మొలతాడు పట్టుదట్టి
సందె తావీదులు సరిమువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతు

కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారు. ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహమును పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు.

పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని పిలుస్తారు.

భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.. దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ... అన్న గీతోపదేశంతో మానవాళికి దిశనిర్దేశం చేశారు కృష్ణభగవానుడు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన. మహా భాగవతం కథలను విన్నా... దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి. ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండటం కృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి, ఆయన లీలలకు అద్దం పడుతోంది. ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు. వివిధ రూపాల్లో, సంప్రదాయాలతో భక్తిప్రపత్తులతో కృష్ణుడిని కొలుస్తున్న ఆయా రాష్ట్రాల వారి సంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన అందాన్ని తెస్తాయి.

గుజరాతీల సంప్రదాయం ఆదర్శం

[మార్చు]

గుజరాత్‌ రాష్ట్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని శ్రీజగదాష్టమి అని పిలుస్తారు. గుజరాతీల సంప్రదాయం ప్రకారం కృష్ణాష్టమి పండగకు నాలుగురోజుల ముందునుంచే పూజలు ప్రారంభమవుతాయని జిల్లా కేంద్రానికి సమీపంలోని జీఎస్‌ ఎస్టేట్‌లో నివాసముండే గుజరాతీలైన తోడికోడళ్లు జ్యోతి, కాజల్‌ తెలిపారు. పండగకు నాలుగురోజుల ముందు వచ్చే చవితినాడు ఆవు, లేగదూడలను ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేస్తారు. బాజ్రీ పిండితో రొట్టెలను తయారు చేసి వాటికి ఆహారంగా అందిస్తారు. కృష్ణుడు గోవులను సంరక్షించేవారు అయినందున గుజరాతీలు గోవులను ప్రత్యేకంగా పూజిస్తారు. అన్నం తినకుండా రెండ్రోజుల ముందుగానే మిఠాయిలు, ఫలహారాలు, కార, చుడువా, గారెలు వంటివి తయారుచేసుకుంటారు. ప్రత్యేకంగా మినపప్పు పిండితో తయారుచేసిన ‘అడిది’ పేరుగల మిఠాయిలు తయారుచేస్తారు. ఒకరోజు ముందు నుంచే ఉపవాసదీక్షలు పాటిస్తారు.

గోపాలుడు

అన్నం స్వీకరించకుండా ఫలహారాలు తీసుకుంటారు. రాత్రి దోసకాయ గుజ్జును తీసివేసి దాంట్లో కృష్ణుడి విగ్రహాన్ని ఉంచుతారు. దాన్ని తల్లి గర్భంగా భావించి పూజలు చేస్తారు. రాత్రి 12 గంటల తర్వాత అందులోంచి విగ్రహాన్ని తీసి పాలతో అభిషేకం చేసి కృష్ణుడి విగ్రహానికి హారతి పూజ నిర్వహిస్తారు. అనంతరం వూయలలో ఉంచి భక్తి, జోలపాటలతో భజన నిర్వహిస్తారు. వెన్న, పెరుగు, డ్రైప్రూట్స్‌తో తయారు చేసిన పదార్థాలను అలంకరించిన కుండలో ఉంచి మహిళలు, యువతీ, యువకులు అందరూ కలిసి ఉట్టికొట్టే (దహీహండీ) కార్యక్రమం నిర్వహిస్తారు. అదే సమయంలో స్త్రీలు దాండియా నృత్యాలు చేయగా, పురుషులు ప్రత్యేక నృత్యప్రదర్శనలతో ఆనందోత్సవాలను పంచుకుంటారు. చిన్నారులను కృష్ణుడి వేషధారణలో అలంకరించి దహీహండీని పగులగొట్టిస్తారు. అనంతరం మరునాడు ఉదయం వంటలు చేసుకొని భోజనాన్ని ఆరగిస్తారు.

లబానా సంప్రదాయం

[మార్చు]

లబానా సంప్రదాయం ప్రకారం కృష్ణాష్టమి పండగకు ఒకరోజు ముందునుంచే కుటుంబంలో ఒక పురుషుడు ఉపవాస దీక్ష ఆచరిస్తారు. కృష్ణాష్టమి వేడుకలను తమ సంప్రదాయం ప్రకారం ఘనంగా నిర్వహిస్తామని జిల్లాకేంద్రంలోని విద్యానగర్‌లో నివాసముంటున్న లభనా కులానికి చెందిన లఖన్‌-గంగాచొపాడే దంపతులు తెలిపారు. చెరువు వద్ద నుంచి తెచ్చిన నల్లమట్టితో చీకటి పడ్డాక కృష్ణుడి విగ్రహాన్ని తయారుచేస్తారు. మరునాడు ఉదయం కృష్ణాష్టమి సందర్భంగా ఉదయమే లేచి ఇంట్లో తూర్పుదిక్కున కట్టె పీటపై కుటుంబసభ్యుల సమక్షంలో కృష్ణుడి గీతాలను ఆలపిస్తూ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తా���ు. విగ్రహానికి కొత్తబట్టలు అలంకరించినట్లు తెల్లబట్టను నెత్తిన ఉంచుతారు. చేనులోని బావినుంచి ముంతలో తెచ్చిన నీటిని విగ్రహంపై చల్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాత్రి సమయంలో జీలకర్ర, ఎండుబంక, సిర, గోధుమపిండితో తయారుచేసిన పిండిపదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. రాత్రి 12 గంటల తర్వాత పుణ్య స్నానమాచరించి చిన్నారులు కుటుంబసభ్యుల సమక్షంలో కృష్ణుడి విగ్రహం వద్ద మళ్లీ పూజలు నిర్వహిస్తారు. విగ్రహానికి గంధం పూసిన తర్వాత పూజల్లో కూర్చున్న వారందరికీ గంధాన్ని తిలకంగా దిద్దుతారు. అనంతరం సమర్పించిన నైవేద్యాన్ని ఫలహారంగా స్వీకరిస్తారు. చుట్టుపక్కల వారికి ప్రసాదంగా అందిస్తారు. అనంతరం రాత్రి లబానా సంప్రదాయ వేషధారణలో యువతీ, యువకులు కృష్ణుడి గీతాలపై ఆనందోత్సహాలతో నృత్యాలు చేస్తారు. మరునాడు ఉదయం 7గంటలకు ముందే ఉపవాస దీక్ష చేపట్టిన వ్యక్తి నెత్తిన బుట్టలో విగ్రహాన్ని తీసుకెళ్లి సమీపంలో ఉన్న నదిలో నిమజ్జనం చేస్తారు. అనంతరం ఇంటికొచ్చి ఉపవాసదీక్షలు విరమిస్తారు.

వినాయకుడి పండగను గుర్తు చేసే రాజస్థానీ సంప్రదాయం

[మార్చు]

రాజస్థాన్‌లో కృష్ణాష్టమికి మట్టివిగ్రహాలను తయారుచేసి ప్రత్యేక పూజలు చేస్తామని జిల్లాకేంద్రంలోని రాణీసతీజీ కాలనీలో నివాసముంటున్న రాజస్థాన్‌వాసులు జగదీష్‌అగర్వాల్‌-హేమలత తెలిపారు. కృష్ణుడి విగ్రహానికి పండగరోజు ఉదయం తెల్లదుస్తులు వేసి ప్రత్యేక ఆభరణాలతో అలంకరిస్తారు. కట్టెతో చేసిన పీటపై కొన్ని కుటుంబాలు కలిసి అందరూ సూచించిన ఒకరి ఇంట్లో ప్రతిష్ఠిస్తారు. ఉపవాసదీక్షలు పాటించి కృష్ణుడిగీతాలతో ప్రత్యేక పూజలు చేస్తారు. చీకటిపడ్డాక చంద్రుడు కనిపించే సమయంలో చప్పట్లు కొడుతూ కృష్ణుడిని వేడుకుంటారు. ఇలా రాజస్థానీ సంప్రదాయంలో కొడుకు పుడితే చప్పట్లు కొట్టే ఆచారాన్ని ఆచరిస్తాం. ఆవుదూడను వెంటతీసుకొని చంద్రుడు కన్పించే విధంగా బాలకృష్ణుడికి కొబ్బరికాయ, చక్కెరతో తయారుచేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. రాత్రి బంధువులంతా కలిసి రాజస్థానీ సంప్రదాయ వేషధారణలో డీజే పాటలపై ఆనందోత్సవాలతో కృష్ణుడి గీతాలపై నృత్యాలు చేస్తారు. మరునాడు ఉదయం ఒక మహిళ పవిత్రస్నానమాచరించి ప్రత్యేక పూజల నడుమ పీట మీద ఉన్న విగ్రహాన్ని బుట్టలో పెట్టి నెత్తిన మహిళలు, యువతీ, యువకుల సమక్షంలో దాదాపు 15-20 మంది వరకు కలిసి కృష్ణుని గీతాలు ఆలపిస్తూ వూరేగింపుగా సమీపంలో ఉన్న నదులు, చెరువులకు వెళ్తారు. ఎంతదూరమున్నా పాదయాత్రగా వెళ్లి అక్కడ నది ఒడ్డున మట్టి విగ్రహానికి పూజలు నిర్వహించి నిమజ్జనం చేస్తారు. అనంతరం నిమజ్జనానికి వచ్చిన వారంతా ఒకచోట కూర్చుని కృష్ణభగవానుని స్మరించుకొని తమ తమ ఇళ్లలోకి వెళ్లి ఉపవాస దీక్షల్ని విరమిస్తారు.

సామూహిక వేడుకలు యాదవుల ప్రత్యేకం

[మార్చు]
కృష్ణుడు వేషధారణలో బాలుడు

యాదవ్ కులస్థులు కృష్ణుడిని కులదైవంగా కొలుస్తారు.. కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు చేసి గ్రామాల్లో, పట్టణాల్లోనూ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.కృష్ణాష్టమి రోజున వూయలలో కృష్ణుడి ప్రతిమను ఉంచి కనులపండువగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తారు. తమ చిన్నారులను కృష్ణుడు, గోపికల వేషధారణలతో అందంగా అలంకరిస్తారు.

కృష్ణుడు వేషధారణలో బాలిక

కృష్ణుడి ప్రతిమకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ముగింపు ఘట్టంగా నిర్వహించి సహపంక్తి భోజనాలతో వేడుకలను ముగిస్తారు. ఉట్టికొట్టే కార్యక్రమంలో అందరూ కలిసి పాల్గొనడం వారిలోని ఐక్యతను పెంచుతోంది. ఈ వేడుకల్లో గ్రామాల్లోని ఇతర కులస్థులు సైతం పాలుపంచుకోవడం పండగకు మరింత వన్నె తీసుకొస్తోంది.

తిరుమల శ్రీవారి ఆస్థానం

[మార్చు]

తిరుమల ఆలయలో శ్రీనివాసుని ప్రక్కనే రజతమూరి శ్రీకృష్ణుని విగ్రహం పూజలందుకుంటూ ఉంటుంది. 11వ శతాబ్దానికి పూర్వమే కృష్ణమూర్తి విగ్రహం ఉన్నట్లు శాసనాధారాలు చెబుతున్నాయి.

కృష్ణాష్టమి సందర్భంగా సాయంత్రం సమయంలో శ్రీవారు ప్రత్యేకంగా కొలువుదీరుతారు. ఈ కొలువును 'గోకులాష్టమీ ఆస్థానం' అని వ్యవహరిస్తారు. సర్వాలంకార భూషితుడైన స్వామి సర్వభూపాల వాహనంలో ఆస్థానానికి విచ్చేస్తారు. పౌరాణికులు భాగవత పురాణంలోని శ్రీకృష్ణావతార ఘట్టాన్ని చదివి వినిపిస్తారు. మరునాడు నాలుగు మాడ వీధుల్లో శిక్యోత్సవం (ఉట్ల పండుగ) కోలాహలంగా జరుగుతుంది. ఇది కృష్ణుడి బాల్యక్రీడకు సంబంధించిన వేడుక. శాసనాల ఆధారంగా ఈ ఉత్సవం చాలా ప్రాచీనమైనదిగా, సా.శ.1545 సంవత్సరంలో తాళ్ళపాక వారే ఉట్ల ఉత్సవాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

అన్నమాచార్య కీర్తన

[మార్చు]

తాళ్ళపాక అన్నమాచార్యుడు ఉట్ల పండుగను ఒక కీర్తనలో ఇలా సెలవిచ్చాడు:

పైకొని చూడరే వుట్ల పండుగ నేడు

ఆకడ గొల్లెతకు ననందము నేడు

అడర శ్రావణబహుళాష్టమి నే డిత డు

నడురేయి జనియించినా డు చూడ గదరే

అరుదై శ్రావణబహుళాష్టమి నా టి రాత్రి

తిరువవతారమందెను కృష్ణు డు

యిరవై దేవకిదేవి యెత్తుకొని వసుదేవు

కరములందు బెట్టితే కడుసంతోసించెను

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. James G. Lochtefeld (2002). The Illustrated Encyclopedia of Hinduism: A–M. The Rosen Publishing Group. pp. 314–315. ISBN 978-0823931798.