Jump to content

సూళ్ళూరుపేట సుళ్ళు ఉత్సవం

వికీపీడియా నుండి

సూళ్ళూరుపేట సుళ్ళు ఉత్సవం అన్ని ప్రాంతాల్లో జరగకపోయినా, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ జరుగుతూ ఉంది. మరికొన్ని చోట్ల సిడిబండి ఉత్సవాలు, గాలపు సిడి ఉత్సవాలు ఇలా జరుగుతూ వుంటాయి. సిడి బండి ఉత్సవం కృష్ణా జిల్లా ఉయ్యూరు వీరమ్మ తిరుణాళ్ళలో జరిగేది. సుళ్ళు ఉత్సవం ఇప్పటికీ నెల్లూరు జిల్లా, సూళ్ళూరు పేటలో చెంగాళమ్మ తిరునాళ్ళలో జరుగుతూ ఉంది.[1] [2]అనాదిగా ఈ ఉత్సవం జరగటం వల్లనే అ ఊరికి సూళ్ళూరు పేట అనే పేరు సార్థకమైన దంటారు. సూళ్ళూరు పేటలో చెంగాళమ్మ దేవస్థానంలో ప్రతి ఏట బ్రహ్మోత్సవాలు జరుగుతూ వుంటాయి.[3]

ఈ ఉత్సవంలో సుళ్ళు ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యాన్నిస్తారు. రాష్ట్రం మొత్తం మీద ఇక్కడ జరిగినంత బ్రంహ్మాండంగా ఈ ఉత్సవం మరెక్కడా జరగదంటారు. సాయత్రం పూట ఆలయ ప్రాంగణంలో దాదాపు ముప్పై అడుగుల ఎత్తులో ఒక స్తంభం పాతి, దాని పైభాగాన ఓ రాట్నం అమరుస్తారు. ఆ రాట్నానికి నలభై అడుగుల పొడవున్న మరొక కొయ్యను అమర్చి దానికి ఒక వైపు పాలవెల్లి చట్రం కడతారు. ఆ చట్రానికి జీవంతో వున్న మేకనూ, మనిషి బొమ్మనూ, రోలు, ఒడిబాల ఏర్పాటు చేసి పూల మాలలతో వాటిని అలంకరించి ఒక్కోసారి తొమ్మిది చుట్లు తిప్పుతారు. ఇలా సిడిమాను తిరిగే సమయంలో దానికి కట్టి వున్న మేక భయంకరంగా ఆరుస్తుంది. క్రింద యువకులు మేళ తాళాలతో ఆవేశంతో నృత్యం చేస్తూ వుంటారు. తప్పెట్ల మోతలతో దద్దరిల్ల చేస్తారు. ఈ దృశ్య ఉత్సవాన్ని ఉత్సవానికి వచ్చిన ప్రజలు ఎంతో ఆసక్తిగా చూస్తారు. ఇంత ప్రాముఖ్యంగా సుళ్ళు ఉత్సవం జరగడం వల్ల దీనికి కొంత కాలం సూళ్ళూరు అని పిలిచే వారు. అది క్రమాను గతంగా సూళ్ళూరుపేటగా మారిందని అంటారు.[1]

చెంగాళమ్మ తిరునాళ్ళలో అన్నిటి కన్నా ఆసక్తి కరమైన కళా రూపం ఈ సుళ్ళు తిరగటమే. ఈ వుత్సవంలో మహిషాసుర మర్థన, తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ఒక్క నెల్లూరు జిల్లా నుంచే కాక, చిత్తూరు, తమిళనాడు ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారు. చెంగాళమ్మ దేవాలయం, మద్రాసు కలకత్తా ట్రంకు రోడ్ ప్రక్కనే ఉంది. వచ్చి పోయే వాహనాల వారు అక్కడ ఆగి పూజలు జరిపి వెళుతుంటారు. చెంగాళమ్మ మహత్తు కలిగిన దేవతగా నమ్మి కొలుస్తారు. బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరిగినన్ని రోజులూ, సంగీత, నృత్య, నాటక, సాంస్కృతి కోత్సవాలు జరుగుతాయి. విద్యుద్దీపాలతో ఆ ప్రాంతాన్నంతా అలంకరిస్తారు. ఈ ఉత్సవంలో ఎక్కడా కనిపించని సుళ్ళు తిరిగే సిడి బండి ప్రత్యేకత ఆకర్షణగా ఉంటుంది.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "సూళ్ళూరుపేట చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయ విశిష్టత, ఉత్సవాలు గురించి ఆసక్తికరమైన విషయాలు..!". telugu.thebetterandhra.com. Archived from the original on 2021-10-28. Retrieved 2021-10-28.
  2. "Sullurpeta Sri Chengalamma Parameshwari Temple Address & Contact Details; Chengalamma Annual Jatra (Brahmotsavam) 2013". Retrieved 2021-10-28.
  3. https://web.archive.org/web/20211028085137/https://tms.ap.gov.in/scripts/aes.js

వెలుపలి లంకెలు

[మార్చు]