గోరా
గోపరాజు రామచంద్రరావు | |
---|---|
జననం | గోపరాజు రామచంద్రరావు 1902 నవంబరు 15 ఒడిశా లోని ఛత్రపురం |
మరణం | 1975 జూలై 26 విజయవాడ | (వయసు 72)
ఇతర పేర్లు | గోరా |
ప్రసిద్ధి | హేతువాది, నాస్తికవాద నేత |
భార్య / భర్త | సరస్వతి గోరా |
పిల్లలు | 9 మంది పిల్లలు |
గోరా గా ప్రసిద్ధి చెందిన గోపరాజు రామచంద్రరావు (1902 నవంబరు 15 - 1975 జూలై 26) సంఘసంస్కర్త, హేతువాది, నాస్తికవాద నేత. గోరా నవంబరు 15, 1902 న ఒడిషా లోని ఛత్రపురంలో పుట్టారు. పెళ్ళికి ముందే సెక్స్ పై అవగాహనలు, కుటుంబ నియంత్రణ వంటి వాటితో పాటు అప్పటి తెలుగు సమాజంలో ఎన్నో విప్లవాత్మక మార్పులను తెచ్చిపెట్టిన ఘనత గోరాదే.
ప్రారంభ జీవితం
[మార్చు]గోరా, ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలోని ఛత్రపురంలో 1902, నవంబరు 15 న ఉన్నతకుల హిందూ కుటుంబంలో వెంకట సుబ్బారావు, రాజ్యలక్ష్మి దంపతులకు జన్మించాడు. తండ్రి పేరొందిన భక్తి కీర్తనల రచయిత. ఆయన రాసిన కీర్తనలు ఆకాశవాణి భక్తిరంజనిలో ఇప్పటికీ ప్రసారం అవుతుంటాయి.
పర్లాకిమిడిలో ప్రాథమిక విద్యాభాసం పూర్తిచేసిన తర్వాత 1913 లో పిఠాపురం రాజా కళాశాల ఉన్నత పాఠశాలలో చదివారు. 1920 లో అక్కడ ఇంటర్మీడియట్ పూర్తిచేసాక గోరా, అప్పుడే ప్రారంభమౌతున్న సహాయ నిరాకరణోద్యమంలో దూకాడు. 1922లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో వృక్షశాస్త్రంలో బి.ఏ చేశారు. 1922 లో సరస్వతి గోరాని ఆమెకు 10 ఏళ్ళ వయసు లోనే పెళ్ళి చేసుకున్నాడు. వివాహానంతరం 1925 లో మదురై లోని మిషన్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరాడు.[1] కోయంబత్తూరు వ్యవసాయ కళాశాలలో ప్రత్తి పరిశోధనా సహాయకుడిగా, ఆ తర్వాత 1927 లో శ్రీలంక రాజధాని కొలంబో లోని ఆనందా కళాశాలలో జీవశాస్త్ర అధ్యాపకునిగా[1], 1928లో కాకినాడ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు.[2] తాను నడిచే మార్గం తండ్రికి ఇష్టం లేకపోవడంతో 1928 లో భార్యపిల్లలతో ఇంటిని వదిలేసి వచ్చాడు. స్వతంత్ర భావాలుగల గోరా ఎక్కడా ఉద్యోగంలో నిలువలేకపోయాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో వృక్షశాస్త్రంలో మాష్టర్ డిగ్రీలో ఉత్తీర్ణుడయ్యాడు.
నాస్తిక కేంద్రం
[మార్చు]గోరా పాతికేళ్ళ వయసు వరకు ఆస్తికుడే. ఆ తరువాత నాస్తిక సిద్ధాంతాలతో జీవితాంతం కృషి చేసాడు. సంఘం, ఆర్ధిక సమత అనే పత్రికలు నడిపారు. వర్ణవ్యవస్థ, అంటరానితనంపై యుద్ధం ప్రకటించిన గోరా 1940 లో భార్యతో కలసి 1940, ఆగస్టు 10న కృష్ణా జిల్లా, ముదునూరులో ప్రపంచంలోనే మొట్టమొదటి నాస్తిక కేంద్రాన్ని 80 మంది యువకులతో ప్రారంభించారు. ఈ కేంద్రం ప్రారంభంతో గోరా జీవితంలో నూతన అధ్యాయం మొదలైంది. 1940 నుంచి 1944 వరకు ముదునూరు చుట్టుపక్కల అక్షరాస్యత, అస్పృశ్యత, సహపంక్తి భోజనాలు వంటి ఉద్యమాలు నిర్వహించారు. భారతదేశ స్వాతంత్ర్యం వస్తున్న సందర్భంగా, 1947 ఏప్రిల్లో, నాస్తిక కేంద్రాన్ని విజయవాడలోని పటమటకు తరలించాడు.
సంఘ సంస్కరణ
[మార్చు]1944 లో మహాత్మా గాంధీ కోరిక మేరకు అఖిల భారత కాంగ్రేస్ ఆర్గనైజర్‌గా అలహాబాద్, ఢిల్లీలలో పనిచేశారు. స్వాతంత్ర్య సమరయోధుని గానే కాక, సాంఘిక, ఆర్థిక సమానత్వ సాధనకు, మూఢ నమ్మకాల నిర్మూలనకు, ప్రజల్లో శాస్త్రీయ దృష్టిని పెంపొందించడానికి, వయోజన విద్యా వ్యాప్తికి, కుల, మత తత్వాల నిర్మూలనకు అనితర కృషి గోరా సల్పారు. గాంధీతో నాస్తికత్వంపై చర్చలు జరిపి, అస్పృశ్యతా నిర్మూలన కోసం కృషి చేసారు. దళితుల దేవాలయ ప్రవేశాన్ని, సమష్టి భోజనాలను, వివాహాలను విస్తృతంగా అతను నిర్వహించారు. ఈ విధంగా సాంఘిక సమానత్వ సాధనకు పెద్దఎత్తున కృషి చేయడమే కాక, నాస్తికత్వాన్ని నిర్మాణాత్మక జీవిత విధానంగా ప్రతిపాదించారు. దైవకేంద్ర సమాజం నుంచి మానవ కేంద్రం సమాజంవైపు పురోగమించడానికి మతానంతర సామాజిక వ్యవస్థ నిర్మాణానికి అతను ఎంతగానో తపించారు.
1949, జనవరి 30 న గోరా సంపాదకత్వంలో 'సంఘం' తొలి సంచిక వెలువడింది. ఆ తరువాత గాంధీ పేరుతో సంఘం స్థాపించాడు. 1962-63లో భారతదేశమంతా పర్యటించి పార్టీ రహిత ప్రజాస్వామ్యం, నిరాడంబరత్వం గురించి విశేష ప్రచారం చేశాడు. పార్టీరహిత ప్రజాస్వామ్య సిద్ధాంతంపై ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులను ఒకే వేదికపైకి తెచ్చి కామన్ ప్లాట్‌ఫారం పద్ధతి ప్రవేశపెట్టిన ఘనత గోరాదే. సెక్యులర్ వ్యవస్థతో పాటు నాస్తికత్వ వ్యాప్తికీ గోరా ఐదు ఖండాలలో విస్తృతంగా పర్యటించారు. స్వంత ఆస్తి అనేది లేకుండా, పూర్తిగా ప్రజలపై ఆధారపడి తన కార్యక్రమాలు కొనసాగించారు. 1968 జనవరిలో 'ది ఏథియిస్ట్' అనే ఇంగ్లీషు మాసపత్రిక ప్రారంభించి అంతర్జాతీయ సంబంధాలు పెంచుకున్నారు. 1972లో విజయవాడలో మొట్టమొదటి ప్రపంచ నాస్తిక మహాసభలను నిర్వహించారు. 1980 లో రెండవ ప్రపంచ నాస్తిక మహాసభలు కూడా విజయవాడలో నిర్వహించగా, 3వ ప్రపంచ నాస్తిక మహాసభలు ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీలో నిర్వహించారు.
సంతానం
[మార్చు]గోరాకు తొమ్మిది మంది సంతానం. గోరా తన కుమారులకు వారు పుట్టినప్పటి ప్రపంచ, దేశ పరిస్థితులకు అద్దం పడుతూ విలక్షణమైన పేర్లు పెట్టాడు. ఉప్పు సత్యాగ్రహం సాగుతున్న కాలంలో పుట్టిన కుమారునికి లవణం అని, భారతీయులు ఛట్ట సభల్లో నిలిచి గెలిచిన కాలంలో పుట్టిన కొడుక్కు విజయం అని, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో పుట్టిన కుమారులకు సమరం, నియంత అని, తొమ్మిదవ సంతానానికి నవ్ అని పేర్లు పెట్టారు. గాంధీ ఇర్విన్ ఒడంబడిక సందర్భంలో పుట్టిన అమ్మాయికి మైత్రి అని పేరుపెట్టాడు. మరో కుమార్తె పేరు మనోరమ. ఈ విధంగా సముచితమైన పేర్లు పెట్టే విధానానికి ఆద్యుడయ్యాడు. గోరా ఆచరణ వాది. గ్రహణం సమయంలో గర్భిణులు బయట తిరిగినంతమాత్రాన పుట్టబోయే పిల్లలకి గ్రహణం మొర్రి రాదు అని నిరూపించడానికి గోరా తన భార్యకు గర్భంతో ఉండగా గ్రహణం వచ్చినపుడు ఆమెని బయటకి తీ���ుకువెళ్ళి తిప్పేవారు. గోరా పిల్లలలో ఎవరికీ గ్రహణం మొర్రి రాలేదు. గోరా గారు విద్య యొక్క ప్రాముఖ్యతను తెలిపేందుకు ఆయన తన కుమార్తెకు విద్య అని పేర్లు పెట్టారు ఈమె విజయవాడ తూర్పు నియోజకవర్గం పార్లమెంటు సభ్యురాలు గా పనిచేశారు
సరస్వతి గోరా
[మార్చు]గోరా సతీమణి సరస్వతి గోరా కూడా భర్త అడుగుజాడల్లో నడిచారు. ఈమె సంఘసేవిక, మతాతీత మానవతావాది. మానవులంతా సమానమనే భావం సమాజంలో నెలకొనాలంటే, ఇన్ని కులాలు, మత విశ్వాసాలుంటే సాధ్యంకాదు. నాస్తిక వాదమొక్కటే శరణ్యం. కులమత రహిత సమసమాజమే ధ్యేయం అనేవారు. ఈమె విజయనగరంలో 1912 లో జన్మించింది. పదేళ్ల వయసులో గోరాతో పెళ్ళయ్యింది. గోరాతో పాటు సరస్వతీ గోరా 1928 ప్రాంతాల్లో శ్రీలంకలో ఉన్నారు. మతాచారాల్ని ధిక్కంచారు. పైగా ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు కావాలని గ్రహణం చూశారు. రాహువు, కేతువులు మానవ సమాజంలోనే ఉన్నారన్నారు. నిప్పులమీద నడవడమనేది దేవతల మహాత్మ్యం కాదని ఎవరైనా నడవవచ్చని ఆమె స్వయంగా నిప్పుల మీద నడచి ఋజువు చేసింది. దేవదాసీ వ్యవస్థ భ్రష్టాచారమంటూ దేవదాసీలకు స్వయంగా వివాహం జరిపించారు. కుల నిర్మూలన, నాస్తిక వాదాల్ని విస్తృతంగా ప్రచారం చేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని కొన్నాళ్లు జైలుశిక్ష అనుభవించారు. అస్పృశ్యతా నివారణ ఉద్యమం చేపట్టారు. మహాత్మా గాంధీజీ ఆమె సేవల్ని గుర్తించి సేవాగ్రామ్‌కు ఆహ్వానించారు. ఆహార కొరత ఉన్న రోజుల్లో కూరగాయలు పండించాలని ఉద్యమించారు. ఈనాం భూముల్ని పొలాలు లేని రైతులకు పంచాలని సత్యాగ్రహం చేపట్టారు. ఆచార్య వినోబాభావే చేపట్టిన సర్వోదయ ఉద్యమాన్ని చేపట్టి దేశమంతా పర్యటించి వినోబాభావే ఆశయాలకు వ్యాప్తి కల్పించారు.మతాన్ని సూచించే ఏ ఆభరణాలు, చిహ్నాలు ఆమె ధరించే వారు కాదు. పుణ్యవతిగా బొట్టు, కాటుక, గాజులు, మంగళసూత్రాలు వంటివి ధరించలేదు. 1975 జూలై 26న గోరా మరణించినప్పుడు ఆమె అభిమతానికి అనుగుణంగా ఏ మత సంప్రదాయాన్ని పాటించకుండా సంస్కారాలు జరిపించారు.
గోరా భావాలు
[మార్చు]"దేవుడు అబద్ధం. నీతి పెరగాలంటే దైవభావం పోవాలి. జాతి, మతం, కులం పేరుతో ప్రజల మధ్య విషం పెరుగుతున్నది. నాస్తికంలో ఈ వివక్షలకు తావులేదు. దేవుడు, కర్మ అనే భావాలు పోతే, మనిషి మతస్తుడిగా కాకుండా మానవుడిగా మిగులుతాడు. సోదరభావం పెరుగుతుంద "ని గోరా భావించాడు.
1975, జూలై 26 న విజయవాడలో భారత గ్రామీణ సమాజంలో మార్పులు ఎలా తీసుకురావాలి అనే అంశంపై ప్రసంగిస్తూ గోరా తుదిశ్వాస వదిలాడు. 2002 లో గోరా శత జయంతి సందర్భంగా, భారతప్రభుత్వ తపాలాశాఖ గోరా స్మృత్యర్ధం, 5 రూపాయల విలువ కలిగిన ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.
గోరా రచనలు
[మార్చు]గోరా అనేక రచనలను చేశాడు.
- నాస్తికత్వం (దేవుడులేడు) 1941
- దేవుని పుట్టుపూర్వోత్తరాలు 1951
- జీవితంనేర్పిన పాఠాలు 1976
- నేను నాస్తికుణ్ణి 1976
- సృష్టి రహస్యం 1976
- సంఘదృష్టి 1980
- ఆర్ధిక సమానత్వం 1980
- నాస్తికత్వం-ప్రశ్నోత్తరాలు 1980
- నాస్తికత్వం -ఆవశ్యకత 1980
- ఎన్ ఏథిస్ట్ విథ్ గాంధీ 1951
- పాజిటివ్ ఏథీయిజమ్ 1972
- వి బికమ్ ఏథీస్ట్స్
- ఐ లెర్న్ 1976
- పీపుల్ అండ్ ప్రోగ్రెస్ 1981
- ఏ నోట్ ఆన్ ఏథీయిజమ్ 1981
- ద నీడ్ ఆఫ్ ఏథీయిజమ్
ఇవి కూడా చూడండి
[మార్చు]- గాంధీజీ తో గోరా Archived 2014-03-31 at the Wayback Machine
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Goparaju Ramachandra Rao, the atheist who worked to spread Gandhian ideology across Andhra region". The Times of India. 2022-08-14. ISSN 0971-8257. Archived from the original on 2022-12-22. Retrieved 2024-08-29.
- ↑ "మహాత్మాగాంధీతో బెజవాడ నాస్తిక కేంద్రానికి ఉన్న బంధం ఏంటి?". BBC News తెలుగు. Archived from the original on 2022-10-03. Retrieved 2024-08-29.
వనరులు
[మార్చు]
- గోరా వంశవృక్షం
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- కృష్ణా జిల్లా హేతువాదులు
- తెలుగు కవులు
- 1902 జననాలు
- 1912 జననాలు
- 1975 మరణాలు
- తమ పేరిట స్మారక పోస్టల్ స్టాంపు విడుదలైన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
- విజయవాడ వ్యక్తులు
- కృష్ణా జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు
- కృష్ణా జిల్లా రచయితలు
- కృష్ణా జిల్లా సంఘ సంస్కర్తలు