కంచట్కా అగ్నిపర్వతాలు
రష్యా దూర ప్రాచ్యంలోని కంచట్కా ద్వీపకల్పంలో విస్తరించిన అగ్నిపర్వతాల సమూహాన్ని కంచట్కా అగ్నిపర్వతాలు అని పిలుస్తారు. సుమారు 160 వరకు గల ఈ అగ్నిపర్వతాలలో 29 అగ్నిపర్వతాలు నేటికీ క్రియాశీలకంగా ఉన్నాయి. ఈ 29 క్రియాశీలక అగ్నిపర్వతాలలో 19 అగ్నిపర్వతాలు, యునెస్కో (UNESCO) సంస్థచే కంచట్కా ద్వీపకల్పంలో గుర్తించబడిన 6 ప్రపంచ సాంస్కృతిక, సహజ వారసత్వ ప్రదేశాలలో (నేచర్ పార్కులు) భాగంగా ఉన్నాయి.[1]
ప్రత్యేకతలు
[మార్చు]కంచట్కా అగ్నిపర్వతాలు వున్న ప్రాంతం కొన్ని ప్రత్యేకతలను కలిగివుంది.
- భూమి మీద గల అత్యంత క్రియాశీలక అగ్నిపర్వతాలు దట్టంగా విస్తరించిన ప్రాంతాలలో ‘కంచట్కా అగ్నిపర్వత ప్రాంతం’ ఒకటి. ఐస్ లాండ్, హవాయి దీవుల తరువాత కంచట్కా ద్వీపకల్పంలోనే క్రియాశీలక అగ్నిపర్వతాలు ఎక్కువ సంఖ్యలో కేంద్రీకృతమై ఉన్నాయి.
- విభిన్న రకాలకు చెందిన అగ్నిపర్వతాలు (స్త్రాంబోలియన్, హవాయి, పెలేన్, వెసువియన్., ప్లినినియన్) ఒకే చోట విలక్షణంగా ఏర్పడిన ప్రాంతాలలో ‘కంచట్కా అగ్నిపర్వత ప్రాంతం’ ఒకటి.
- కంచట్కా అగ్నిపర్వత ప్రాంతం’ పూర్తి వైవిధ్యభరితమైన అగ్నిపర్వత సంబంధిత లక్షణాలను కలిగివుంది. ఈ ప్రాంతంలో గీజర్స్ (Geysers), బురద కొలనులు (Mud pools), వేడి నీటి బుగ్గలు (Hot springs). కాల్డేరా (Caldera) మొదలైన అగ్నిపర్వతీయ విశేషాలు ఒకే చోట ఏర్పడ్డాయి.
- యురేషియా లోనే కాక ఉత్తరార్ధగోళంలోనే అత్యంత ఎత్తైన క్రియాశీలక అగ్నిపర్వతం క్లైయుచెవస్కాయా స్కోయా (Klychevskaya skoya) లేదా క్లైయుచెవస్కీ (Klyuchevsky) (4688 మీటర్లు) ఈ ప్రాంతంలోనే ఉంది. దీనికన్నా ఇరాన్ లోని దమావంద్ పర్వతం (Mt. Damavand) (5610 మీ.) ఎత్తైనదైనప్పటికి, దమావంద్ అగ్నిపర్వతాన్ని ప్రస్తుతం నిద్రాణ (Dormant) స్థితిలోనిదిగా పేర్కొంటారు.
ఉనికి-విస్తరణ
[మార్చు]కంచట్కా అగ్నిపర్వతాలు పసిఫిక్ అగ్ని వలయంలో (Pacific Ring of Fire) భాగంగా ఉన్నాయి. ఇవి కురిల్- కంచట్కా సముద్ర ట్రెంచ్ కు సమాంతరంగా ముఖ్యంగా కంచట్కాద్వీపకల్పం యొక్క తూర్పు భూభాగంలో కేంద్రీకృతమై ఉన్నాయి. కంచట్కా నదికి, సమీపంలోని కేంద్ర లోయ (Central Valley) ను ఆనుకొని వున్న ఒక పెద్ద అగ్నిపర్వత శ్రేణిలో భాగంగా ఇవి విస్తరించి ఉన్నాయి.
కంచట్కా అగ్నిపర్వతాలలో అతి ఎత���తైన అగ్నిపర్వతం క్లైయుచెవస్కాయా స్కోయా (4688 మీ.). ఇది యురేసియా లోనే అతి ఎత్తైన క్రియాశీలక అగ్నిపర్వతం. చివరిసారిగా 2017 లో విస్ఫోటం చెందింది. క్రోనట్‌స్కీ (Kronotsky) అనే అగ్నిపర్వతం కచ్చితమైన శంకం ఆకారంలో వున్నకారణంగా దానిని ప్రపంచంలోని అత్యంత అందమైన అగ్నిపర్వతంగా రాబర్ట్, బార్బరా డెకర్ అనే అగ్నిపర్వత శాస్త్రవేత్తలు వర్ణించారు. 2007 లో కంచట్కా తూర్పు భాగంలో సంభవించిన ఒక భారీ బురదపాతం (Mud Slide) వలన ప్రపంచ ప్రఖ్యాత గీజర్ వ్యాలీ (Geyser Valley) పాక్షికంగా ధ్వంసమైంది.
ఆవిర్భావం
[మార్చు]యురేసియన్ పలక లోనికి పసిఫిక్ పలక చొచ్చుకొని పోయినపుడు, ఆ పలకల అభిసరణ సరిహద్దుల (Convergent Boundaries) వద్ద కురిల్- కంచట్కా సముద్ర ట్రెంచ్‌కు సమాంతరంగా కంచట్కా ద్వీపకల్పంలో ఈ అగ్నిపర్వతాలు ఏర్పడ్డాయి. పలక విరూపణ సిద్ధాంతం ప్రకారం యురేసియన్ ఖండ పలక యొక్క తూర్పు భాగాన్ని, పసిఫిక్ సముద్ర పలక ఢీకొన్నప్పుడు అధిక సాంద్రత కలిగిన పసిఫిక్ సముద్రపు పలక, తక్కువ సాంద్రత కలిగిన యురేసియా ఖండ పలకలోనికి చొచ్చుకొనిపోతుంది. ఇలా క్రిందకు చోచ్చుకోనిపోయిన సముద్ర పలక వలన సబ్ డక్షన్ మండలం (Subduction Zone) ఏర్పడుతుంది. క్రిందకు చొచ్చుకుపోయిన పసిఫిక్ సముద్రపు పలక లోని కొంత భాగం ఈ సబ్ డక్షన్ మండలం లోని అధిక లోతుల వద్ద అధిక ఉష్ణోగ్రతల వలన కరిగిపోతుంది. దీని వలన సబ్ డక్షన్ ప్రాంతంలోని మాగ్మా పలకల సరిహద్దుకు కొంచెం దూరంలో సన్నని పగుళ్ళ ద్వారా పైకి ఉబికి వస్తుంది. ఇలా ఉబికి వచ్చిన మాగ్మా వలన ప్రధానంగా కంచట్కా ద్వీపకల్పం యొక్క తూర్పు భూభాగంపై అగ్నిపర్వతాలు విస్తృతంగా ఏర్పడ్డాయి.
ఈ సబ్ డక్షన్ మండలంలో అగ్నిపర్వత ప్రక్రియతో పాటు భూప్రకంపనలు కూడా ఏర్పడుతున్నాయి. సమీపంలోని కురిల్- కంచట్కా సముద్ర ట్రెంచ్ వలన అగాధ భూకంప ప్రక్రియలు (deep-focus earthquakes), సునామీలు సాధారణంగా ఏర్పడుతున్నాయి. 1737 అక్టోబరు 16 న, 1952 నవంబరు 4 న కంచట్కా తీరప్రాంతంలో వరుసగా 9.3, 8.2 పరిమాణాలతో కూడిన భారీ భూకంపాలు సంభవించాయి. 2006 ఏప్రిల్‌లో ఈ ప్రాంతంలో అనేక గాథ భూప్రకంపనలు (Shallow earthquakes) వరుసగా నమోదయ్యాయి.
ప్రపంచ సాంస్కృతిక , సహజ వారసత్వ ప్రాంతాలలో భాగంగా కంచట్కా అగ్నిపర్వతాలు
[మార్చు]యునెస్కో (UNESCO) సంస్థ కంచట్కాలోని ఆరు నేచర్ పార్కులను వరల్డ్ కల్చరల్ అండ్ నేచురల్ హెరిటేజ్ ప్రాంతాల జాబితాలో చేర్చింది. కంచట్కా అగ్నిపర్వతాలలోని మొత్తం 19 క్రియాశీలక అగ్నిపర్వతాలు ఈ వరల్డ్ హెరిటేజ్ ప్రాంతాలలో భాగంగా ఉన్నాయి. అవి
1. బైస్ట్రిన్స్కి రీజనల్ నేచర్ పార్క్ (Bystrinsky Regional Nature Park) : 13.68 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించిన ఈ పార్క్ లో గల ముఖ్యమైన క్రియాశీలక అగ్నిపర్వతం ఇచిన్‌స్కీ అగ్నిపర్వతం (Ichinsky) (3607 మీ.)
2. క్లైయుచెవస్కీ రీజనల్ నేచర్ పార్క్ (Kluchevskoy Regional Nature Park) : 3.71 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించిన ఈ పార్క్ లో మధ్యలో క్లైయుచెవస్కీ సమూహానికి చెందిన అగ్నిపర్వతాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ పార్క్ లో 4 క్రియాశీలక అగ్నిపర్వతాల లతో పాటు 9 విలుప్త అగ్నిపర్వతాలు విస్తరించి ఉన్నాయి.
క్రియాశీలక అగ్నిపర్వతాలు: క్లైయుచెవస్కీ (Klyuchevskoy) (4750 మీ.), ప్లోస్కీ టోల్బాచిక్ (Plosky Tolbachik), బెజిమైయాని (Bezymianny) (2882 మీ.), ఉష్కోవస్కీ (Ushkovsky) (3943 మీ.)
విలుప్త అగ్నిపర్వతాలు: కామెన్ (Kamen), క్రెస్టోవిస్కీ (Krestovsky), ఆస్ట్రీ టోల్బాచిక్ (Ostry Tolbachik), ఒవల్నాయా జిమినా (Ovalnaya Zimina), ఆస్ట్రాయా జిమినా (Ostraya Zimina), బోల్షాయ ఉదీనా (Bolshaya Udina), మలాయ ఉదీనా (Malaya Udina), శ్రేడ్ని (Sredny) , గోమి జోబ్ (Gorny Zoub) మొదలగునవి క్లైయుచెవస్కీ రీజనల్ నేచర్ పార్క్‌లో విస్తరించి వున్నాయి.
3. క్రోనట్‌స్కీ నేచర్ రిజర్వ్ (Krontsky Nature Reserve) : ఈ పార్క్ 11.47 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించివుంది. మొత్తం 29 క్రియాశీలక అగ్నిపర్వతాలలో 12 అగ్నిపర్వతాలు ఈ పార్క్ లోనే ఉన్నాయి. ఇక్కడి ముఖ్యమైన క్రియాశీలక అగ్నిపర్వతం క్రోనట్‌స్కీ (kronotsky) (3528 మీ.). ఇది కచ్చితమైన శంకువు ఆకారంతో తెల్లగా ప్రకాశిస్తూ వుంటుంది. ఈ పార్క్ లోగల ఇతర అగ్నిపర్వతీయ విశేషాలలో 212 చ. కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించిన క్రోనట్‌స్కీ సరస్సు, ఉజాన్ (uzon) అగ్నిపర్వతం యొక్క కాల్డేరాలు ముఖ్యమైనవి.
4. నలైచెవో రీజనల్ నేచర్ పార్క్ (Nalychevo Regional Nature Park) : 2.86 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఈ పార్క్ విస్తరించి ఉంది. ఈ పార్క్ లో ప్రధానంగా విలుప్త అగ్నిపర్వతాలతో పాటు 4 క్రియాశీలక అగ్నిపర్వతాలు ఉన్నాయి.
5. దక్షిణ కంచట్కా రీజనల్ నేచర్ పార్క్ (Southern Kanchatka Regional Nature Park) : 5.00 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించిన ఈ పార్క్ లో వున్న క్రియాశీలక అగ్నిపర్వతాలలో జెల్టొవిస్కీ (Zheltovsky), Ksudach, Khodutka, Vilyuchinsky, Mutnovsky ముఖ్యమైనవి.
6. దక్షిణ కంచట్కా వన్యప్రాణి రిజర్వ్ (Southern Kanchatka Wildlife Reserve) : 3.22 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించిన ఈ పార్క్ లోని క్రియాశీలక అగ్నిపర్వతాలలో Kambalny (2,156 మీ.), కొషిలెవా (Kosheleva) (1,812 మీ.), ఇల్లినిస్కీ (Ilyinsky) (1,578 మీ.) ముఖ్యమైనవి.
అగ్నిపర్వతాల జాబితా
[మార్చు]కంచట్కా ద్వీపకల్పంలో ఉత్తరం నుండి దక్షిణానికి పోయేకొలది విస్తరించిన మధ్య శ్రేణికి చెందిన అగ్నిపర్వతాలు.
దృశ్యమాలికలు
[మార్చు]-
కంచట్కా ప్రాంతంలోని కొన్ని అగ్నిపర్వత చిత్రాలు (అంతరిక్షం నుండి తీసిన ఫోటో)
-
కంచట్కా లోని జుపానోవిస్కీ, జెంజూరిస్కీ అగ్నిపర్వతాలపై నుండి క్రిందకు ప్రవహిస్తున్న అగ్నిపర్వతీయ విశేషాలు (లాండ్శాట్ ఉపగ్రహం నుంచి తీసిన ఫోటో)
-
అగ్నిపర్వత సుదూర దృశ్యం
-
కాల్డేరా సరస్సుపై పొగమంచు కమ్ముకొన్న దృశ్యం
-
కాల్డేరా సరస్సు దృశ్యం