Jump to content

కపిలతీర్థం

వికీపీడియా నుండి
కపిలతీర్థం

కపిలతీర్థం తిరుపతిలో శేషాద్రికొండ దిగువన, తిరుమల కు వెళ్ళే దారిలో ఉంది. దీనినే చక్రతీర్థం లేదా ఆళ్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. కృతయుగములో పాతాళలోకంలో కపిలమహర్షి పూజించిన కపిలేశ్వరస్వామి, ఏవో కారణాలవల్ల, భూమిని చీల్చుకొని, ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. అందువల్ల ఇది కపిలలింగంగా పేరొందింది. త్రేతాయుగములో అగ్ని పూజించిన కారణంగా ఆగ్నేయలింగం అయి, ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలందుకుంటోంది. ముల్లోకాలలోని సకల తీర్థాలూ ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ పది ఘటికల (నాలుగు గంటల) పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో అక్కడ స్నానం చేసి, నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా, అది మేరుపర్వత సమాన దానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం. కార్తీక మాసం లో వచ్చు కార్తీక దీప పర్వ దినాన ఇక్కడ కొండ పైన దీపం సాక్షాత్కరిస్తుంది. భక్తులందరు కపిలతీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు. ఈ ఆలయం తి.తి.దే. వారి ఆద్వర్యంలో పనిచేస్తుంది, శివరాత్రి పండుగ, బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి.

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. ఇక్కడ శ్రీవారి ఆలయంతోపాటు గోవిందరాజస్వామి, కోదండరామస్వామివారి ఆలయాలున్నాయి. గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఓ శైవక్షేత్రం కూడా ఉంది. అదే కపిలతీర్థం. తిరుపతికి ఉత్తరంగా, తిరుపతి కొండలకు ఆనుకుని అలిపిరి దిగువకు వెళ్తే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది. ముఖ్యంగా, వర్షాకాలంలో ఇక్కడ జలపాతంలో నీరు ఎక్కువగా ప్రవహిస్తుంది. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువయ్యాడు. కొండలమీద 20 అడుగుల ఎత్తునుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగ. ఈ పుష్కరిణినే కపిలతీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమనీ, వైష్ణవులు ఆళ్వార్‌ తీర్థమనీ పిలుస్తారు. వైష్ణవులు కోనేటి చుట్టూ నాలుగు మూలల్లోనూ నాలుగు సుదర్శన రాతిశిలలను స్థాపించారట. రాతిమెట్లు, సంధ్యావందన దీపాలనూ ఏర్పాటుచేశారు. అందుకే, అప్పట్నుంచీ దీన్ని చక్రతీర్థమని పిలిచేవారు వైష్ణవులు.

చరిత్ర

[మార్చు]

విజయనగర చక్రవర్తి, అచ్యుత రాయలు ఈ తీర్థము చుట్టూ రాతి మెట్లు, మంటపము నిర్మించాడు.[1] 1830ల నాటికి ఈ ప్రాంతం చుట్టూ విశాలమైన మంటపం ఉండేదని చాలా రమ్యమైన ప్రదేశమని యాత్రికుడు, యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య వ్రాశారు. బ్రాహ్మణ సమారాధనకు ఇక్కడ కట్టియున్న విశాలమైన మంటపం అనుకూలంగా ఉండేదని, ఆ చుట్టుపక్క స్థలాల్లో హైదరాబాద్ రాజ్య పేష్కారు చందులాలా ఏర్పాటుచేసిన దానధర్మాలు బాగా జరిగేవని ఆయన వ్రాశారు.[2]

11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజేంద్రచోళుని కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. అప్పట్లో రాయన్‌ రాజేంద్రచోళ అనే చోళ అధికారి దీని నిర్మాణ సూత్రధారి. చోళులు శివభక్తులు కావడంతో దీన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్మించారు. ఆహ్లాదకరమైన కపిల తీర్థాన్ని చోళులు అభివృద్ధి చేస్తే, అచ్యుతదేవరాయల హయాంలో వైష్ణవులు దీన్ని ఆళ్వారుతీర్థంగా మార్చారు. ఈ ఆలయానికి ముందు ఒక పాడుబడ్డ గుడి ఉంటుంది. అది నమ్మాళ్వార���‌ అనే ఆళ్వారు గుడి అని చెబుతారు. 12వ శతాబ్దం నుంచీ 18వ శతాబ్దం వరకూ దీన్ని ఆళ్వారు తీర్థంగానే వ్యవహరించారు. పదహారో శతాబ్దంలో విజయనగరం నుంచి వచ్చిన సెవ్వుసాని అనే దేవదాసి ఈ ఆలయానికి ఎంతో సేవ చేసిందట. ఆలయంలోని వినాయకుణ్ణి ఆవిడే ప్రతిష్ఠించిందట. కపిలతీర్థంలో కపిలేశ్వర స్వామితోపాటు కాశీవిశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, శ్రీకృష్ణుడు, అగస్త్యేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఉన్నారు.[3]

చిత్రమాలిక

[మార్చు]

బాహ్య లింకులు

[మార్చు]

తి.తి.దే వారి అంతర్జాల సైటు నందు శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం వివరాలు

మూలాలు

[మార్చు]
  1. "అనాదిగా తిరుమల - పి.కుసుమ కుమారి". Archived from the original on 2006-11-06. Retrieved 2006-12-07.
  2. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  3. పట్టా, మోహన్ కుమార్. "శ్రీవారి సన్నిధిలో శివాలయం". eenadu.net. తిరుపతి: ఈనాడు. Archived from the original on 20 May 2017. Retrieved 20 May 2017.