బ్రాహ్మణీకం
బ్రాహ్మణీకం | |
కృతికర్త: | గుడిపాటి వెంకట చలం |
---|---|
ముద్రణల సంఖ్య: | 2 |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | పెద్ద కథ/ నవల |
విభాగం (కళా ప్రక్రియ): | తెలుగు సాహిత్యం |
ప్రచురణ: | యువ కార్యాలయము తెనాలి |
విడుదల: | 1937,1945 |
పేజీలు: | 86 |
బ్రాహ్మణీకం నవలను గుడిపాటి వెంకట చలం వ్రాశాడు. 1937లో దీనిని తెనాలి యువ కార్యాలయము వారు ప్రచురించారు. 1945లో పునర్ముద్రింపబడింది.
కథాసంగ్రహము
[మార్చు]సుందరమ్మ పల్లెటూరి బ్రాహ్మణపిల్ల. సంప్రదాయంగావస్తున్న నికార్సైన పూర్వాచారపరాయణకుటుంబం లో పుట్టిన కారణంచేత మడి, ఆచారం, దేవుళ్లు, దెయ్యాలు, జ్యోతిషాలు, సోదెలు మొదలైన మూఢనమ్మకాలుగల అమాయక ప్రవృత్తి కలిగింది. బహు చిన్ని వయస్సు అయినా పెద్ద ఆచారాలు, పెద్దమడులు, పెద్దవూహలు. ఎనిమిదోయేటనే మేనత్తకొడుక్కిచ్చి పెళ్లిచేశారు. పెళ్లికాగానే సంస్కృత విద్యాభ్యాసంకోసం పరదేశాలకు పోయి ఆరేళ్లు గడచివచ్చి కార్యంచేసుకుని భార్యతో కాపురం సాగించాడు. సుందరమ్మ యితని రసికతకు దీటైన సౌందర్యరాశి అవటంచేత రెండు సంవత్సరాలపాటు యధేచ్ఛగా ప్రవర్తించారు. ఇంతలో దేవుడికి కన్ను కుట్టిందికాబోలు దాంపత్యాన్ని త్రుంచివేశాడు. తీవ్రజాడ్యం యేర్పడి భూశయనం చేయబడ్డాడు అతడు. దీపం కునికిపోయే సమయంలో సుందరమ్మను, మామగార్ని దగ్గరకు పిలిచి "నేను పోయినా దానిలో నివసించబోతున్నాను. దాని అందాన్ని అమితంగా ప్రేమిస్తున్నాను. దానిని వికారం చెయ్యొద్దు" అని చెప్పి ప్రాణాలు విడిచాడు. మూడు సంవత్సరాలు గడిచాయి. భర్తకు చేసిన వాగ్దానం ప్రకారం యేయితరజోక్యం కలుగచేసికోకుండా తొణుకాడని గాంభీర్యంతో తపశ్శాలినిలాగుందే అనుకునేటట్టు తోపచేస్తోంది. ఇంతలో తండ్రికూడా మరణించాడు. దిక్కు శూన్యమయ్యేసరికి మేనమామ చేరదీశాడు. మేనమామ వెంకట్రామయ్య యింట్లో చంద్రశేఖరమనే బీదకుర్రాడు చదువుకుంటూ వెంకట్రామయ్య కూతురుకు పాఠాలు, సంగీతం చెబుతున్నాడు. సుందరమ్మను కూడా వానిదగ్గర పాఠం, సంగీతం వగైరా నేర్చుకోవలసిందిగా మేనమామ ఆజ్ఞాపించాడు. చంద్రశేఖరం ఆగర్భదరిద్రుడు. వీనికి సుందరమ్మమీద మనసు పారింది. కొంతకాలం వీనిచేష్టలు ఆమె గుర్తించనే లేదు. సుందరమ్మకు ఆ గొడవే లేదు. చంద్రశేఖరం తాపన అంతకంతకు జాస్తి అవుతోంది. తన ఉపాయాలన్నీ విఫలమవుతాయి. కొంత కాలానికి వాని దురూహ సుందరమ్మకు కొంచెం అర్థమవుతుంది. అయినా తొణకదు. ఆతడో ఆమెమీద త్రాచుపగ పట్టాడు. ద్వేషం, మోహం రెండూ పెన వేసుకుని బాధిస్తున్నాయి అతన్ని. ఆమెను పొందనిదే తన జన్మసార్థకత కాదనే మూర్ఖపు పట్టుపట్టి ధైర్యంచేసి సఫలుడైనాడు. సుందరమ్మ పొత్తికడుపు పెద్దదై నునుపెక్కుతోంది.సుందరమ్మ గర్భధారణ విషయం వెంకట్రామయ్య నోటీసులోకి వెళ్లింది. సుందరమ్మను చంద్రశేఖరానికిచ్చి వివాహం చేయడం తప్ప వేరే ఉపాయమేమీ తోచక వానిని పట్టి తీసుకువచ్చి వివాహం జరిపించి యిరవై అయిదు రూపాయల బ్యాంకు గుమాస్తాపనికూడా కుదిర్చి వేరే కాపురం పెట్టించి చేతులు కడిగేసుకున్నాడు. ఈ వివాహ విషయంలో చంద్రశేఖరం సుందరమ్మల ఇష్టాయిష్టాలను తెలుసుకోవటానికి యెవ్వరూ ప్రయత్నించలేదు. సుందరమ్మ చంద్రశేఖరాన్ని ప్రేమించలేదు. పైగా తన జీవితాన్ని ధ్వంసంచేసినాడనీ, తాను తన పూర్వపుభర్తకు చేసిన వాగ్దానం భంగం చేసినదనీ, యీ వితంతు వివాహం మహాపాపకార్యమనీ చంద్రశేఖరాన్ని ద్వేషంగా చూడటం మొదలెట్టింది. సుందరమ్మ యొక్క ప్రకృతిని తెలుసుకోకుండా తను అంటే ఆమె విముఖురాలుగా వుండటం ఆమెకు పరపురుష సంబంధ మున్నదని చంద్రశేఖరం అనుమానపడి యిద్దరకూ ఒకరిని చూస్తే ఒకరికి ఏమాత్రం పడకుండావచ్చింది. భర్త అంటే ఆడదాని మీద సర్వాధికారి అని చంద్రశేఖరం భావన. సుందరమ్మను కేవలం దాసీకన్నా కనాకష్టంగా చూస్తున్నాడు. సంసారంలో భర్తకు యెక్కుడు ఆధిక్యము కలదా, భార్యకు యెక్కువ కలదా? అనే జిజ్ఞాస సుందరమ్మకు లేదు. ఆమె దంతా అదొక అడవిగోడు. కాని చంద్రశేఖరం ప్రవర్తన, అతడు తనకు చేసిన మోసంవల్ల అతన్ని మనసా ద్వేషిస్తోంది.సంసారం చేస్తున్నారన్న మాటేకాని ఒక్కనాడుగూడ తృప్తికరంగా సుఖంగా గడిపింది లేదు. ప్రసవించింది. ఏ ముచ్చటాలేదు. బిడ్డ అవసరానికి యేదైనా స్వల్పమాత్రపుడబ్బు కావలిస్తే సుందరమ్మ అతనిదగ్గర వేశ్యాతత్వం అవలంబించవలసిన అవసరం యేర్పడటం ఆమెకు మరింత అసహ్యంగా తోస్తూవుంది. ఈ వివాహం వితంతువివాహం కావటం చేత చుట్టుప్రక్కల యిండ్లవాళ్లెవరూ పలుకరించరు. బిడ్డకు జబ్బు అంతకంతకు ముంచుకువస్తోంది. చంద్రశేఖరం యేమాత్రం శ్రద్ధచూపటం లేదు. ఆబిడ్డకు ఆ జబ్బు చేయటం తాను చేసిన పాపకర్మఫలం అని ఆమె విశ్వాసం. శ్రమపడి డాక్టరును పిలుచుకువస్తుంది. చూచి సూది మందెక్కించవలె నంటాడు. సుందరమ్మ తన వద్ధ డబ్బు లేదని చెబితే అతను వెళ్లిపోతాడు. మందుకొరకు తనే మందులషాపుకు వెళ్లుతుంది. డబ్బులియ్యనిదే షాపువాళ్లు మందియ్యమంటారు. ఈమె వాలకం అంతా షాపులో ఒక గమళ్ల కులస్తుడు కనిపెట్టి ఆమె వెంటబడి యింటికి వస్తాడు. ఈతడు ప్రథమం నుంచీ బ్రహ్మద్వేషిగా పెరిగాడు.సుందరమ్మ అసమాన సౌందర్యానికి తోడు బ్రాహ్మణజాతిది కూడా కావడం వాని సంకల్పం యీడేరే యోగం పట్టినట్టు భావించాడు.తను డాక్టరునని చెప్పూకుంటాడు. సహజ అమాయకత్వంచేత యీ అయాచితుడయిన మనిషి తమపాలిట దైవమని భావిస్తుంది సుందరమ్మ. మందిస్తే దానికి ప్రతిఫలం ఆమె పొందు నభిలషిస్తాడు. ఆమె మౌనం సంపూర్ణాంగీకారంగా భావించి తన జీవితాశయం నెరవేర్చుకుంటాడు. మందియ్యమంది. తను వైద్యుడు కానని అంటే తిరగబడింది. రాక్షసి, దెయ్యం, మహిషాసురమర్దని, శక్తి అయింది ఆమె. ఆమె ధాటికి తప్పించుకోవలెనని ప్రయత్నించటంలో వాని బట్టకు అక్కడ మండుతూవున్న కిరసనాయిలు దీపం అంటుకుని భస్మమైపోతాడు. సుందరమ్మ పిల్ల మీద పడి చచ్చిపోతుంది.
బయటి లింకులు
[మార్చు]- [1]భారత డిజిటల్ లైబ్రరీలో బ్రాహ్మణీకం ప్రతి.
- [2][permanent dead link] భారతి (మాస పత్రిక) ఏప్రిల్ 1938 సంచిక పుటలు 44-47