Jump to content

కొండవీడు కోట

అక్షాంశ రేఖాంశాలు: 16°15′35″N 80°15′55″E / 16.2597°N 80.2653°E / 16.2597; 80.2653
వికీపీడియా నుండి

కొండవీడు కోట
ఆంధ్రప్రదేశ్ లో భాగం
పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారత దేశం
కొండవీడు కోట వాటర్ కలర్ పెయింటింగ్ చిత్రం
కొండవీడు కోట పరిసర ప్రాంతం దృశ్యాలు
కొండవీడు కోట is located in ఆంధ్రప్రదేశ్
కొండవీడు కోట
కొండవీడు కోట
కొండవీడు కోట is located in India
కొండవీడు కోట
కొండవీడు కోట
భౌగోళిక స్థితి16°15′35″N 80°15′55″E / 16.2597°N 80.2653°E / 16.2597; 80.2653
రకముకోట
ఎత్తు1700 అడుగులు
స్థల సమాచారం
నియంత్రణఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
స్థల చరిత్ర
కట్టిన సంవత్సరం14 శతాబ్థం
కట్టించిందికొండవీడు రెడ్డిరాజులు
వాడిన వస్తువులుగ్రానైట్, రాతి, స��న్నం
Battles/warsరెడ్డి రాజులు, విజయనగర రాజులు, గోల్కొండ సుల్తానులు, ప్రెంచి రాజులు, బ్రిటీసు రాజులు

కొండవీడు కోట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లా, యడ్లపాడు మండలం లోని కొండవీడు గ్రామ పరిధిలో ఉన్న పర్యాటక ప్రదేశం.ఇది గుంటూరు నగరానికి 20 కి.మీ.దూరంలో ఉంది. రెడ్డిరాజులు కొండవీడు కోటను రాజధానిగా చేసుకుని సా.శ. 1325 నుండి 1425 వరకు పరిపాలన సాగించారు.14 వ శతాబ్థంలో రెడ్డి రాజులు పరిపాలన సాగించిన కాలంలో ఈ కోటను నిర్మించారు.ఇందులో 21 నిర్మాణాలు ఉన్నట్లుగా తెలుస్తుంది.ఇందులో చాలా వరకు శిధిలమైనట్లుగా తెలుస్తుంది.[1]

కోట చరిత్ర

[మార్చు]
కొండవీడు కోటలోని గోపినాధేశ్వర స్వామి ఆలయం

ప్రోలయ వేమారెడ్డి రెడ్డి రాజులలో ప్రథముడు.ఇతను తొలుత సా.శ. 1325లో అద్దంకిని రాజధానిగా చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని 1353 వరకు పరిపాలించాడు. ఆ తరువాత అతని కుమారుడు అనపోతారెడ్డి సా.శ. 1353 నుండి 1364 వరకు రాజ్యపాలనను చేపట్టినట్లు తెలుస్తుంది. శత్రుమూకలు తరచూ అతని రాజ్యంపై దాడులు చేస్తుండడంతో రాజధానిని కొండవీడుకు తరలించి  రెండో రాజధానిగా చేసుకుని పాలన సాగించాడని తెలుస్తుంది. అనపోతారెడ్డి కొండవీడును శతృదుర్బేధ్యమైన గిరిదుర్గంగా మలచిన ఘనత అనపోతారెడ్డికి దక్కుతుంది.ఆ తరువాత అనపోతారెడ్డి తమ్ముడు అనవేమారెడ్డి సా.శ.1364 నుండి 1386 వరకు రాజ్యాధికారం చేపట్టి కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాలను జయించి రాజ్య విస్తరణ గావించాడు. తిరిగి పినతండ్రి అనవేమారెడ్డి మరణానంతరం అనపోతారెడ్డ్డి కుమారుడు కుమారగిరిరెడ్డి సా.శ. 1386 నుండి 1402 వరకు పరిపాలించి కొండవీడు రాజ్యాన్ని ఉదయగిరి నుంచి ఒడిశాలోని కటక్‌ వరకు విస్తరించాడు. ఆ తరువాత అనవేమారెడ్డి కుమారుడు పెదకోమటి వేమారెడ్డి సా.శ. 1402 నుండి 1420 వరకు పరిపాలించినట్లుగా తెలుస్తుంది.ఇతని పరిపాలనా కాలంలో సాహిత్యానికి, కళలకు పెద్దపీటవేసి ఆదరించినట్లుగా తెలుస్తుంది. ఒకరకంగా ఇతని పరిపాలనాకాలాన్ని  స్వర్ణయుగమని చెప్పవచ్చు. శ్రీనాథ కవి ఇతని ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేశాడని తెలుస్తుంది.సా.శ. 1420 నుండి  1424 వరకు చివరివాడైన  రాచ వేమారెడ్డి పరిపాలించాడు. ఇతను అసమర్థుడు కావడంతో రెడ్డిరాజుల పాలన అంతమైంది. కొండవీడు రాజ్యాన్ని విజయనగర రాజులు హస్తగతం చేసుకున్నారు.[2]

కొండవీడు కోటను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.[3]

కొండవీడు దుర్గంలో బౌద్ధం ఆనవాళ్ళు

[మార్చు]

ఇప్పటి వరకు దుర్గం రెడ్డిరాజుల కోటగానే గుర్తింపు ఉంది. ఐతే, ప్రస్తుతం వారి పరిపాలనకు ముందు సుమారు రెండు వేల సంవత్సరాల క్రితమే అక్కడ బౌద్ధనాగరికత ఉందన్నవాదనలు వినిపిస్తున్నాయి. గుంటూరు సర్కిల్‌ అటవీశాఖ అధికారి అనూప్‌సింగ్‌ సతీమణి రుచిసింగ్‌, కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ కె.వి.రావుతో కలసి ఇక్కడ ఈ మధ్య నిధుల కోసం తవ్వకాలు జరిపిన శివాలయం పరిసరాల్లో బౌద్ధ స్థూపాన్ని గుర్తించారు. స్థూపం సుమారు 12 అడుగుల వ్యాసార్థంతో ఉంది. నిర్మాణానికి లేత ఆకుపచ్చ, నాపరాళ్లు, నలుపు రంగు రాళ్లు వాడారు.స్థూపం పైన శివాలయం నిర్మించారని తేల్చారు.

కొండవీడు కొండల మీద టెర్రాస్‌ స్థూపాలు కన్పిస్తున్నాయి. ఈ స్థూపాలు వేదికలాగా ఉంటాయి. ఇవి శాతవాహనుల కాలం నాటి పెద్దపెద్ద ఇటుకలతో నిర్మితమయ్యాయి. అలాగే బౌద్ధ విహారాల పైకప్పుల కోసం ఉపయోగించుకొనే పెంకులు, మట్టిపాత్రల శకలాలు కూడా ఇక్కడ దొరికాయి. కొండవీడు కొండలు సముద్ర మట్టానికి పదిహేడు వందల ముఫ్పై అయిదు అడుగుల ఎత్తులో ఉన్నాయి.శాతవాహనులు క్రీస్తు పూర్వం 1, 2 శతాబ్దాల నాటికి ధాన్యకటకాన్ని ముఖ్య పట్టణంగా చేసుకొని పరిపాలించారు.కొండవీడు కొండల మీద కూడా శాతవాహనుల కాలంలోనే బౌద్ధం వ్యాపించిందన్నందుకు ఆధారాలు దొరికాయి. ఈ కొండల మీద కాలిబాటకు రెండు వైపులా పైభాగంలో కూడా బౌద్ధ స్థూపాలను నిర్మించిన ఆధారాలు దొరికాయి. ఎత్తయిన కొండల మీద ఏటవాలుగా ఉన్న ప్రదేశాల్లో వేదికల మీద నిర్మించిన స్థూపాలను టెర్రాస్‌ స్థూపాలని అంటారు. గుంటూరు జిల్లాలోని అమరావతి, భట్టిప్రోలు, మల్లెపాడు (తెనాలి) లాంటి ప్రాచీన బౌద్ధక్షేత్రాల దగ్గర మాత్రమే అతి పెద్ద పరిమాణంలో యాభై ఎనిమిది సెంటీమీటర్ల పొడవు, ముప్ఫయి సెంటీమీటర్ల వెడల్పు, పది సెంటీమీటర్ల మందం కలిగిన పెద్ద ఇటుకలు దొరికాయి. అలాగే కొండవీడు కొండపైన చైనా దేశానికి చెందిన సెల్‌డన్‌వేర్‌గా పేరున్న కొన్ని పింగాణీ పాత్రలకు చెందిన ముక్కలు కూడా లభించాయి.[4]

దర్శనీయ ప్రదేశాలు

[మార్చు]

ఇక్కడ ఒక పురాతన కోట ఉంది. కోటకు వెళ్లేందుకు రెండువైపుల నుంచి నేలమెట్లు ఉన్నాయి. కొండ మీద మూడు చెరువులున్నాయి. ఒకటి నిండగానే నీరు వృథా కాకుండా, రెండు చెరువులోకి వెళ్లే సౌకర్యం ఉంది. కొండకింద ఉన్న కత్తుల బావి (వేణునాథస్వామి దేవాలయం), శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం, ఆలయం లోపల, బయట గోడల మీద అపరూప శిల్ప సంపదలున్నాయి. కొండమీద చారిత్రక ఆనవాళ్లుగా నిలచిన అనేక కట్టడాలు, 44 కోట బురుజులు, 32 మైళ్ల ప్రాకారాలు, రెండు ధాన్యాగారాలు, 5 దేవాలయాలు, గుర్రపు శాలలు, ఆయుధశాల, నేటికొట్టు, మసీదు, ఖజానా, వంటి చారిత్ర సంపద ఉంది. కొండవీడు కోటను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రక్షిత కట్టడంగా గుర్తించింది.[5]

కోటకు వెళ్లేందుకు రెండువైపుల నుంచి నేలమెట్లు ఉన్నాయి. సరాసరి కొండమీదకు వెళ్లేవారి కోసం నిర్మించాల్సిన ఘాట్‌రోడ్డుకు సర్వే పూర్తి కావస్తోంది. కొండమీద మూడు చెరువులున్నాయి. ఒకటి నిండగానే నీరు వృథా కాకుండా, రెండు చెరువులోకి వెళ్లే సౌకర్యం ఉంది. కొండకింద ఉన్న కత్తుల బావి (వేణునాథస్వామి దేవాలయం), శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం, ఆలయం లోపల, బయట గోడల మీద అపరూప శిల్ప సంపదలున్నాయి. కొండమీద ఉపయోగించుకునే అవకాశం ఉన్న భూమి విస్తీర్ణం అయిదు చదరపు కిలోమీటర్లు.కొండమీద చారిత్రక ఆనవాళ్లుగా నిలచిన అనేక కట్టడాలు, 44 కోట బురుజులు, 32 మైళ్ల ప్రాకారాలు, రెండు ధాన్యాగారాలు, 5 దేవాలయాలు, గుర్రపు శాలలు, ఆయుధశాల, నేటికొట్టు, మసీదు, ఖజానా, వంటి చారిత్ర సంపద ఉంది.

కొండవీడు కోటను రాష్ట్ర ప్రభుత్వం రక్షిత కట్టడంగా గుర్తించింది.కొండవీడు కోటను పురావస్తు శాఖ రక్షిత కట్టడంగా జి.ఒ. సంఖ్య 1535 తేదీ 2-11-1966న నిర్ణయించారు. ఇక్కడో కందకం (అగడ్త) ఉండేది. 37 ఎకరాల విస్తీర్ణం గల ఈకందకానికి చారిత్రక కొండవీటికొండ మీద నుంచి వర్షాకాలంలో నీరు జాలువారుతుంది. కందకంలోకి చేరిన నీటిని కొండవీడు పరిసరాల్లోని ఐదు గ్రామాల భూముల రైతులు సాగునీరుకు వినియోగించు కుంటున్నారు. చాలా కాలంగా సరైన మరమ్మతులు లేకపోవటంతో కందకం అడవి మాదిరిగా తయారైంది. ఇది కొంత ఆక్రమణలకు లోనైంది. .

ఘాట్ రోడ్డు

[మార్చు]

కొండపైకి సుందరమైన ఘాట్ రోడ్డు పూర్తయింది.[6]

మూలాలు

[మార్చు]
  1. "రెడ్డిరాజుల పౌరుషం, వైభవానికి ప్రతీక.. 'కొండవీడు కోట'!". Samayam Telugu. 9 ఆగస్టు 2018. Retrieved 20 అక్టోబరు 2019.
  2. "కొండవీడు కోట చూసొద్దాం రండి..." www.andhrajyothy.com. 27 ఫిబ్రవరి 2017. Archived from the original on 17 సెప్టెంబరు 2019. Retrieved 20 అక్టోబరు 2019.
  3. "Kondaveedu fort likely to get UNESCO heritage status". Archived from the original on 18 ఫిబ్రవరి 2017. Retrieved 17 ఫిబ్రవరి 2017.
  4. జూలై 16, 2010 ఈనాడు గుంటూరు జిల్లా అనుబంధం
  5. "తెలుగు రాష్ట్రాలలో చారిత్రక కట్టడాలు !". Greynium Infotech. 27 నవంబరు 2015. Archived from the original on 12 నవంబరు 2016. Retrieved 26 అక్టోబరు 2016.
  6. "'కొండవీడి'న ఆధ్యాత్మిక సౌందర్యం, (ఈనాడు, విజయవాడ సంచిక)". ఈనాడు. 28 ఫిబ్రవరి 2022. Retrieved 1 మార్చి 2022.

వెలుపలి లంకెలు

[మార్చు]