Jump to content

కొండపల్లి కోటేశ్వరమ్మ

వికీపీడియా నుండి
కొండపల్లి కోటేశ్వరమ్మ
విశాఖపట్నంలో తన నివాసంలో రచనలు చేస్తున్న కోటేశ్వరమ్మ
జననం(1918-08-05)1918 ఆగస్టు 5
పామర్రు, కృష్ణా జిల్లా
మరణం2018 సెప్టెంబరు 19(2018-09-19) (వయసు 100)
మద్దిలపాలెం, విశాఖపట్టణం
నివాస ప్రాంతంవిశాఖపట్టణం
ప్రసిద్ధికమ్యూనిస్టు ఉద్యమకారిణి, మహిళా హక్కుల పోరాటయోధురాలు, రచయిత్రి
మతంహిందూ

కొండపల్లి కోటేశ్వరమ్మ (ఆగష్టు 5, 1918 - సెప్టెంబర్ 19, 2018) ప్రముఖ కమ్యూనిస్టు ఉద్యమకారిణి, మహిళా హక్కుల పోరాటయోధురాలు, రచయిత్రి.[1][2]

జీవిత విశేషాలు

[మార్చు]

ఈమె కృష్ణా జిల్లా పామర్రులో 1918, ఆగష్టు 5న పుట్టింది. ఆమెకు బాల్యవివాహం అయి ఏడేళ్ళ వయసు వచ్చేసరికల్లా భర్త మరణించి బాల్యవితంతువు అయ్యింది. తల్లిదండ్రులు తమ తప్పు సరిదిద్దుకునేందుకు ఆమెని చదివించారు. కుటుంబంలో పరిస్థితులు ఆమెను చిన్నతనంలోనే జాతీయోద్యమం వైపు ఆకర్షితురాలిని చేశాయి. క్రమేపీ అప్పుడప్పుడే విస్తరిస్తున్న కమ్యూనిస్టు ఉద్యమంతోనూ సంబంధాలు పెరిగాయి. కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడైన కొండపల్లి సీతారామయ్య ఆమెని వివాహం చేసుకుంటానని ముందుకువచ్చాడు. గ్రామస్తులు వితంతు పునర్వివాహం అని దీన్ని వ్యతిరేకిస్తున్నా కుటుంబ సభ్యుల సమ్మతిపై సీతారామయ్యతో కోటేశ్వరమ్మ వివాహం జరిగింది.[3]

సీతారామయ్యతో వివాహానంతరం కమ్యూనిస్టు ఉద్యమంలో మరింత చురుకుగా ఆమె పనిచేసింది. పురుషులు, వేశ్యలు తప్ప మహిళలు నాటకాల్లో స్త్రీ పాత్రలు వెయ్యని రోజుల్లో మాభూమి, కన్యాశుల్కం వంటి నాటకాల్లో ఆమె నటించింది. పార్టీ కార్యకర్తగా ఎంతో కృషిచేసింది. ఈ దశలో ఆమెకు కుమార్తె కరుణ, కుమారుడు చంద్రశేఖర్ ఆజాద్ జన్మించారు. పార్టీ పనుల వల్ల ఆమె జైలుశిక్ష కూడా అనుభవించింది. 1948 తర్వాత కమ్యూనిస్టు పార్టీని భారత ప్రభుత్వం నిషేధించినప్పుడు బందరు, ఏలూరు, విశాఖపట్టణం, పూరీ, నాగ్‌పూర్, రాయచూర్, గోంధియా వంటి ప్రాంతాలు సంచరిస్తూ, భర్త, పిల్లలకు దూరమై అజ్ఞాత జీవితాన్ని గడుపుతూ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీకి పనిచేసింది. నిషేధం ఎత్తేశాకా పార్టీ కార్యకర్తగా ఊరూరా తిరిగి జెండా భుజాన వేసుకుంది.

పురస్కారాలు

[మార్చు]

మరణం

[మార్చు]

విశాఖపట్టణం నగరం మద్దిలపాలెంలోని కృష్ణా కాలేజీ ఎదురుగా మనవరాలు అనురాధ ఇంట్లో ఉంటున్న కోటేశ్వరమ్మకు కొద్దిరోజులక్రితం బ్రెయిన్‌స్ట్రోక్‌ వచ్చింది. కేర్‌ ఆస్పత్రిలో చేర్పించినా పరిస్థితి విషమించడంతో 2018, సెప్టెంబర్ 19 బుధవారం వేకువజామున ఇంటివద్ద తుదిశ్వాస విడిచారు. కోటేశ్వరమ్మ దేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనకోసం ఆంధ్ర మెడికల్‌ కళాశాలకు అప్పగించారు.[7]

మూలాలు

[మార్చు]
  1. "Revolutionary Communist leader Kondapalli Koteswaramma passes away". The Times of India. Retrieved 20 September 2018.
  2. "తొలితరం కమ్యూనిస్ట్ నేత, కొండపల్లి సీతారామయ్య సతీమణి కన్నుమూత". telugu.samayam.com. Retrieved 17 September 2018.
  3. "Woman extraordinaire". Archived from the original on 2016-08-17.
  4. పెనుగొండ లక్ష్మీనారాయణ (1 January 2020). గుంటూరు సీమ సాహిత్య చరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం. pp. 282–283.
  5. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (14 July 2016). "'సమాజానికి నిజమైన వైద్యులు సాహితీవేత్తలే'". www.andhrajyothy.com. Archived from the original on 12 July 2020. Retrieved 12 July 2020.
  6. ఘనంగా సాహితీ పురస్కారాల ప్రదానోత్సవం, తెలుగువాణి, తెలుగు విశ్వవిద్యాలయ ప్రచురణ, ఏప్రిల్-ఆగస్టు 2016, హైదరాబాదు పుట. 42.
  7. సాక్షి (20 September 2018). "కొండపల్లి కోటేశ్వరమ్మ ఇకలేరు". Archived from the original on 20 September 2018. Retrieved 20 September 2018.

ఇతర లింకులు

[మార్చు]
  1. Nirjana Vaaradhi (lit. Deserted Bridge), Autobiographical memoir of Kondapalli Koteswaramma.
  2. ఆమె జీవిత విశేషాలు