దాశరథి కృష్ణమాచార్య
దాశరథి కృష్ణమాచార్య | |
---|---|
జననం | మహబూబాబాదు జిల్లా, చిన్నగూడూరు | 1925 జూలై 22
మరణం | 1987 నవంబరు 5 | (వయసు 62)
ఇతర పేర్లు | దాశరథి |
వృత్తి | కవి, రచయిత |
తల్లిదండ్రులు |
|
దాశరథి గా పేరు గాంచిన దాశరథి కృష్ణమాచార్యలు గారు(జూలై 22, 1925 - నవంబర్ 5, 1987) తెలంగాణకు చెందిన కవి, రచయిత. నిజాం ప్రభువును ఎదిరిస్తూ రచనలు చేశాడు. తెలంగాణ విముక్తి కోసం కృషి చేశాడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి తెలంగాణ ఉద్యమానికీ ప్రేరణనందించిన కవి దాశరథి. పలు సినిమాలకు గేయరచయితగా పనిచేశాడు. ప్రతి సంవత్సరం దాశరథి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సాహిత్యరంగంలో కృషిచేసినవారికి తెలంగాణ ప్రభుత్వం దాశరథి సాహితీ పురస్కారం అందజేస్తోంది.[1]
జీవిత విశేషాలు
[మార్చు]దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22 న మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం ఈ గ్రామం మహబూబాబాద్ జిల్లాలో ఉంది. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రిక్యులేషను, భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బి.ఎ చదివాడు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. చిన్నతనంలోనే పద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదించాడు. ప్రారంభంలో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉండి రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి[2] హైదరాబాదు సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలుపంచుకున్నాడు.[3]
రచనా ప్రస్థానం
[మార్చు]ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్‌స్పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసాడు. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేసాడు. కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు రాసాడు.
నిజాం పాలనలో రకరకాల హింసలనుభవిస్తున్న తెలంగాణాను చూసి చలించిపోయాడు. పీడిత ప్రజల గొంతుగా మారి నినదించాడు.
“ | రైతుదే తెలంగాణము రైతుదే. ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని గర్జించాడు.
దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు, దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, దిగిపోవోయ్, తెగిపోవోయ్ |
” |
అని నిజామును సూటిగా గద్దిస్తూ రచనలు చేసాడు.
ఆంధ్రమహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం చేత జైలు శిక్ష అనుభవించాడు. నిజామాబాదు లోని ఇందూరు కోటలో ఆయన్ని మరో 150 మందితో ఖైదు చేసి ఉంచింది, నిజాము ప్రభుత్వం. ఆయనతోపాటు ఖైదులో వట్టికోట ఆళ్వారుస్వామి కూడా ఉన్నాడు. పళ్ళు తోముకోవడానికిచ్చే బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి దెబ్బలు తిన్నాడు. మంచి ఉపన్యాసకుడు. భావప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో ఒకడు. 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడుగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించాడు. ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా 1977 ఆగష్టు 15 నుండి 1983 వరకు పనిచేశాడు. రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులు గెల్చుకున్నాడు. అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానుల్ని సంపాదించుకున్నాడు. మీర్జాగాలిబ్ ఉర్దూ గజళ్ళను తెలుగులోకి గాలిబ్ గీతాలు పేర అనువదించాడు. తల్లి మీద, తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి.
మరణం
[మార్చు]1987 నవంబరు 5వ తేదీన ఉదయం రక్త పరీక్ష చేయించుకొని వచ్చి 11 గంటల ప్రాంతంలో ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకొన్నాడు. బాత్రూంలోకి వెళ్లి అక్కడే పడిపోయి శాశ్వతంగా కన్నుమూశాడు దాశరథి.
రచనలు, అవార్డులు, బిరుదులు
[మార్చు]కవితా సంపుటాలు
[మార్చు]- అగ్నిధార (ఖండ కావ్యం)
- మహాంధ్రోదయం (ఖండ కావ్యం)
- రుద్రవీణ (ఖండ కావ్యం)
- అమృతాభిషేకం (ఖండ కావ్యం)
- ఆలోచనాలోచనాలు (ఖండ కావ్య)
- ధ్వజమెత్తిన ప్రజ (ఖండ కావ్యం)
- కవితాపుష్పకం ( ఖండ కావ్యం)
- తిమిరంతో సమరం (ఖండ కావ్యం)
- నేత్ర పర్వం (ఖండ కావ్యం)
- పునర్నవం (ఖండ కావ్యం)
- గాలిబ్ గీతాలు (అనువాద కవిత)
- నవమి (వచన నాటిక)
- నవమంజరి (లలిత గీతాలు)
- ఖబడ్దార్ చైనా (ఖండ కావ్యం)
- వ్యాసపీఠం (వివిధ సాహిత్య వ్యాసాల సంపుటి విమర్శ)
- జయదేవకృత గీతగోవింద కావ్యం (వ్యాఖ్యానం),
- మిన్నేటిపొంగులు (హీరాలాల్ మోరియా కవితలకు అనువాదం),
- ప్రణయసౌధం (అనువాదకావ్యం),
- యాత్రాస్మ్రతి (ఆత్మకథ),
- జ్వాలాలేఖిని (30 కవితలు)
- మహా బోధి (కథా కావ్యం)
- నవ మంజరి (లలిత గీతాలు)
- దాశరథి (బాలగేయాలు)
- శంకర్స్ బొమ్మల బాల రామాయణం (కథల సంయుక్త రచన)
- శంకర్స్ బొమ్మల బాల భాగవతం (కథల సంయుక్త రచన)
- శంకర్స్ బొమ్మల బాల భారతం (కథల సంయుక్త రచన)
- తేనెపాటలు (లలిత గీతాలు సంయుక్త రచన)
- దాశరథి శతకం (పద్యశతకం)
- మహా శిల్పి జక్కన (చారిత్రాత్మక నవల)
- ప్రాచీన లక్నో (అనువాద చరిత్ర గ్రంథం)
- అమృతవల్లి తెలుగుతల్లి (ఖండ కావ్యం)
- బాలసరస్వతి తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ
- జ్వాలా లేఖిని (ఖండ కావ్యం)
- నవజగానికి వందనం (అనువాద కవిత)
- జయదేవకృత గీత గోవింద కావ్యం (వ్యాఖ్యానం)
- నేత్రపర్వం (ఖండ కావ్యం)
- సాఖీనామా (గజళ్ళు, రుబాయిలు)[4]
అవార్డులు
[మార్చు]- 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి 'కవితాపుష్పకం' కవితా సంపుటికి ఉత్తమ కవితా పురస్కారాన్ని ప్రకటించింది
- 'తిమిరంతో సమరం' కవితాసంపుటికి 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది
- ఆంధ్ర విశ్వవిద్యాలయం "కళాప్రపూర్ణ"
- వెంకటేశ్వర విశ్వవిద్యాలయం "డి. లిట్ "
- మహాంధ్రోదయం"అనే కవిత హైదరాబాద్ ప్రభుత్వ సమాచారశాఖ నిర్వహించిన కవితల పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకుంది.
- ఢిల్లీ ప్రభుత్వం వారి బహద్దూర్ షాజఫర్ అవార్డు కూడా లభించింది.
బిరుదులు
[మార్చు]- కవిసింహం
- అభ్యుదయ కవిసామ్రాట్
- యువకవిచక్రవర్తి
- ఆంధ్రవిశ్వవిద్యాలయం వారి 'కళాప్రపూర్ణ'
- ఆంధ్ర,ఆగ్రా,శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాల గౌరవడాక్టరేట్లు
- ఆంధ్రకవితాసారధి
- ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి 1977 నుంచి 1983 వరకు..
- ఆంధ్రా కవితా సారధి
మచ్చుకు కొన్ని దాశరథి రచనలు
[మార్చు]తెలుగుజాతి ఆత్మకథ లాగా ఉంటుంది కింది పద్యం..
:ఎవరు కాకతి! ఎవరు రుద్రమ!
ఎవరు రాయలు! ఎవరు సింగన!
అంతా నేనే! అన్నీ నేనే!
అలుగు నేనే! పులుగు నేనే!
వెలుగు నేనే! తెలుగు నేనే!'
:మానవుల నెత్తురును త్రాగు మానవులను
దానవులె గాక మానవాత్వంబు కలదె?
దానవుల నంతమొందింప నేను కూడా
రామకృష్ణావతార ధారణము సేతు'
గతమే జీవితమనుకొని
వర్తమానమే వలదని
వెనక్కు నడిచేవారిని
వెక్కిరించు కోర్కి లేదు.
గతమంతా బూదికుప్ప
కావాలి మనోజ్ఞ భావి
తిరుగబడండని అరచే
బిరుసువారి నిందింపను.
ఇవి రెండూ ఒక కత్తికి
అటూ ఇటూ రెండంచులు
నే మాత్రం రెండంచుల
సాము చెయ్యగలను లెండి'.
ఆ చల్లని సముద్ర గర్భం
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ||ఆ చల్లని||
భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలెన్నో
ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
ఒక రాజుని గెలిపి��చుటలో ఒరిగిన నర కంఠములెన్నో
కుల మతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో ||ఆ చల్లని||
మానవ కళ్యాణం కోసం పణమెత్తిన రక్తము ఎంతో
రణరక్కసి కరాళ నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో
కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో
భూస్వాముల దౌర్జన్యాలకు
ధనవంతుల దుర్మార్గాలకు
దగ్ధమైన బతుకులు ఎన్నో ||ఆ చల్లని||
అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో
గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ||ఆ చల్లని||
- నిరంకుశ నిజాము పాలన గురించి..
ఓ నిజాము పిశాచమా, కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
తీగలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ
ఎముకల్ మసిచేసి పొలాలు దున్ని
భోషాణములన్ నవాబునకు
స్వర్ణము నింపిన రైతుదే
తెలంగాణము రైతుదే
1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా..
- ఆంధ్ర రాష్ట్రము వచ్చె
- మహాంధ్ర రాష్ట్రమేరుపడువేళ
- పొలిమేర చేరపిలిచె
- నా తల్లి ఆనందం పంచుకుంది
సినీ గీతాలు
[మార్చు]- దాశరథి సినిమా రచనలు
1961లో ఇద్దరు మిత్రులు సినిమాలో పాటలు రాయడంతో ఆయన సినీరంగ ప్రవేశం చేసాడు. ఇంచుమించుగా కొన్ని వందల పాటలను రచించి తెలుగు సినీ సాహిత్యానికి సేవచేశారు.[5]
- ఇద్దరు మిత్రులు (1961): ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ
- వాగ్దానం (1961): నా కంటిపాపలో నిలిచిపోరా...నీవెంట లోకాల గెలవనీరా
- అమరశిల్పి జక్కన (1964): అందాల బొమ్మతో ఆటాడవా, పసందైన ఈరేయి నీదోయి స్వామి
- డాక్టర్ చక్రవర్తి (1964): ఓ ఉంగరాల ముంగురుల రాజ నీ హంగు చూసి మోసపోను లేర
- దాగుడు మూతలు (1964): గోరంక గూటికే చేరావు చిలకా ; గోరొంక కెందుకో కొండంత అలక
- మూగ మనసులు (1964): గోదారి గట్టుంది గట్టు మీద సెట్టుంది సెట్టుకొమ్మన పిట్టుంది పిట్టమనసులో ఏముంది
- నాదీ ఆడజన్మే (1964): కన్నయ్యా నల్లని కన్నయ్యా నిను కనలేని కనులుండునా
- ప్రేమించి చూడు (1965):
- ఆత్మగౌరవం (1966): ఒక పూలబాణం తగిలింది మదిలో తొలిప్రేమ దీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే
- నవరాత్రి (1966): నిషాలేని నాడు హుషారేమి లేదు ఖుషీ లేని నాడు మజాలేనే లేదు
- శ్రీకృష్ణ తులాభారం (1966): ఓ చెలి కోపమా అంతలో తాపమా సఖీ నీవలిగితే నేతాళజాల
- వసంత సేన (1967): కిలకిల నగవుల నవమోహిని ప్రియకామినీ సాటిలేని సొగసుల గజగామినీ
- పూల రంగడు (1967): నీవు రావు నిదురరాదు, నిలిచిపోయె యీ రేయి
- నిండు మనసులు (1967): నీవెవరో నేనెవరో నీలో నాలో నిజమెవరో
- కంచుకోట (1967): ఈ పుట్టినరోజు, నీ నోములు పండినరోజు, దివిలో భువిలో కనివిని ఎరుగని అందాలన్ని అందేరోజు
- పట్టుకుంటే పదివేలు (1967): తల్లివి తండ్రివి నీవే మమ్ము లాలించి పాలించ రావా దేవా
- రంగులరాట్నం (1967): కనరాని దేవుడే కనిపించినాడే ; నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో
- బంగారు గాజులు (1968): విన్నవించుకోనా చిన్నకోరికా ఇన్నాళ్ళు నామదిలో వున్న కోరిక
- రాము (1968): రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా దీనులను కాపాడ రారా కృష్ణయ్యా
- బందిపోటు దొంగలు (1968): విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో
- ఆత్మీయులు (1969): మదిలో వీణలు మ్రోగె ఆశలెన్నొ చెలరేగె కలనైన కనని ఆనందం ఇలలోన విరిసె ఈనాడె
- బుద్ధిమంతుడు (1969): నను పాలింపగ నడచీ వచ్చితివా, మొర లాలింపగ తరలీ వచ్చితివా గోపాలా
- భలే రంగడు (1969): నిన్న నాదే నేడు నాదే రేపు నాదేలే ఎవరేమన్నా ఎన్నటికైనా గె���ుపు నాదేలే
- మాతృ దేవత (1969): మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా నన్నెన్నడు మరువకురా కృష్ణా
- మూగ నోము (1969): ఈవేళ నాలో ఎందుకో ఆశలు ; నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే
- ఇద్దరు అమ్మాయిలు (1970): పువ్వులో గువ్వలో వాగులో తీవెలో అంతట నీవేనమ్మా అన్నిట నీవేనమ్మా
- చిట్టి చెల్లెలు (1970): మంగళగౌరి మముగన్న తల్లి మా మనవి దయతో వినవమ్మా
- అమాయకురాలు (1971): పాడెద నీ నామమే గోపాలా హృదయములోనే పదిలముగానే నిలిపితి నీ రూపమేరా
- మనసు మాంగల్యం (1971): ఆవేశం రావాలి ఆవేదన కావాలి ; ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
- శ్రీమంతుడు (1971) ఎంతో చిన్నది జీవితం ఇంకా చిన్నది యవ్వనం
బయటి లింకులు
[మార్చు]- వేపచేదు.ఆర్గ్ లో దాశరథి వ్యాసం
- దాశరథి కృష్ణమాచార్యులు రాసిన కవితాసంకలనం మహాంధ్రోదయము
- గర్జించే కవిత్వం .. గర్వించే పాటలు దాశరథి శైలి
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ (18 July 2018). "ప్రముఖ కవి వజ్జల శివకుమార్‌కు దాశరథి అవార్డు". నమస్తే తెలంగాణ. Archived from the original on 2018-07-26. Retrieved 5 May 2022.
- ↑ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు యోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ కమిటీ ప్రచురణ, 2006, పేజీ 102
- ↑ V6 Velugu (18 July 2021). "తెలంగాణ మహాకవి దాశరథి కృష్ణమాచార్య" (in ఇంగ్లీష్). Archived from the original on 18 జూలై 2021. Retrieved 18 July 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ మామిడి హరికృష్ణ.కాలం సృష్టించిన ధిక్కార స్వరం. ఈనాడు.22 జూలై 2024
- ↑ దాశరథి సినిమా పాటలు, సంకలన కర్త: కె. ప్రభాకర్, లావణ్య ఆర్ట్ క్రియేషన్స్, హైదరాబాద్, 2010.
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- తెలుగు కవులు
- తెలుగు సినిమా పాటల రచయితలు
- 1925 జననాలు
- 1987 మరణాలు
- తెలుగు రచయితలు
- తెలుగు కళాకారులు
- తెలుగు లలిత సంగీత ప్రముఖులు
- ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్ధులు
- మహబూబాబాదు జిల్లా కవులు
- ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తెలుగు రచయితలు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తెలంగాణ రచయితలు
- మహబూబాబాదు జిల్లా సినిమా పాటల రచయితలు
- ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవులు
- ఉర్దూ నుండి తెలుగు లోకి అనువాదం చేసినవారు