Jump to content

రేసుగుర్రం

వికీపీడియా నుండి
రేసుగుర్రం
దర్శకత్వంసురేందర్ రెడ్డి
రచనవక్కంతం వంశీ
స్క్రీన్ ప్లేవిక్రం సిరికొండ
నిర్మాతనల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి),
డా. వెంకటేశ్వరరావు
తారాగణంఅల్లు అర్జున్,
శ్రుతి హాసన్,
సలోని,
ప్రకాశ్ రాజ్,
రవి కిషన్
సాయాజీ షిండే
శ్యామ్
ఛాయాగ్రహణంమనోజ్ పరమహంస
కూర్పుగౌతంరాజు
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
శ్రీ లక్ష్మినరసింహా ప్రొడక్షన్స్
పంపిణీదార్లుషణ్ముఖ ఫిల్మ్స్
విడుదల తేదీ
ఏప్రిల్ 11, 2014
భాషతెలుగు

శ్రీ లక్ష్మినరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలపు శ్రీనివాస్, డా. వెంకటేశ్వరరావు సమ్యుక్తంగా నిర్మించిన చిత్రం రేసుగుర్రం. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, శ్రుతి హాసన్, సలోని, రవి కిషన్, ప్రకాశ్ రాజ్ ముఖ్యపాత్రలు పోషించారు. మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకుడిగా పనిచేయగా ఎస్. తమన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా 2014 ఏప్రిల్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది.[1]

రాము (శ్యామ్‌), లక్కీ (అల్లు అర్జున్) అని పిలవబడే లక్ష్మణ్ వరంగల్ ప్రాంతంలో ��డిపిన వారి బాల్యంతో ఈ సినిమా కథ మొదలవుతుంది. రాము బుద్ధిమంతుడు, మంచివాడు అయితే లక్కీ ఆకతాయి, అల్లరి చేసే వ్యక్తి. రాము నిబంధనలను పాటిస్తే లక్కీ తన మనసు చెప్పిందే వింటాడు. చిన్నప్పటి నుంచీ వాళ్ళ మధ్య ఉన్న వైరం తగ్గించాలని వాళ్ళ అమ్మ (పవిత్ర లోకేష్) ఎంత ప్రయత్నించినా అది వాళ్ళ వయసుతోపాటు పెరుగుతూనే ఉంటుంది. పెద్దయ్యాక రాము పోలీస్ శాఖలో అసిస్టంట్ కమిషనర్ అయితే అమెరికాకి వెళ్ళాలని తపనపడుతూ లక్కీ ఆవారాగా తన స్నేహితులతో కలిసి తిరుగుతూ ఉంటాడు. ఈలోపు రాము స్నేహితుడు, మరో అసిస్టంట్ కమిషనర్ అయిన రాజు రాజకీయాల్లోకి రావాలని ఆశపడుతున్న రౌడీషీటర్ శివారెడ్డి (రవి కిషన్)ని శాసనసభ సభ్యుడు పదవికి నామినేషన్ వెయ్యడానికి కూడా వీల్లేకుండా శివారెడ్డి చేసిన అన్ని అక్రమఆలకు సంబంధించిన వివరాలు, సాక్ష్యాలు సేకరించి వాటిని బయటపెట్టి శివారెడ్డి అంతు చూడాలనుకుంటాడు. కానీ శివారెడ్డి రాజుని, తన సహచరులనీ బంధించి వారిలో ఒకరైన పార్థు (రాజీవ్ కనకాల)ను రాజుని తుపాకితో కాల్చి చంపమంటాడు. లేకపోతే నిన్ను చంపుతానని బెదిరిస్తాడు. నిజాయితీపరుడైన పార్థు రాజుని కాల్చి చంపడానికి తడబడుతున్న సమయంలో శివారెడ్డి మరో వైపున తుపాకితో కాలిస్తే ఆ శబ్దానికీ, అదురుకీ పార్థు ట్రిగర్ నొక్కడం, రాజు చనిపోవడం జరుగుతాయి. రాజు తుపాకి శుభ్రం చేసుకుంటుండగా మిస్ఫయర్ అయ్యి చనిపోయాడని వార్తలు పుట్టిస్తారు. రాజు తండ్రి (పరుచూరి వెంకటేశ్వరరావు) మాత్రం ఇది నమ్మక తన కొడుకు ఆశయం

ఇదిలా ఉండగా లక్కీ స్పందన (శ్రుతి హాసన్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. పేరుకు విరుద్ధంగా ఎలాంటి స్పందన ప్రదర్శించకుండా అన్నిటికీ లోపలే స్పందించడం స్పందన తీరు. ఉదాహరణకి హాస్య సన్నివేశాలు చూస్తూ బయటకి రాయిలా ఉన్నా లోపల పగలబడి నవ్వడం, భయం వేస్తే బయటకి ధైర్యంగా, చలనం లేకుండా ఉంటూ లోపల వణికిపోవడం వంటి చర్యలు చేస్తుంటుంది. తన తల్లిదండ్రులది కూడా అదే పద్ధతి. తన తండ్రి ప్రకాశ్ (ప్రకాశ్ రాజ్) ఒక విజయవంతమైన వ్యాపారవేత్త. సుమారు 500 కోట్ల ఆస్తి ఉన్న తను మనిషి తనను తాను అన్నివేళలా, అన్నిటిలో నిగ్రహించుకుంటే ప్రపంచాన్ని గెలుచుకుంటాడు అనే సూత్రాన్ని నమ్మి ప్రతీ చిన్న విషయంలో తన కుటుంబం, పనివాళ్ళు మొత్తం అలాగే ఉండేలా జాగ్రత్తపడతాడు. ఈ ప్రవర్తనా ధోరణి ఏ స్థాయికి చేరుకుంటుందంటే తన తల్లి (ప్రగతి) ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో ఉంటే స్పందన ఏమీ జరగనట్టు అక్కడికి వెళ్తుంది. మెల్లమెల్లగగా స్పందనలో సహజ స్పందనలు కలిగించి తనని మామూలుగా మార్చడమే కాక తన ప్రేమను పొందుతాడు. అయితే లక్కీ ప్రవర్తనను ఏ మాత్రం ఇష్టపడని ప్రకాశ్ నిన్ను రిజెక్ట్ చెయ్యడానికి గల ముఖ్యకారణం నీ అన్నయ్య రాము నీ గురించి ఫోన్ చేసి తప్పుగా చెప్పడం అని చెప్తాడు. ఇంటికెళ్ళి రాముతో గొడవపడుతుంటే వాళ్ళ అమ్మ లక్కీపై చెయ్యి చేసుకుంటుంది. తన తల్లి తనని మొదటిసారి కొట్టడం, అదీ రాము వల్ల కొట్టడం లక్కీని రాము ఉద్యోగం పోగొట్టాలని నిర్ణయించుకునేలా చేస్తాయి. శివారెడ్డి ఎన్నికలకి నామినేషన్ వెయ్యడానికి వెళ్తున్న రోజు రాజు తండ్రి సాక్ష్యాలను రాముకి అప్పగిస్తాడు. అవి తీసుకుని కలెక్టర్ ఆఫీసుకు వెళ్తున్న విషయం శివారెడ్డికి తెలిసి తన మనుషులకు ఫోన్ చేసి రాముని చంపెయ్యమంటాడు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర లక్కీ తన స్నేహితులతో కలిసి రాము వెళ్తున్న కారును దొంగిలిస్తారు. ఎత్తుకెళ్ళింది ఎవరో రాముకి తెలియదు. దారిలో ముగ్గురూ దిగిపోగా లక్కీ ముందుకెళ్తాడు. ఈ లోపు లక్కీ వెళ్తున్న కారుని శివారెడ్డి మనుషులు లారీలతో గుద్దుతారు. లక్కీ గాయాలతో బయటపడగా కారు, అందులోని సాక్ష్యాలు తగలబడిపోతాయి. బయటపడ్డ లక్కీ శివారెడ్డి మనుషులని కొట్టాక వాళ్ళు రాముని చంపాలనుకున్నారని తెలుసుకుంటాడు.

అప్పటిదాకా అన్నయ్య మీద ఉన్న కోపం, ద్వేషం ఒక్కసారిగా చచ్చిపోతాయి. శివారెడ్డి నామినేషన్ వెయ్యడానికి వెళ్తే అక్కడ లక్కీ తనని కొట్టి తీసుకొచ్చి ప్రమాదం జరిగిన చోట ఉన్న మర్రిచెట్టు ఊడకి తలకిందలుగా కట్టి పడేసి శివారెడ్డిని బెదిరించి తలని చెట్టుకేసి కొట్టి వెళ్ళిపోతాడు. తలకి బలమైన గాయం తగిలి రక్తం కారడం వల్ల శివారెడ్డి స్పృహ కోల్పోతాడు. శివారెడ్డిని ఆసుపత్రిలో చూసిన తన తండ్రి, కడప వాస్తవ్యులు పెద్దిరెడ్డి (ముఖేష్ రిషి) తన కొడుకుని కొట్టిందెవరో తెలుసుకునే దాకా తిరిగి వెళ్ళనని భీష్మించుకు కూర్చుంటాడు. అప్పుడు లక్కీ పెద్దిరెడ్డి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఈ విషయాన్ని ఇక్కడే వదిలెయ్యమని సున్నితంగా బెదిరించి వెళ్ళిపోతాడు. లక్కీ స్నేహితులు భయపడుతుంటే లక్కీ మాత్రం కారు ఎత్తుకెళ్ళింది మనమే అని రాముకి తెలియకూడదు, తెలిస్తే మనని జైల్లో పెడతాడంటాడు. రాము ప్రేమను గెలిపిస్తే తను తప్పించుకోవచ్చనుకుంటాడు. రాముకి ఓ ప్రేమ కథ ఉందని ఎవ్వరికీ తెలియదు. దానిని స్పందనకి, తన స్నేహితులకి చెప్తాడు లక్కీ. రాము, లక్కీ కాలేజిలో చదువుకునే రోజుల్లో రాము శ్వేత (సలోని) అనే అమ్మాయిని ప్రేమించాడు. ధైర్యం కూడదీసుకుని ఓ వాల్కెంటైన్స్ డే రోజున శ్వేతకు తన ప్రేమ విషయం చెప్పడానికి వెళ్తాడు. ఇది తెలియని లక్కీ శ్వేతకు ప్రపోజ్ చేస్తాడు. శ్వేత ఒప్పుకోకపోవడంతో లక్కీ వెళ్ళిపోయాక రాము వచ్చి ప్రపోజ్ చేస్తాడు. ఒక్క నిమిషం ముందొచ్చినా నీ ప్రేమను స్వీకరించేదాన్ని, కానీ నీ తమ్ముడు ఇప్పుడే నాకు ప్రపోజ్ చేసాడు, నిన్ను పెళ్ళి చేసుకుని ఆ ఇంట్లో అడుగుపెట్టడం నాకు ఇబ్బందిగా ఉంటుందని తిరస్కరించి వెళ్ళిపోతుంది. తన ప్రేమ ఓడిపోడానికి లక్కీ కారణమని భావించిన రాము చాలా కాలం తర్వాత సందర్భం అనుకూలించడంతో ప్రకాశ్ కి ఫోన్ చేసి లక్కీ గురించి చెప్తాడు. ఈ లోపు రాము తన కారుని ఎత్తుకెళ్ళింది ఎవరని తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు కానీ ఫలితం మాత్రం సూన్యం. అయితే మాదాపూర్ ప్రాంతంలో కారు ఆగడం, ముగ్గురు దిగి అక్కడున్న ముఖలేష్ హోటల్లోకి వెళ్ళడం రాము చూస్తాడు. ముఖలేష్ హోటల్ ఓనర్ ముఖలేష్ (ఎం. ఎస్. నారాయణ)ని బాబాయి అని పిలుస్తుంటాడు లక్కీ. ఆ హోటల్ని లక్కీ, తన స్నేహితులు తమ అడ్డాగా మార్చుకుంటారు. ఇవేవీ తెలియని రాము అక్కడికెళ్ళి ఎంక్వయిరీ చెయ్యడానికి అక్కడికి వెళ్ళి ఏమీ తెలుసుకోకుండా తిరిగొస్తాడు.

శ్వేత షాద్ నగర్ ప్రాంతంలో ఉందని తెలుసుకున్న లక్కీ తనని తీసుకురావడానికి వెళ్తాడు. అక్కడికి లక్కీని చంపడానికి ప్రకాశ్ కూడా వెళ్తాడు. కానీ శ్వేత పెళ్ళిని చెడగొట్టి లక్కీ తనని తీసుకురావడంతో లక్కీని పెళ్ళివారు తరుముతుంటారు. అదే సమయానికి ప్రకాశ్ ని చూడటంతో తనని తరమడం వల్ల ప్రకాశ్ ప్లాన్ ఫైల్ అవుతుంది. లక్కీ శ్వేతని ఇంటికి తీసుకొచ్చినప్పుడు రాముకి, ఇన్స్పెక్���ర్ జనరల్ జే.పీ. (జయప్రకాశ్ రెడ్డి) కూతురికి నిశ్చితార్థం జరిగిపోతుంది. అది ఎలాగైనా చెడగొట్టాలని లక్కీ రాము కంట స్వేత పడేలా చేస్తాడు. ఒకరినొకరు ఇంకా ప్రేమించుకుంటున్నారని తెలుసుకున్న రాము, శ్వేత జే.పీ.ని వదిలించుకోవాలనుకుంటారు. తన కానిస్టేబుల్ (దువ్వాసి రామ్మోహన్) సలహాతో లక్కీని సాయం చెయ్యమని బ్రతిమాలతాడు. అప్పుడు లక్కీ తను నిలబడ్డ చోటినుంచి రాముని కిందకు తోసేస్తాడు. ఆసుపత్రిలో డాక్టర్ బాలి (ఆలీ) సహాయంతో తన తల్లిదండ్రులని, జే.పీ. కుటుంబాన్ని రాము ఇక తండ్రి కాలేడని నమ్మిస్తాడు లక్కీ. దానితో పెళ్ళి ఆగిపోతుంది. పెళ్ళి ఆగిందని సంతోషించినా లక్కీ ఆడిన అబద్ధం గురించి తెలుసుకున్న రాము పెళ్ళాపడానికి వేరే కారణం దొరకలేదా అని లక్కీతొ గొడవపెట్టుకుంటాడు రాము. అప్పుడు లక్కీ నువ్వు అవినీతిపరుడివని, కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేవని చెప్పినా ఎవరూ నమ్మరు కాబట్టే ఈ అబద్ధం ఆడానంటాడు. లక్కీ తనపై చూపించిన ప్రేమకి రాము ఆశ్చర్యపోతాడు. ఆసుపత్రి నుంచి విడుదలైన శివారెడ్డి లక్కీని కలిసి బెదిరిస్తే నువ్వెవరని లక్కీ ప్రశ్నిస్తాడు. నా జీవితంలో నువ్వు లేవు, నీ జీవితంలోకి నన్ను రానీకని హెచ్చరించి వెళ్ళిపోతాడు. పెద్దిరెడ్డి మంత్రిపదవిలో ఉన్న బలంతో లక్కీని నాశనం చెయ్యమని శివారెడ్డికి చెప్తాడు. ఎం.ఎల్.సి.గా ఎన్నికైన శివారెడ్డికి పారిశ్రామిక మంత్రి పదవినిస్తారు. ఆ పదవితో లక్కీ జీవితాన్ని అల్లకల్లోలం చెయ్యాలనుకుంటాడు శివారెడ్డి. ముందు రాముపై ఒక అమ్మాయి చేత టీవీ షోలో అబద్ధాలు చెప్పిస్తాడు శివారెడ్డి. తన భర్త చనిపోతే అనుమానం ఉన్నవారిపై విచారణ జరిపించండని అడిగితే తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఏడ్చి విషం తాగినట్టు నాటకమాడుతుంది ఆ అమ్మాయి. తద్వారా రాముని సస్పెండ్ చేస్తారు ఉన్నతాధికారులు. ఇంటికి తిరిగొచ్చాక ఇంటిని గవర్నమెంట్ అధికారులు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పేరిట కూలగొడతారు. వీటన్నిటి వెనకా శివారెడ్డి ఉన్నాడని గ్రహించిన లక్కీ కష్టపడి తన దగ్గరికి వెళ్తాడు. కానీ అక్కడ శివారెడ్డి నువ్వెవరు అని అడుగుతాడు. ఈలోపు రాముకి రాజు తండ్రి ద్వారా కారు ఎత్తుకెళ్ళింది లక్కీయే అని తెలుసుకుంటాడు.

ఇంటికి తిరిగొచ్చాక లక్కీని రాము ఇంటినుంచి గెంటేస్తాడు. అప్పుడే శివారెడ్డి మనుషులు తనని కొట్టి మర్రిచెట్టు ఊడకి కట్టిపడేస్తారు. శివారెడ్డి లక్కీ ముందుకొచ్చాక లక్కీ శివారెడ్డిని నిన్ను నాశనం చేస్తానని బెదిరిస్తాడు. మరుసటిరోజు లక్కీ ప్రమేయం వల్ల హైకమాండ్ దృష్టిలో మంచివాడిగా మారి, హోం మినిస్టర్ పదవిని సంపాదించిన గోవర్ధన్ (పోసాని కృష్ణమురళి) లక్కీని చూడటానికి కుటుంబసమేతంగా ఆసుపత్రికి వెళ్తాడు. అక్కడ బాలి సహకారంతో లక్కీ తనకి బ్లడ్ క్యాన్సర్ ఉందని నమ్మించి చనిపోయే ముందు ఒక్క రోజు పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నానని అంటాడు. అందరూ ఒత్తిడి తేవడంతో గోవర్ధన్ మరుసటి రోజు లక్కీని స్పెషల్ ఆఫీసరుగా ఒక్క రోజుకి ఉద్యోగం ఇచ్చి అన్ని సహకారాలను అందిస్తాడు. నిజాయితీగా పనిచెయ్యాలని ఆశపడి, పై అధికారుల ఒత్తిడి వల్ల చెయ్యలేక బాగా ఫ్రస్ట్రేషనులో ఉన్న కొంత మంది పోలీస్ అధికారుల టీముని లక్కీ అడుగుతాడు. దానిని గోవర్ధన్ సాంక్షన్ చేసాక లక్కీ తను బ్రతికేందుకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయని, అవి నిజమై తను బ్రతకాలంటే 12 గంటలు ప్రపంచంతో సంబంధం లేకుండా చండీయాగం చేస్తే బ్రతుకుతానని లక్కీ అంటాడు. గోవర్ధన్ చండీయాగం జరిపిస్తుండగా లక్కీ స్పెషల్ ర్యాపిడ్ ఫోర్స్ అని పిలవబడే ఆ ప్రత్యేక బృందంతో మాట్లాడతాడు. ఆ బృందంలో పార్థు కూడా ఒకడు. ఆ బృందంలో బాగా ఫ్రస్ట్రేషనులో ఉన్న కిల్ బిల్ పాండే (బ్రహ్మానందం) లక్కీ అనుచరుడిగా మారతాడు. వాళ్ళ మొదటి పనిగా లక్కీ కుటుంబంపై, స్పందనపై ఒకేసారి దాడి చెయ్యబోయిన శివారెడ్డి మనుషులని కిల్ బిల్ పాండే చెత చంపించి, మిగిలిన వారిని అరెస్ట్ చేస్తారు. అక్కడే ఉన్న రాముని కూడా అవాంతరాలు రాకుండా ఉండేందుకు అరెస్ట్ చేయిస్తాడు లక్కీ. కిల్ బిల్ పాండేని వాడుకుని తెలివిగా శివారెడ్డి అక్రమాస్తుల జాబితాను సంపాదించిన లక్కీ వాటన్నిటిపై దాడులు చెయ్యిస్తాడు.

ఒక్కరోజులో శివారెడ్డి ఆస్తులు, మంత్రి పదవి పోతాయి. పగబట్టిన శివారెడ్డిని ఎదురుకుని అరెస్ట్ చేస్తుండగా అప్పుడే విధుల్లోకి తిరిగొచ్చిన రాము లక్కీ, శివారెడ్డిలను అరెస్ట్ చేస్తాడు. ముఖ్యమంత్రి (సాయాజీ షిండే), హోమ్మంత్రి ప్రదేశానికి చేరుకున్నాక రాము లక్కీని చంపే ముందు జనంలో ప్రభుత్వంపై కలిగిన ప్రేమని, సానుకూల స్పందనని ఇద్దరికీ చూపిస్తాడు. ఈలోపు లక్కీ మాయ చేసి స్పెషల్ ర్యాపిడ్ ఫోర్స్ ఎప్పటికీ ఇలాగే ఉండేలా, దానికి కిల్ బిల్ పాండే నేతృత్వం వహించేలా, తనకు అమెరికా వెళ్ళడానికి వీసా లభించేలా చేస్తాడు. శివారెడ్డిని వెనక నుంచి పారిపొమ్మని చెప్పి వెనకే పార్థు చేత చంపించేస్తారు. ఇది ప్రభుత్వం చర్యలు కావని, లక్కీ సొంత ప్రతీకార చర్యలన్న రహస్యాన్ని ముఖ్యమంత్రి, హోమ్మంత్రి, రాము, లక్కీ తమలోనే దాచుకుంటారు. అన్నదమ్ములిద్దరూ కలిసిపోవడం, అక్కడే ఉన్న కిల్ బిల్ పాండేకి జనాలు జైకొట్టే సన్నివేశంతో సినిమా ముగుస్తుంది.

విమర్శకుల స్పందన

[మార్చు]

రేసుగుర్రం సినిమా విమర్శకుల నుంచి సానుకూల స్పందనను రాబట్టగలిగింది. 123తెలుగు.కామ్ తమ సమీక్షలో "భారీ అంచనాల నడుమ విడుదలైన ‘రేసు గుర్రం’ సినిమా బాక్స్ ఆఫీసు రేసులో విజయాన్ని అందుకునే రేంజ్ లోనే ఉంది. ఈ సమ్మర్ కి పక్కా పైసా వసూల్ ఎంటర్టైనర్ గా నిలిచిపోతుంది. అల్లు అర్జున్ తో పాటు బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, ఎంఎస్ నారాయణ, పోసాని కలిసి మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తే శృతి హాసన్ గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. ‘రేసు గుర్రం’ అల్లు అర్జున్ కెరీర్లో నటుడిగా మరో మెట్టు పైకి తీసుకెళ్ళడమే కాకుండా బన్ని కెరీర్లో కూడా బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిపోతుంది" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3.5/5 రేటింగ్ ఇచ్చారు.[2] వన్ఇండియా తమ సమీక్షలో "కథలో కొత్తదనం, ఊహించని ట్విస్ట్ లు లేకపోయినా రెండు గంటల సేపు ఎంటర్ట్నైన్ చేయటంలో సఫలీకృతమయ్యింది. ముఖ్యంగా సెకండాఫ్ లో బ్రహ్మానందం, అలీతో చేసిన కామెడీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఈ గుర్రం మీద పందెం కాయచ్చు, టిక్కెట్ డబ్బుకు తగ్గ ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది అనే భరోసా కలిపించింది. జూలాయి,కిక్,తడాఖా కలిపినట్లున్న ఈ చిత్రం ఏ మాత్రం ఢోకా లేని వినోదాన్ని ఇస్తుంది. మితి మీరిన హింస, అసభ్యత లేకపోవటంతో ఫ్యామిలీలకు మంచి ఆప్షన్. ఫైనల్ గా అల్లు అర్జున్...ద్యాముడా(దేముడా) అనే ఊతపతం చెప్పే విధానం కోసమైనా చూడొచ్చు" అని వ్యాఖ్యానించి ఈ సిన��మాకి 3/5 రేటింగ్ ఇచ్చారు.[3] ఇండియాగ్లిట్స్ తమ సమీక్షలో "ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి ఆలోచ‌న బాగుంది. ఇంట‌ర్వెల్ త‌ర్వాత యాక్ష‌న్ అంటూ హింస‌ను తెర‌పై చూపించ‌కుండా కామెడి ట్రాక్‌తో సినిమాని న‌డిపించ‌డం సినిమాకి ప్ల‌స్ అయ్యింది. అన్న‌ద‌మ్ములుగా శ్యామ్‌, అల్లుఅర్జున్‌ల సినిమాని నిల‌బెట్టింది. అల్లుఅర్జున్ ఎనర్జికి త‌గిన‌ట్లు తెర‌కెక్కించిన ఈ సినిమా క‌మ‌ర్షియల్ హిట్ సినిమాల రేసులో నిల‌బ‌డింది" అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3.5/5 రేటింగ్ ఇచ్చారు.[4]

పురస్కారాలు

[మార్చు]

సైమా అవార్డులు

[మార్చు]

2014 సైమా అవార్డులు (తెలుగు)

  1. ఉత్తమ దర్శకుడు
  2. ఉత్తమ నటి
  3. ఉత్తమ హాస్యనటుడు (బ్రహ్మనందం)
  4. ఉత్తమ నేపథ్య గాయకుడు (సింహ - సినిమా చూపిస్త మామ)

మూలాలు

[మార్చు]
  1. "ఏప్రిల్ 11న విడుదలకానున్న రేస్ గుర్రం". 123తెలుగు.కామ్. 11 April 2014. Archived from the original on 26 మార్చి 2014. Retrieved 11 April 2014.
  2. "సమీక్ష: రేసు గుర్రం – స్టైలిష్ కమర్షియల్ ఎంటర్టైనర్". 123తెలుగు.కామ్. 11 April 2014. Archived from the original on 13 ఏప్రిల్ 2014. Retrieved 11 April 2014.
  3. "పందెం కాయచ్చు... ('రేసుగుర్రం' రివ్యూ)". వన్ఇండియా. 11 April 2014. Retrieved 11 April 2014.[permanent dead link]
  4. "ఈ గుర్రం రేసుగుర్ర‌మే‌". ఇండియాగ్లిట్స్. 11 April 2014. Retrieved 11 April 2014.