వేసవి లేని సంవత్సరం
వేసవి లేని సంవత్సరం | |
---|---|
అగ్నిపర్వతం | తంబోరా పర్వతం |
తేదీ | April 10, 1815 |
Type | అల్ట్రా ప్లీనియన్ |
ప్రదేశం | లెస్సర్ సుండా దీవులు, డచ్చి ఈస్ట్ ఇండీస్ దీవులు (నేటి ఇండోనేషియా) 8°15′S 118°0′E / 8.250°S 118.000°E |
VEI (ఎక్స్‌ప్లోజివిటీ ఇండెక్సు | 7 |
తాకిడి | అగ్నిపర్వత శీతలం ఏర్పడి, ప్రపంచవ్యప్తంగా ఉష్ణోగ్రతలు 0.4–0.7 °C పడిపోయాయి. |
1816 ను వేసవి లేని సంవత్సరం అని అంటారు. దీన్ని బీదరికపు సంవత్సరం అని, పద్దెనిమిద వందల మృత్యుశీతలం అనీ కూడా అంటారు.[1] తీవ్రమైన వాతావరణ వైపరీత్యాల కారణంగా భూమిపై ఉష్ణోగ్రతలు 0.4–0.7 °C పడిపోవడంతో.[2] ఏర్పడిన పరిస్థితుల వలన దీన్ని అలా పిలుస్తారు. దీనివలన ఉత్తరార్థగోళంలో పెద్దయెత్తున ఆహార కొరత ఏర్పడింది.[3]
1815 లో ఇండోనేషియా లోని సంబావా దీవి (అప్పటి డచ్ ఈస్ట్ ఇండీస్) లోని తంబోరా అగ్నిపర్వతం విస్ఫోటనం చెందటం ఈ వైపరీత్యానికి ప్రధాన కారణం. 1300 ఏళ్ళ తరువాత ఇంత పెద్ద అగ్నిప��్వత విస్ఫోటనం ఇదే. అంతకు ముందు, 1814 లో జరిగిన ఫిలిప్పీన్స్ లోని మాయోన్ అగ్నిపర్వతం పేలుడు, ఈ పేలుడు ప్రభావాన్ని తీవ్రతరం చేసింది.
వివరణ
[మార్చు]వేసవి లేని సంవత్సరం వ్యవసాయానికి విపత్తు తెచ్చిపెట్టింది. ఇది పశ్చిమ దేశాల్లో మానవ మనుగడకు ఎదురైన అతి పెద్ద ముప్పు అని చరిత్రకారుడు జాన్ పోస్ట్ అన్నాడు.[4][5] 1816 నాటి వాతావరణ ప్రతికూలతలు న్యూ ఇంగ్లాండ్, అట్లాంటిక్ కెనడా, పశ్చిమ ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత తీవ్ర ప్రభావాన్ని చూపాయి.
ఉత్తర అమెరికా
[మార్చు]1816 వసంత ఋతువులో తూర్పు అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో నిరంతరం పొడి మంచు ఆవరించి ఉండేది. ఈ మంచు సూర్యకాంతిని మందగింపజేసింది. సూర్యుడి లోని మచ్చలను అద్దాలేమీ లేకుండానే కంటితో చూడగలిగారు. గాలి, వర్షం కూడా ఈ మంచును చెదరగొట్టలేకపోయాయి.[6]
దీర్ఘ కాలపు శీతాకాలాలకు అలవాటు పడిన వాళ్ళకు చల్లటి వాతావరణం పెద్దగా ఇబ్బంది కలిగించలేదు. ఈ వాతావరణం పంటలపై చూపిన ప్రభావం, ఆ కారణంగా ఆహారం, వంటచెరకు కోసం ఏర్పడిన కరువూ అసలైన సమస్యలు. వాతావరణం బాగున్నప్పుడే వ్యవసాయం సమస్యగా ఉండే ఎత్తైన ప్రదేశాల్లో ఈ వాతావరణం మరీ సమస్యాత్మకం అయింది. 1816 మే లో మసాచుసెట్స్, న్యూ హాంప్‌షైర్, వెర్మాంట్, న్యూయార్క్ రాష్ట్రాల్లోని ఎత్తైన ప్రాంతాల్లో పంటలను చాలావరకు మంచు నాశనం చేసింది. జూన్ 6 న, ఆల్బనీ, డెన్నిస్‌విల్ లలో మంచు కురిసింది.[7] కేప్ మే లో, జూన్ నెలలో వరసగా ఐదు రాత్రుల పాటు కురిసిన మంచు కారణంగా పంటలు విపరీతంగా దెబ్బతిన్నాయి.[8]
1816 మే లో న్యూ యార్కు లోని న్యూ లెబనాన్ నుండి నికోలస్ బెనెట్ ఇలా రాసాడు: "అన్నీ గడ్డ కట్టేసాయి. కొండలు శీతాకాలంలో లాగా పచ్చదనం కోల్పోయి ఎండిపోయాయి. మేలో ఉష్ణోగ్రతలు దాదాపు ప్రతిరోజూ సున్నా కంటే దిగువకు పడిపోయాయి. జూన్ 9 న భూమి గడ్డకట్టింది." మసాచుసెట్స్ చరిత్రకారు డొకరు ఈ విపత్తును ఇలా వర్ణించాడు:
ప్రతీనెలా తీవ్రంగా గడ్ద కట్టే పరిస్థితులు ఏర్పడేవి; జూన్ 7న, 8న మంచు కురిసింది. అప్పుడు ఎంత చల్లగా ఉందంటే, పంటలు విరిగి పోయాయి. వేర్లు కూడా చలికి కొయ్యబారిపోయాయి. శరదృతువు తొలినాళ్ళలో పాలుపోసుకునే దశలో ఉన్న మొక్కజొన్న పంట గడ్డకట్టి పోయింది, ఈననే లేదు. రొట్టెకు దిక్కులేదు, ధరలు మిన్నంటాయి. పేదలు తిండి కోసం అల్లాడారు. రైలు మార్గం అప్పటికింకా పూర్తిగా అందుబాటులోకి రానందువల్ల పశ్చిమాన ఉన్న ధాన్యపు కొట్టాల్లోని ధాన్యపు రాశులు కరువు ప్రాంతానికి అందలేదు. స్థానికంగా ఉన్న వనరులపైనే ఆహారం కోసం ప్రజలు ఆధారపడాల్సి వచ్చింది.[9]
జూలై ఆగస్టుల్లో ఎక్కడో దక్షిణాన ఉన్న వాయవ్య పెన్సిల్వేనియా లోని నదులు, సరస్సుల్లో కూడా మంచు ఏర్పడింది. ఆగస్టు 20,21 ల్లో వర్జీనియాలో మంచు ఏర్పడింది.[10] ఉష్ణోగ్రతల్లో మార్పులు ఆకస్మికంగా ఉండేవి. కొద్ది గంటల్లోనే ఉష్ణోగ్రత 35 °C నుండి దాదాపు సున్నాకు పడిపోయేది. అధ్యక్షుడిగా పనిచేసి, తరువాత మోంటిసెల్లోలో వ్యవసాయం చేసుకుంటున్న థామస్ జెఫర్‌సన్, పంటలు దెబ్బతినడంతో అప్పుల్లో కూరుకుపోయాడు. మొక్కజొన్న పంట మూడొంతుల దాకా దెబ్బతింది అని సెప్టెంబరు 13 న ఒక వర్జీనియా వార్తా పత్రిక రాస్తూ, "మంచు, కరువూ కలిసి ప్రజల ఆశలను మొగ్గ లోనే తుంచేసాయి" అని రాసింది.[11] నార్‌ఫోక్, వర్జీనియా లోని వార్తాపత్రిక ఒకటి ఇలా రాసింది:
జూలై సగం గడిచింది. కానీ, అది వేసవి కాలం అని చెప్పేందుకు ఒక్క రోజు కూడా కనబడలేదు. అంతకు ముందు మూణ్ణెల్ల నుండీ తూర్పు గాలులే వీస్తున్నాయి... ఆ సమయంలో సూర్యుడు మినుకు మినుకు మంటూ ఉన్నాడు, ఆకాశం మబ్బులు కమ్మి ఉంటోంది. గాలిలో తేమ బాగా ఉండి ఇబ్బందిగా ఉంటోంది. బాగా చల్లగా ఉండి ఎప్పుడూ చలిమంట పక్కనే కూచ్చోవాలనిపిస్తోంది.[12]
ఐరోపా
[మార్చు]అతి శైత్యము, అతివృష్టిల కారణంగా బ్రిటను, ఐర్లాండుల్లో పంటలు దెబ్బతిన్నాయి. వేల్స్‌లోని కుటుంబాలు భిక్షాటన చేస్తూ సుదూర ప్రాంతాలకు వెళ్ళాయి. ఉత్తర, వాయవ్య ఐర్లాండులో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. జర్మనీలో పరిస్థితులు మరీ విషమించాయి. ఆహార ధరలు పెరిగిపోయాయి. ఆ పరిస్థితులకు కారణమేంటో తెలియని ప్రజలు ధాన్యపు మార్కెట్ల వద్ద, బేకరీల వద్దా నిరసనలు చేసారు. అనేక ఐరోపా నగరాల్లో దోపిడీలు, అల్లర్లు, దహనాలూ చెలరేగాయి. 19 వ శతాబ్ది ఐరోపాలో అది అతిపెద్ద కరువు.[13]
ఈ ఘటన ప్రభావాలు విస్తృతంగా ఉన్నాయి. శీతాకాలం తరవాత కూడా కొనసాగాయి. 1816, 1817 వేసవిలో పశ్చిమ స్విట్జర్లాండులో ఎంత చల్లగా ఉండేదంటే, గీట్రో గ్లేసియరు అడుగున ఒక మంచు డ్యాము ఏర్పడింది. 1818 జూన్‌లో అది కూలి విపత్తుకు దారితీసింది.[14]
ఆసియా
[మార్చు]శీతల స్థితుల కారణంగా చైనాలో చెట్లు నశించాయి. వరి పంట దెబ్బతింది. ఉత్తర చైనాలో నీటిగేదెలు చనిపోయాయి. వీటికి ��ట్టుకుని నిలబడ్డ పంటలను చాలావరకు వరదలు మింగేసాయి. ఋతుపవనాలు గతి తప్పాయి. ఆ కారణంగా యాంగ్జీ లోయను వరదలు ముంచెత్తాయి. భారతదేశంలో నైఋతి ఋతుపవనాలు ఆలస్యమయ్యాయి. పెద్దపెట్టున కురిసిన అకాల వర్షాల కారణంగా కలరా వ్యాపించింది.[15] జపానులో శైత్యం పంటలను నాశనం చేసింది. జనాభాపై ప్రతికూల ప్రభావం చూపింది.[16]
1815 ఏప్రిల్ 5-15 మధ్య తంబోరా అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం ఈ పరిస్థితికి కారణమని భావించారు.[18][19][20] వోల్కానిక్ ఎక్స్‌ప్లోజివిటీ ఇండెక్స్ (VEI) పై ఇది 7 గా నమోదైంది. 100 ఘన కిలోమీటర్ల పదార్థాన్ని ఈ విస్ఫోటనం ఎగజిమ్మింది. సా.శ 180 లో జరిగిన హటేపె విస్ఫోటనం తరువాత ఇదే అతిపెద్దది. ఇదే సమయంలో జరిగిన ఇతర విస్ఫోటనాలు (VEI 4 కంటే ఎక్కువ తీవ్రత కలిగినవి):
- 1809: పసిఫిక్ మహాసముద్రంలో 1808/1809 లో జరిగిన విస్ఫోటనం (VEI 6)
- 1812: సెంట్ విన్సెంట్ లోని లా సోఫ్రియరీ
- 1812: డచ్చి ఈస్ట్ ఇండీస్ లోని అవు.
- 1813: జపాను ర్యూకు దీవుల్లోని సువానోసెజిమా
- 1814: ఫిలిప్పీన్స్ లోని మాయోన్
పై విస్ఫోటనాల కారణంగా వాతావరణంలో పెద్దయెత్తున ధూళి చేరింది. ఈ కారణంగా స్ట్రాటోస్ఫియరు నుండి సూర్యరశ్మి చొచ్చుకొని రాలేకపోయినందున ఉష్ణోగ్రతలు ప్రపంచవ్యాప్తంగా పడిపోయాయి. ఇలాంటి పెద్ద విస్ఫోటనాల్లో ఇది సాధారణంగా జరిగేదే.[21]
ఒకదాని వెంట ఒకటిగా జరిగిన అగ్నిపర్వత విస్ఫోటనాల కారణంగా వీటి ప్రభావానికి గురైన ప్రాంతాల్లో అనేక సంవత్సరాల పాటు పంటలు సరిగా పండలేదు; 1815 నాటి తంబోరా విస్ఫోటనం ఈ ప్రాంతాలకు చావుదెబ్బ అయింది. నెపోలియన్ చేసిన యుద్ధాల నుండి అప్పుడప్పుడే కోలుకుంటున్న ఐరోపాలో ఆహార కొరత ఏర్పడింది. ఇంగ్లాండు, ఫ్రాన్సుల్లో తిండి కోసం అల్లర్లు రేగాయి. గోదాములను దోపిడీ చేసారు. స్విట్జర్లాండులో అత్యంత తీవ్రమైన హింస జరిగింది. కరువు కారణంగా ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించింది. తుపాను వర్షాల వల్ల నదులు పొంగి వరదలు ముంచెత్తాయి. ఆగస్టులో మంచు కురిసింది. కరువు కారణంగా 1816, 1819ల మధ్య ఐర్లాండులో టైఫస్ అనే అంటువ్యాధి ప్రబలింది. 100,000 మంది ప్రజలు మరణించారు. ఐరోపాలో వార్షిక మరణాల కంటే 1816 నాటి మరణాలు రెట్టింపు ఉన్నాయని ఒక బిబిసి డాక్యుమెంటరీ తెలిపింది.
ప్రభావాలు
[మార్చు]వరసగా ఏర్పడిన అగ్నిపర్వత విస్ఫోటనాల వలన అనేక ఏళ్ళ పాటు పంటలు దెబ్బతిన్నాయి; 1815 లో తంబోరా విస్ఫోటనంతో ఇది పరాకాష్ఠకు చేరింది. నెపోలియన్ కాలం నాటి యుద్ధాల నుండి అప్పుడప్పుడే తేరుకుంటున్న ఐరోపాలో మళ్ళీ ఆహార కొరత మొదలైంది. ఇంగ్లాండు, ఫ్రాన్సుల్లో తిండి గొడవలు జరిగాయి. ధాన్యపు గోదాములను దోపిడీ చేసారు. స్విట్జర్లాండులో హింస అత్యంత తీవ్రంగా ప్రబలింది. కరువు కారణంగా అక్కడి ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని విధించింది.
అతివృష్టి వలన ఐరోపాలోని నదులకు వచ్చిన వరదలు, ఆగస్టు మంచుకూ కారణం ఈ ఘటనేనని చెప్పారు. వేసవి లేని సంవత్సరం వలన ఏర్పడిన కరువు కారణంగా 1816, 1819 ల మధ్య టైఫస్ అంటువ్యాధి వ్యాపించింది. లక్ష మంది దాకా ఐరిష్ ప్రజలు ఈ కాలంలో మరణించారు. 1816 ఏడాది మరణాలు మామూలు పరిస్థితుల్లో ఉండే మరణాల కంటే రెట్టింపు అని, మొత్తం ఐరోపాలో 2 లక్షల మండి మరణించారనీ ఒక బిబిసి, ఒక డాక్యుమెంటరీలో చెప్పింది.
దీనికి సాటి రాగల ఘటనలు
[మార్చు]- టోబా మహావిపత్తు 70,000 - 75,000 సంవత్సరాల కిందట
- సా.శ.పూ. 1628–1626 నాటి వాతావరణంలో కలిగిన పెనుమార్పులు - సాధారణంగా వీటిని సాంటోరిని విస్ఫోటనానికి ఆపాదిస్తూంటారు.
- సా.శ.పూ. 1200 లో హెక్లా 3 విస్ఫోటనం. కంచుయుగ పతనం సమయానిది ఇది.
- సా.శ. 180 నాటి హతేపే విస్ఫోటనం (టాపో విస్ఫోటనం అని అనడం కూడా కద్దు)
- 535–536 లో విపరీత వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎల్ సాల్వడార్. లోని క్రకటోవా లేదా ఇలోపాంగో విస్ఫోటనం కారణంగా ఇవి ఏర్పడ్డాయని భావించరు.
- 969 (± 20 ఏళ్ళు) లో ఉత్తర కొరియా, చైనాల మధ్య ఉన్న పేక్టూ పర్వతం విస్ఫోటనం.
- 1257 లో లోంబోక్ ద్వీపంలో మౌంట్ రంజాని విస్ఫోటనం.
- పసిఫిక్ అగ్నిపర్వతం, కూవే విస్ఫోటనం.1453 లో కాన్‌స్టంటినోపుల్ పతనానంతరం జరిగిన సంఘటనలకు ఇదే కారణంగా భావించారు.
- పెరూలో హుయ్‌నాపుతినా విస్ఫోటనం. ఈ కారణంగా, 1601 వ సంవత్సరం, ఆరు శతాబ్దాల్లో అత్యంత శీతల సంవత్సరంగా నిలబడింది; 1601 లో తీవ్రమైన చలికాలం, చల్లటి వేసవికాలమూ వచ్చాయి.
- ఐస్‌ల్యాండులో వేలాది మందిని కబళించిన లాకీ విస్ఫోటనం - 1783–84.
- 1883 లో క్రకటోవా విస్ఫోటనం కారణంగా ఉత్తరార్థగోళంలో ఉష్ణోగ్రతలు 1.2 °C దాకా పడిపోయాయి.
- 1991 లో పినాటుబో విస్ఫోటనం కారణంగా అమెరికాలో అసాధారణ వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]1816, వేసవి లేని సంవత్సరం - బిబిసి
నోట్స్
[మార్చు]- ↑ "Weather Doctor's Weather People and History: Eighteen Hundred and Froze To Death, The Year There Was No Summer". Islandnet.com. Retrieved 2017-10-12.
- ↑ Stothers, Richard B. (1984). "The Great Tambora Eruption in 1815 and Its Aftermath". Science. 224 (4654): 1191–1198. Bibcode:1984Sci...224.1191S. doi:10.1126/science.224.4654.1191. PMID 17819476.
- ↑ "Saint John New Brunswick Time Date". New-brunswick.net. Archived from the original on 2017-01-09. Retrieved 2012-03-05.
- ↑ Post, John D. (1977). The last great subsistence crisis in the Western World. Baltimore: Johns Hopkins University Press. ISBN 9780801818509.
- ↑ Evans, Robert Blast from the Past, Smithsonian Magazine. July 2002, p. 2
- ↑ Oppenheimer, Clive (2003). "Climatic, environmental and human consequences of the largest known historic eruption: Tambora volcano (Indonesia) 1815". Progress in Physical Geography. 27 (2): 230–259. doi:10.1191/0309133303pp379ra.
- ↑ Oppenheimer 2003
- ↑ American Beacon (Norfolk, VA), Vol. II, Issue 124 (July 4, 1816), 3.
- ↑ William G. Atkins, History of Hawley (West Cummington, Mass. (1887), 86.
- ↑ American Beacon (Norfolk, VA), September 9, 1816, 3.
- ↑ "Crops," American Beacon(Norfolk, VA), September 13, 1816, 3
- ↑ Columbian Register(New Haven, CT), July 27, 1816, 2.
- ↑ "The 'year without a summer' in 1816 produced massive famines and helped stimulate the emergence of the administrative state", observes Albert Gore, Earth in the Balance: Ecology and the human spirit, 2000:79
- ↑ The flood is fully described in Jean M. Grove, Little Ice Ages, Ancient and Modern (as The Little Ice Age 1988) rev. ed. 2004:161.
- ↑ Facts – Year Without Summer Archived 2020-03-08 at the Wayback Machine Extreme Earth, Discovery Channel
- ↑ "夏のない年 from turning-point.info". Archived from the original on 2019-09-11. Retrieved 2019-01-21.
- ↑ Dai, Jihong; Mosley-Thompson, Ellen; Thompson, Lonnie G. (1991). "Ice core evidence for an explosive tropical volcanic eruption six years preceding Tambora". Journal of Geophysical Research: Atmospheres. 96: 17, 361–17, 366. Bibcode:1991JGR....9617361D. doi:10.1029/91jd01634.
- ↑ Tambora, Indonesian Volcano (Tambora Volcano Part I): Tambora: The Year Without A Summer Anthony Tully, Indodigest, archived on June 15, 2006 from the original
- ↑ "The Year without a Summer" Bellrock.org.uk
- ↑ Sir Thomas Stammford Raffles: A History of Java; Black, Parbury, and Allen for the Hon. East India Company 1817; reprinted in the Cambridge Library Collection, 2010.
- ↑ "Why does the stratosphere cool when the troposphere warms? « RealClimate". Realclimate.org. Retrieved 2016-04-21.