మానవీయ శాస్త్రాలు
మానవీయ శాస్త్రాలు (ఆంగ్లం: Humanities) విద్యారంగంలో ఒక వర్గానికి చెందిన శాస్త్రాలు. ఇవి మానవ సమాజం, సంస్కృతి లాంటి అంశాలను, సహజంగా మానవులకు ఎదురయ్యే అనేక రకాల ప్రశ్నలను గురించి అధ్యయనం చేస్తాయి. సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో మతం, దైవత్వం కన్నా మానవీయ శాస్త్రాల అధ్యయనం అంటే సాంప్రదాయ సాహిత్యం, భాషాధ్యయనమే ఎక్కువగా ఉండేది. ఆ నాటి విశ్వవిద్యాలయాలలో లౌకిక పాఠ్యప్రణాళికలో మానవీయ శాస్త్రాలు ముఖ్యమైన భాగంగా ఉండేవి. ప్రస్తుతం ప్రకృతి/భౌతిక శాస్త్రాలు, సామాజిక శాస్త్రం, సాంప్రదాయిక శాస్త్రాలు (గణితం లాంటివి), అనువర్తన శాస్త్రాల పరిధిలో లేని శాస్త్రాలన్నింటినీ మానవీయ శాస్త్రాలు అని తరచు నిర్వచిస్తున్నారు.[1] విజ్ఞాన శాస్త్రాలు ప్రయోగ పూర్వక పద్ధతులను ఉపయోగిస్తే మానవీయ శాస్త్రాలు అందుకు భిన్నంగా విమర్శనాత్మక, ఊహాత్మక, వ్యాఖ్యాన పూర్వక పద్ధతులు ఉపయోగిస్తాయి.[2]
తత్వశాస్త్రం, మతం, చరిత్ర, భాషా సంబంధిత కళలు (సాహిత్యం, రచన, ఉపన్యాసం, అలంకారం, కవిత్వం), ప్రదర్శించే కళలు (నాటకం, సంగీతం, నృత్యం, మొదలైనవి), దృశ్య కళలు (చిత్రలేఖనం, శిల్పం, ఛాయచిత్రకళ, సినిమా, మొదలైనవి) మానవీయ శాస్త్రాల కిందకి వస్తాయి.[3]
మూలాలు
[మార్చు]- ↑ Oxford English Dictionary (3rd ed.).
- ↑ "Humanity" 2.b, Oxford English Dictionary, 3rd ed. (2003).
- ↑ "Arts and Humanities Majors and Degrees". BigFuture (in ఇంగ్లీష్). Retrieved 2023-12-13.