ఇస్లామీయ కేలండర్
ఇస్లామీయ కేలండర్ లేదా ముస్లిం కేలండర్ (అరబ్బీ : التقويم الهجري అత్-తఖ్వీమ్ అల్-హిజ్రి), ఇస్లామీయ దేశాలలో, ముస్లింల సముదాయాలలో అవలంబింపబడుతున్న కేలండర్. ఇది చంద్రమాసాలపై ఆధారంగా గలది కావున దీనికి 'తఖ్వీమ్-హిజ్రి-ఖమరి' అని కూడా అంటారు. ఈ కేలండర్ లో 12 చంద్రమాసాలు, దాదాపు 354 దినాలు గలవు.
హిజ్రీ శకం
[మార్చు]"హిజ్రీ శకా"నికి మూలం ముహమ్మద్ ప్రవక్త గారి హిజ్రా (هِجْرَة), హిజ్రాహ్ లేదా హిజ్రత్. మహమ్మదు ప్రవక్త , అతని అనుయాయులు మక్కా నుండి మదీనా కు సా.శ. 622 లో వలసవెళ్ళారు. ఈ వలస వెళ్ళడాన్నే హిజ్రత్ అని అంటారు.
సెప్టెంబరు 622 లో మహమ్మదు ప్రవక్త తన అనుయాయులతో కలసి హిజ్రత్ (వలస చేసి) 'యస్రిబ్' నగరాన్ని చేరుకొన్నారు. యస్రిబ్ నగరానికి మదీనా (తెలుగార్థం: నగరం) లేదా "మదీనతున్-నబీ" లేదా నబీ (ప్రవక్త) గారి నగరంగా పేరు స్థిరపడింది. ముస్లింల శకం హిజ్రీ ప్రారంభమయింది. ఉమర్ కాలంలో 638లో ఇస్లామీయ కేలండర్ ప్రారంభమయింది. మహమ్మదు ప్రవక్త గారి వలస క్రింది విధంగా జరిగింది.
వలస జరిగిన క్రమం
[మార్చు]- దినము 1: గురువారం 26 సఫర్ నెల, హి.శ. 1, 9 సెప్టెంబరు 622
- మక్కానగరం లోని తన ఇంటిని వదిలారు. మక్కాకు దగ్గరలోని తూర్ గుహలో మూడు రోజులు గడిపారు.
- దినము 5: సోమవారము 1 రబీఉల్ అవ్వల్ నెల, హి.శ. 1, 13 సెప్టెంబరు 622
- మక్కా పొలిమేరలు దాటి యస్రిబ్ ప్రాంతానికి పయనం.
- దినము 12: సోమవారం 8 రబీఉల్ అవ్వల్ నెల, హి.శ. 1, 20 సెప్టెంబరు 622
- మదీనా దగ్గరలోని "ఖుబా" ప్రాంతానికి చేరుక.
- దినము 16: శుక్రవారం 12 రబీఉల్ అవ్వల్, హి.శ. 1, 24 సెప్టెంబరు 622
- ఖుబా నుండి మదీనా ప్రయాణం, శుక్రవారపు ప్రార్థనలు.
- దినము 26: సోమవారం 22 రబీఉల్ అవ్వల్, హి.శ. 1, 4 అక్టోబరు 622
- మదీనా మొదటి దర్శనం
హిజ్రీ మొహర్రం నెలలో ప్రారంభం కాలేదు. హిజ్రీ ప్రారంభం మొహర్రం నెలలో కాదు. ఇస్లామీయ కేలండరు లోని మూడవనెల అయిన రబీఉల్ అవ్వల్ నెలలో హిజ్రత్ జరిగింది కావున, హిజ్రీ శకం, హి.శ. 1 లోని మూడవ నెల అయిన రబీఉల్ అవ్వల్ 22 వ తేదీన ప్రారంభం అవుతుంది.
ఇస్లామీయ మాసాలు
[మార్చు]1. మొహర్రం :محرّم (ముహర్రముల్ హరామ్)
2. సఫర్ : صفر (సఫరుల్-ముజఫ్ఫర్)
3. రబీఉల్-అవ్వల్ : ربيع الأول
4. రబీఉల్-ఆఖిర్ (రబీఉస్-సాని): ربيع الآخر أو ربيع الثاني
5. జమాదిఉల్-అవ్వల్: جمادى الأول
6. జమాదిఉస్-సాని: جمادى الآخر أو جمادى الثاني
7. రజబ్ : رجب (రజబ్-ఉల్-మురజ్జబ్)
8. షాబాన్ : شعبان (షాబానుల్-ముఅజ్జమ్)
9. రంజాన్ : رمضان (రంజానుల్-ముబారక్)
10. షవ్వాల్: شوّال (షవ్వాలుల్-ముకర్రమ్)
11. జుల్-ఖాదా: ذو القعدة
12. జుల్-హిజ్జా: ذو الحجة
వారములోని దినాలు
[మార్చు]ఇస్లామీయ వారము తెలుగువారములానేవుంటుంది. వారములోని మొదటిదినము ఆదివారము 'ఇత్వార్' తో ప్రారంభము అవుతుంది. ముస్లింలకు పవిత్రదినం శుక్రవారము. శుక్రవారము ముస్లింలు 'జుమా' ప్రార్థనలకు హాజరవుతారు. "يوم" (యౌమ్) అనగా దినము.
తెలుగు లిప్యాంతరీకరణ |
అరబ్బీ పేరు |
తెలుగు పేరు |
ఉర్దూ పేరు |
పర్షియన్ పేరు |
---|---|---|---|---|
యౌమ్ అల్-అహద్ | يوم الأحد | (మొదటి దినము - ఆదివారము) | ఇత్వార్ اتوار | ఎక్-షుంబా یکشنبه |
యౌమ్ అల్-ఇస్నైన్ | يوم الإثنين | (రెండవ దినము - సోమవారము) | పీర్ پير | దో-షుంబా, دوشنبه |
యౌమ్ అల్-సలాస | يوم الثُّلَاثاء | (మూడవ దినము - మంగళవారము) | మంగల్ منگل | సెహ్-షుంబా, سه شنبه |
యౌమ్ అల్-అర్బియా | يوم الأَرْبِعاء | (నాలుగవ దినము - బుధవారము) | బుధ్ بدھ | చహార్-షుంబా, چهارشنبه |
యౌమ్ అల్-ఖమిస్ | يوم الخَمِيس | (ఐదవ దినము - గురువారము) | జుమేరాత్ جمعرات | పంజ్-షుంబా, پنجشنبه |
యౌమ్ అల్-జుమా | يوم الجُمُعَة | (ఆరవదినము - శుక్రవారము) | జుమా جمعہ | జుమా, جمعه లేదా ఆదీన آدينه |
యౌమ్ అల్-సబ్త్ (సబత్) | يوم السَّبْت | (ఏడవ దినము - శనివారము) | హఫ్తా ہفتہ | షుంబా లేక షంబా, شنبه |