చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
ఈ వ్యాసము లేదా వ్యాస విభాగములో చింతలపాటి వర ప్రసాద మూర్తి రాజు ను విలీనము చేయవలెనని ప్రతిపాదించబడినది. (చర్చించండి) |
చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు | |
---|---|
జననం | చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు 1919 డిసెంబరు 16 తణుకు సమీపంలోని సత్యవాడ |
మరణం | 2012 , నవంబరు 12 |
మరణ కారణం | శ్వాసకోశ, గుండె సంబంధ వ్యాధులు |
ఇతర పేర్లు | మూర్తి రాజు |
ప్రసిద్ధి | గాంధేయవాది. స్వాతంత్ర్యసమరయోధులు |
భార్య / భర్త | సత్యవతీదేవి |
చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు ప్రముఖ గాంధేయవాది. స్వాతంత్ర్యసమరయోధులు. 1800 ఎకరాలు దానం చేసిన దాత. సర్వోదయ ఉద్యమానికి చేయూత అందించారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. ఆక్వా పరిశ్రమకు ఆద్యుడుగా గుర్తింపుపొందాడు. ఆయన విద్యాదాత, అభినవ భోజుడు, గాంధేయవాది కూడా. పశ్చిమగోదావరి జిల్లా రాజకీయ ప్రముఖుడు. ఆయన కొల్లేరు రాజుగా గుర్తింపు పొందారు.
దాత
[మార్చు]తన 1800 ఎకరాల ఆస్తిని ధర్మసంస్థ ఏర్పాటుకు దానంగా ఇచ్చారు. 14 కళాశాలలు, 58 ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో విద్యావ్యాప్తికి అవిరళ కృషి చేశారు. స్త్రీ విద్యను ప్రోత్సహించారు . కొల్లేరు కార్మికుల సంక్షేమానికి కృషి చేయడంతో పాటు, ఆక్వా పరిశ్రమకు బీజం వేశారు. 1919 డిసెంబరు 16 న తణుకు సమీపంలోని సత్యవాడలో జన్మించిన ఆయన జమిందారీ కుటుంబానికి చెందిన చింతలపాటి బాపిరాజు, సూరాయమ్మల ఏకైక సంతానం. ఆయనకు కలిగిన ఒక్కగానొక్క కుమారుడు చిన్నతనంలోనే కన్ను మూయగా భార్య సత్యవతీదేవి 2010లో పరమపదించారు.
జీవితం
[మార్చు]1.వంశచరిత్ర మహాత్మాగాంధీ అదుగుజాడలు గాని, ఆయన దేశ ప్రజలకు అందించిన సందేశాలు గాని మన సామాజిక రంగంలో ఈ నాటికీ మనుగడ సాగిస్తున్నాయంటే ప్ర��న కారణం కొద్దిమంది మహానుభావులు మన మధ్య ఉండటమే. ఆ కొద్దిమందిలో "మహాదాత" మూర్తిరాజు గారికి అగ్రతాంబూలం ఇవ్వవలసివుంది. యువ ప్రాయం నుండి దేశభక్తిని రంగరించుకొని, గాంధీజీ, వినోబాల ప్రభావంతో తమకంటూ సిద్ధంతాలను ఏర్పరచుకొని, మహోన్నత ఆశయాలతో, లక్ష్యాల కార్యచరణతో సామజిక సేవకు ఉద్యమించి ప్రతిహతంగా ముందుకుసాగారు. 1942 నుంచి ఈనాటి వరకు సాగిన మహోజ్వల జీవితయానంలో మహోన్నత శిఖరాలనూ అధిగమించారు. చేదు అనుభవాలనూ స్వంతం చేసుకున్నారు. లక్ష్యసిద్ధికి, ఆశయ సాధనకు తమ నిండు జీవితాని అంకితం చేసిన "మహాదాత" మూర్తిరాజుగారు స్థితప్రజ్ఞతో ఉత్థానపతనాలన్నిటినీ సమదృష్టితోనే అవలోకిస్తూ ముందడుగువేశారు. రాబోయే తరాల వారందరికీ దీపకళికవలె భాసిల్లుతున్న మహామనీషి మూర్తిరాజుగారి ఆదర్శ జీవితం క్షీరనీర న్యాయంతో పరిచయమాత్రంగా అందిస్తున్న జీవనయానం ప్రారంభాన్ని ఈ తొలి అధ్యాయంలో గమనించండి. మూర్తిరాజుగారి తాత పేరు చింతలపాటి సుబ్బరాజు. స్వస్థలం భీమవరం తాలూకా చినఅమిరం గ్రామం. వ్యవసాయం పెద్ద ఎత్తున చేయాలనే తలంపుతో చినఅమిరం నుంచి అదే తాలూకాలోని చిననిండ్రకొలనుకు కుటుంబ సమేతంగా చేరుకున్నారు. సుబ్బరాజుగారికి ఇద్దరు కొడుకులు. మూర్తిరాజు, బాపిరాజు. ఇరువురూ యువప్రాయంలోకి అడుగుపెట్టబోతున్నవారే. ఆనాడు చిననిండ్రకొలను ప్రాంతమంతా నూజివీదు జమిందారుల హయాంలో ఉండేది. నిరంకుశంగా భూమి శిస్తు వసూళ్ళు చేసేవారు. సుబ్బరాజుగారు వ్యవసాయం నిమిత్తంకొన్ని భూములను కౌలుకు తీసుకున్నారు. ప్రతీ సంవత్సరం రాబడి సరిపోక అప్పులు చేయవలిసి వచ్చేది. అయినప్పటికీ, ఆరుగాలం కష్టపడి సేద్యం చేస్తూ అప్పులు తీరుస్తుండేవారు.
కొంతకాలానికి జమిందారుల భూములు ఎవరూ సేద్యం చేయక, బీడు భూములుగా ఉన్నవాటిని ఎవరైనా సేద్యం చేసుకోవడం ఆ ప్రాంతంలో నెమ్మదిగా ప్రారంభమైంది. జమిందారులు ఎవరికి ఎంత కావలిస్తే అంత భూమి సేద్యం చేసుకొవడానికి అనుమతి ఇచ్చారు. కానీ, ఎకరానికి మించి చేసేవాళ్ళు ఎవరూ ముందుకు రాలేదు. సుబ్బరాజుగారు ధైర్యం చేసి, ఎక్కువ భూమి సాగు చేయడానికి ముందుకు వచ్చారు. రెందవ కొడుకు బాపిరాజుగారు పిన్నవయస్కులైనప్పటికీ తండ్రికి అండదండలు అందిస్తూ, వ్యవసాయంలో మెళకువలు తెలుసుకుంటూ ముందడుగు వేశారు. బీడు భూములను కష్టపడి బాగుచేసి, సాగు చేయడం ప్రారంభించారు. అవన్నీ కొల్లేరు భూములుగానే పిలవడం జరిగేది. పెద్ద పెద్ద బడరాళ్ళు, పిచ్చిమొక్కలు, బురదతో నిండివుండేవి. నడిచి వెళ్ళడం చాలాకష్టం. ఆ ప్రాంతమంతటా గుర్రం మీదనే తిరిగేవారు. జమీ భూమిలోని భూములన్నింతినీ పరిశీలిస్తూ బక్క చిక్కిన రైతులందరికీ సలహాలిచ్చేవారు. వ్యవసాయం మీద అపరిమితమైన అభిమానం ఉండటంతో, తాను చూసిన ప్రాంతంలోని మంచి భూముల వివరాలను తోటి రైతులకు చెప్పేవారు. తండ్రి తీసుకున్న భూములు కాకుండా, మరికొన్ని భూములను జమిందారుల వద్దనుంచి కొన్నారు. మీర్జాపురం జమిందారుల అధీనంలో ఉన్న ఆముదాలపల్లి, భయనేపల్లి, తొకలపల్లి గ్రామాలలో భూములనే ఎక్కువ కొన్నారు.
బాపిరాజుగారి అన్నగారి పేరు మూర్తిరాజు. ఆయన ఇంటిపనులనే ప్రధానంగా చూసుకునేవారు. ఇతర వ్యవహారాలు, వ్యవసాయం బాధ్యలన్నీ తమ్ముడు బాపిరాజుకే అప్పగించారు. బాపిరాజు స్వతహాగా కష్టజీవి. పొద్దు పొదవక పూర్వమే వేగుచుక్క పొడవగానే నిద్ర లేచి, పొలాల వద్దకు వెళ్ళి పనులు పురమాయించేవారు. తానూ కష్టించేవారు. జాము పొద్దు ఎక్కిన తర్వాత ఇంటికి వచ్చి భోజనం చేసి, మళ్ళీ వెంటనే పొలం పనులకు వెళ్ళేవారు. చీకటి పడేవేళకు ఇంటికి వచ్చేవారు. బాపిరాజుగారి కుమారుడే ఈ గ్రంథం కథానాయకుడు. ప్రముఖ గాంధేయవాది శ్రీ చింతలపాటి సీతారామచంద్రవరప్రసాద మూర్తిరాజు గారి తండ్రి బాపిరాజుగారి అన్న పేరు కూడా మూర్తిరాజే. గ్రామ స్వరూపం : చిననిండ్రకొలను గ్రామం ఖండవల్లి మొఖాసాలోని ఒక గ్రామం. భీమవరం తాలూకా. అప్పటికి కృష్ణాజిల్లాలోనే ఈ తాలూకా ఉందేది. జిల్లా కేంద్రం మచిలీపట్నం. ఆ రోజుల్లో బందరు వెళ్ళడానికే రెండు మూడు రోజులు పట్టేది. పడవలలోనూ ఎడ్ల బండి మీద అంచెలంచెలుగా ప్రయాణం చేయవలసి వచ్చేది.
కాలక్రమంలో బాపిరాజుగారు అప్ ల్యాండ్ నల్లమాడు ప్రాంతంలో కొన్ని భూములు సంపాదించారు. జంగారెడ్డిగూడెం సమీపంలోని రెడ్డి గణపవరం, ములగలంపల్లి గ్రామాల ప్రాంతాలలో కూడా భూములు ఏర్పడ్డాయి. వీటిని కేవలం పశువుల మేత నిమిత్తం కొన్నారు. కొన్ని సారవంతమైన భూముల్లో కొద్దిపాటి వ్యవసాయం చేసేవారు. బాపిరాజుగారికి ఉన్నన్ని పశువులు ఆ ఇరుగుపొరుగు ప్రాంతాలలో మరెవరికీ ఉందేవి కావు. అందరూ ఆయనను "వెయ్యి ఆవుల రాజుగారు"గా చెప్పుకునేవారు. వ్యవసాయంలో మేటి అయిన బాపిరాజురారికి పశుశాస్త్రం, అశ్వశాస్త్రం బాకా తెలుసు. 5వ తరగతి వరకు చదువుకున్నప్పటికీ, రామాయణం, భారతం, భాగవతం గ్రంథాలను, పురాణాలను చదివేవారు. సంస్కృతం పంచకావ్యాలు చదివారు. ముఖ్యంగా సాటి ప్రజలను అర్ధం చేసుకునేవారు. తీరిక వేళల్లో గ్రామంలోని వారు వచ్చి సలహాలు అడిగేవారు, సంప్రదింపులు జరిపేవారు. అన్న మూర్తిరాజుగారి నిర్యాణం తవాత వ్యవసాయం, ఇంటి వ్యవహారాలు అన్నీ తానే చూసుకునేవారు.
ఆ రోజున ఎటువైపు వెళ్ళాలన్నా రహదారులు లేవు. పడవలలో ప్రయాణం చేయాలి లేద కాలి నడకన వెళ్ళవలసి వచ్చేది. కొత్తాగా రైలు మార్గం ఏర్పడింది. బాపిరాజుగారు చెన్నపట్టణం వెళ్ళివస్తే అదొక వింతకింద చెప్పుకునేవారు. ఉంగుటూరు చుట్టూ దట్టమైన అడవి, ఎన్నెన్నో వన్యమృగాలు ఉండేవి. అక్కడినుండి అడవి పందులు రాత్రివేళల్లో గ్రామంలోకి చొరబడేవి. క్షత్రియులు వాటిని వేటాడేవారు. వైశ్యులు కూడా కొంతమంది క్షత్రియులతో పాటు వేటలో పాల్గొంటూ వుండేవారు. ఉమ్మడికుటుంబం విచ్ఛిన్నం : గ్రామంలోని పత్సమట్ల చినవెంకట్రాజు గారి అన్న సత్తిరాజు అకస్మాత్తుగా మరణించారు. అన్నగారి ఆస్తి ఉమ్మడి ఆస్తి అయినా చినవెంకట్రాజుకు రాకుండా చేయాలని వూరి పెద్దలు కొంతమంది ప్రయత్నాలు చేశారు. ఈ యత్నాన్ని బాపిరాజుగారు వ్యతిరేకించారు. గ్రామంలో చీలికలు ఏర్పడ్డాయి. కొంతకాలనికే బాపిరాజుగారికి, అన్న మూర్తిరాజుగారి కుమారుడు సుబ్బరాజుగారికి ఆస్తుల పంపకాలు జరుగలలసి వచ్చింది. ఆ సంవత్సరం1929 లో బాపిరాజుగారు పండించిన 14వేల బస్తాల ధాన్యం నారాయణపురంలో కొత్తగా కట్టించిన ధాన్యపు కొట్టాలలో నిలవ చేశారు. అప్పటి బస్తాధర ఏడురూపాయలు. ఆ ధాన్యం అమ్మరాదని సుబ్బరాజుగారు అడ్డుపడ్డారు. ఆయనకు పత్సమట్ల కుటుంబీకులు మద్దతుగా నిలబడ్డారు. ఈ వివాదం వల్ల బస్తా ఆరురూపాయలకే అమ్మవలసి వచ్చింది. మూర్తిరాజుగారు జీవించి వున్నప్పుడు పగలు ఎక్కువగా మండువాలో కూర్చుండేవారు. ఎవరితో అయినా అక్కడే కూర్చుని మాట్లాడేవారు. ఆయన ఉపయోగించే ఇనుపపెట్టెను అన్నగారి మీద గౌరవంతో ఆయన మణించిన తరువాత కూడా బాపిరాజుగారు తెరిచి చూడలేదు. ఉమ్మడి ఆస్తి అయినప్పటికీ, అ పెట్టెలో ఉన్న ఇరవై వేలరూపాయల సొమ్మును, కుటుంబ సంబంధ రికార్డులను మూర్తిరాజుగారి కుమారుడు సుబ్బరాజుగారు తన మద్దతుదారుల ప్రోద్బలంతో తెరిచి స్వంతం చేసుకున్నారు.
అన్నదమ్ములు మూర్తిరాజుగారు, బాపిరాజుగారు మైనర్లుగా ఉండగా జమిందారులు యిజారా తాలూకు సొమ్ము వేలం వేయడానికి సిద్దపడ్డారు. అప్పుడు వీరి ఆస్తులు మూర్తిరాజుగారి మామగారు యండగండి కలిదిండి భీమరాజు పేర, ఇతరుల పేర రాయడం జరిగింది. ఆయన తన మనుమడైన సుబ్బారాజుకు మొత్తం ఆస్తిని వీలునామాగా రాశారు. అప్పటికి ఆస్తి సుమారు 300 ఎకరాలు. ఈ రకంగా ఉమ్మడి ఆస్తిలో వాటా కోల్పోయిన బాపిరాజుగారు తర్వాతి కాలంలో తన శక్తి సామర్ధ్యాలతో 3,600 ఎకరాలకు ఆస్తిని పెంచారు.
వీరి కుటుంబానికి పెన్మెత్స పెద్దిరాజుగారు ప్లీడరు. ఆయన మొత్తం ఆస్తిని ఇరువురు అన్నదమ్ములకు సమానంగా ఉండే విధంగా రాయించారు. మైనారిటీ తీరిన అన్నగారి కుమారుడు సుబ్బరాజు మద్దతు దారులు మొత్తం ఆస్తి ఆయనకే చెందాలని, చెరి సగం చేస్తూ రాయించడం మోసమని, దీనిని వ్యతిరేకించమని సలహా ఇచ్చారు. బాపిరాజుగారు తనను మోసం చేశారని, తన పినతండ్రి మీదనే అపనమ్మకం కలిగిన సుబ్బరాజుగారు పంపకాలు చేయమని ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ విధంగా ఉమ్మడి కుటుంబం చెదిరిపోయింది. బాపిరాజుగారు నిబ్బరంగా ఉంటూ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడంలోనే నిమగ్నమై ఉన్నారు. ఇదీ నేపథ్యం. జన్మస్థలం, బాల్యం : మన చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద మూర్తిరాజుగారి జననం, బాల్య విషేషాలు. మూర్తిరాజుగారు తల్లి సూరాయమ్మగారి స్వగ్రామం తణుకు తాలూకా సత్యవాడలో 1919వ సంవత్సరం డిసెంబరు 16వ తేదీన జన్మించారు. బాపిరాజు, సూరాయమ్మ దంపతులకు మూర్తిరాజుగారికి ముందు అయిదుగురు ఆడపిల్లలు పుట్టారు. ఇద్దరు బాలికలు చిన్నతనంలోనే మరణించారు. సూరాయమ్మగారు మగపిల్లలు పుట్టలేదని శ్రీరాముడిని వేడుకుంటూ పూజలు పునస్కారాలు చేసేవారు. ఆమె భద్రాచలం వెళ్ళి దేవుని దర్శించారు. ఆమె నిశ్చల భక్తి ప్రపత్తుల ఫలితంగా పుట్టినందున ఈయనకు సీతారామచంద్ర వరప్రసాద మూర్తిరాజు అని నామకరణం చేశారు. ముగ్గురు అక్కలూ ఈయనను ఎంతో అల్లరుముద్దుగా చూసుకునేవారు.
తల్లిగారు రాత్రింబవళ్ళు ఏదో ఒక పనిచేస్తూఉండేవారు. నిమిషం తీరిక ఉండేది కాదు. వేగుచుక్క పొడిచిన వేళ నుంచి తిరిగి రాత్రి పొద్దుపోయేంత వరకు పనిపాటలతోనే ఆమెకు గడిచిపోయేది. ఇంటికి వచ్చిన వారందరికీ వంటలు చేసి వడ్డించి భోజనాలు చేస్తే గాని పంపించేవారు కాదు. ఆమెకు విసుగు విరామం లేదు, అలసట లేదు. స్వయంగా మజ్జిగ చిలికేవారు. ఇంటిపనులలో మూర్తిరాజుగారి మేనత్తలూ, ఇరుగుపొరుగువారూ సహాయపడూతుండేవారు. బ్రాహ్మణులు ఇంటికివస్తే వారికి స్వయంపాకానికి కావలసినవన్నీ ఆదరంతో ఇచ్చేవారు.
నారాయణపురంలో బాల్యం : మూర్తిరాజుగారి బాల్యం కొంతమేర సత్యవాడలోనే గడిచింది. ముందు చిననిండ్రకొలను (పత్తేపురం) లో ఉండే వారు. తరువాత తండ్రిగారు నారాయణపురంలో ధాన్యపుకొట్లు కట్టించారు. పండిన ధాన్యాన్ని ఆ కొట్లలో భద్రపరిచేవారు. వర్షాకాలంలోనే నారాయణపురంలో ఉండేవారు.
నారాయణపురంలో వీరి ఇంటికి సమీపంలో గోదావరి ఏలూరు కాలువ పక్కనే పాకలు వేయించి, వాటిలో వివేకానంద మాధ్యమిక పాఠశాలను బాపిరాజుగారు తమ స్వంత యాజమాన్యంలో నిర్వహించేవారు. మూర్తిరాజుగారు ఆ పాఠశాలలోనే మాధ్యమిక విద్�� పూర్తిచేసారు. ఎనిమిదవ తరగతి వరకు అక్కడే చదివారు.
బాపిరాజుగారు 1929లో నారాయణపురంలో వివేకానంద మిడిల్ స్కూల్ నెలకొల్పారు. పిల్లలు ఎవరూ చేరలేదు. ఊరూరు తిరిగి, అందరికీ ప్రచారం చేసి "మీ పిల్లలను చదివించండి, పుస్తకాలు ఇస్తాం, భొజనం పెడతాం" అని వాగ్ధానం చేసారు. పాఠశాలను నిలబెట్టడానికి బాపిరాజుగారు చాలా శ్రమించారు. ప్రభుత్వ అనుమతిని కూడా తెప్పించారు. అందునిమిత్తం 40ఎకరాల భూమిని హామీ ఇవ్వవలసి వచ్చింది. ఇంత చేసినా చివరకు చదువుకునే పిల్లల సంఖ్య పెరగనే లేదు. ఆరు సంవత్సరాల పాటు స్కూలు నడిచింది. ఆ తరువాత నడువలేదు. ఆ రోజుల్లో ఎవరికీ విద్య పట్ల ఆసక్తి లేదు. చదువుకున్నవారు ఏ పని చేయడానికి ఇష్టపడరని, సోమరిపోతులయి పోతారని రైతులు భావించేవారు. స్వాతంత్ర్యోద్యమ తొలిపరిచయం : 1930లో దేశమంతటా ఉప్పు సత్యగ్రహం జరిగింది. అప్పుడు మూర్తిరాజుగారి వయసు పదిసంవత్సరాలు. వివేకానంద్ మిడిల్ స్కూల్ లో చదువుతున్నారు. ఏప్రియల్ 6వ తేదీ చారిత్రాత్మకమైనది. ఆ రోజున గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం చేసారు. అదే విధంగా దేశమంతటా సత్యాగ్రహులు తమ సమీప సముద్రతీరాలలో చట్టవిరుద్దంగా ఉప్పు తయారుచేసి, అరెస్ట్ అయ్యారు. 1930, మార్చి 31వ తేదీన పశ్చిమగోదావరి సత్యాగ్రహయోధులు సర్దార్ దండు నారాయణరాజు, ఆత్మకూరు గోవిందాచార్యులు ఏలూరు నుండి కాలినడకన మట్లపాలెం ఊరేగింపుగా బయల్దేరారు. ఖద్దరు దుస్తులతొ, తెల్ల టోపీలతో, చేతిలో త్రివర్ణపతాకంతో "వందేమాతరం", అనే నినాదంతో ఆకాశం చిల్లులు పడే విధంగా ఆవేశంతో జైకొడుతూ నారాయణపురం కాలువ గట్టు మీద నుంచి సత్యాగ్రహుల ఊరేగింపు ఏప్రిల్ 2వ తేదీకి చేరింది. అప్పుడు విద్యార్థులందరూ జేజేలు చేస్తూ ఊరేగింపును తనివితీరా చూశారు. వారిలో మూర్తిరాజు, వారి స్నేహితులు ఉన్నారు, వారందరూ ఊరేగింపును చూసి ఆకర్షితులయ్యారు. స్కూల్ లో లక్ష్మీపతి ప్రధానోపాధ్యాయులుగా, నరసిం హాచార్యులు మొదలైనవారు చాలా మంచి టీచర్లుగా ఉండేవారు. పాఠాలతోపాటు అనేక విషయాలు చెప్పేవారు. గాంధీ గురించి, ఆయన సిద్ధంతాల గురించి హృదయానికి హత్తుకునేలా చెప్పేవారు. వాస్తవానికి వారివల్ల దేశభక్తి అంటే ఏమిటో, ప్రజాసేవ అంటే ఏమిటొ మూర్తిరాజుకి తెలిసింది. ఉప్పు సత్యాగ్రహులు తమదారిన తాము ఊరేగింపుగా వెళ్ళిపొయారు. మూర్తిరాజు, ఈయనతో పాటు ఉన్న నడింపల్లి సోమరాజు, పెన్మెత్స సోమరాజు, నదింపల్లి విశ్వనాధరాజు మొదలైన ఐదుగురు కుర్రాళ్ళు కాలువ గట్టున కూర్చున్నారు. తమలో తాము మాట్లాడుకొని, జీవహింస చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, మత్స్య, మాంసాలు తినకూడదు అని నిర్ణయించుకున్నారు. ఆనాటి నుంచి మాంసాహారం మానివేశారు. వీరు ఏడుగురు ఎక్కువ స్నేహంగా ఉండేవాళ్ళు కలిసి ఆడుకునేవాళ్ళు. అందరి వయసూ ఒకటే. నారాయణపురంలో మూర్తిరాజు చదువుకుంటున్న రోజులలో ఈయనలో జాతీయోద్యమం ఆకర్షించిన రెండు సంఘటనలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయి. 1929లొ సంఘటన యింతకు ముందు చెప్పుకున్నాం. తిరిగి 1933లొ మహాత్మాగాంధీ ఆంధ్రప్రాంతంలో పర్యటించినప్పుడు వేలాదిమంది ప్రజలు చేబ్రోలు రైల్వేస్టేషన్ లో దర్శించినవారిలో ఈయనా ఉన్నారు. మొదటిసారి 13వ ఏట గాంధీగారిని చూడగా, రెండవసారి 14వ ఏట దర్శించడం జరిగింది. మిడిల్ స్కూల్ లో చదివే రోజులలోనే గాంధీ ప్రభావం మూర్తిరాజు మీద పడింది. తణుకు ఉన్నత పాఠశాలలో చేరిన తరువాత అనేక మంది రాజకీయనాయకుల సభలకు హాజరయ్యేవారు. బాబూ రాజేంద్రప్రసాద్, జయప్రకాశ్ నారాయణ తణుకు వ్చ్చినప్పుది టౌన్ హాల్ లో బహిరంగ సభలు జరిగాయి. వారి ఉపన్యాసాలు మూర్తిరాజుని ఎంతగానో ఆకట్టుకోగా స్నేగితులలో కలిసి విద్యార్థి కాంగ్రెస్ ను ఏర్పాటుచేసారు. ఈయనను అధ్యక్షుడుగా ఉండమన్నారు. కార్యదర్శికి బాధ్యత ఎక్కువ కాబట్టి ఈయన కార్యదర్శి పదవిని ఎంచుకున్నారు.ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ను అధ్యక్షుడుగా చేశారు. విద్యార్థి కాంగ్రెస్ లోని వారంతా ఒకే తరగతిలోని విద్యార్థులు. బాట్లివాలా తాడేపల్లిగూడెం వచ్చినపుడు వీరందరూ తణుకు నుండి సైకిళ్ళమీద వెళ్ళారు. ఆయన మంచి వక్త. ఉంద్రేకంతో మాట్లాడేవారు. బ్రిటిష్ వాళ్ళు కనిపిస్తే ఎక్కడికక్కడే చంపివేయాలని అనేవారు. పొట్టి నిక్కరు, పొట్టి చొక్కా ఇవే ఆయన దుస్తులు. మూర్తిరాజు ఆయన ఉపన్యాసానికి ఉత్తేజితులై ఖద్దరు దుస్తులు, ఖద్దరు టోపీ ఎల్లప్పుడు ధరించడమే కాకుండా విద్యర్ధులందరినీ ఖద్దరు బట్టలు కట్టుకోమని ప్రోత్సహించారు. ఇంతలో మదరాసు ప్రెసిడెన్సీలో 1935 ఎన్నికలలో చక్రవరి రాజగోపాలచారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు మూలుపూరి రంగయ్యగారు జిల్లా బోర్డు అధ్యక్షులుగా ఉన్నారు. రంగయ్య గారు, విద్యార్థి కాంగ్రెస్ అధ్యక్షుడు హరిశ్చంద్రప్రసాద్ ఇరువురూ కలిసి బెజవాడ గోపాలరెడ్డిని తణుకు రప్పించారు. మూర్తిరాజు చదువుకుంటున్న హైస్కూల్ లో సభ జరిగింది. అదపాదడపా జరిగే ఈ తరహా మీటింగ్లన్నిటికీ హాజరయ్యేవారు. చిట్టూరి వారందరూ జస్టిస్ పార్టీవారు, మూళ్ళపూడి హరిశ్చంద్రప్రశాద్ తండ్రి, మూర్తిరాజు కుటుంబం కాంగ్రెస్ వారు. కాంగ్రెస్ వారు మీటింగ్ లు పెట్టబోతే చిట్టూరివారు పెట్టనిచ్చెవారుకాదు. కొవ్వలి గోపాలరావు, పుసులూరి కోదండ రామయ్య (ప్లీడరు), పొతాప్రగడ శ్రీరామారావు (ప్లీడదు), ముదిగంటి జగ్గన్నా శాస్త్రి మొదలైన నాయక్కులు తణుకు లోని కోమల విలాస్ దగ్గర గాంధీబ్బొన్మ్మ వద్ద సభలు జరిపేవారు. మూర్తిరాజు, స్నేహితులు కలసి మీటింగ్ ఏర్పాట్లు చేసేవారు. పెద్దలు మాట్లాడేవారు. వీరంతా కాంగ్రెస్ సానుభూతిపరులు. వీళ్ళు మీటింగ్ పెడితే జస్టిస్ పార్టీవారు స్టేజి ఎక్కి వీళ్ళందరిని తోసివేసేవారు. స్కూల్ లో ఏ మీటింగ్ జరిగినా మూర్తిరాజు స్నేహబృందం తోడ్పాటుతోనే జరిగిగేది. మూర్తిరాజు దృష్టి చదువు మీద కంటే రాజకీయాలమీదే ఎక్కువగా ఉండేది. చదువుపట్ల శ్రద్ధ ఉండేది కాదు. కొంచెంసేపు చదివితే తలనొప్పి గాని, నిద్రగాని వచ్చేది. ఆ రోజులలో రూపాయి విలువ చాలా ఎక్కువ. నెలకు ఏడురూపాయలు ఇస్తే మూడు పూటలా భోజనం పెట్టేవారు. మూర్తిరాజు అంత చిన్నతనంలో ఉన్నప్పుడు కూడా ఇబ్బందిలో ఉండే సహాధ్యాయులకు సాయం చేసేవారు. ఎంత ఖర్చు పెట్టినదీ ఎప్పుడూ అకౌంట్ రాయలేదు. చిన్నప్పటినుంచీ అంతే. ఈరోజునా అంతే. తండ్రి బాపిరాజు ఈయనను చూడటానికి తణుకు వచ్చేవారు. ఈయన చేత ఎలాగైనా అకౌంట్ రాయించాలని పట్టుదలగా ఉండేవారు. ఈయనతో పాటు ఈయన మేనల్లుడు రామలింగరాజు ఉండేవాడు. డబ్బు ఆయన చేతికి ఇచ్చేవారు. ఆయనను అకౌంట్ రాయమనేవారు. మూర్తిరాజు మాత్రం రాయరు. తండ్రిగారు ఎంత చెప్పినా అకౌంట్ రాయడం అబ్బలేదు. ఉన్నతవరకు లెక్కలేకుండా ఇచ్చివేయడమే అలవాటయింది. ఒకసారి హైస్కూల్ లో మూర్తిరాజు సాటివ్ద్యర్ధులతో నాటకం వేయించారు. నటించడం అంటే ఈయనకు ఎంతో ఇష్టం. నటన నటన మాత్రమే కాదు, లలిత కళలన్నా ఇష్టమే. చాలా నేర్చుకోవాలని అనుకునే వారేగాని కాలం అనుకూలించలేదు. ఈనాటికీ 90 సంవత్సరాల వయసు దాటినా నేర్చుకోవాలనే కాంక్ష పోలేదు. మూర్తిరాజు చదువుతున్న రోజులలో ఒక సంఘటన జరిగింది. అడపా నారాయణకు సైకిల్ షాపు, బట్టలకొట్టు ఉండేది. ఒక రోజున నారాయణపురంలోకి విడేశీ ఇంగ్లీష్ ఫ్యాషన్ అయిన బట్టలు అమ్మకానికి వచ్చాయి. అవి బాగున్నాయని నాలుగు రకాల దుస్తులు ఎంచుకొని తెచ్చుకున్నారు. ఆ బట్టలలో ఒక జత తొడుక్కుని, ఇంటి బయటకు వస్తుంటే అది తండ్రిగారి కటబడింది ఆయన తన పక్కనున్నవారితో "మా వాడు రంగుల బట్టలు కట్టుకున్నాడు." అని అంటున్నారు. అది మూర్తిరాజు విని వెంటనే ఇంట్లోకి వెళ్ళి మామూలు దుస్తులు వేసుకున్నారు. ఈయన సాధారణంగా తండ్రిగారి ఎదుట పడేవారుకాదు. తండ్రిగారు ఏమంటారో అని. ఆయన అభిమతం తెలుసుకొని అమలు జరపడం పిల్లల ఆనవాయితీగా ఉండేది. తండ్రిగారు తీరిక సమయాలలో నలుగురితో కూర్చుని మాట్లాడ్టం, అప్పుడప్పుడు భగవతం, రామాయణం వంటి పురాణాలు చదివి, అర్ఢం చెప్పడంతో కాలక్షేపం చేసేవారు. ఆయన ఎప్పుడూ సత్యమే మాట్లాడేవారు. ఎవరిని 'ఒరేయి ' అనకూడదు. మర్యాదగా మాట్లాడాలని చెప్పేవారు. మూర్తిరాజు చదువుకునే రోజులలో ఒకసారి కమ్మవారి ఇంటిలో అప్పసాని అచ్తూతరామయ్య, అప్పసాని సుబ్బారావులతో కలసి భోజనం చేసారు. ఇంది తెలిసి ఊరిలోని పెద్దలు ఈయన తండ్రిగారికి ఫిర్యాదు చేశారు. తండ్రిగారు ఈయనను మందలిస్తూ, ఇంకెప్పుడూ ఇలా చేయవద్దని అన్నారు. ఆ రోజులలో రాజులు ఎక్కడికైనా వెళ్ళి నప్పుడు బ్రాహ్మణులు, క్షత్రియులు ఇళ్ళలో తప్ప ఎక్కడా భోజనం చేసేవారు కాదు. తిన్న ఆకును వారే తీసివేసేవారు. ఇప్పటి రోజులలో ఆ మర్యాదలు ఏమీలేవు. ఆనాడు పెద్దవారు ఏమి చేస్తే దాన్ని చేయడమే తప్ప "చేయను" అని పిల్లలు అనేవారు కారు. మూర్తిరాజు తణుకులో 1934 నుండి 1939 వరకు విద్యాభ్యాసం చేసారు. 1939 మార్చి నెలలో స్కూలు ఫైనల్ పరీక్ష జరగగా, అందులో ఫెయిలయ్యారు. దానితో చదువు మాని స్వగ్రామానికి తిరిగివెళ్ళారు. ఆతర్వాత చదువు కొనసాగించడానికి ప్రయత్నించలేదు. ఈయన తండ్రిగారికి మాత్రం మూర్తిరాజు బాగా చదువుకోవాలనే అభిలాష ఉండేది. ట్యూషన్ ఏర్పాటు చేశారు. కాని, ట్యూషన్ కు వెళ్ళడంలో ఈయన అశ్రద్ధ చేసేవారు. చదవడానికి మనస్కరించేది కాదు, ఆసక్తి అంతా రాజకీయాలలో ఉండేది. తణుకు నుండి తిరిగి వచ్చిన తర్వాత గుర్రపుస్వారీ నేర్చుకున్నారు. నేర్చుకొనక తప్పని పరిస్థితి. ఆ రోజుల్లో రోడ్లు లేవు. కాలువగట్టు దారులూ, పుంతలూ ఉండేవి. నారాయణపురం నుంచి పత్తేపురం రావటానికి మార్గం లేదు. వర్షాకాలంలో కయ్యలు బాగా లోతుగా వుండేవి. గుర్రం కూడా ఎంతో కష్టపడి నడిచేది. అందుకే వర్షాకాలం పూర్తయ్యేవరుకు కుటుంబం అంతా నారాయణపురంలోనే మకాం ఉండేవారు. మూర్తిరాజు తండ్రి చాలా శక్తిమంతులు. పట్టుదల గలవారు. ఆయన ఏది చెబితే అది జరగాలి. ఆయన చదువులకు ఉపాధ్యాయులను ఇంటికి పిలిపించి వారి చేత పిల్లలకు చెప్పించేవారు. అక్షరాలు గుండ్రంగా రాయాలని చెప్పేవారు. చుట్టుప్రక్కల ఊళ్ళలో ఎవరైనా గొడవలు పడితే ఆ తగవులు ఆయనే తీర్చేవారు. మూర్తిరాజుగారు కూడా కొంతకాలం అలాగే చేశారు. తండ్రి బాపిరాజు చాలా పలుకుబడి గలవారు. 1936లో లోకల్ బోర్డులు వచ్చాయి. అప్పుడు జటిస్ పార్టీకి బలం ఉండేది. సర్ కూర్మా వెంకటరెడ్డినాయుడు గవర్నరు అయ్యారు. బడేటి వెంకట్రామయ్యనాయుడు, పెన్మెత్స పెద్దిరాజు జిల్లాలోని పెద్ద నాయకులు. బాపిరాజు తాలూకా బోర్డు సభ్యులుగా ఉండేవారు. బోర్డు మీటింగ్ కు వచ్చిన సభ్యులకు ప్రయాణపు ఖర్చులు ఇచ్చే పద్ధతిని మనం మానుకొందామని ఆయన మీటింగ్ లో తీర్మానం ప్రవేశపెడితే సభ్యులు అంగీకరించలేదు. ఆయన వెంటనే తన సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ప్రజాసేవకే అంకితం: బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మూర్తిరాజు తన జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేశారు. చిన్నతనంలోనే మహాత్మాగాంధీ ప్రభావం ఆయనపై పడింది. చివరి వరకు ఆయన నిజమైన గాంధేయవాదిగానే ఉన్నారు. మహాత్మాగాంధీ దేశ పర్యటనలో భాగంగా 1929లో జిల్లాకు వచ్చినప్పుడు చేబ్రోలు రైల్వేస్టేషనులో ఆయనను చూశారు. అప్పటి నుంచి గాంధీ మార్గంలోనే నడిచారు. గాంధేయవాదిగా ముద్ర వేసుకొని సత్యం, అహింస, స్వదేశీ విధానాలను తాను ఆచరించడమే కాకుండా జిల్లా వ్యాప్తంగా వాటికి విశేష ప్రచారం కల్పించారు. మాంసాహారానికి దూరంగా ఉన్నారు. చిన్నతనం నుంచే ఖద్దరు వస్త్రాలను ధరించడం మొదలు పెట్టారు. తన పక్క గ్రామమైన పెదనిండ్రకొలనులో పార్లమెంటు నమూనాలో గాంధీభవనం నిర్మించి ప్రజల స్మృతిపథం నుంచి మహాత్ముని చెరిగిపోకుండా చేశారు. సర్వోదయ ఉద్యమానికి ఊపిరులూదారు. 1955లో వినోభాబావే భూదానోద్యమంలో భాగంగా జిల్లాకు వచ్చినప్పుడు 100 ఎకరాల భూమిని దానం చేశారు. 1961లో ఉంగుటూరు మండలం నాచుగుంటలో అఖిల భారత సర్వోదయ సమ్మేళనం నిర్వహంచారు. విద్యారంగంపై తిరుగులేని ముద్ర: విద్యారంగంలో మూర్తిరాజు తనదైన ముద్ర వేశారు. భీమవరం, ఏలూరు నగరాలకే పరిమితమైన విద్యను గ్రామీణ ప్రాంతాలకు తీసుకొచ్చిన ఘనత ఆయనదే. తాను ఎస్‌ఎస్‌ఎల్‌సీ వరకు చదివినా చదువు విలువ గుర్తించి ప్రతి ఒక్కరూ విద్యావంతులను చేయాలనే తపన పడేవారు. బాపిరాజు ధర్మసంస్థ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. వాటన్నింటికి దేశ నాయకుల పేర్లు పెట్టారు. కుటుంబంలో మహిళ చదువుకుంటే ఆ ఇల్లంతా విద్యావంతులవుతారనేది ఆయన దృఢ విశ్వాసం. అందుకోసం ఆయన జీవితాంతం కృషి చేశారు. కళల్ని సాహిత్యాన్ని ప్రేమించే మూర్తిరాజు కళాకారులకు ఎందరికో ఉపాధి చూపించారు. భూరి విరాళాలిచ్చి అభినవ భోజుడిగా పేరుపొందారు.. నేడు సినీరంగంలో ప్రముఖ హాస్య నటునిగా కొనసాగుతున్న ఎంఎస్ నారాయణ, పురాణ వ్యాఖ్యాత మైలవరపు శ్రీనివాసరావు ఆయన నెలకొల్పిన పాఠశాలల విద్యార్థులే. ప్రముఖ రచయిత, నటులు పరుచూరి గోపాలకృష్ణ ఆయన స్థాపించిన కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. మాజీ మంత్రులు దండు శివరామరాజు, మరో మాజీ మంత్రి కంతేటి సత్యనారాయణరాజులు ఆయన శిష్యులే.
ఆరు సార్లు ఎమ్మెల్యేగా
[మార్చు]చిన్ననాటనే రాజకీయాల్లో ప్రవేశించి ఆరుసార్లు ఎమ్మ��ల్యేగా ఎన్నికయ్యారు. 1952 నుంచి 1982 వరకు తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, పెంటపాడు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్కెటింగు, గిడ్డంగులు, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రోటెం స్పీకరుగా కూడా పనిచేశారు.
ఆశయం..కొల్లేరు జిల్లా
[మార్చు]దుర్భర దారిద్య్రంతో అలమటిస్తున్న కొల్లేరు ప్రజల అభ్యున్నతికి కృషి చేశారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో కొన్ని ప్రాంతాలను కలిపి కొల్లేరును జిల్లాగా చేయాలన్న ఆయన ఆశయం నెరవేరలేదు. ఈ విషయంపై అనేకమంది ముఖ్యమంత్రులతో పోరాటాలు కూడా చేశారు.
మూలాలు
[మార్చు]- courtesy with Eenadu news paper-14/11/2012
యితర లింకులు
[మార్చు]- వికీకరించవలసిన వ్యాసాలు
- తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు
- 1919 జననాలు
- 2012 మరణాలు
- విలీనము చేయవలసిన వ్యాసములు
- గాంధేయవాదులు
- పశ్చిమ గోదావరి జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు
- పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు
- పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు
- పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన భూదాతలు
- తెలుగు గ్రంధాలయ ప్రముఖులు
- ఆంధ్ర రాష్ట్రంలో శాసన సభ్యులు