Jump to content

ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము

వికీపీడియా నుండి
ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం-సంపుటి 1 (కాశీనాథుని నాగేశ్వరరావు పునఃముద్రణ) ముఖచిత్రం
ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం-సంపుటి 2 ముఖచిత్రం.

కొమర్రాజు వేంకట లక్ష్మణరావు సాహితీ జీవితంలో మిగిలినవన్నీ ఒకయెత్తు, విజ్ఞాన సర్వస్వం ఒక్కటీ ఒకయెత్తు. ప్రపంచ విజ్ఞానాన్ని తెలుగువారందరికీ పంచిపెట్టాలని ఆయన తపించిపోయాడు. బ్రిటిష్ ఎన్సైక్లోపీడియా తరహాలో ఆంధ్ర విజ్ఞాన సర్వస్వాన్ని వెలువరించాలనేది ఆయన ప్రబల వాంఛ. 1912-13 కాలంలో ఈ బృహత్కార్యానికి పూనుకొన్నాడు. తాను ప్రధాన సంపాదకునిగానే కాదు, ప్రధాన రచయితగా కూడా పనిచేశాడు. లక్ష్మణరావుకు అనేక శాస్త్ర విషయాలలో ప్రవేశం ఉండేది. స్వయంగా పండితుడే గాక నిష్పాక్షిక పరిశోధన, సమతుల్యత ఆయన స్వభావాలు. ఎందరెందరో మహనీయులు ఆయనకు తోడుగా శ్రమించినా, లక్ష్మణరావు రాసినన్ని వ్యాసాలు ఇంకెవరూ రాయలేదు. ఏ విధమైన సంపదా, ధన సహాయమూ, ప్రభుత్వాదరణా లేకుండానే అంత బ్రహ్మాండమైన ప్రయత్నాన్ని తలకెత్తుకొన్నాడు.

గాడిచర్ల హరిసర్వోత్తమరావు, ఆచంట లక్ష్మీపతి, మల్లంపల్లి సోమశేఖర శర్మ, రాయప్రోలు సుబ్బారావు వంటివారు ఆయనకు తోడు నిలిచారు. ఒక్కరోజు కూడా విడవకుండా లక్ష్మణరావు, హరిసర్వోత్తమరావు మద్రాసు కన్నెమెరా గ్రంథాలయానికి వెళ్ళి, అది మూసేంతవరకు ఉండి, కుప్పలు తెప్పలుగా ఉన్న పుస్తకాల నుండి సమాచారం సేకరించేవారు.

అలాగని వారి రచనలు అనువాదాలకు పరిమితం కాలేదు. లక్ష్మణరావే ఒక విజ్ఞాన సర్వస్వం. ప్రతివిషయాన్ని కూలంకషంగా పరిశోధించి, సమగ్రమైన స్వతంత్ర వ్యాసంగా వ్రాసేవాడు. మొదట 'అ'కారాదిగా నెలకు నూరు పేజీల చొప్పున దీనిని వెలువరించారు. రేయింబవళ్ళు శ్రమించి, మూడు సంపుటములు ప్రచురించారు. ఇందులో సైన్సు, భాష, ఖగోళశాస్త్రము, చరిత్ర, కళ వంటి వివిధ విషయాలపై ఉన్న నూరు వ్యాసాలలో ఆయన స్వయంగా 40 వ్యాసాలను కూర్చాడు. అధర్వవేదం, అద్వైతం, అభిజ్ఞాన శాకుంతలం, అలంకారాలు, అష్టాదశ మహాపురాణాలు, అట్ట బైండు, అష్టాధ్యాయి వంటి ఎన్నో వైవిధ్యమైన విషయాలపై ఆయన వ్యాసాలు రాశాడు.

"అ"కారంతో మూడు సంపుటాలు పూర్తిచేసిన తరువాత "ఆంధ్ర" సంపుటాన్ని తయారుచేయడం కోసం పూనుకొన్నాడు. తెలుగువారి గురించి అప్పటికి జరిగిన పరిశోధన అత్యల్పం. కనుక మౌలిక పరిశోధన అవుసరమైంది. లక్ష్మణరావు రాత్రింబవళ్ళు శిలాశాసనాలు, ఇతర గ్రంథాలు పరిశోధనలో గడిపాడు. ఆ సమయంలో ఆయనకు ఉబ్బసం వ్యాధి ఉధృతమైంది. మదనపల్లెలో కొంతకాలం విశ్రాంతి తీసుకొని మళ్ళీ మద్రాసు వచ్చాడు. ఆంధ్ర సంపుటం రాయడానికి శాసనాలు పరిశీలిస్తూనే 1923 జూలై 12న లక్ష్మణరావు మరణించాడు.

అలా ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం "అ"కారం మూడు సంపుటాలతో ఆగిపోయింది. ఆ రోజుల్లో విజ్ఞాన సర్వస్వం అంత చక్కని ముద్రణ, అంత చక్కని కాగితం, చిత్రాలు, పటాలు భారతదేశంలో ఏ ప్రచురిత గ్రంథాలోను కనిపించలేదట. చేసిన ప్రతిపనిని పరిపూర్ణంగా చేయడం ఆయన అలవాటు. తర్వాత కాశీనాధుని నాగేశ్వరరావు మరింత మంది పండితుల సహకారంతో తిరిగి 'అ'కార పరంపరనే రెండు ముచ్చటైన సంపుటాలలోప్రచురించాడు.

Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:

బయటిలింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]