వన పర్వము షష్టమాశ్వాసము
షష్టాశ్వాసం
[మార్చు]అంత వరకు కథను వింటున్న జనమేజయుడు వైశంపాయనుని పాండవులకు హాని మాత్రమే చేసే దుర్యోధనుడు శత్రువులచే అవమానం పొందటమే కాక పాండవులచే రక్షింపబడ్డాడు కదా ఆ అవమానాన్ని ఎలా సహించి హస్థినకు చేరాడు. ఆ పై దుర్యోధనుడు ఎలా ప్రవర్తించాడు " అని అడిగాడు.
దుర్యోధనుని అవమానభారం
[మార్చు]వైశంపాయనుడు " పాండవులచే రక్షింపబడిన ధుర్యోధనుడు అవమానభారంతో, మితిమీరిన దుఃఖంతో తన సేనలను మరల్చుకుని కొంత దూరం వెళ్ళి విడిది చేసాడు. సుయోధనునికి నిద్ర పట్టలేదు. అతడు కుటీరంలో ఏకాంతంగా దుఃఖిస్తూ ఉండగా కర్ణుడు వెళ్ళి " సుయోధనా! మానవులకు సాధ్యం కాని పని నీవు సాధించావు. గంధర్వులతో యుద్ధం చేసి గెలిచావు. నీవు చూస్తుండగానే గంధర్వులు నన్ను పరిగెత్తించారు. చెదిరిపోయే సేనను గూడా నేను నిలువరించలేక పోయాను. బాణాల తాకిడితో తీవ్రంగా గాయపడ్డాను. నా రథం కూడా విరిగి పోవడంతో నేను వికర్ణుని రథంపై పక్కకు పోయాను. నీవు అమానుషమైన ఆ యుద్ధంలో గాయపడకుండా నష్టపోకుండా శత్రువులను జయించావని అంతఃపుర స్తీలతో కలిసి వచ్చావని తెలిసి ఆనందించి నిన్ను అభినందిద్దామని వచ్చాను. నీ సోదరులతో కలిసి యుద్ధంలో నీవు ప్రదర్శించిన పరాక్రమం వంటి పరాక్రమం ప్రదర్శించగలవాడు లోకంలో మరొకడు లేడు " అన్నాడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు కర్ణునికి విషయం తెలియక మాట్లాడుతున్నందుకు చింతించి సిగ్గుతో తలవంచుకుని గద్గద స్వరంతో " కర్ణా! నేను తమ్ములు గంధర్వులతో యుద్ధం చేసాము. చిత్రసేనుడు నన్ను, నా భార్యను పరివార సమేతంగా బంధించి తీసుకు వెళుతున్న సమయంలో మనవాళ్ళు కొందరు ధర్మరాజుని శరణు వేడారు. ధర్మరాజు తన తమ్ములను పంపాడు. వారు ముందు గంధర్వులకు నచ్చ చెప్పి చూసారు. వారు వినక పోవడంతో యుద్ధం చేసి గంధర్వులను ఓడించారు. అప్పుడు చిత్రసేనుడు మన ఘోషయాత్రలోని మంత్రాంగాని చెప్పాడు. సుఖహీనులైన ద్రౌపదిని, పాండవులను చూడటం కోసమే మనం వచ్చినట్లు చెప్పేశాడు. అప్పుడు నేను సిగ్గుపడి భూమిలోకి కూరుకు పోయినట్లని పించింది. అప్పుడు పాండవులు గంధర్వులకు మంచి మాటలు చెప్పి ఒప్పించగా బందీలమైన మమ్ములను స్త్రీలతో సహా ధర్మరాజు వద్దకు తీసుకువెళ్ళి మన విషయమును ధర్మజుడికి చెప్పి అప్పగించారు ఇంత కన్నా బాధాకర మేముంటుంది? వారు నా నిత్య శత్రువులు.అయితే వారే నన్ను విడిపించారు. వారే నాకు బ్రతుకు నిచ్చారు. కర్ణా! ఇంత అవమానం జరిగిన తరువాత బ్రతకటం వ్యర్ధం. నన్ను చూసి ప్రజలు నవ్వరా. వారిని ఎలా పాలించగలను. ఇంత కంటే గంధర్వుల చేతిలో మరణించటం మేలు కదా అలాగైతే స్వర్గం ప్రాప్తించేది " అని తిరిగి " నేను ప్రాయోపవేశం చేయుట ఉత్తమం. నా తరువాత దుశ్శాసనుడు మీకు నాయకుడు.ఇప్పటి వరకు శత్రువులను పరభావించి మిత్రులను సత్కరించిన నేను శత్రువులచేత పరాభవాన్ని పొంది నగరానికి రాలేను. పది మందిలో తిరుగలేను, తండ్రి దృతరాష్ట్రునితోను తాత భీష్ముడితోను సంభాషించలేను . ఇది స్వయంకృతాపరాధం అనుభవించి తీరవలెను. చెడ్డ వాడు సిరి సంపదలను కూర్చ వచ్చును, విద్యలు నేర్వ వచ్చును కాని వాటిని సద్వినియోగం చేయలేరు. నేనూ అంతే. అయ్యో! ఆ పని చేయకుండా వుండాలిసింది. ఇప్పుడు బ్రతుకే సంశయాగ్రస్త మయ్యింది. పరాక్రమంతో శత్రువుల తలలపై,గుండెలపై నిలువగలిగిన నన్ను గంధర్వుడు పట్టుకోవడం ఎంత అవమానం. ఆత్మాభిమానం పోయిన తరువాత ప్రాణాలతో జీవించడం నిరర్ధకం కనుక కర్ణా! ప్రాయోపవేశం చేసి నా ప్రాణాలను త్యజించడం తధ్యం నా మాటకు తిరుగు లేదు " అన్నాడు.
కర్ణుడు సుయోధనుడిని ఓదార్చుట
[మార్చు]సుయోధనుడు పక్కనే ఉన్న దుశ్శాసనిని చూసి " దుశ్శాసనా! నీకు రాజ్యాభిషేకం చేస్తాను. శకుని , కర్ణుల సాయంత��� ఈ భూమండలం ఏలుకుంటూ నీ తమ్ములకు సంతోషం కలిగించు. బ్రాహ్మణును సన్మానించుతూ, గురువులను భక్తితో పూజిస్తూ ప్రజలను పాలించు " అన్నాడు. ఇది విన్న దుశ్శాసనుడు తల్లడిల్లి పోయి " అన్నా! భూమి బద్ధలైనా, సముద్రాలన్నీ ఇంకిపోయినా, సూర్యచంద్రులు తేజమును కోల్పోయినా నీవే సార్వభౌముడవు. నేను ఈ రాజ్యభారాన్ని భరించ లేను " అంటూ ఏడవసాగాడు. కర్ణుడు వారిరువురుని చూసి " సుయోధనా! మీరిరువురు శోకమును విడువండి. ఈ విధంగా శోకించిన శత్రువులు సంతోషిస్తారు. చంద్రవంశపు రాజువు ఇలా అల్పునిలా దుఃఖించ తగునా. ఎన్నో భోగములు అనుభవించ వలసిన ఈ శరీరమును ఇలా త్యజిస్తావా. నీవే ధైర్యం కోల్పోయిన మమ్ములను ఎవరు ఓదారుస్తారు. నువ్వు పాండవుల వలన విముక్తుడవైనావని దుఃఖిస్తున్నావు కాని అది సరి కాదు. ఏ రాజ్యంలో పౌరులు నిశ్చింతగా జీవిస్తున్నారో వారు ఆ రాజుకు సేవకులు. ఆ రాజు ఆపదలో ఉన్నప్పుడు పౌరులు తమ శౌర్యంతో అతనిని రక్షించాలి. పాండవులు నీ రాజ్యంలో నివసిస్తున్న నీ కింకరులు. ఆపదలో ఉన్న నిన్ను రక్షించుట వారి ధర్మం. పాండవులు జూదంలో సర్వమూ పోగొట్టుకుని నీకు దాసులైన వారు. ఈ మాత్రం చేయడంలో వారి గొప్ప ఏమున్నది " అన్నాడు.
శకుని సుయోధనుడికి హితవు చెప్పుట
[మార్చు]శకుని దుర్యోధనుని చూసి " సుయోధనా! కర్ణుని మాటలు విని నీ దుఃఖము విడువుము. నేను పాండవుల రాజ్యం నీకు కట్టబెట్టాను. నీ పరాక్రమంతో సాధించినవి కాదు. కనుక నీవు ప్రాయోపవేశం చేసిన నా మనసుకు బాధ కలుగుతుంది. చిన్నపటి నుండి సిరి సంపదలతో పెరిగావు. పెద్దలకు సేవ చేయలేదు కనుక నీకు లోకజ్ఞానం లేదు. రాజుకు పిరికితనం, ఏమరుపాటుతనం, మెతకతనం ఉండరాదు. మనసు వికలమైనప్పుడు, కోపం వచ్చినప్పుడు వాటిని అంతమొందించాలి. నీకు మేలు చేసిన పాండవులకు ప్రత్యుపకారం చెయ్యి. పరాక్రమవంతులు, ధర్మాత్ములు, సద్గుణసంపన్నులైన పాండవులను పిలిచి తగు సత్కారం చేసి వారి రాజ్యం వారికి ఇచ్చిన నీకు ఎనలేని కీర్తి కలుగుతుంది. నీ సోదరులైన పాండవులతో రాజ్యపాలన చేస్తూ అందరూ సంతోషంగా ఉండండి " అన్నాడు. దుర్యోధనుడు " మీరు నన్ను అడ్డగించ వద్దు. నాకు ఈ భోగభాగ్యాలపై ఆసక్తి లేదు. నాకు అడ్డు చెప్పక మీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళండి " అన్నాడు. వారు " నీవు తప్ప మాకు ఎవ్వరు ఉన్నారు . మేము నీతో సహగమనం చేస్తాం " అన్నారు. దుర్యోధనుడు శుచిగా స్నానమాచరించి దర్భాసనంపై కూర్చున్నాడు.
కృత్య దుర్యోధనుని పాతాళమునకు తీసుకువెళ్ళుట
[మార్చు]రాత్రి అయ్యింది. దుర్యోధనుడి నిర్ణయం పాతాళవాసులైన దానవులకు తెలిసింది. వారు దేవతలచే ఓడించబడి పాతాళంలో ఉన్నారు. ఈ నిర్ణయం తమకు నష్టమని భావించి వారు దుర్యోధనుడిని తమ వద్దకు రప్పించు కోవాలని మంత్ర విశారడులైన బృహస్పతి, శుక్రాచార్యులు చెప్పిన మంత్రాలను తగిన విధంగా జపిస్తూ నిశ్చల దీక్షతో యజ్ఞం చేయగా ఆ అగ్ని హోత్రం నుంచి కృత్య అనే భయంకరా కారిణి ఉద్భవించి "నేనేమి చేయాలి" అన్నది. అంత ఆ దైత్యులు సుయోధనుడిని పాతాళానికి తీసుకు రమ్మని పంపాడు. కృత్య సుయోధనుని పాతాళానికి తీసుకుని వచ్చింది. దానవులు అతనిని కౌగలించుకుని కుశల మడిగారు. వారు " సుయోధనా! శూరుడైవై భరతకులోద్భౌడవైన నీవు ఇలా ఆత్మహత్యకు సాహసించడం తగునా. ఆత్మ హత్య చేసుకున్న లోకనింద, దుర్గతి, హీనత తప్పదు. నీ వంటి బుద్ధిమంతులకు ఇది తగదు. నీ నిర్ణయం మార్చుకుని ధైర్యమును ప్రతాపమును చూపి శత్రువులను ఓడించు. నీ జన్మ వృత్తాంతం చెప్తాను వినుము. మేము పరమేశ్వరుని గురించి తపస్సు చేయగా పరమేశ్వరుడు నిన్ను మాకు ప్రసాదించాడు. నీ శరీరం పైభాగం వజ్రసమానం. ఏ విధమైన అస్త్రములు దానిని ఛేధించలేవు. నీవు కారణ జన్ముడవు నీకు సాయంగా అనేకమంది దానవులు క్షత్రియులుగా జన్మించారు. వారే భగదత్తుడు మొదలైన వారు. భీష్మ, ద్రోణ, కృపాచార్యులు దేవతాంశలతో జన్మించినా వారి భావనలో రాక్షసాంశ ఉండటం చేత యుద్ధంలో పుత్రులు, పౌత్రులు, మిత్రులు, వృద్ధులు, బాలురు, శిష్యులు అనే భేధం లేక పాండవ సైన్యాలను నాశనం చేస్తారు. అర్జునుడంటే భయపడుతున్నావు ఏమి భయం లేదు. కృష్ణునిచే సంహరింప బడిన నరకాసురుని ఆత్మను కర్ణునిలో ప్రవేశపెట్టాము. కనుక కర్ణుడు శ్రీకృష్ణునిపై అర్జునిని పై పగబట్టి చంపగలడు. దేవేంద్రుడు కుమారుడైన అర్జునిని రక్షించుటకు బ్రాహ్మణ వేషంలో కర్ణుని కవచకుండలాలను దానంగా గ్రహిస్తాడంటే అర్జునుడు కర్ణుని గెలవలేడనే కదా. లక్షల మంది రాక్షస వీరులు సంశక్తులు పేరున జన్మించారు. వారిచే అర్జునుడు ఓడింపబడతాడు. దైన్యం వీడి వెళ్ళు ఈ భూమండలాన్ని నీవు పాలించగలవు " అన్నారు. కృత్య దుర్యోధనుని తిరిగి స్వస్థానంలో వదిలింది. సూర్యోదయం కాగానే నిద్రలేచిన దుర్యోధనునికి రాత్రి జరిగినది కలో నిజమో అర్ధం కాకున్నా. పాండవులను జయించ గలనన్న ఆత్మ విశ్వాసం కలిగింది.
సుయోధనుడు ప్రాయోపవేశ నిర్ణయాన్ని విడచుట
[మార్చు]కర్ణుడు తిరిగి దుర్యోధనుని దగ్గరకు వచ్చి " సుయోధనా! చచ్చి సాధించేది ఏముంది. బ్రతికి ఉంటే శత్రువులను జయించి సమస్త సౌఖ్యములు పొందవచ్చు. అర్జునిని పట్ల నీకున్న భయం పోగొట్టుకో. అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగిసిన తరువాత నేను అర్జునిని సంహరిస్తానని ఈ ఆయుధంపై ఒట్టేసి చెప్తున్నాను" అన్నాడు. రాత్రి రాక్షస వీరుల పలుకులు ఇప్పుడు కర్ణుని ప్రతిజ్ఞ దుర్యోధనునిలో కొత్త ఆశలు నింపగా ప్రాయోపవేశ నిర్ణయాన్ని నిలిపి హస్థినకు చేరాడు. ఒక రోజు భీష్ముడు " సుయోధనా! పెద్దల మాటలు పెడచెవిన పెట్టి ఘోషయాత్రకు వెళ్ళి అవమానం పొందావు. చివరకు ధర్మరాజు వలన బయటపడ్డావు కాని లేకున్న గంధర్వుని చెరలో మగ్గేవాడివి కదా. అయినా నువ్వు సిగ్గు పడవు. నువ్వు నమ్మిన కర్ణుడు నిన్ను రక్షించ లేదు నిన్ను నీ తమ్ములను వదిలి పారిపోయాడు. అతని యుద్ధ నైపుణ్యం చూసావు కదా. పాండవులు పరాక్రమ వంతులు . వారి ముందు కర్ణుడు వీశమెత్తు కూడా చెయ్యడు. అతడు మాటల వీరుడు. నీమేలు కోరి చెప్తున్నాను కర్ణుని నమ్మి ��ంశనాశనం చేసుకొనక పాండవుల్తో సంధి చేసుకుని సుఖంగా ఉండు " అని హితవు పలికాడు. సుయోధనుడు భీష్ముని మాటలు లెక్క చేయక శకునితో కలసి నవ్వుకుంటూ వెళ్ళాడు. భీష్ముడు అవమానంతో సిగ్గుతో కుదించుకుని పోయి తన నివాసానికి వెళ్ళిపోయాడు. కర్ణుడు దుశ్శాసనుడు తో కలిసి శకునితో వున్న దుర్యోధనుడితో "భీష్ముడు ఎప్పుడూ మనలను నిందిస్తూ పాండవులను ప్రశంశిస్తూ వుంటాడు.అది నేను సహించ లేకుండావున్నాను. నేను సేనను తీసుకుని నలుగురు పాండవులు కలిసి గెలుచుకున్న భూమండల మంతా నేను ఒంటరిగా గెలుచుకుని నీకు సమర్పిస్తాను. అప్పుడు నా బలాన్ని చూసి భీష్ముడు తనను తాను అసహ్యించు కుంటాడు నాకు అనుమతి నివ్వు" అనగా దుర్యోధనుడు పరమానందపడి కర్ణుడి యాత్రకు కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు. కర్ణుడు సైన్యమును తీసుకుని మహా యుద్ధం చేసి పాంచాలరాజు ద్రుపదుడిని అతడి సామంతులను ఓడించి కప్పం కట్టించాడు. తర్వాత ఉత్తర దిక్కుగా ప్రయాణించి అనేక రాజులను, భగాదత్తుడిని ఓడించాడు. హిమాలయ పర్వత ప్రాంతీయులను ఓడించి కప్పం కట్టించాడు. తూర్పు దిక్కుగా వెళ్లి అంగ, వంగ, కాలింగ, శున్దిక, మిధిలా,మగధ దేశాధిషులను ఓడించాడు. తర్వాత దక్షిణ దిక్కుగా వెళ్లి మహారధులు ఎందరినో ఓడించాడు. కేరళ రాజులను, నీల రాజులను మారెందరినో ఓడించి కప్పం గైకొన్నాడు. శిశుపాల సుతుడిని, అవంతీ రాజులను ఓడించి వృష్టి వంశస్తులతో చెలిమి చేసుకుని పశ్చిమ దిశగా ప్రయాణించి అనేక రాజులను ఓడించి హస్తినాపురానికి చేరుకొన్నాడు. దుర్యోధనుడు అంతో ఆడంబరంగా కర్ణుడికి స్వాగతం పలికి పాండవులు, ఇతర రాజులూ నీముందు పదహారవ భాగానికి కూడా సరికారని ప్రశంశించాడు.
దుర్యోధనుని వైష్ణవయాగం
[మార్చు]ఒక రోజు దుర్యోధనుడు కర్ణునితో " కర్ణా! ధర్మరాజు రాజసూయయాగం చేసాడుకదా. అలాంటి యాగం నేను చేయాలని అనుకుంటున్నాను. తగు సన్నాహాలు కావించు " అన్నాడు. కర్ణుడు వెంటనే " అదెంతపని సుయోధనా ! ఈ భూమండలంలోని రాజులంతా నీ సామంతులు. అందరికి ఆహ్వానాలు పంపించు. బ్రాహ్మణులను సత్కరించు. యాగశాలలు నిర్మించు. అన్న సంతర్పణకు సంభారాలు సమకూర్చు. దేవేంద్రుడు మాదిరి యాగం చెయ్యి " అన్నాడు. సుయోధనుడు బ్రాహ్మణులను పిలిపించి రాజసూయయాగానికి తగిన సన్నాహాలు చేయమన్నాడు. వారు " సుయోధనా! పాండవులు నీ శత్రువులు. వారిని జయించి కాని నీవు రాజసూయ యాగం చేయలేవు. రాజసూయయాగం వంటిదే వైష్ణవయాగం. దానిని ఇది వరకు వాసుదేవుడు చేసాడు. అది నీకు తగిన యాగం " అని చెప్పారు. సుయోధనుడు అందుకు సమ్మతించి తల్లితండ్రులైన గాంధారిదృతరాష్ట్రుల వద్ద గురుదేవులైన ద్రోణ, కృపుల వద్ద, భీష్ముని వద్ద అనుమతి తీసుకున్నాడు. రాజులకు, బ్రాహ్మణోత్తములకు ఆహ్వానాలు పంపాడు. పాండవులకు ఆహ్వానం పంపాడు. దూత " ధర్మరాజా ! సుయోధన చక్రవర్తి చేసే వైష్ణవయాగానికి మిమ్మలిని పిలువడానికి నన్ను పంపాడు. కనుక మీరు తప్పక వేంచేయాలి " అని అర్ధించాడు. ధర్మరాజు " సుయోధనుడు యాగం చేయటం మాకు చాలా సంతోషం. దీని వలన మా వంశం పావనమౌతుంది. మేము చేసుకున్న ఒప్పందం కారణంగా మేము అరణ్యవాస సమయంలో నగరప్రవేశం చేయడం సమజసం కాదు. ఆ విషయం దయచేసి మీ రాజుకు చెప్పండి " అన్నాడు. పక్కనే ఉన్న భీముడు " అరణ్యాజ్ఞాత వాసములు గడచిన పిమ్మట మేమే పిలవ కుండానే వచ్చి మా ఆయుధాలతో అగ్ని గుండం వేల్చి అందులో నీ రాజు దుర్యోధనుని అతని నూరుగురు తమ్ములను యజ్ఞ పశువులుగా అర్పించగలము " అని చెప్పు అన్నాడు. దూత అవే మాటలను సుయోధనునికి చెప్పాడు. ధృతరాష్ట్రుడు యాగనిర్వహణకు, అతిథి సత్కారానికి విదురుని నియోగించాడు. యాగం నిర్విజ్ఞంగా సమాప్తి అయింది. యాగానికి వచ్చిన కొందరు సుయోధనుని పొగిడారు. కొందరు ధర్మరాజు చేసిన రాజసూయ యాగంతో అది సరి పోలదని అన్నారు. సోదరు లందరూ చుట్టూ నిలువగా ప్రముఖ ఆసనం పై కూర్చున్న దుర్యోధనుడితో కర్ణుడు " సుయోధనా! వైష్ణవ యాగం నిర్విఘ్నంగా జరిపించావు. ఇదే విధంగా పాండవులను చంపి రాజసూయ యాగం కూడా నెరవేర్చగలవు. నేను అర్జునుని చంపే వరకు నేను ఎవరితోనూ కాళ్ళు కడిగించుకోను. నీట బుట్టిన వేవీ తినను. ఎవరయినా యాచిస్తే లేదు అనను" అని భీషణ ప్రతిజ్ఞ చేసాడు. అందుకు సుయోధనుడు ఆనందించి " నీ సాయం ఉంటే పాండవులను జయించడం నాకు కష్టం కాదు " అన్నాడు.
వేదవ్యాసుడు పాండవుల వద్దకు వచ్చుట
[మార్చు]కర్ణుడు చేసిన శపథం విని ద్వైతవనంలో ఉన్న ధర్మరాజు భయపడ్డాడు. ఒక రోజు ధర్మరాజు నిద్రిస్తుండగా అతని స్వప్నంలో ఒక అడవి జంతువు కనపడి " ధర్మరాజా! ప్రతి రోజు మీరు మమ్మల్ని చంపితింటున్నారు. మా జాతులు నామ మాత్రం అవుతున్నాయి. మా వంశాలు నాశనం కాక ముందే మీరు ఇక్కడి నుండి వెళ్ళి పొండి " అని అభ్యర్థించాయి. మరునాడు ధర్మరాజు తన తమ్ములు, ద్రౌపది, పురోహితులతో కలసి ద్వైత వనాన్ని విడిచి కామ్యక వనం వెళ్ళాడు. అక్కడ వాళ్ళు పండ్లు కాయగూరలు మాత్రం తింటూ జీవ హింస చేయకుండా గడిపారు. ఇలా అరణ్యవాసంలో పదకొండు సంవత్సరాలు అడిచాయి. తను చేసిన అపరాధం వల్లనే సోదరులు ద్రౌపది కష్ట పడవలసి వచ్చినదని, జూద సమయంలో కర్ణుడి, దుర్యోధనుడి మాటలను స్మరిస్తూ యుధిష్టిరుడు బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు వేదవ్యాసుడు ధర్మరాజు వద్దకు వచ్చారు. అతనిని తగురీతిని సత్కరించాడు. అడవులలో కందమూలాలను భుజిస్తూ కృశించి పోయిన మనుమలను చూసి దుఃఖించి" వివేక వంతుడు సుఖం వస్తే అనుభవించాలి. దుఃఖం వస్తే సహించాలి. కాలానుగుణంగా ప్రాప్తించే దానిని స్వీకరించాలి. తపస్సును చేయనివాడు ఈ లోకంలో మహాసుఖాలను పొందలేడు. తపస్సు చేత గొప్ప ఫలాలను పొందవచ్చు. దేవతలకు అతిధులకు దానం చేసినవాడు సుఖవంతుడౌతాడు అన్నాడు.అంత ధర్మరాజు " మహాత్మా! తపస్సు దానం గొప్పవి అంటారు కదా! ఆ రెండింటిలో ఏది గొప్పది? " అని అడిగాడు. అందుకు వేద వ్యాసుడు " ధర్మజా ! దానం అంటే తనకు ఉన్న దానిని పరులకు ఇవ్వటం. మానవులు ఎన్ని కష్టాలు పడినా ధనం కోసమే. కనుక ధనం మానవులకు ప్రాణం కంటే మక్కువ ఎక్కువ. కష్టపడి సంపాదించిన ధనం పరులకు ఇవ్వడం గొప్పది. సాధారణంగా బుద్ధి హీనులు తాము అక్రమంగా సంపాదించిన ధనం దానం చేస్తుంటారు. అందువలన పుణ్యం ఏమీ రాదు. న్యాయంగా సంపాదించినది మాత్రమే కొంచం దానం చేసినా పుణ్యం వస్తుంది. అలాంటి ధనం సకాలంలో సరి అయిన ప్రదేశంలో యోగ్యుడైన వాడికి దానం చేయాలి. అపాత్ర దానం చేయకూడదు. ఉదాహరణగా నీకు వ్రీహి ద్రోణో పాఖ్యానం చెప్తాను విను.
ముద్గలుని వృత్తాంతం
[మార్చు]ధర్మజా! పూర్వం కురుక్షేత్రంలో ముద్గలుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పొలములో రాలిన ధాన్యం ఏరుకుని జీవించేవాడు. కటిక దరిద్రుడు. సత్యవ్రతుడు నిష్టాగరిష్టుడు. ఉన్నంతలో అతిథులను సత్కరించే వాడు. ఒక రోజు అతని ఇంటికి దుర్వాసుడు అనే ముని వచ్చాడు. అతడు చూడటానికి పిచ్చి వాని వలె ఉన్నాడు. ముద్గలుడు దుర్వాసునికి తగిన సత్కారం చేసి భోజనం పెట్టాడు. అలా ప్రతి అమావాస్య పౌర్ణమికి ముద్గలుని ఇంటికి దుర్వాసుడు వస్తూనే ఉన్నాడు. ముద్గలుడు అతను నిరాహారుడై అతనికి భోజనం పెట్టే వాడు. ఆ విధంగా ఆరు పర్వదినాలు వరసగా ప్రీతిగా భోజనం పెట్టిన ముద్గలుని చూసి దుర్వాసుడు ఆశ్చర్య పోయాడు. దుర్వాసుడు " ముద్గల మహర్షీ! నీ వంటి దాన శీలిని నేను ఇంతవరకు చూడలేదు. నీవు సద్గుణ సంపన్నుడవు, పుణ్యమూర్తివి. ఏమాత్రం ఏవగించు కోకుండా కోపం లేకుండా, అవమానించక నాకు అతిథి పూజ చేసావు. నీ అన్నదానం, సత్యం, ధైర్యం, పరుల సొత్తును ఆశించక పోవడమే నీ సంపద. మనసును ఇంద్రియములను అదుపులో ఉంచేదే తపస్సు. అటువంటి తపస్సు నీవు చేసావు. అతిథి సత్కారానికి నేను తృప్తి చెందాను. నీకు సశరీరంగా స్వర్గలోక ప్రాప్తి జరుగు తుంది " అని చెప్పి వెళ్ళి పోయాడు.
దేవదూతను తిరిగి పంపుట
[మార్చు]ఒక దేవదూత విమానం తీసుకు వచ్చి ముద్గలునితో " మహామునీ! నీవు చేసినా పుణ్యం వలన నీకు స్వర్గలో లోక ప్రాప్తి కలిగింది. విమానం ఎక్కుము " అని చెప్పారు. ముద్గలుడు ఆ దేవదూతను చూసి " అయ్యా! దేవలోకం ఎలా ఉంటుంది " అని అడిగాడు " తపస్సు చేసి సిద్ధి పొందిన మహా మునులు, యజ్ఞాలు చేసిన వాళ్ళు, సత్యసంధులు, ఇంద్రియములు జయించిన వారు, దానం చేసిన వారు. యుద్ధంలో మరణించిన వారు దేవలోకంలో నివసిస్తారు. ఇంకా అప్సరసలు, సిద్ధులు, సాధ్యులు, దేవమునులు, మరుత్తులు నివసిస్తంటారు " మేరు పర్వత శిఖరం అక్కడే ఉంది. నందనోద్యానం ఉంది. అక్కడ ఆకలి దప్పులు ఉండవు. వ్యాధులు, ముసలితనం ఉండదు. అక్కడ అందరికి తేజోమయ దేహాలు ఉంటాయి. స్వర్గంలో ఉన్నంత కాలం దుఃఖం ఉండదు, నిరంతర సౌఖ్యం, ఆనందం ఉంటాయి. స్వర్గలోకం పైన బ్రహ్మలోకం ఉంటుంది. అక్కడ మనువులు, మహర్షులు మాత్రం ఉంటారు. అక్కడ పునర్జన్మ ఉండదు. ప్రళయకాలంలో అన్ని లోకాలు నాశనం అవుతాయి. బ్రహ్మలోకం మాత్రం నిలిచి ఉంటుంది. మనుష్యుడు భూలోకంలో చేసిన పుణ్యాలకు ఫలితం స్వర్గలోకంలో అనుభవిస్తారు. అక్కడ ఎలాంటి పుణ్యం చేసుకోవడానికి వీలు లేదు. చేసిన పుణ్యఫలం అనుభవించిన తరువాత మరల భూలోకానికి వస్తారు. వచ్చిన మానవుడు వాటిని విడువలేక వేదనకు గురి ఔతాడు. స్వర్గలోకంలో ఉన్నవారు కూడా తమకంటే ఉన్నత స్థిలో ఉన్న వారిని చూసి మనసులో బాధ పడతారు. బ్రహ్మలోకం శాశ్వతం. స్వర్గలోకం అనుభవానికి మాత్రమే. భూలోకం కర్మభూమి. భూలోకంలో చేసిన సత్కర్మల ఫలం స్వర్గలోకంలో అనుభవిస్తారు " అని చెప్పి స్వర్గ లోకానికి రమ్మని ముద్గలుని పిలిచాడు. ముద్గలుడు " అయ్యా! నాకు అశాశ్వతములైన స్వర్గసుఖములు అవసరం లేదు. ఏ లోకానికి పోతే తిరిగి జన్మలేదో ఆ లోకానికి పోవడానికి ప్రయత్నిస్తాను " అన్నాడు. దేవదూత వెళ్ళి పోయాడు. ఆ తరువాత ముద్గలుడు ద్వందముల యందు ఆసక్తి వదిలి, అంతటా సమభావంతో చూసి జ్ఞానయోగి అయ్యాడు. జీవన్ముక్తుడు అయ్యాడు. కనుక ధర్మరాజా ! నీవు రాజ్యం పోయినందుకు చింతించ వలదు " అని హితబోధ చేసాడు. తరువాత తన ఆశ్రమానికి వెళ్ళాడు.
సైంధవుడు ద్రౌపదిని చూచుట
[మార్చు]కొంత కాలం గడిచింది ఒక రోజు పాండవులు అడవికి వేటకు వెళ్ళారు. ద్రౌపది కుటీరంలో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో సింధు దేశాన్ని పాలించే సైంధవుడు తన చతురంగ బలాలతో పెక్కుమంది ఇతర మిత్ర రాజులతో కలిసి సాళ్వరాజ పుత్రిని వివాహం చేసుకోవడానికి పయనిస్తూ మార్గ మధ్యంలో కామ్యకవనం చేరుకున్నాడు. కుటీరం ముందు నిలిచి ఉన్న ద్రౌపదిని చూసి మోహ పరవశుడైయ్యాడు. తన మిత్రుడైన కోటికాస్యుని పిలిచి " ఈ సుందరాంగి ఎవరు? ఆమెపట్ల నా మనసు లగ్నం అయింది. ఆమెతో మాట్లాడి ఎలాగైనా నన్ను చేరేలా చెయ్యాలి " అన్నాడు. కోటికాస్యుడు ద్రౌపది వద్దకు వెళ్ళి " లలనా! నీవెవరు, వన్యమృగాలు తిరిగే ఈ అడవిలో ఎందుకు ఉన్నావు. వనదేవతవా? శచీదేవివా? లక్ష్మీ దేవివా? నీ భర్త ఎవరు? నీ పేరేమి? నా పేరు కోటికాస్యుడు. మహా బలవంతుడను. అడుగో అక్కడౌన్న వాడు త్రిగర్త దేశాధి పతి, ఆ పక్కన కళింగ దేశాధిపతి, ఆ పక్కన ఉన్నది సింధు దేశాధీశుడు జయద్రధుడు. అతనికి నీ మీద మనసు కలిగింది. అందుకే నన్ను పంపాడు " అన్నాడు. ఆ మాటలు విన్న ద్రౌపది " అన్నా నేను ఒంటరి దానను, పుత్రవతిని నీవు నా దగ్గరకు రావడం తగదు. నన్ను సామాన్య స్త్రీగా ఎంచ వద్దు. నేను పాంచాలరాజ పుత్రిని, నా పేరు కృష్ణ, పాండవుల ధర్మ పత్నిని వారితో వనవాసం చేస్తున్నాను. కొంత సేపట్లో నా భర్తలు వస్తారు. ఈ సమీపంలో కొంత సమయం ఉండండి. వారు రాగానే అతిథి సత్కారం చేస్తాను " అన్నది. కోటికాస్యుడు జరిగినది జయద్రధునికి చెప్పాడు. ఎలాగైనా ద్రౌపదిని అపహరించాలన్న ఉద్దేశంతో జయద్రధుడు కుటీరంలో ప్రవేశించాడు.
సైంధవుడు ద్రౌపదిని తీసుకుని పోవుట
[మార్చు]ద్రౌపదితో " ద్రౌపదీ! నీవూ పాండవులు క్షేమమేనా? " అన్నాడు. ద్రౌపది " అయ్యా! అందరూ క్షేమమే నీవు మా అతిథివి. నా భర్తలు వేటకు వెళ్ళారు. వారు రాగానే మీకు అతిథి సత్కారాలు చేస్తారు " అన్నాడు. సైంధవుడు " ద్రౌపదీ! నీ మీద నాకు మనసైంది. రాజ్యమును కోల్పోయిన పాండవులతో నీవు పొందే సుఖం ఏమి? నాతో వచ్చిన సౌఖ్యములు అనుభవించగలవు " అన్నాడు. ఆ మాటలకు ద్రౌపది భయపడింది. పాండవులు వచ్చే వరకు నిరీక్షించాలని అనుకుంది. అంతవరకు అతనిని ఎలాగైనా మాటలలో పెట్టాలని అనుకుంది. " అయ్యా! నీవు నాభర్తల సోదరి దుస్సల భర్తవు. ఆమె నా భర్తల సోదరి కనుక నీవు నాకు సోదరుడివి. నువ్వు ఇలా మాట్లాడటం తగదు. జయద్రధుడు " ద్రౌపదీ ! రాజులకు ఆడువారి విషయంలో వావి వరసలు లేవు. అది రాజధర్మం. రాజులు తమకు ఇష్టం వచ్చినట్లు వినోదించవచ్చు. స్త్రీలు ఏ ఒక్కరి సొత్తు కాదు. ఏవరినైనా కోరిన పొందవచ్చు" అన్నాడు. ద్రౌపది ఇక వీడు మంచి మాటలతో వినడు అనుకుంది. " ఓరి ! క్షత్రియ కులములో పుట్టిన అధముడా ! పాండవుల పరాక్రమం తెలిసి నన్ను అవమానిస్తున్నావు. ఫలితం అనుభవిస్తావు. జయద్రధా భీముని సంగతి తెలుసు కదా గుహలో నిద్రిస్తున్న సింహాన్ని జూలుపట్టుకు లాగుతున్నావు. అర్జునిని గురించి అతని గాండీవం గురించి తెలియునా? అతనికి ఆగ్రహం తెప్పించిన వాడు బ్రతకడం అసాధ్యం. నకులసహదేవులను అవమానించడం త్రాచుపాములను తొక్కడం వంటిది. ఎలాగైనా నేటితో నీకు చావు మూడింది కనుకనే ఇలా మాట్లాడుతున్నావు. జాగ్రత్త " అని హెచ్చరించింది. ఆ మాటలకు జయద్రధుడు నవ్వి " పాండవుల పరాక్రమం నాకు తెలియును. నన్ను భయపెట్టకు. మేము పరాక్రమవంతులమే. ఇక మారు పలుకక ఆ బంగారురథంలో ఎక్కుము " అన్నాడు. " జయద్రధా! నేను మహా వీరుల ధర్మపత్నిని. శ్రీకృష్ణుడు నా అన్న. నేను పతివ్రతను. నా పాతివ్రత్యం నిన్ను దహించ గలదు. అర్జునుని గాండీవం, భీమసేనుని గధాపాతానికి నీ మదం అణుగుతుంది " అన్నది. కాని సైంధవుడు వినక ఆమె చీరపట్టుకుని లాగాడు. ఆమె అతడిని బలంగా నెట్టింది సైంధవుడు కింద పడ్డాడు. ద్రౌపది గట్టిగా అరుస్తూ ధౌమ్యుడిని పిలిచింది. సైంధవుడిలో పట్టుదల పెరిగి ద్రౌపదిని బంధించి రథం పైకి ఎక్కించి తీసుకుపోసాగాడు. అది చూసిన ధౌమ్యుడు " అయ్యా! రాజులకు ఇలా దుష్కర్మలు చేయడం తగునా! ఆమెను వదిలి పెట్టుము. నీ పాపం నిన్ను నాశనం చేస్తుంది " అంటూ రథం వెంట పరుగెత్తాడు. పాండవులు ఇంటికి రాగానే వారికి దుశ్శకునాలు గోచరించాయి. ద్రౌపది పరిచారిక వారికి జరిగినది వివరించింది. పాండవులకు కోపం వచ్చింది వెంటనే సైంధవుడు వెళుతున్న దిక్కుకు పరుగెత్తారు. రథం వెనుక పరుగెడుతున్న ధౌమ్యుని వెనుకకు పంపి పాండవులు సైంధవుని వెంబడించారు. తన రథం వెనుక వస్తున్న పాండవులను చూసిన సైంధవుడు " ద్రౌపదీ! వారిలో నీ భర్తలు ఎవరు చెప్పవా? " అని చమత్కరించాడు. ద్రౌపది " నీవు! పాండవులను గురించి తెలుసుకున్నా ప్రయోజనం లేదు. ఇక నీకు శిక్ష తప్పదు. అయినా అడిగావు కనుక చెప్తాను. చచ్చే ముందు వారి గురించి తెలుసుకో " అని పాండవుల గురించి వివరంగా చెప్పింది.
సైంధవుడి పరాభవం
[మార్చు]జయద్రధుడు తన సైన్యాలను యుద్ధసన్నద్ధం చేసాడు. భీముడు గదా తీసుకుని సింధురాజు వైపు పోతుండగా కోటికాస్యుడు భీముని ఎదుర్కొన్నాడు. అర్జునుడు సేన అగ్ర భాగాన నిలిచిన ఐదు వందల మందిని చంపేశాడు. సౌరాష్ట్ర రాజు గద తో ధర్మరాజు యొక్క నలుగు అశ్వాలను చంపగా క్రుద్దుడైన ధర్మరాజు అర్ధచంద్ర బాణంతో రొమ్ముపై కొట్టగా అతడు గుండెలు బ్రద్దలై కూలిపోయాడు. యుధిష్టరుడు సహదేవుడి రధం ఎక్కాడు. త్రిగర్త రాజు సురధుడు తన ఏనుగు చేత నకులుడు రధమును త్రుక్కు చేయగా నకులుడు రధంనుండి దూకి కత్తి డాలు తీసుకుని ఆ ఏనుగు యొక్క తొండాన్ని దంతాలతో సహా నరకగా ఆ ఏనుగు పెద్దగా ఘీంకరిస్తూ భూమి మీదకు ఒరిగిపోతూ తన మీదవున్న వున్న సురధనుడిని క్రింద పడవేయగా నకులుడు అతడిని సంహరించాడు. భీముడు కోటికాస్యుడిని చంపివేశాడు. క్హేమంకరుడు, మహాముఖుడనే రాజులు నకులుడిమీదకు రాగ నకులుడు వారిరువురిని సంహరించాడు. అర్జునుడు పన్నెండు మంది సౌవీర రాజులను, అడ్డువచ్చిన త్రిగర్తులను, సైన్ధవులను,శిబి ఇక్ష్వాకు ప్రముఖుల నందరిని చంపివేశాడు. ఆ ప్రదేశ మంతా తలలు లేని మొండెములు, శరీరాలు లేని తలలతో చెల్లా చెదురుగా పడిపోయాయి. పాండవుల ధాటికి సైంధవ సేనలు ఆగలేక పోయాయి. అర్జునుడు సృంజయుడు, స్తుకుడు, శత్రుంజయుడు, సుప్రబుద్ధుడు, శుభంకరుడు, భ్రమంకరుడు, శూరుడు, రథి, గుహకుడు, బలాడ్యుడు అనే పేరుగల సౌవీర వీరులను చంపాడు. అలా వీరులంతా చనిపోగా సైందవుడు సంకుల సైన్య మధ్యలో ద్రౌపదిని తన రథం నుండి దింపి రథం తోలుకుంటూ పారి పోయాడు. భీముడు తన పేరు చెప్పి మరీ మిగిలిన వారిని చంపుతున్నాడు. అది చూసిన అర్జునుడు సైంధవుడు పారి పోతున్నాడు ఇక అమాయకు లైన వీరిని వధించడం వలన లాభ మేమున్నది, అప మన్నాడు. అందరూ ద్రౌపది దగ్గరకు వెళ్ళారు. అర్జునుడు ధర్మరాజుతో " అన్నా! నువ్వూ, ద్రౌపది, నకుల సహదేవులు, ధౌమ్యుని తీసుకుని కుటీరానికి వెళ్ళండి. నేను భీమసేనుడు సైంధవుని వెంబడిస్తాము " అన్నాడు. యుధిష్టరుడు "సైంధవుడు దురాత్ముడైనప్పటికి గాంధారిని, దుస్సాలను తలచుకుని చంపకూడదు" అనగా ద్రౌపది " భార్యను అపహరించిన, రాజ్యమును అపహరిచిన శత్రువును ప్రాణదానం చేయమని ప్రాధేయపడినా వదిలిపెట్ట కూడదు. కాబట్టి సైంధవుడు దుర్మార్గుడు వాడి పట్ల దయ చూపవద్దు వధించండి " అన్నది. ధర్మరాజు తమ్ములతో ద్రౌపదితో ఆశ్రమానికి తిరిగి వెళ్ళగా అక్కడి ఆసనములు ఇతర వస్తువు లన్ని చిందర వందరగా పడి వున్నాయి. అప్పటికే అక్కడికి మార్కండేయాది విప్రులు వచ్చి వున్నారు. భీమార్జునులు సైంధవుడిని వెంబడించారు. అర్జునుడు క్రోసేడు దూరంలో వున్న సైంధవుడి రధమును చూసి బాణములతో అతని గుర్రాలను చంపాడు. జయద్రధుడు రథం దిగి పారిపోసాగాడు. భీముడు అర్జునుడు వాడిని వెంబడించి పట్టుకున్నారు. భీముడు వాడిని చితక కొట్టి మెడమీద కాలు వేసి పట్టుకున్నాడు. వాడు స్పృహ తప్పాడు. అర్జునుడు " ఇక చాలు ఇంకా కొడితే వీడు చస్తాడు. అన్నగారి మాట మన్నించి వీడిని విడిచి పెట్టు " అన్నాడు. భీముడు " అయ్యో! వీడిని వదిలితే ఎన్ని అనర్ధాలు జరుగుతాయో. అన్న ధర్మజుడు ఎప్పుడూ దయాళువే. నీవు గూడా ఎప్పుడూ నన్ను బాధపెడుతూ వుంటావు/ వీడికి తగిన శాస్తి చేస్తాను " అని పదునైన కత్తి తీసుకుని తల అయిదు శిఖలుగా గొరిగి " జయద్రధా! నీవు పోయిన చోటంతా నేను పాండవుల దాసుడను అని చెప్పు. లేకుంటే చస్తావు " అన్నాడు.జయద్రధుడు "సరే అలాగే" నన్నాడు. తరువాత వాడిని రథానికి కట్టి ధర్మరాజు వద్దకు తీసుకు వచ్చాడు. భీముడు జయద్రధుని ధర్మరాజు పాదాలపై పడవేసి " అన్నయ్యా! వీడు పాండవదాసుడు జయ ద్రధుడు " అన్నాడు. ద్రౌపది వాడిని హేళనగా చూసింది. ధర్మరాజు " జయద్రధా ! ఇక మీదట ఇలాంటి చెడ్డ పనులు చేయకు. నీ బుద్ధి ధర్మమందు ఉంచు. అధర్మము మీద మానసు పెట్టక బుద్ధిగా ఉండు " అని వదిలి పెట్టాడు. అవమాన భారంతో జయద్రధుడు గంగా తీరానికి వెళ్ళి శివుని గురించి ఘోరంగా తపస్సు చేసాడు. శివుడు ప్రత్యక్షం కాగా జయద్రధుడు " దేవా! యుద్ధంలో నేను పాండవులను జయించేలా వరం ప్రసాదించు " అని కోరాడు. శివుడు " జయద్రధా! అది అసాధ్యం. పాండవులను జయించడం ఎవరికి సాధ్యం కాదు. నీవు అడిగావు కముక ఒక్క రోజు మాత్రం అర్జునుడు తప్ప మిగిలిన వారిని జయించే వరం ఇస్తున్నాను. ఇందులో అంతరం గ్రహించి మసలుకో " అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. తరువాత జయద్రధుడు సింధు దేశానికి వెళ్ళాడు.
మార్కండేయౌని రాక
[మార్చు]ఒకరోజు మార్కండేయుడు ధర్మరాజు వద్దకు వచ్చాడు. ధర్మరాజు అతిథి మర్యాదలు చేసాడు. ధర్మరాజు " మహర్షీ! మేము, ద్రౌపది మేము అడవిలో ఇన్ని కష్టాలు పడుతున్నాము. మా వలె కష్టాలు పడుతున్న వారెవరైనా ఉన్నారా? " అందుకు మార్కండేయుడు "ధర్మజా! పూర్వము ఇక్ష్వాకు వంశంలో అజుడు అనే రాజు ఉండే వాడు. అతని కుమారుడు దశరధుడు. అతనికి ముగ్గురు భార్యలు. వారిలో కౌసల్య అనే భార్యకు రాముడు, కైకేయి అను భార్యకు భరతుడు, సుమిత్ర అను భార్యకు లక్ష్మణుడు, శత్రుజ్ఞుడు అనే కుమారులు కలిగారు. బ్రహ్మకు మానస పుత్రుడైన పులస్త్యునకు వైశ్రవణుడు అనే కుమారుడు జన్మించాడు.
సంక్షిప్త రామాయణం
[మార్చు]ఇక్ష్వాకు వంశంలో అజుడు అనే రాజు ఉండే వాడు. అతని కుమారుడు దశరధుడు. అతనికి ముగ్గురు భార్యలు. వారిలో కొసల్య అనే భార్యకు రాముడు, కైకేయి అను భార్యకు భరతుడు, సుమిత్ర అను భార్యకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనే కుమారులు కలిగారు. బ్రహ్మకు మానస పుత్రుడైన పులస్త్యునకు వైశ్రవణుడు అనే కుమారుడు జన్మించాడు. వైశ్రవణుడు తన తండ్రి మాట వినకుండా బ్రహ్మను గురించి తపస్సు చేసాడు. ప్రత్యక్షమైన బ్రహ్మ వద్ద నలకుబేరుడు అనే కుమారుని శివునితో సాన్నిహిత్యాన్ని ధనాధిపత్యాన్ని కోరుకున్నాడు.
రావణ కుంభకర్ణాదుల పుట్టుక
[మార్చు]పులస్త్యుడు తన శరీరం నుండి విశ్రవసువును సృష్టించి వైశ్రవణునికి హాని చెయ్యమని పంపాడు. ఇది తెలిసిన వైశ్రవణుడు విశ్వవసువు వద్దకు వెళ్ళి " అయ్యా! నేను నీ పుత్ర సమానుడను దయ చూపుము " అని చెప్పి విశ్వవసువుకు నృత్యగాన విశారదలైన పుష్పోత్కట, మాలిని, బక అనే రాక్షస వనితలను సృష్టించి ఇచ్చాడు. వారు విశ్వవసువుకు సేవలు చేస్తున్నారు. విశ్రవసువు వారికి సంతానాన్ని ప్రసాదించాడు. పుష్పోత్కటకు రావణుడు, కుంభకర్ణుడు మాలినికి విభీషణుడు బకకు ఖరుడు, శూర్పణఖ అనే కవలలు జన్మించారు. వారిలో రావణుడు పది తలలు కల వాడు, కోపిష్టి. కుంభకర్ణుడు కఠిన హృదయుడు, గర్విష్టి. విభీషణుడు మంచి గుణములు కలవాడు. ఖరుడు దుర్మార్గుడు. బ్రాహ్మణులను అవమానించే వాడు. రక్త, మాంసాలను ఆహారంగా తీసుకునే వాడు. శూర్పణఖ కూడా అధర్మపరురాలు, పాపాత్మురాలు. ఆ రాక్షస వీరులు తండ్రి విశ్వవసువు దగ్గర వేద వేదాంగాలు విలువిద్య అభ్యసించారు.
రావణ సోదరుల తపస్సు
[మార్చు]ఒకరోజు వైశ్రవణుడు వారిని చూడటానికి వచ్చాడు. రావణాదులు అతని వైభవాన్ని చూసారు. అది అంతా అతని తపస్సు వలన సమకూరినది అని తెలుసు కున్నారు. వారంతా తపస్సు చేయడానికి బయలుదేరి బ్రహ్మను గురించి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసారు. వారికి శూర్పణఖ, ఖరుడు సేవలు చేస్తున్నారు. కాని బ్రహ్మ దేవుడు ప్రత్యక్షం కాలేదు. రావణుడు వెయ్యి సంవత్సరాలకు ఒక తల చొప్పున తొమ్మిది తలలు అగ్నిలో వేల్చి హోమం చేసాడు. పదివేల సంవత్సరాలు పూర్తి కాగానే పదవ తల అగ్నిలో వేయడానికి సంసిద్ధం అయిన తరువాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. రావణునికి ఖండించిన తొమ్మిది తలలను ఇచ్చి ఏమి వరం కావాలో కోరుకొమ్మన్నాడు.రావణుడు " దేవా! నేను దేవతల చేతగాని, పితరుల చేతగాని, రాక్షసుల చేతగాని, పాముల చేత గాని, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, విద్యాధరుల చేతగాని ఓడి పోకూడదు. విశ్వంలో ఎక్కడికైనా ఇచ్ఛానుసారం సంచరించే వరం ప్రసాదించు అని అడిగాడు. బ్రహ్మ దేవుడు " రావణా! మానవులు వలన తప్ప ఇంకెవరి వలన నీకు మరణ భయం లేదు " అని వరం ఇచ్చాడు. బ్రహ్మదేవుడు కుంభకర్ణుని చూసి " నీ కేమి వరం కావాలో కోరుకో " అన్నాడు. విధి వశాత్తు కుంభకర్ణుడు తనకు అత్యంత ప్రియమైన నిద్రను ప్రసాదించమని అడిగాడు. అలాగే నని వరమిచ్చాడు. తరువాత విభీషణుని చూసి నీకేమి వరం కావాలో కోరుకో అని అడిగాడు. విభీషణుడు " దేవా! ఎన్ని కష్టాలు వచ్చినా నాలో పాప చింతన పొడ చూపకుండా అనుగ్రహించు " అని ప్రార్థించాడు. అందుకు బ్రహ్మ " విభీషణా! నీవు రాక్షస వంశంలో జన్మించినా ధర్మబుద్ధిని కలిగ ఉన్నావు. నీకు అమరత్వం ప్రసాదిస్తున్నాను. నీవు కోరిన వరాన్ని ప్రసాదిస్తున్నాను " అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. బ్రహ్మదేవుడిచ్చిన వరగర్వంతో రావణుడు కుబేరునికి స్వంతమైన లంకపై దండెత్తాడు. రావణుని శక్తి తెలుసుకున్న కుబేరుడు పుష్పక విమానం ఎక్కి లంకను వదిలి పారి ప���యాడు. రావణుడు కుబేరుని వెంబడించి అతని విమానం అపహరించాడు. అందుకు యక్ష రాజైన కుబేరుడు కోపించి " పెద్ద వాడినైన నన్ను అవమానించి నా విమానాన్ని అపహరించావు. ఇది పరుల పాలు ఔతుంది " అని శపించాడు. తరువాత రావణుడు దేవలోకం మీద దండెత్తి ఇంద్రుడిని దేవతలను జయించాడు.
దేవతలు బ్రహ్మదేవుని వద్ద మొరపెట్టుకొనుట
[మార్చు]అప్పుడు ఋషులు, దేవతలు అందరూ కలసి అగ్ని దేవుని వెంట పెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. " విశ్రవసుని కుమారుడు రావణుడు దేవతలను జయించి వారిని తన దాసులుగా చేసుకున్నాడు. లోకాలు భయంతో వణికి పోతున్నాయి. మీరే మమ్ము రక్షించాలి " అని వేడుకున్నారు. బ్రహ్మదేవుడు " అయ్యలారా! ఈ విషయంలో నేను నారాయణుడితో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. శ్రీ మహా విష్ణువు మానవుడిగా జన్మించి అతనిని హత మారుస్తాడు. ఇంద్రుడు మొదలైన వారు కోతులుగా ఎలుగు బంట్లుగా జన్మించి నారాయణునికి తోడ్పడుతారు " అని చెప్పి దుందుభి అనే యక్ష కాంతను పిలిచి మంధర అనే పరిచారికగా జన్మించి దేవకార్యం నెరవేర్చమని చెప్పాడు. బ్రహ్మదేవుని మాటను శిరసా వహించి దేవతలు కొండల వంటి వజ్రశరీరంతో అత్యంత పరాక్రమమైన కోతులుగా జన్మించారు.
అయోధ్య
[మార్చు]ఇలా ఉండగా అయోధ్యలో నారాయణుడు ఆదిశేషునితో సహా అన్నదమ్ములుగా దశరధ మహారాజుకు జన్మించాడు. వారు పెరిగి పెద్దవారై వేద వేదాంగాలు చదువు కున్నారు. విలు విద్యలో నిష్ణాతులైయ్యారు. దశరధుడు వారికి వివాహాలు జరిపించాడు. శ్రీరాముని యౌవరాజ్య పట్టాభిషిక్తుని చేయాలని నిశ్చయించాడు. మంత్రులను పౌరులను సంప్రదించి ముహూర్తం నిశ్చయించాడు. ఆ సమయంలో మంధర కైకేయి వద్దకు పోయి " అమ్మా! నీ భర్త నీ పై ప్రేమ చూపించి నట్లు చూపించి నిన్ను మోసం చేసాడు. అతనికి కౌశల్య మీదనే ప్రేమ అందుకే ఆమె కుమారుడైన రామునికి పట్టాభిషేకం చేస్తున్నాడు. ఇక నీవు నీ కుమారుడు వారికి దాస్యం చేస్తూ బ్రతకండి " అన్నది. ఆమె మాటల ప్రభావానికి లొంగి పోయిన కైక దశరధునితో " ఇది వరలో మీరు నాకు మూడు వరాలు ఇస్తానని మాటిచ్చారు కదా. అవి ఇప్పుడు ఇవ్వండి " అని కోరింది. అందుకు అంగీకరించిన దశరధునితో " నా కుమారుడైన భరతునికి పట్టాభిషేకం చేసి శ్రీరాముని పదునాలుగేండ్లు అరణ్యాలకు పంపమని కోరిది " ఆ మాటలు విని దశరధుడు దినమైనా రాముని వదలలేనని చెప్పి స్పృహతప్పి పడిపోయాడు. కైకేయి వరాలు తండ్రి ఆవేదన గ్రహించిన రాముడు తండ్రి మాట నిలబెట్టడానికి అరణ్యాలకు పయన మయ్యాడు. రామునితో లక్ష్మణుడు, రాముని భార్య సీత అరణ్యాలకు పయనమయ్యాడు. స్పృహ నుండి తేరుకున్న దశరధుడు కుమారుడైన రాముడు లక్ష్మణుడు, సీతను వెంట పెట్టుకుని అడవులకు వెళ్ళటం సహించలేక మరణించాడు. కైకేయి భరతుని పిలిపించి " కుమారా! మీ తండ్రి దశరధుడు మరణించాడు. నీ అన్నలు వనవాసం వెళ్ళారు. ఈ రాజ్యానికి వారసుడివి నువ్వే కనుక రాజ్యభారాన్ని వహించు " అని చెప్పింది. భరతుడు " అమ్మా! నీవు మా సూర్యవంశానికి మచ్చ తెచ్చావు. కోరరాని కోరిక కోరి నా తండ్రి మరణానికి కారకురాలివైయ్యావు. నా అన్న రాముని, లక్ష్మనుని, వదిన సీతమ్మను అరణ్యాలకు పంపావు. నీ పాపాలకు అంతు లేదా " అని నిందించాడు.
పాదుకాపట్టాభిషేకం
[మార్చు]భరతుడు తరువాత తండ్రికి అంత్య క్రియలు జరిపాడు. మంత్రులు, సామంతులు, ముగ్గురు తల్లులు, తమ్ముడు శత్రుజ్ఞుడితోను సకల పరివారంతో చిత్రకూటంలో ఉన్న రాముని దగ్గరకు వెళ్ళాడు. జటా వల్కములను, నార చీరలు ధరించిన రాముని చూసి ఆవేదనకు గురి అయ్యాడు. భరతుడు రామునితో " అన్నా! మన తండ్రి మరణించాడు. నీవే మాకు దిక్కు నీవు అయోధ్యకు వచ్చి పట్టాభిషేక్తుడవై మమ్మల్ని పాలించు " అని ప్రార్థించాడు. కాని రాముడు అంగీకరించక తన పాదుకలను మాత్రం ఇచ్చి భరతుని తిరిగి పంపాడు. భరతుడు రామపాదుకలను సింహాసనం మీద ఉంచి పట్టాభిషేకం జరిపించి నందిగ్రామంలో రాజప్రతినిధిగా మాత్రం రాజ్య పాలన చేస్తూ రామునిలా మునివృత్తిని అవలంభించాడు. తరువాత రాముడు శరభంగ ఆశ్రమానికి వెళ్ళాడు.
దండకారణ్యం
[మార్చు]శరభంగ ఆశ్రమం నుండి రాముడు దండకారణ్యం వెళ్ళాడు. గోదావరి తీరంలో లక్ష్మణుడు అన్నకు, వదినకు నిర్మించిన పర్ణశాలలో అందరూ ప్రశాంత జీవితం జరుపుతున్నారు. దశకంఠుని చెల్లెలు శూర్పణఖ రాముని చూసి మోహపరవశ అయి వారికి అపకారం చేయబోతుండగా లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసాడు. శూర్పణఖ పురికొల్పగా ఖరుడు, దూషణుడు అనే ఆమె సోదరులు పదునాలుగు వేల రాక్షసులతో రాముని మీదకు యుద్ధానికి వచ్చారు. రాముని చేతిలో వారంతా హతులైయ్యారు. శూర్పణఖ రావణుని కాళ్ళపై పడి రోదించింది. రావణుడు " సోదరీ! నీకు పరాభవం చేసిన వాడెవడో చెప్పు. వెంటనే వాడిని వధిస్తాను. వాడి ఆయుష్షు తీరింది " అన్నాడు. శూర్పణఖ తాను రాముని చూసిన దగ్గర నుండి ఖర దూషణులను వధించడం వరకు అంతా చెప్పింది.
మాయలేడి
[మార్చు]రావణుడు వెంటనే గోకర్ణం వెళ్ళి మారీచుని చూసి కలిసాడు. మారీచుడు రాముని చేతిలో పరాభవం చెంది శివుని గురించి తపస్సు చేసు కుంటున్నాడు. ఒకప్పుడు రావణునికి మంత్రిగా పనిచేసిన మారీచుడు రావణుని ఆహ్వానించాడు. రావణుడు " మారీచా! రాముడనే వాడు మన ఖరదూషణులను సంహరించాడు. వాడిని పరాభవించటానికి నీవు సహకరించాలి " అన్నాడు. ఆ మాటలు విన్న మారీచుడు వణుకుతూ " యుద్ధంలో రాముని పరాక్రమం నీవు వినలేదేమో! శివుడు కూడా రాముని బాణానికి ఎదురు నిలువ లేడు. నీకు చేటు కాలం దాపురించి ఈ కార్యానికి పూనుకున్నావు. నేను రాముని చేతిలో ఓడిపోయి ఇలా శివుని గురించి తపస్సు చేస్తున్నాను " అన్నాడు. " మారీచా నా మాట వినకున్న నేను నిన్ను సంహరిస్తాను " అన్నాడు. ఇక రావణుడు వినడని తెలుసుకుని మారీచుడు రావణుని చేతిలో మరణించే కంటే ధర్మాత్ముడైన రాముని చేతిలో మరణించడం మేలని తలిచాడు. రావణుడు " మారీచా నీవు మాయలేడి రూపం ధరించి సీతను ప్రలోభ పెట్టు. సీత ఆ లేడిని కావాలని కోరుతుంది. రాముడు బంగారు లేడి కోసం వెళ్ళినప్పుడు నేను సీతను అపహరిస్తాను. సీతా వియోగంతో రాముడు పరితపిస్తాడు " అన్నాడు. రావణాసురుని ఆదేశం మేరకు మారీచుడు బంగారు లేడి రూపంలో ఆశ్రమ సమీపంలో తిరుగుతున్నాడు. విధి ప్రేరితయై సీత బంగారు లేడిని తెమ్మని రాముని కోరింది. రాముడు సీత రక్షణను లక్ష్మణునుకి అందించి బంగారు లేడి కోసం వెళ్ళాడు. అందినట్లే అందుతూ ఆలేడి రాముని అడవిలో చాలా దూరం తీసుకు వెళ్ళింది. అప్పటికి రాముడు యదార్ధం గ్రహించి శరం సంధించి మారీచుని కొట్టాడు. మారీచుడు " హా సీతా, హా లక్ష్మణా " అని రాముని కంఠాన్ని అనుకరిస్తూ ప్రాణాలు వదిలాడు. ఆ అరుపులు విన్న సీత " లక్ష్మణా! మీ అన్నయ్య ఆపదలో ఉన్నట్లున్నాడు. నీవు వెళ్ళి రక్షించు " అన్నది. లక్ష్మణుడు " అమ్మా! సీతా మా అన్నయ్య పరాక్రమ వంతుడు. భయపడకుము మా అన్నయ్య శత్రుసంహారం చేసి రాగలడు " అన్నాడు. సీతకు కోపం వచ్చింది. ఆ ఆవేశంలో లక్ష్మణుని పై అనుమానం వచ్చింది. "లక్ష్మణా! నీ తలపు అర్ధం అయింది నీకు నా మీద ఆశ ఉంది. నేను చావనైనా చస్తాను కాని నీకు దక్కను " అని కఠోరంగా పలికింది. ఆ మాటలు భరించలేని లక్ష్మణుడు విల్లంబులు పట్టుకుని రాముడు వెళ్ళిన మార్గంలో వెళ్ళాడు.
సీతాపహరణం
[మార్చు]అవకాశం కోసం చూస్తున్న రావణుడు సన్యాసి వేషంలో అక్కడికి వచ్చాడు. మార్గాయాసంతో అలసినట్లు కనిపిస్తున్న రావణుని చూసి అతిథి సత్కారాలు చేసింది. సీతను చూసిన రావణుడు మోహవివశుడై " సుందరీ! నా పేరు రావణుడు, దానవ నాయకుడను నా రాజధాని లంక. నీవు నన్ను భర్తగా వరించి భోగాలు అనుభవించు. రాజ్యాన్ని కోల్పోయి అడవుల వెంట తిరుగుతున్న రామునితో ఏమి సుఖపడతావు. వేరు ఆలోచించక నన్ను వరించు " అన్నాడు. సీత " అయ్యా! మీరు ఇలా మాట్లాడటం తగునా! సూర్యచంద్రులు తేజం కోల్పోయినా, ఆకాశం నేల కూలినా, సముద్రములు ఇంకి పోయినా, భూమి బద్దలు అయినా నేను నా భర్త రాముని తప్ప అన్యుని తలవను " అన్నది. రావణుడు సీతను బలవంతంగా పట్టుకుని ఆకాశానికి ఎగిరాడు. అప్పుడు సీత పెద్దగా కేకలు వేస్తూ " దేవతలారా ! నేను జనక మహారాజు కూతురిని, రాముని భార్యను. ఈ రావణుడు నన్ను బలవంతంగా ఎత్తుకు పోతున్నాడు. మీకు నమస్కరిస్తాను నన్ను కాపాడండి " అని రోదించింది. ఆ అరుపులు జటాయువు అనే పక్షి విని రావణుని అడ్డగించాడు. " ఓరి రావణా! ఈమెను ఎందుకు బలవంతంగా ఎత్తుకుపోతున్నావు. ఈమెను విడవకున్న నిన్ను సంహరిస్తున్నాను " అన్నాడు. జటాయువుకు రావణునికి మధ్య పోరు ఘోరంగా జరిగింది. జటాయువు తన ముక్కుతో, గోళ్ళతో రావణుని గాయ పరచింది. రావణుడు జటాయువు రెక్కలు ఖండించాడు. జటాయువు నేల కూలాడు. రావణుడు సీతను ఎత్తుకు పోతున్నాడు. సీత ఇక తనను రక్షించే వారు లేరని అనుకుంటున్న సమయంలో ఋష్యమూక పర్వతంపై ఉన్న వానరములను చూసి తన ఆభరణములు చీర కొంగున మూటకట్టి పడవేసింది. రావణుడు సీతను లంకకు తీసుకు వెళ్ళాడు. సీతను అశోకవనంలో ఉంచి రక్షణగా రాక్షస స్త్రీలను కాపలా ఉంచారు.
సీతాన్వేషణ
[మార్చు]దండ కారణ్యంలో మారీచుని సంహరించి రాముడు కుటీరానికి తిరిగి వస్తున్నాడు. దారిలో లక్ష్మణుడు ఎదురు వచ్చాడు. రాముడు " లక్ష్మణా! రాక్షసులు తిరిగే ఈ అరణ్యంలో సీతను ఒంటరిగా ఎందుకు వదిలి వచ్చావు అని మందలించాడు " అన్నాడు. లక్ష్మణుడు సీత తనను ఆక్షేపించిన విషయం వివరించాడు. రాముడు జరిగిన దానికి చింతించాడు. రామునికి దుశ్శకునాలు గోచరించాయి. సీతకు ఏదో ఆపద వచ్చిందని మనస్సు శంకించింది. కుటీరంలో సీత కనపడ లేదు అక్కడ కనిపించిన సంకేతాలు చూసి సీత అపహరణకు గురి అయినట్లు గ్రహించి వేదన పడ్డారు. సీత కోసం అన్వేషించటం మొదలు పెట్టారు. దారిలో కొన ఊపిరితో ఉన్న జటాయువు కనపడి " రామా! నా పేరు జటాయువు. నేను నీ తండ్రి దశరధునికి మిత్రుడను. నీ భార్య సీతను రావణుడు అపహరించి దక్షిణ దిక్కుగా పోయాడు. నేను అడ్డగించినందుకు నా రెక్కలు ఖండించాడు " అని చెప్పి ప్రాణాలు విడిచాడు. రాముడు జటాయువుకు అంతిమ సంస్కారములు చేసాడు.
కబంధుడు
[మార్చు]రామలక్ష్మణులు సీతను వెదుకుతూ దక్షిణ దిశగా వెళ్ళారు. దారిలో కబంధుడు లక్ష్మణుని పట్టుకున్నాడు. కబంధుడు ఒక వింత జీవి. దాని గుండెలో కళ్ళు పొట్టలో నోరు ఉంది. చేతులు మాత్రం చాలా పొడవు అది కూచున్న చోటు నుండి కదలక చేతులను చాచి చిక్కిన జంతువులను పట్టుకుని తింటూ జీవిస్తుంది. లక్ష్మణుడు కంబంధుడి పట్టు నుండి తప్పించుకో లేక పోయాడు. " అన్నా! శ్రీరామా! నన్ను రక్షించు. నీకు రాజ్యం పోయింది, తండ్రి మరణించాడు, భార్యను పోగొట్టుకున్నావు ఇప్పుడు ఈ కబంధుడు నన్ను పట్టుకున్నాడు. నా వంటి దురదృష్టవంతుడు ఉంటాడా " అని అరిచాడు. రాముడు లక్ష్మణునికి ధైర్యం చెప్పి బాణాలతో కబంధుని హస్తాలు ఖండించి లక్ష్మణుని విడిపించాడు. ఒక కత్తి తీసుకుని కబంధుని పొట్ట చీల్చగా అతడు ఒక దివ్య పురుషుడుగా మారి పోయాడు. " రామా! నేను విశ్వావసు అనే గంధర్వుడను. బ్రహ్మదేవిని శాపం వలన నాకు ఈ రాక్షస జన్మ వచ్చింది. నేడు నీ వలన నాకు మోక్షం కలిగింది. రావణుడు అనే రాక్షసుడు నీ భార్యను తీసుకు వెళ్ళి లంకలో ఉంచాడు. పంపా సరస్సు ఒడ్డున ఉన్న ఋష్య మూక పర్వతం పై వాలి సోదరుడైన సుగ్రీవుడు నివసిస్తున్నాడు. అతనితో నీవు సఖ్యం చేసిన నీ కార్యం సిద్ధిస్తుంది " అని చెప్పి గంధర్వుడు వెళ్ళి పోయాడు.
కిష్కింద
[మార్చు]రామలక్ష్మణులు పంపా సరోవర తీరాన తమ పితరులకు తర్పణం విడిచారు. అక్కడి నుండి చాలా ఎత్తుగా కనపడు తున్న ఋష్యమూక పర్వతాన్ని చేరారు. ఋష్యమూక పర్వతం పైనున్న వానరరాజు సుగ్రీవుడు రామలక్ష్మణులను చూసి వారి వృత్తాంతం తెలుసుకు రమ్మని మంత్రి అయిన హనుమంతుని పంపాడు. హనుమంతుడు చాకచక్యంగా వ్యవహరించి రామలక్ష్మణుల గురించిన సకల వృత్తాంతం గ్రహించి సుగ్రీవునకు నివేదించాడు. రామలక్ష్మణులకు సుగ్రీనికి మైత్రి చేసాడు. సుగ్రీవుడు సీతాదేవి కిందకు జారవిడిచిన ఆభరణాలు చూపించాడు. రాముడు ఆ ఆభరణాలు గుర్తు పట్టాడు. సుగ్రీవుడు తన అన్న వాలి తన భార్యను అపహరించి తన మీద నిష్కారణ కక్ష పెంచుకుని తనను రాజ్యం నుండి వెడలగొట్టాడని తన అన్నను చంపి తనకు రాజ్యం ఇప్పించమని కోరాడు. బదులుగా సీతాన్వేషణలో తాను సాయం చేస్తానని చెప్పాడు. రాముడు అందుకు ఒప్పుకున్నాడు.
వాలి వధ
[మార్చు]అందరూ కిష్కిందకు భయదేరి నగరం వెలుపల నిలిచి సుగ్రీవుడు తన అన్న వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి సుగ్రీవునితో యుద్ధానికి పోతుండగా వాలి భార్య తార " నాధా! సుగ్రీవుడికి ఏదో సాయం లభించినట్లు ఉందు. అయోధ్య రాజు దశరధుని కుమారులైన రామ లక్ష్మణులతో సుగ్రీవునకు మైత్రి కుదిరిందని చారుల ద్వారా విన్నాను. రాముని భార్య సీతను రావణుడు అపహరించాడు. రాముడు సుగ్రీవుని సాయం కోరాడు. సుగ్రీవుడు అంగీకరించాడు. ప్రతిఫలంగా సుగ్రీవునకు సాయం చేస్తానని అన్నాడంట. మహా బలవంతులైన మైందుడు, ద్వివిదుడు, హనుమంతుడు, జాంబవంతుడు అతనికి మంత్రులుగా ఉన్నారు. కనుక ఇప్పుడు సుగ్రీవునితో యుద్ధానికి పోవడం ప్రమాదకరం " అని తార వాలిని వారించింది. కాని వాలి భార్యమాట లక్ష్యపెట్టక సుగ్రీవునితో యుద్ధానికి సిద్ధం అయ్యాడు. సుగ్రీవుని చూసి వాలితో " ఓరీ! మంద బుద్ధీ నేను ఎన్నో మార్లు నిన్ను ఓడించి తరిమి వేసాను. మరల సిగ్గు లేకుండా యుద్ధానికి ఎందుకు వచ్చావు " అన్నాడు. సుగ్రీవుడు " వాలి! నేను భార్యను పోగొట్టుకుని రాజ్యభ్రష్టుడనయ్యాను. నేను ఉండి చేసేదేముంది అందుకే యుద్ధానికి వచ్చాను " అని వాలితో అన్నాడు. వాలి సుగ్రీవులు చెట్లతోను, బండలతోను యుద్ధం చేసుకున్నారు. తరువాత ఒకరితోనొకరు ముష్టి యుద్ధం చేసుకుంటున్నారు. కవలలైన వారిని పోల్చలేక రాముడు వాలిని చంపలేక పోయాడు. సుగ్రీవుడు తిరిగి వచ్చి రామునితో నిష్టూరంగా మాట్లాడాడు. రెండవ సారి రాముని సలహాతో గుర్తు కొరకు వనపుష్ప మాలను ధరించి సుగ్రీవుడు వాలితో యుద్ధంచేసాడు. రాముడు వేసిన బాణాలకు వాలి నేల కూలాడు. తనను చంపడం అధర్మమని వాలి రామునితో వాదించాడు. రాముడు చెప్పిన ధర్మసూక్ష్మాలను అంగీకరించి తనభార్యను సుగ్రీవునికి అప్పగించి కుమారుడైన అంగదుని యువ రాజుని చేసే బాధ్యత రామునికి అప్పచెప్పి ప్రాణాలు వదిలాడు. సుగ్రీవుడు రామునకు నమస్కరించి " రామా నీమాట నీవు నిలబెట్టు కున్నావు. ఇప్పుడు ఎండా కాలం తరువాత వర్షాకాలం సితాన్వేషణకు ఇది తరుణం కాదు కనుక నేను వర్షాకాలం ముగియ గానే సీతాన్వేషణ ప్రారంభిస్తాను " అన్నాడు.
అశోకవనం త్రిఝటా స్వప్నం
[మార్చు]అశోకవనంలో సీత రాముని తలచుకుంటూ కాలం గడుపుతుంది. సీతకు కాపలాగా రాక్షస స్త్రీలైన త్ర్యక్షి, లలాటాక్షి, త్రిస్తని, ఏకపాద, దీర్ఘజిహ్వ, అజిహ్వ, త్రిజట, ఏకలోచన మొదలైన వారు సీత చుట్టూ కాపలా ఉన్నారు. వారు రావణుని వరించమని ఆమెను వేధిస్తున్నారు. సీత వారి మాటలు వినలేక " అమ్మా! నేను రాముని తప్ప అన్యులను మనసులో కూడా తలవను ఇది సత్యం నాకు జీవించవలెను అన్న కోరిక లేదు. నన్ను ఏమైనా చెయ్యండి " అన్నది. సీత చావటానికి భయపడ లేదని చెప్పడానికి కొందరు స్త్రీలు రావణుని వద్దకు వెళ్ళారు. అప్పుడు త్రిజట " అమ్మా! సీతా నీకు సంతోషం కలిగించే మాట ఒకటి చెప్తాను. రాముని మేలు కోరే వాడు అవింద్యుడు అనే వాడు నన్ను ఇక్కడ నియమించాడు. నీకు హితమైన మాటలు చెప్పమన్నాడు. రామలక్ష్మణులు నిన్ను వెతుకుతూ సుగ్రీవుని కలుసుకుని మైత్రి చేసుకున్నారు. సుగ్రీవుడు నిన్ను వెతికించే కార్యము మొదలు పెట్టాడు. రావణునికి రంభ కారణంగా నలకూబరుడు ఒక శాపం పెట్టాడు. ఆ కారణంగా రావణుడు నిన్ను బలాత్కరించడు కనుక భయపడ వలదు. దుర్మార్గుడైన రావణునికి చేటు కాలం దాపురించిందని తెలిపే కల నాకు వచ్చింది. గాడిదలు కట్టిన రథం పై ఒంటి నిండా నూనె రాసుకుని తల విర బోసుకుని రావణుడు దక్షిణదిక్కుగా వెళుతున్నాడు. అతని వెంట కుంభకర్ణుడు ఇతర రాక్షసులు ఎర్రని పూలు ధరించి జుట్టు విరబోసుకుని దిగంబరులై యముని దిక్కుగా వెళుతున్నారు. విభీషణుడు ��ెల్లని వస్త్రములు ధరించి, తెల్లని పూలు ధరించి తెల్లని కొండపై మంత్రులతో కొలువు తీరటం నేను స్వప్నంలో చూసాను. సీతా! అలాగే రాముడు ఏనుగునెక్కి లక్ష్మణునితో కలసి సంతోషంగా పాయసం సేవిస్తున్నట్లు కనబడింది నా కల నిజమౌతుంది. నీవు నీ భర్తను త్వరగా చేరగలవు " అని పలికింది.
రాణుడి ప్రేలాపన
[మార్చు]రావణుడు సీత మీది మోహంతో అశోక వనానికి వచ్చి సీతతో " ఓ సీతా! నీ మీద నేను మనసు పడ్డాను. అన్న పానీయాలు విడిచి ఎందుకు నీవు ఇలా కృశిస్తావు. కృపతో నన్ను ఏలుకొమ్ము. నేను దేవతలను, యక్షులను, రాక్షసులను జయించిన వాడిని. ఎంతో మంది స్త్రీలు నా ఆధీనంలో ఉన్నా నేనా మనసు నీ మీద లగ్నం అయింది. రాజ్యం పోగొట్టుకుని పిచ్చి వాడి వలె అడవులలో తిరిగే అల్పుడైన రాముడు నా ముందెంత? నేను సకల లోకములకు ఈశ్వరుడను. రాక్షసులు యక్షులు వేల సంఖ్యలో నన్ను కొలుస్తున్నారు. విశ్వవసుడు నా తండ్రి, కుబేరుడు నా అన్న. గంధర్వ కన్యలు, అప్సరసలు నన్ను సేవిస్తున్నారు. నన్ను పంచమ లోక పాలకుడని ముల్లోకాలు కీర్తిస్తున్నాయి. దేవేంద్రుని వద్ద నున్న సమస్తం నా వద్ద ఉన్నాయి నా జీవితమునకు రాణివై నన్ను పాలించుము " అని పలికాడు. సీత ఒక గడ్డి పోచను రావణునికి తనకు మధ్య పెట్టి " నేను పరస్త్రీని, అబలను, మానవాంగనను, పతివ్రతను. నీవు రాక్షసుడవు నీయందు నాకేమాత్రం ప్రేమ లేదు. నాతో ఏమి సుఖిస్తావు. బ్రహ్మదేవుని మనుమడిని, కుబేరుని తమ్ముడిని అని చెప్పుకునే నీకు ధర్మం తెలవాలి. చెడు ప్రవర్తన విడిచి పెట్టాలి కాని ఇలా సిగ్గు లేకుండా మాట్లాడటం ధర్మమా? " అని సీత ఏడుస్తుంటే రావణుడు కొన్ని దుర్భాషలాడి వెళ్ళి పోయాడు.