Jump to content

ఏ మాయ చేశావే

వికీపీడియా నుండి
ఏ మాయ చేశావే
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం గౌతమ్ మీనన్
కథ గౌతమ్ మీనన్
చిత్రానువాదం గౌతమ్ మీనన్
తారాగణం అక్కినేని నాగ చైతన్య
సమంత
కృష్ణుడు
పూరీ జగన్నాథ్
సంగీతం ఏ.ఆర్.రెహ్మాన్
నిర్మాణ సంస్థ ఇందిరా ప్రొడక్షన్స్
విడుదల తేదీ 26 ఫిబ్రవరి 2010
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఇందిరా ప్రోడక్షన్స్ పతాకం పై ఘట్టమనేని మంజుల నిర్మాతగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథాచిత్రం ఏ మాయ చేశావే. అక్కినేని నాగ చైతన్య, సమంత ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందించారు.[1] 2010 ఫిబ్రవరి 26న విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. నాగ చైతన్య, సమంతలకు తొలి తెలుగు విజయవంత చిత్రంగా నిలిచిపోయిన ఈ సినిమా నేటికీ తెలుగులో వచ్చిన అమర ప్రేమకథాచిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఏ.ఆర్.రెహ్మాన్ అందించిన సంగీతం నేటికీ విశేషంగా ఆదరించబడుతోంది. కార్తీక్ అనే యువ అసిస్టంట్ డైరెక్టరుకీ, తనకంటే రెండేళ్ళు పెద్దదైన జెస్సీ అనే మలయాళ క్రిష్టియన్ అమ్మాయికీ మధ్య నడిచిన ప్రేఅమాయణాన్నీ, ఈ ప్రయాణంలో వారు వారి కుటుంబాల నుంచి ఎదురుకున్న ఒడిదుడుకుల నేపథ్యంలో సాగే ఈ సినిమా ఏకకాలంలో తమిళంలో శింబు, త్రిష ముఖ్య పాత్రల్లో ఈ సినిమా "విన్నైతాండి వరువాయా" పేరుతో తెరకెక్కింది. ఈ సినిమా నటవర్గం, పతాక సన్నివేశం ఏ మాయ చేశావే సినిమాకి పూర్తి విభిన్నంగా ఉంటుంది. ఈ సినిమా కూడా భారీ విజయం సాధించింది. కానీ ఈ సినిమా హింది పునః నిర్మాణమైన ఏక్ థా దీవానా మాత్రం పరాజయం చవి చూసింది.

తన ఇంజినీరింగ్ పూర్తిచేసుకున్న కార్తీక్ (అక్కినేని నాగ చైతన్య) సినిమా దర్శకుడవ్వాలని కలలు కంటుంటాడు. తన స్నేహితుడి ద్వారా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ దగ్గర అసిస్టంట్ గా చేరుతాడు. ఇంతలో తన ఇంటి పైపోర్షనులో కేరళ నుంచి వచ్చిన ఒక క్రిష్టియన్ కుటుంబానికి కార్తీక్ ప్రోత్సాహం మీద ఇల్లు అద్దెకి ఇస్తాడు కార్తీక్ తండ్రి. ఐతే వాళ్ళ కూతురు జెస్సీ (సమంత)ని చూసి ప్రేమలో పడతాడు కార్తీక్. తన తండ్రికి భయపడుతున్న కార్తీక్ ఒక రోజు ఎవరూలేని సమయం చూసి జెస్సీకి తన ప్రేమ విషయం చెప్తాడు. దీనికి ఒప్పుకోని జెస్సీ తరువాత తన ఊరికి బయలుదేరిందని కార్తీక్ తెలుసుకుంటాడు. తన స్నేహితుడి (కృష్ణుడు)తో కలిసి ఆ ఊరికి .చేరుకున్న కార్తీక్ జెస్సీని కలిసి తన ప్రవర్తనకు క్షమాపణలడిగి, స్నేహితులుగా కొనసాగుదామని చెప్తాడు.కార్తీక్ పై ఎలాంటి ఆలోచనలు లేవని స్పష్టం చేసిన జెస్సీ తన స్నేహానికి ఒప్పుకుని తన ఇంట్లోవారికి తన క్లాస్ మేట్ గా పరిచయం చేస్తుంది. ఆపై ట్రైనులో హైదరాబాద్ కు వెళ్తున్నప్పుడు కార్తీక్ జెస్సీని ముద్దుపెట్టుకుంటాడు. మళ్ళీ గొడవలు మొదలవుతాయి. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనుకున్న జెస్సీ సోదరుడు కార్తీక్ తో గొడవ పెట్టుకుని తన్నులు తింటాడు. జెస్సీ తల్లిదండ్రులకు కూడా అనుమానం రావడంతో పెళ్ళికి ఏర్పాట్లు చేస్తారు. కానీ ఈ పెళ్ళి తనకి ఇష్టం లేదని జెస్సి తేల్చిచెప్పడంతో పెళ్ళి ఆగిపోతుంది. జెస్సీని చూడాలని వచ్చిన కార్తీక్ జరిగింది తెలుసుకుని జెస్సీ ఇంటికి వెళ్తాడు. అక్కడ జెస్సీని కలిసి తనని జెస్సీ గాఢంగా ప్రేమిస్తోందనీ, ఇది తెలిస్తే రెండు కుటుంబాల్లో గొడవలు చెలరేగుతాయనీ తన మాటలను బట్టి తెలుసుకుంటాడు కార్తీక్. ఆపై వారిద్దరు వారి కుటుంబాలకి తెలియకుండా హైదరాబాద్ లో ఒకరినొకరు ప్రేమించుకుంటూ హాయిగా కాలం వెళ్ళదీస్తుంటారు. అంతా సాఫీగా జరుగుతుండగా పూరీ జగన్నాధ్ గోవాలో షూటింగ్ కి తన యూనిట్ తో కలిసి వెళ్తాడు. 45 రోజులు సాగే ఈ ��ూటింగ్ లో కార్తీక్ కూడా ఒక భాగం. షూటింగ్ జరుగుతుండగా జెస్సీ ఇంట్లో తన పెళ్ళి గురించి చర్చలు జరుగుతుంటాయి. దానితో భయపడిపోయి జెస్సీ కార్తీక్ కి ఫోన్ చేస్తుంది. తను షూటింగ్ లో పాల్గొంటున్న లోకేషన్లలో సిగ్నల్స్ లేక పోవడం, దర్శకుడైన పూరీ జగన్నాధ్ సెట్స్ లో ఫోన్ల వాడకం నిషేధించడం వల్ల ఇప్పుడు మాట్లాడలేనని, తిరిగి వచ్చాక మాట్లాడుకుందామని ఫోన్ కట్ చేస్తాడు. దానితో జెస్సీ తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదనీ, తమ ఇద్దరి జీవిత లక్ష్యాలు వేరనీ చెప్పి కార్తీక్ తో విడిపోతుంది. తన తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధం ఒప్పుకుని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయిందని తెలుసుకుని నివ్వెరబోతాడు కార్తీక్. రెండేళ్ళ తర్వాత తనతో పాటు అసిస్టంట్ గా పనిచేసిన నందిని తనని ప్రేమిస్తున్నానై కార్తీక్ తో చెప్తుంది. ఇంకా జెస్సీని మర్చిపోని కార్తీక్ తన ప్రేమని సున్నితంగా తిరస్కరించి, స్నేహితునిగా మిగిలిపోతాడు. పూరీ జగన్నాధ్ దగ్గర పనిచేసిన తర్వాత తన ప్రేమ కథను సినిమాగా తెరకెక్కించాలని పూనుకుంటాడు కార్తీక్. ఇందుకోసం తన పాత్రకు ప్రముఖ తెలుగు నటుడు శింబును, జెస్సీ పాత్రకు ప్రముఖ నటి త్రిషను ఎంచుకుని వారిచే ఒప్పిస్తాడు. పతాక సన్నివేశం లేకుండా చిత్రీకరణ జరుపుకుంటున్న ఆ సినిమాకి జెస్సీ అని పేరు పెడతాడు కార్తీక్. న్యూయార్క్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ మళ్ళీ జెస్సీని కలుసుకుంటాడు కార్తీక్. జెస్సీకి పెళ్ళైందని నమ్ముతున్న కార్తీక్ ఇంకా తను నిన్నే ప్రేమిస్తున్ననని జెస్సీతో చెప్పకనే చెప్తాడు కార్తీక్. కానీ జెస్సీ తనకి ఇంకా పెళ్ళి కాలేదనీ, కార్తీక్ తో తన పెళ్ళికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని ఆ పెళ్ళి ఆపుకుని, తన తల్లిదండ్రులకు దూరమయ్యానని చెప్తుంది. ఏం జరిగినా వారిద్దరూ పెళ్ళి చేసుకుని కలిసి బ్రతకాలని నిశ్చయించుకుని చర్చిలో, గుడిలో ఒకే రోజు పెళ్ళి చేసుకుంటారు. ఇద్దరూ కలిసి హైదరాబాద్లో జెస్సీ సినిమా చూస్తుండటంతో కథ సుఖాంతమౌతుంది.

తారాగణం

[మార్చు]

సంగీతం

[మార్చు]

ఏ మాయ చేశావే సినిమాకి ఏ.ఆర్.రెహ్మాన్ గారు సంగీతం అందించగా అనంత శ్రీరామ్, కళ్యాణీ మీనన్, కైతప్రం పాటలను రచించారు. గౌతమ్ మీనన్ రెహ్మాన్ ల తొలి కలయిక ఐన ఈ సినిమా పాటలు 2010 ఫిబ్రవరి 3న సోనీ మ్యూజిక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించాయి. ఎందరినుంచో ప్రశంసలందుకున్న ఏ.ఆర్.రెహ్మాన్ ఈ సినిమా ద్వారా తన తొలి తెలుగు ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. ఈ చిత్రం యొక్క కలెక్టరు ఎడిషన్ 2010 నవంబరు 13లో విడుదలైంది. అందులో 3 కొత్త పాటలను జతచేసారు. ఈ సినిమా పాటలనే హిందీ, తమిళ వర్షన్లలో వాడారు. ఆయా భాషల్లో కూడా ఈ పాటలకు మంచి ఆదరణ లభించింది. 2010 ఫిబ్రవరి 3న విడుదలైన పాటలు

పాట గానం రచన నిడివి
కుందనపు బొమ్మ బెన్నీ దాయాల్, కళ్యాణీ మీనన్ అనంత శ్రీరామ్, కళ్యాణీ మీనన్ 5:32
మనసా దేవన్ ఏకాంబరన్, చిన్మయి అనంత శ్రీరామ్ 4:11
స్వాస్యే కార్తీక్ అనంత శ్రీరామ్ 3:12
ఈ హృదయం విజయ్ ప్రకాష్, సుజన్, బ్లాజీ అనంత శ్రీరామ్ 5:30
ఆకాశం నరేష్ అయ్యర్‌ అనంత శ్రీరామ్ 3:52
వింటున్నావా శ్రేయా ఘోషల్, కార్తీక్ అనంత శ్రీరామ్ 6:56
ఆరోమలే ఆల్ఫాన్స్ జోసెఫ్ కైతప్రం 5:46

2010 నవంబరు 13న విడుదలైన మిగిలిన పాటలు (ఈ మూడు పాటలు కేవలం కలెక్టర్స్ ఎడిషన్ లో మాత్రమే లభించును)

పాట గానం నిడివి
బ్రోకెన్ ప్రోమిసెస్ శ్రేయా ఘోషల్ 4:33
జెస్సీ'స్ ల్యాండ్ మేఘ 1:58
ముమెంట్స్ ఇన్ కేరళ ప్రభాకర్ 2:40

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Ye Maya Chesave (2010)". Indiancine.ma. Retrieved 2021-04-22.