Jump to content

ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు

వికీపీడియా నుండి
సర్

ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియార్
జననం (1887-10-14) 1887 అక్టోబరు 14 (వయసు 137)
మరణం1974 ఏప్రిల్ 15(1974-04-15) (వయసు 86)[1]
మద్రాసు, భారతదేశం
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థమద్రాసు క్రైస్తవ కళాశాల
వృత్తిఉపకులపతి, మద్రాసు విశ్వవిద్యాలయం
బంధువులుఆర్కాటు రామస్వామి మొదలియారు (సోదరుడు)
పురస్కారాలుపద్మ భూషణ్, పద్మవిభూషణ్
మద్రాసు విశ్వవిద్యాలయపు సెనెట్ హౌస్‌లో ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు విగ్రహం

ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు (Arcot Lakshmanaswami Mudaliar) (1887 - 1974) ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసూతి వైద్య నిపుణులు, విద్యావేత్త. ఆయన కవల సోదరుడు ఆర్కాటు రామస్వామి మొదలియారు కూడా విద్యారంగంలో, న్యాయరంగంలో తమ ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించడంతో వీరిద్దరూ ఆర్కాటు సోదరులు పేరిట ప్రఖ్యాతులయ్యారు. లక్ష్మణ స్వామి మొదలియారు మద్రాసు విశ్వవిద్యాలయంలో అవిచ్ఛిన్నంగా 27 సంవత్సరాలు ఉప కులపతిగా పనిచేశారు.

జీవిత విశేషాలు

[మార్చు]

వీరు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో ఒక తమిళ మొదలియార్ కుటుంబంలో జన్మించారు. అక్కడి మునిసిపల్ ఉన్నత పాఠశాల చదివేకాలంలో ప్రధానోపాధ్యాయుడైన కె.ఆర్. రఘునాథాచారి వీరి ఉన్నత భవిష్యత్తును ఊహించారు. వీరు మద్రాసు క్రైస్తవ కళాశాలలో బి.ఎ. (తెలుగు) పూర్తిచేసి, తర్వాత మద్రాసు వైద్య కళాశాల నుండి 1922 లో వైద్యవిద్య నభ్యసించారు.

ఉద్యోగజీవితం

[మార్చు]

లక్ష్మణస్వామి మొదలియారు వైద్యవృత్తినీ, వైద్యవిద్యనీ చేపట్టి రెండింటిలోనూ ప్రతిభ చూపారు. అనంతర కాలంలో అనేకమైన పదవుల్లో ప్రపంచవైద్యసంస్థకు, దేశంలోని వైద్యసంస్థలకు సేవలు చేసినా ప్రధానంగా ఆయన చికిత్సలోనూ, బోధనలోనూ ఉద్యోగ జీవితాన్ని గడిపారు.

చికిత్సరంగంలో

[మార్చు]

వైద్యవిద్య పూర్తిచేసుకున్న వెంటనే లక్ష్మణస్వామికి 1909లో ప్రభుత్వ వైద్యశాఖలో ఉద్యోగం లభించింది. మొదటి సంవత్సరం మదురై, పశని పట్టణాల్లో పనిచేసి ఆపైన మద్రాసుకు బదిలీ అయ్యారు. మద్రాసులో మొదట ఆయనను డొనోవన్ అనే ప్రఖ్యాత వైద్యునికి సమాయకునిగా నియమించారు. ఆపైన 1912లో ఎగ్మూరులోని ప్రభుత్వ స్త్రీ, శిశు ఆసుపత్రికి బదిలీ చేశారు. ఆనాటి నుంచీ ఆయన స్త్రీ, ప్రసూతి, శిశు వైద్యరంగంలో విశేష నైపుణ్యాన్ని కనబరిచి అదే స్పెషలైజేషన్ లో ఏళ్ళతరబడి పనిచేయడమే కాక సుప్రఖ్యాతులయ్యారు. 1914లో ఆయన బి.ఎ. పూర్తచేసుకుని పట్టభద్రుడు కావడంతో ఆయనను రాయపురంలోని ప్రసూతి ఆసుపత్రికి ఉద్యోగోన్నతిపై బదిలీ చేశారు. అక్కడ కూడా ఆయన మంచి వైద్యునిగా పేరుగడించి తన బాధ్యతలు నిర్వర్తించారు. 1920లో ఆయనను మద్రాసు ప్రభుత్వ మహిళల శిశువుల ఆసుపత్రికి బదిలీచేశారు. ఆపైన అక్కడే 25 సంవత్సరాలకు పైగా పనిచేసి తనకూ, ఆసుపత్రికీ కూడా దేశాంతర ఖ్యాతిని తెచ్చిపెట్టారు. ఆయన వద్ద నైపుణ్యం నేర్చేందుకు, వైద్యవిద్యలో లోతుపాతులు తెలుసుకునేందుకు ఆసుపత్రికే బర్మా, మలేషియా, చైనా మొదలైన ఆసియా దేశాల నుంచి స్నాతకోత్తర వైద్యవిద్య���ర్థులు వచ్చి వెళ్ళేవారు.[2]

వైద్యబోధనలో

[మార్చు]

1934 లో మద్రాసు మెడికల్ కళాశాలలో ప్రసూతి వైద్య విభాగంలో ప్రొఫెసర్ పదవిని పొందారు. అనతికాలంలోనే ఆ కాలేజీకి ప్రిన్సిపాల్ గా పదవిని అధిష్టించిన తొలి భారతీయులుగా ఘనత పొందారు. ప్రిన్సిపాల్ గా ఆయన కళాశాలలో మంచి క్రమశిక్షణ నెలకొల్పారు. కేవలం మార్కుల ఆధారంగా కాక ఇతర కొలమానాలను ఉపయోగించి విద్యార్థి ప్రతిభను అంచనావేయాలని, విద్యబోధన తదనుగుణంగానే వుండాలని ఆయన నమ్మేవారు. మార్కులకు అతీతమైన ప్రతిభ, వైద్యరంగంలో రాణించగల సమర్థత విద్యార్థిలో కనిపిస్తే దాని ఆధారంగా విద్యార్థులను కళాశాలలో చేర్చుకోవచ్చని వాదించేవారు. దానిని ఆధారం చేసుకుని కొన్ని మార్పుచేర్పులు చేసి నిర్ణయాలు కూడా తీసుకోవడంతో కోర్టులో కూడా ఆయన ఒకసారి తన వాదనను వినిపించాల్సివచ్చింది. మద్రాసు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షపదవి పొందారు. ఆయన మద్రాసు విశ్వవిద్యాలయంలో సుదీర్ఘకాలం పనిచేసిన ఉపాధ్యక్షునిగా నిలిచారు.[3] (27 సంవత్సరాలు) భారతీయ విద్యాసంస్థల్లో ఔషధరంగం (ఫార్మసీ) లో డిగ్రీ కోర్సును ప్రప్రథమంగా ఏర్పాటుచేసిన ఘనత ఆయనకు దక్కుతుంది.

వైద్యరంగం

[మార్చు]

వైద్యరంగంలో, మరీ ముఖ్యంగా ప్రసూతి వైద్యంలో, లక్ష్మణస్వామి మొదలియారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వ్యక్తి. ఆయన చేసిన క్లిష్టమైన సర్జరీలు, ఆయనలోని గొప్ప విశ్లేషణ, సమన్వయశక్తులను గమనించి 1914నాడే పలువురు తోటి వైద్యులు లక్ష్మణస్వామిని వయసుకు, అనుభవానికి మించిన విశేష ప్రతిభ కలవానిగా గుర్తించారు. వీరు 1938 లో వైద్య విద్యార్థుల కోసం ప్రసూతి సంబంధమైన పుస్తకం రచించారు. ప్రసూతి సమస్యలతో మరణాలు ఎక్కువగా వుండే 20వ శతాబ్ది తొలి అర్థభాగంలో ఆయన తన వైద్యనిపుణతతో ఎందరెందరో స్త్రీలను, శిశువులను మృత్యుముఖం నుంచి బయటకు తెచ్చి ప్రాణాలు పోశారు.

పదవులు

[మార్చు]

వీరు 1923లో మొదటిసారిగా మద్రాసు విశ్వవిద్యాలయంలో సెనేట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1936, 1940 లలో ఆక్టింగ్ వైస్ ఛాన్సలర్ అయి, అనంతరం 1942 నుండి 1969 వరకు 27 సంవత్సరాల పాటు, వరుసగా 9 సార్లు వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు.

వ్యక్తిత్వం

[మార్చు]

లక్ష్మణస్వామి మొదలియారు ప్రశాంతంగా, నిజాయితీగా వ్యవహరించే వ్యక్తి. ఆయన ప్రవర్తన చుట్టుపక్కలవారిని ఎంతగానో మెచ్చుకునేటట్టుగా వుండేది. ఆయనతో వైద్యకళాశాలలో కలసి విద్యనభ్యసించి, తర్వాత ఆయన పొరుగింట్లో నివసించడం, సాటి వైద్యురాలు కావడం, ఆయనతో వైద్యంచేయించుకోవడం వంటి కారణాలతో దగ్గరగా పరిశీలించిన డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి ఆయన గురించి ‘‘ప్రపంచ అద్భుతాలలో ఒకటి’’ అనే వ్యాసంలో ఇలా అభివర్ణించారు -డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియారు ప్రశాంతంగా, నిజాయితీగా వ్యవహరించేవారు. ఇంగ్లీషులో మనస్సుకి హత్తుకునేలా మాట్లాడేవారు. అందువల్ల యూరోపియన్ సూపరింటెండెంటు కల్నల్ గిఫర్డు తదితరులు ఆయన్నెంతో అభిమానించేవారు. తత్ఫలితంగా ఆయనకు బదిలీల బెడద కూడా లేదు. అదే ఆసుపత్రిలో అవిచ్ఛిన్నంగా పనిచేయగలిగారు’’
లక్ష్మణస్వామి వృత్తి పట్ల ఎంతో అంకితభావాన్ని కలిగివుండేవారు. ఆయనలో దైవభక్తి కూడా అధికంగా వుండేది. తెల్లవారుజామునే లేచి చేసుకునే నిత్యకర్మల్లో దైవప్రార్థనదే ప్రధానభాగం. విద్యార్థికి ఏ విషయంలో ప్రతిభ వుందో తెలుసుకుని, దాన్ని ప్రోత్సహించేవారు. లక్ష్మణస్వామిలో ఎంతగా ప్రశాంత గాంభీర్యం తొణికిసలాడినా, దానిలోనే ఒక మర్యాదకరమైన హాస్యం కూడా తొంగిచూసేది. ఆయన తన విద్యార్థులతో ఎంతో గాఢమైన విషయాలు బోధిస్తూనే హఠాత్తుగా మంచి జోక్ వేసి ఆశ్చర్యపరిచేవారు.[2]

గౌరవ సత్కారాలు

[మార్చు]

ఈయన్ను అనేక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేటుతో సత్కరించాయి. వీటిలో కొన్ని - సిలోన్ విశ్వవిద్యాలయం (1942), ఆంధ్రా, పాట్నా, లక్నో, ఉత్కళ్ విశ్వవిద్యాలయాలు (1943- 1950), ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం (1948), గ్లాస్గో విశ్వవిద్యాలయం (1951) [4]

అంతర్జాతీయ ఖ్యాతి

[మార్చు]

లక్ష్మణస్వామి మొదలియారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో), యునెస్కోలతో సన్నిహిత సంబంధాలు కలిగివుండేవారు. 1953లో లండన్‌లో జరిగిన ప్రపంచ వైద్యవిద్యా సదస్సుకు ఆయన ఉపాధ్యక్షునిగా వ్యవహరించారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గౌరవ డాక్టరేట్లు, బిరుదులు, అవార్డులు, అరుదైన గౌరవాలు, అంతర్జాతీయ సదస్సులకు నేతృత్వాలు వంటివి లెక్కలేనన్ని పొందారు. వారు వైద్య బోధనలో అసమానులుగా పేరొందారు.

పాఠ్య పుస్తకాలు

[మార్చు]
  • Clinical Obstetrics first edition 1938; later revised as Mudaliar and Menon, 10th edition, ISBN 81-250-2870-6

గౌరవాలు

[మార్చు]

వీరి శతజయంతి సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన గ్రంథాన్ని చల్లా రాధాకృష్ణశర్మ వ్రాశారు.

మూలాలు

[మార్చు]
  1. "Late Dr. A. Lakshmanaswami Mudaliar". Indian Journal of Medical Education (in ఇంగ్లీష్). 13. Indian Association for the Advancement of Medical Education: 77–79. 1974. Retrieved 18 April 2019. Sir Arcot, a distinguished obstetrician and gynaecologist, an international public health worker, an outstanding medical statesman and an internationally recognised medical educationist passed away on 15th April, 1974, at Madras...
  2. 2.0 2.1 రాధాకృష్ణమూర్తి, చల్లా. ఆర్కాట్ సోదరులు (మొదటి ముద్రణ ed.). హైదరాబాద్: తెలుగు విశ్వవిద్యాలయం.
  3. "వైస్ ఛాన్సలర్స్". మద్రాసు విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్. మద్రాసు విశ్వవిద్యాలయం. Retrieved 23 November 2014.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-07-16. Retrieved 2010-05-22.

బయటి లింకులు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.