Jump to content

పల్లెపాడు

అక్షాంశ రేఖాంశాలు: 16°02′40″N 77°35′33″E / 16.04441°N 77.59259°E / 16.04441; 77.59259
వికీపీడియా నుండి

పల్లెపాడు, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, మానవపాడ్ మండలంలోని గ్రామం.[1]

పల్లెపాడు
—  రెవిన్యూ గ్రామం  —
[[Image:
దేవాలయం
|250px|none|]]
అక్షాంశరేఖాంశాలు: 16°02′40″N 77°35′33″E / 16.04441°N 77.59259°E / 16.04441; 77.59259
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్ జిల్లా
మండలం మానోపాడ్
ప్రభుత్వం
 - సర్పంచి సత్యారెడ్డి
జనాభా (2011)
 - మొత్తం 1,818
 - పురుషుల సంఖ్య 948
 - స్త్రీల సంఖ్య 870
 - గృహాల సంఖ్య 446
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది మండల కేంద్రమైన మానోపాడ్ నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కర్నూలు నుండి 32 కి. మీ. దూరంలోనూ ఉంది.2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2] శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వలన ముంపుకు గురై 1980 లో నూతన గ్రామం నిర్మించబడింది.

పూర్వం ఆలంపూరు పరగణాలో ఉండేది. చాళుక్య వినయాదిత్యుని శాసనం ఈ గ్రామంలో లభించింది. చరిత్ర పరిశోధకుడు, సాహితీవే��్త గడియారం రామకృష్ణ శర్మ దీన్ని పల్లెపాడు శాసనంగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. పల్లెపాడు మానోపాడు మండలంలోని ప్రధాన గ్రామాలలో ఒకటి. కృష్ణా నది పరీవాహక ప్రాంతం. శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వలన ముంపుకు గురై 1980 లో నూతన గ్రామం నిర్మించబడింది

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 446 ఇళ్లతో, 1818 జనాభాతో 1355 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 948, ఆడవారి సంఖ్య 870. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 429 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 576400.[3]

పరిసర గ్రామాలు

[మార్చు]

ఈ గ్రామానికి ఉత్తరాన కృష్ణా నది, దక్షిణాన బోరవెల్లి గ్రామం, తూర్పున మారమునగాల, పశ్చిమాన మంగంపేట సరిహద్దులుగా ఉన్నాయి.

రవాణా మార్గం

[మార్చు]

ఈ గ్రామానికి వెళ్ళడానికి ప్రధానంగా రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఈ ఊరికి పశ్చిమాన 32 కి.మీ. దూరంలో ఉన్న గద్వాల పట్టణం నుండి రోజుకు 4 సార్లు తిరుగు బస్సు ద్వారా చేరుకోవచ్చు. రెండు- ఈ గ్రామానికి 30 కి.మీ. దూరంలో గల కర్నూలు నుండి కూడా బస్సు సౌకర్యం ఉంది. 7వ నంబరు జాతీయ రహదారి ( ప్రస్తుతం 44) మీద హైదరాబాదు నుండి కర్నూలుకు వెళ్ళే మార్గంలో, కర్నూలుకు 22 కి.మీ. ముందుగా వచ్చే జల్లాపురం స్టేజి దగ్గర దిగితే, అక్కడ నుండి కూడా ఆటోలలో వెళ్ళవచ్చు.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. 7 వ తరగతి దాకా చదువుకున్న విద్యార్థులు ఉన్నత పాఠశాల విద్య కొరకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న జల్లాపురం గ్రామానికి వెళ్తుంటారు.గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉంది.

బాలబడి మానోపాడ్లోను, మాధ్యమిక పాఠశాల జల్లాపూర్లోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల మానోపాడ్లోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల‌లు కర్నూలులోనూ ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల కొండేర్లోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు కర్నూలులోనూ ఉన్నాయి.

సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉండవెల్లిలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు కర్నూలులోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

సమీప ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పశు వైద్యశాల, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టరు ఒకరు ఉన్నారు.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార సౌకర్యం

[మార్చు]

పల్లిపాడులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

పల్లిపాడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 179 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 151 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 44 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 276 హెక్టార్లు
  • బంజరు భూమి: 303 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 399 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 873 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 105 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

పల్లిపాడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 48 హెక్టార్లు* చెరువులు: 37 హెక్టార్లు* ఇతర వనరుల ద్వారా: 20 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

పల్లిపాడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, జొన్న

దేవాలయాలు/ప్రార్థనాలయాలు

[మార్చు]

ఈ గ్రామం సర్వమత సమ్మేళనానికి ఓ గుర్తు. గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయం, మసీదు, చర్చి ఉన్నాయి. ఆంజనేయస్వామి ఆలయంలోనే ఓ వైపు శ్రీసీతారామస్వామిల విగ్రహాలను ఉంచారు. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమికి ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రైతులకు సంబంధించి గిరక పందేలు, బండలాగుడు పోటీలు, ఇతర పోటీ కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. మొదట్లో ఈ గ్రామంలోని ముస్లిములు ప్రతి సంవత్సరం జరుపుకొనే బక్రీదు, రంజాను లాంటి పండుగల సందర్భంలో గ్రామంలో ఈద్గా లేక పోవడంచే సమీపంలోని గార్లపాడు, బోరవెల్లి తదితర గ్రామాలకు వెళ్ళెవారు. పది సంవత్సరాల క్రితం గ్రామంలో ఓ మసీదును నిర్మించుకున్నారు. ఇప్పుడు అన్ని పండుగలకు ప్రార్థనలు అక్కడే చేస్తుంటారు.

జీవనోపాధి

[మార్చు]

ఈ గ్రామ ప్రజల జీవనోపాధి ప్రధానంగా వ్యవసాయమే. ఈ గ్రామానికి వాయువ్యాన తప్ప చుట్టూ నల్లరేగడి భూములే. ఈ భూముల్లో ప్రధానంగా వేరుశనగ, జొన్న, కంది లాంటి పంటలు పండించేవారు. ప్రస్తుతం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ కుడికాలువ నీరు అందుబాటులోకి రావడం వలన పత్తి, మిరుప వంటి పంటలు పండిస్తున్నారు. డిసెంబరు, జనవరి మాసాల్లో సమీపంలోని కృష్ణానది బ్యాక్ వాటర్ మెల్లగా తగ్గుముఖం పట్టాక ఆ ఒండ్రు నేలలో శనగ, పొద్దు తిరుగుడు పంటలు పండిస్తుంటారు. గ్రామానికి వాయువ్యాన ఎర్ర నేలల్లో బిజ్జుల వంశీయుల మామిడి తోటలు, చింతతోపులు ఉన్నాయి. ఆయా కాలాల్లో ఈ తోటల మీద కొంత మంది ఆధారపడి జీవిస్తుంటారు. గ్రామానికి దగ్గర్లోనే కృష్ణానది ఉండటం వలన వర్షాకాలంలో చేపల వేట మీద మరికొంత మంది ఆధారపడి జీవిస్తున్నారు.

పరిపాలనా చరిత్ర

[మార్చు]

ఈ గ్రామం పూర్వం హైదరాబాదు పాలకులుగా కుతుబ్‌షాహీలు ఉన్న కాలంలో అలంపూరు పరగణాలో ఉండేది. అలంపూరు, మరికొన్ని పరగణాలను బిజ్జుల వంశీయులు కుతుబ్‌షాహీలకు సామంతులుగా పాలించారు. బిజ్జుల వంశీయులు మొటాటి రెడ్లు, వెన్నూళ్ళ గోత్రం వారు. బిజ్జుల వంశీయులలో ముఖ్యంగా పేర్కోదగినవారు బిజ్జుల తిమ్మభూపాలుడు. ఇతను అనర్ఘ రాఘవ నాటకమును తెలుగులోకి అనువాదం చేశారు. హైదరాబాదు మొఘలుల స్వాధీనమైన సందర్భంలో వారి ప్రతినిధిగా, తరువాత స్వతంత్రుడిగా నిజాం ఖమురుద్దీన్ పరిపాలించిన సందర్భంలో ఖమురుద్దీన్ తన బంధువైన షాహ్ యారుల్ ముల్క్ కు అలంపూరు పరగాణను జాగీరుగా ఇవ్వగా, బిజ్జుల వంశీయులు అలంపూరుపై అధికారాన్ని కోల్పోయి, కేవలం ఈ గ్రామాన్ని (పల్లెపాడు) మాత్రమే జాగీరుగా మిగుల్చుకున్నారు. ఆ విధంగా ఈ గ్రామం బిజ్జుల వంశీయుల పాలనలో కొనసాగుతూ వచ్చింది. వీరిలో బిజ్జుల చంద్రశేఖర్ రెడ్డి, బిజ్జుల వేంకటధర్మారెడ్డి, బిజ్జుల రామేశ్వర్ రెడ్డి ప్రజా సంక్షేమ పాలకులుగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఈ వంశీయులే గ్రామ పెద్దలుగా చలామణి అవుతున్నారు. గ్రామం చుట్టూ వారి మాన్యాలే దర్శనమిస్తాయి. 1980 దాకా (ఆంటే కొత్త గ్రామం ఏర్పడే వరకు) బిజ్జుల రామేశ్వర్ రెడ్డి పరిపాలన సాగితే, తరువాత వారి ఆశిస్సులతో మారం శంకర్ రెడ్డి పరిపాలన కొనసాగింది. దాదాపు రెండు దశాబ్ధాల పాటు తిరుగులేని నాయకునిగా చెలామణి అయ్యారు. ఆ తరువాత 1996 లో జరిగిన సాధారణ పంచాయతీ ఎన్నికలలో బి.సి. మహిళకు సర్పంచి పదవి కేటాయించగా శంకర్ రెడ్డి గారి మద్దతుదారు శ్రీమతి నాగమ్మ సర్పంచిగా ఎన్నికయ్యారు. అప్పటి దాకా ఎన్నికలే తెలియని ఈ గ్రామ పరిపాలనా చరిత్రలో మొదటిసారి ఎన్నికలలో నిలిచి గెలిచిన సర్పంచుగా నాగమ్మకు స్థానం ఉంది. 2001 లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచి పదవి దళితులకు కేటాయించగా శంకర్ రెడ్డి గారి మద్దతుదారు మస్తాను సర్పంచుగా ఎన్నికయ్యారు. 2006 ఎన్నికలలో సర్పంచి పదవి బిసి లకు కేటాయించగా బిజ్జుల విజయలక్ష్మిదేవి మద్దతుదారు వెంకటేశ్వర్లు సర్పంచిగా ఎన్నికయ్యారు. 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికలలో అయ్యవారిపల్లి సత్యారెడ్డి సర్పంచిగా ఎన్నికై పదవిలో కొనసాగుతున్నారు.

పల్లెపాడు తిరునాళ్ళ వైభవం - ఓ జ్ఙాపకం

[మార్చు]

1980 కు ముందు పల్లెపాడు అంటే తిరునాళ్ళ, తిరునాళ్ళ అంటే పల్లెపాడు అనేంతగా ప్రసిద్ధి ఇక్కడ జరిగే తిరునాళ్ళ. బిజ్జుల వంశీయుల ఇలవేల్పు శ్రీ చెన్నకేశవస్వామి పేరు మీదుగా ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో ఇక్కడ బ్రహ్మాండంగా తిరునాళ్ళ జరిగేది. గ్రామంలో అతి పెద్దదైన ఆకర్షణీయమైన రథం ఉండేది. రథోత్సవాల సందర్భంగా జనాలు తండోప తండాలుగా తరలివచ్చేవారు. ఊరికి ఉత్తరాన దొరల (బిజ్జుల వారి) మాన్యాలలో అంగళ్ళు, పిల్లల వినోదాలకు సర్కసులు, తోటలలో వందల ఎకరాలలో ఎద్దుల బేరాలు, కలప వ్యాపారం జోరుగా సాగేది. చుట్టు పక్కల తాలుకాల నుండే గాక కర్నూలు జిల్లాలోని గ్రామాల నుండి కూడా ప్రజలు తరలివచ్చేవారు. కాని ఇదంతా ఒకనాటి వైభవం. 1980 తర్వాత గ్రామం శ్రీశైలం ప్రాజెక్ట్ కింద ముంపుకు గురికావడంతో పాత ఊరిని వదిలి దానికి ఓ రెండు కిలో మీటర్ల దూరంలో దక్షిణాన కొత్త గ్రామాన్ని నిర్మించారు. పాత ఊరిని వదిలి వచ్చాక ఓ రెండు, మూడు సంవత్సరాల పాటు అదే తరహాగా తిరునాళ్ళను కొనసాగించే ప్రయత్నం చేసినా, క్రమంగా పతనమవుతూ వచ్చింది. దీనికి కారణం ఆలనా పాలనా లేక చెన్నకేశవ ఆలయం శిథిలావస్థకు చేరుకోవటం, గుప్తనిధుల వేటగాళ్ళ తవ్వకాల బారిన పడటం వలన ఆలయం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. గ్రామ జాగీర్ధారులైన బిజ్జుల వంశీయుల మలి తరం వారు నగరాలకు తరలిపోవడం, గ్రామ పెద్దలు పట్టించుకోకపోవడం వలన కొత్త గ్రామంలో ఆలయ పునర్నిర్మాణపు కల ఓ కలగానే మిగిలిపోయింది, ఇప్పటికీ ఎండోన్మెంట్ వారి దగ్గర గ్రామ ఆల��ాల గ్రాంట్ మూలుగుతూనే ఉంది. ముప్పై సంవత్సరాలు గడిచినా పాత ఊరిలో ఇప్పటికీ చెక్కుచెదరని రథశాల ఒక్కటే అలనాటి వైభవానికి సజీవ సాక్ష్యం. కొత్త ఊరిలో ఏ గూడులేక నానాటికి శిథిలమవుతూ ముళ్ళకంపల్లో మగ్గుతున్న రథం నిలువెత్తు నిర్లక్ష్యానికి నిదర్శనం. ఓ కోలాటం పాట పాత తిరునాళ్ళ వైభవాన్ని గుర్తుచేస్తుంది.

జరిగేది జాతరంటరా ఓ చిన్నోడా!

పిలుస్తుంది పల్లెపాడురా!

కొవెలలోన కేశవస్వామిరా ఓ చిన్నోడా!

కొలువుదీరి కూకున్నాడురా!

వైశాఖ మాసంలో, పౌర్ణమి వెన్నల్లో

మోగేటి మేళాల్లో, వాగేటి డప్పుల్లో

పెద్దోళ్ళ గోలల్లో, పిల్లల్ల కేకల్లో

రయ్యిన కదిలింది రంగుల రథమంటా

హొయ్ హొయ్...జరిగేది జాతరంటరా!

రస్తాల పొడుగునా మిఠాయి అంగళ్ళు

దొరలోళ్ళ మాన్యాల్లో ఎద్దుల గుంపుళ్ళు

మిఠాయి తినేసి, ఎద్దులు చూసేసి

సక్కంగ తిరునాళ్ళ తిరుగేద్దాం చిన్నోడా! .ııజరిగేదిıı

కుమ్మరి కుండల్లు, మేదరి గంపళ్ళు

ఎన్నెన్నో హోటళ్ళు, నిండాయి తిరునాళ్ళు

కుండల్లు, గంపళ్లు నెత్తిన పెట్టేసి

సక్కంగ తిరునాళ్ళ తిరిగేసి వద్దాం! హొయ్..హొయ్ ııజరిగేదిıı

దాసరి దారాలు, గొల్లోళ్ళ గొంగళ్ళు

ఎర్రని యాపిళ్ళు పండిన మామిళ్ళు

దారాలు చుట్టేసి, గొంగళ్ళు గప్పేసి

సక్కంగ తిరునాళ్ళ తిరుగేసి వద్దాం! ııజరిగేదిıı[4]

గ్రామ శాసనం

[మార్చు]

పాత పల్లెపాడులో శ్రీ ఆంజనేయస్వామి దేవాలయానికి కుడివైపున రాతి గోడకు ఒక శాసనం ఉంది. అది యదాతథంగా... శ్రీ సీతారామ చింద్ర గురు పరబ్రహ్మణ నమః స్వస్తి శ్రీ విజయాభ్యుదయ శాలివాహన శక వర ముహుర్తం కొ తిథినామ సంవ్త్సర శ్రావణ శు సౌమ్యవాసరము వరకు శ్రీమత్పల్లెపాటి శ్రీఆంజనేయస్వామి బృందావనము సిథిల మైనందున విందోళ గోత్రోద్భవులైన శ్రీమంత మహారాııరాజా బిజ్జుల వేఙటధర్మారెడ్డి దేశముఖ ııపıı ఆలంపూరు వ అమరాబాదు గారు జీణోద్ధారమునకై జ్యేష్ఠ పత్నియైన సౌభాగ్యవతి లక్ష్మిదేవంమ్మ గారి పుత్రుండగు వెఙటనారసిహ్మరెడ్డికి ఆజ్ఙాపిఞచినందున తదనుసారముగా జీర్ణోద్ధారము చేయించి యున్నారు ıı త్లాıı మహె మెహరు స9 13 13 ఫసలిıı[5]

నిజాం విముక్తి పోరాటంలో గ్రామ పెద్దల పాత్ర

[మార్చు]

తెలంగాణలో నిజాం విముక్తి పోరాటంలో భాగ్యనగర్ రేడియో నిర్వహించిన పాత్ర తక్కువేమి కాదు. పోరాటంలో భాగంగా కర్నూలులో పాగా పుల్లారెడ్డి సర్వాధికారిగా తెలంగాణా ప్రాంతీయ సమితి కార్యాలయం ఏర్పాటుచేయటం జరిగింది. ఈ కార్యాలయంలో గడియారం రామకృష్ణ శర్మ గారు భాగ్యనగర్ రేడియోనును నడిపారు. ఇది విముక్తి పోరాటానికి ఎంతగానో తోడ్పింది. అయితే ఈ రేడియోను నడపటానికి కావలసిన ట్రాంసిమిషన్ను వనపర్తి రాజా రాజారామేశ్వరరావు గారు ముంబాయి నుండి తెప్పిస్తే, దాన్ని తన యింట్లో రహస్యంగా దాచి తన కుమారులైన బిజ్జుల జనార్ధన్ రెడ్డి, బిజ్జుల గోవర్ధన్ రెడ్డి గార్లచే అన్ని వసతులు కల్పింపజేసి, సమర్థవంతంగా నడపడానికి కావలసిన సహాయాన్ని అందించింది ఈ గ్రామానికి చెందిన జాగీర్ధారు బిజ్జుల చంద్రశేఖర్ రెడ్డి గారే[6].అంతేకాకుండా వారి వంశ మూల పురుషుల సంఖ్యలో ప్రముఖులైన బిజ్జుల తిమ్మభూపాలుడు రచించిన అనర్ఘ రాఘవమను ఆంధ్రానువాద గ్రంథాన్ని 1930 లో ప్రచురించి వెలుగులోకి తెచ్చినదీ వీరే[7].

చరిత్ర నిర్మాణంలో గ్రామ పాత్ర

[మార్చు]

ప్రముఖ కవి, చారిత్రిక పరిశోధకుడు గడియారం రామకృష్ణ శర్మ శాసనల శర్మగా పేరు రావడానికి ఈ గ్రామమూ ఓ కారణమే. ఈ గ్రామంలో ఓ రైతు తన పొలం దున్నుతుండగా ఓ కుండలో పాతిపెట్టిన మూడు రేకుల తామ్ర శాసనం దొరికింది. ఆ రైతు దాన్ని గ్రామ జాగీర్ధారుకు ఇవ్వగా, జాగీర్ధారు రామకృష్ణ శర్మకు చూపించారు. వారు దాన్ని పరిశీలించి, రెండవ పులకేశి మనవడు వినయాదిత్యుని శాసనంగా తేల్చారు[8]. శర్మగారు దాన్ని విపుల వ్యాఖ్యానంతో భారతి పత్రికలో ప్రకటించి ఎంతో పేరు సంపాదించారు. తరువాత వారే దాన్ని వినయాదిత్యున్ని పల్లెపాడు తామ్ర శాననంగా పుస్తక రూపంగానూ తీసుకొచ్చారు. ఆ విధంగా ఈ ఊరి ద్వారా ఆ కవికి, ఆ కవి ద్వారా ఈ ఊరికి ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి.

గ్రామ ప్రముఖులు

[మార్చు]
  • కేశవపంతుల నరసింహశాస్త్రి అను ప్రసిద్ధ కవి ఈ గ్రామానికి చెందిన వారే. వీరు ప్రబంధ పాత్రలు, సంస్థానముల సాహిత్య సేవ, త్యాగధనులు, బాల వీరులు, రత్నాలక్ష్మి శతకం, ఉదయసుందరి మొదలగు రచనలు చేశారు. వీరి వారసులు నేటికీ గ్రామంలో ఉన్నారు.
  • బిజ్జుల వేంకటధర్మారెడ్డి జాగీర్ధారు వంశీయులు. అలంపూరులోని నవ బ్రహ్మ ఆలయాల దగ్గర యాత్రికుల కొరకు సత్రములు కట్టించిన గొప్ప ధాత[9]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  2. "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. గ్రామానికి చెందిన కోలాటం కళాకారుడు మద్దిలేటి నుండి సేకరించినది
  5. గ్రామ నివాసి నాయుడిగారి జయన్న నుండి సేకరించినది
  6. గడియారం రామకృష్ణశర్మ,శతపత్రం,సుపథ ప్రచురణలు,2004,పుట-87
  7. డాక్టర్ కట్టా వేంకటేశ్వర శర్మ, గద్వాల సంస్థాన సాహిత్య పోషణం, సునందా పబ్లికేషన్స్, మ. నగర్, 1987, పుట-8
  8. గడియారం రామకృష్ణశర్మ,శతపత్రం,సుపథ ప్రచురణలు,2004,పుట-206
  9. గడియారం రామకృష్ణశర్మ,శతపత్రం,సుపథ ప్రచురణలు,2004,పుట-150

వెలుపలి లింకులు

[మార్చు]

బిజ్జుల వంశం[permanent dead link] bizzula.com