Jump to content

ఏడిద నాగేశ్వరరావు

వికీపీడియా నుండి
ఏడిద నాగేశ్వరరావు
జననంఏడిద నాగేశ్వరరావు
(1934-04-24)1934 ఏప్రిల్ 24
కొత్తపేట , తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
మరణం2015 అక్టోబరు 4
హైదరాబాదు, తెలంగాణ
మరణ కారణంఅనారోగ్యం, వృద్ధాప్యం
వృత్తినిర్మాత
తండ్రిసత్తిరాజు నాయుడు
తల్లిపాపలక్ష్మి

ఏడిద నాగేశ్వరరావు (ఏప్రిల్ 24, 1934 - అక్టోబరు 4, 2015) ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అనే సంస్థ ద్వారా కొన్ని ఉన్నత ఆశయాలు గల తెలుగు సినిమాలను నిర్మించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర, భారత ప్రభుత్వాల నుండి ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు.

బాల్యం

[మార్చు]

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేటలో సత్తిరాజునాయుడు, పాపలక్ష్మి దంపతులకు 1934, ఏప్రిల్ 24 న జన్మించాడు.[1]

రంగస్థల ప్రస్థానం

[మార్చు]

కాకినాడ మెక్లారిన్ హైస్కూల్‌లో ఫిఫ్త్‌ ఫారమ్‌ చదువుతుండగా స్కూల్‌ వార్షికోత్సవంలో లోభి నాటకంలో తొలిసారిగా ఏడిద అమ్మాయి వేషం వేశారు. దానికి సిల్వర్‌ మెడల్‌ను కూడా అందుకున్నారు. ఆ నటనకు రజతపతకం సాధించిన ఉత్సాహంతో ‘విశ్వభారతి, ‘పరివర్తన’, ‘ఓటు నీకే’వంటి నాటకాల్లో నటించి మరిన్ని బహుమతులు పొందారు. ఆ తర్వాత విజయనగరంలో ఇంటర్‌మీడియట్‌ చదువుతుండగా ‘కవిరాజు మెమోరియల్‌ క్లబ్‌’లో కొన్ని నాటకాలు ఆడారు. పిఠాపురం రాజాస్‌ కాలేజీలో బి.ఎ. ఎకనామిక్స్‌లో చేరిన నాగేశ్వరరావుకు అక్కడే దర్శకనిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్‌ పరిచయమయ్యారు. వి.బి.రాజేంద్రప్రసాద్, నటులు హరనాథ్, మాడా, కె.కె.శర్మ, వడ్డాది సూర్యనారాయణమూర్తిలతో కలిసి కళాప్రపూర్ణ రాఘవ కళాసమితి నాటక సంస్థని ప్రారంభించి ఇన్‌స్పెక్టర్ జనరల్ వంటి[2] పలు నాటకాలు ప్రదర్శించి నటించారు. 26 ఏళ్ళ వయసులో నాగేశ్వరరావు ‘కప్పలు’ నాటకంలో వృద్ధ పాత్ర పోషించి మెప్పించినందుకుగానూ ఆయనకు పరిషత్‌ పోటీలలో బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు వచ్చింది.

కుటుంబం

[మార్చు]

డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌లో మేనమామ కూతురైన జయలక్ష్మితో 1954 ఏప్రిల్‍ 24న వివాహం జరిగింది. కూతురు ప్రమీల, కుమారులు విశ్వమోహన్, శ్రీరామ్, రాజా ఉన్నారు. ముగ్గురు కుమారుల్లో విశ్వమోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా స్థిరపడగా, చిన్న కుమారులు ఏడిద శ్రీరామ్ నిర్మాత, నటుడిగా, ఏడిద రాజా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నారు.

సినీరంగ ప్రస్థానం

[మార్చు]

తన స్నేహితుడు, నిర్మాత వి.బి.రాజేందప్రసాద్‍ నుంచి ‘అన్నపూర్ణ’లో నటించాలని పిలుపు రావడంతో మద్రాస్‍ వెళ్లాడు. కాని, ఆ వేషం దక్కలేదు. డబ్బింగ్‍ కళాకారుడిగా ప్రయత్నాలు ప్రారంభించారు. ‘పార్వతీ కళ్యాణం’ లోని శివుడి పాత్రకి డబ్బింగ్‍ చెప్పి తొలి సంపాదనగా రూ.500 పొందారు. ఆ తర్వాత నటుడిగా కూడా అవకాశాలు సొంతం చేసుకొన్నారు. నిర్మాత కాక ముందు ఆయన నటుడిగా సినీ ప్రస్థానాన్ని ఆరంభించారు. రణభేరి, నేరము శిక్ష, బంగారు బాబు, మానవుడు దానవుడు, చిన్ననాటి స్నేహితులు తదితర చిత్రాల్లో నటించారు.

1962 నుంచి 1974 మధ్య కాలంలో సుమారు 30 సినిమాల్లో నటించారు. వంద చిత్రాలకి పైగా డబ్బింగ్‍ చెప్పారు. ఆ తర్వాత కాకినాడకి చెందిన భాస్కరరెడ్డి, రామకృష్ణారెడ్డి, లచ్చిరెడ్డి, వీర్రాజులతో కలిసి ‘వెంకటేశ్వర కల్యాణం’అనే చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. ఆ సినిమాకి లాభాలు రావడంతో ఆ నలుగురూ కలిసి గీతాకృష్ణ కంబైన్స్ అనే సంస్థని ప్రారంభించి నిర్మాణ సారథ్య బాధ్యతల్ని ఏడిద నాగేశ్వరరావుకి అప్పగించారు.

‘నేరము శిక్ష’లో నటించడంతో ఆ చిత్ర దర్శకుడు కె. విశ్వనాథ్తో పరిచయం ఏర్పడింది. ఆయనతో సిరి సిరి మువ్వ సినిమాని నిర్మించారు. అది విజయం సాధించింది. తర్వాత తన బంధువులతో కలిసి పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ స్థాపించారు. తొలి ప్రయత్నంగా కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వంలో తాయారమ్మ బంగారయ్యను నిర్మించారు. అందులో చిరంజీవి ప్రతినాయక ఛాయలున్న ఓ చిన్న పాత్రని పోషించారు. ఆ సినిమా విజయం సాధించడంతోపాటు తమిళం, హిందీ భాషల్లోనూ రీమేక్‍ అయ్యింది. నిర్మాణ సారథిగా ఒక విజయాన్ని, నిర్మాతగా మరో విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. మూడో సినిమా కోసం మళ్లీ కె.విశ్వనాథ్‍ని సంప్రదించి శంకరాభరణం నిర్మించారు. ఇక ఆ చిత్రం తర్వాత వెనుదిరిగి చూసుకొనే అవకాశం రాలేదు. సీతాకోక చిలుక, స్వాతిముత్యం, సితార చిత్రాలకి వివిధ విభాగాల్లో జాతీయ పురస్కారాలు లభించాయి. ‘స్వాతిముత్యం’ తెలుగు నుంచి ఆస్కార్‍ నామినేషన్లకు ఎంపికైంది. చాలా సినిమాలకు వివిధ విభాగాల్లో నంది పురస్కారాలు వరించాయి. చివరిగా ‘ఆపద్బాంధవుడు’చిత్రాన్ని నిర్మించారు ఏడిద నాగేశ్వరరావు.

వృత్తి

[మార్చు]

నాటకరంగం నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టాడు. నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా, నిర్మాతగా ఎదిగాడు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కార్యదర్శిగా సేవలందించాడు. నంది పురస్కారాల కమిటీ అధ్యక్షుడిగా, జాతీయ పురస్కారాల కమిటీలో సభ్యుడిగా పని చేశాడు.

పురస్కారాలు

[మార్చు]
  1. ఉగాది పురస్కారం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు, 11 ఏప్రిల్ 2013)[3]

మరణం

[మార్చు]

అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదు లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబరు 4, 2015 ఆదివారం సాయంత్రం 5 గంటలకు కన్ను మూశారు.[4]

విశేషాలు

[మార్చు]
  • ఆయన నిర్మించిన చిత్రాలన్నీ జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకున్నాయి.
  • పలు చిత్రాలు రష్యన్ భాషలో విడుదలయ్యాయి.
  • ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన 9 సినిమాల్లో అత్యధిక చిత్రాలు కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కడం విశేషం.

‘శంకరాభరణం’తో ఖండాతర ఖ్యాతి

[మార్చు]

సింగిల్‌ షెడ్యూల్లో 52 రోజుల్లో రూ.11 లక్షల వ్యయంతో ‘శంకరాభరణం’ను నిర్మించారు ఏడిద. జాతీయ స్థాయిలో వ్యూయర్‌షిప్‌ను తెచ్చుకున్న సినిమా. ఈ సినిమాను మలయాళంలోకి డబ్‌ చేశారు. అయితే పాటలను మాత్రం తెలుగులోనే ఉంచారు. ఎర్నాకులంలోని కవితా థియేటర్లో రెండేళ్ళు ఆడింది. అమెరికాలోనూ విడుదల చేశారు. 20 మంది యూనిట్‌ సభ్యులు అమెరికాలో 45రోజుల పాటు శంకరాభరణం నైట్స్‌ను నిర్వహించారు. తెలుగు సినిమాకు అమెరికాలో అంతగా బ్రహ్మరథం పట్టడం అదే ప్రథమం. జాతీయ స్థాయిలో స్వర్ణకమలం కూడా సాధించింది. ఈస్ట్‌ ఫ్రాన్స్‌లో సంగీత ప్రధాన చిత్రాలు మాత్రమే పాల్గొనే బెసన్‌కాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ సినిమాకు బెస్ట్‌ ఫిల్మ్‌ అవార్డు లభించింది. ఆ తర్వాత భారతిరాజా దర్శకత్వంలో ‘సీతాకోకచిలుక’ను తెరకెక్కించారు. అది జాతీయ స్థాయిలో ‘ఉత్తమ ప్రాంతీయ చిత్రం’గా రజత పతకాన్ని, రాష్ట్ర స్థాయిలో బంగారు నందిని అందుకుంది. అలీకి ఈ సినిమాకు ఉత్తమ బాలనటుడు అవార్డు లభించింది. ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన సినిమా ‘సాగర సంగమం’. బెంగుళూరులో 575రోజుల అరుదైన రికార్డును సొంతం చేసుకున్న సినిమా అది. నేటివిటీ మార్పులతో తెలుగు, తమిళ్‌, మలయాళంలో ఒకేసారి విడుదలైన సినిమా ఇది. తమిళంలో ‘సలంగై ఒళి’ పేరుతోనూ మలయాళంలో ‘సాగరసంగమం’ అనే పేరుతోనే విడుదలైందీ సినిమా. ఇండియన్‌ పనోరమకు ఎంపికైంది. బాలసుబ్రమణ్యానికి బెస్ట్‌సింగర్‌గా జాతీయ అవార్డు వచ్చింది.

నిర్మించిన చిత్రాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు దినపత్రిక అక్టోబరు 5, 2015
  2. ఉత్తమ నాటకం ఇన్‌స్పెక్టర్ జనరల్, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 7 ఆగస్టు 2017, పుట.14
  3. సాక్షి, ఎడ్యుకేషన్ (9 April 2013). "41 మందికి ఉగాది పురస్కారాలు...15 మందికి హంస అవార్డులు". www.sakshieducation.com. Archived from the original on 17 April 2020. Retrieved 17 April 2020.
  4. "Shankarabharanam producer Edida Nageswara Rao dead". www.thehindu.com. 4 October 2015. Retrieved 2021-04-13.{{cite web}}: CS1 maint: url-status (link)