ఆళ్వారులు
ఆళ్వారులు లేదా అళ్వార్లు (English: Alvars/Alwars; తమిళం: ஆழ்வார்கள்) శ్రీవైష్ణవ సంప్రాదాయంలోనూ, తమిళ సాహిత్యంలోనూ విశిష్టమైన స్థానం కలిగిన విష్ణు భక్తులు. తమ పాశురాలతో విష్ణువును కీర్తించి దక్షిణాదిన భక్తి సంప్రదాయాన్ని పరిమళింపజేశారు. వీరు పాడిన (రచించిన) పాశురాలు అన్నీ (నాలుగు వేలు) కలిపి దివ్య ప్రబంధం లేదా నాలాయిరం లేదా ద్రవిడ వేదం అనబడుతాయి. భక్తి, పారవశ్యము, శరణాగతి - ఇవి ఈ అళ్వారుల జీవితంలోనూ, రచనలలోనూ, వారిని గురించిన గాథలలోనూ ప్రముఖంగా కానవచ్చే అంశాలు. ఆళ్వారులు అందించిన సాంస్కృతిక వారసత్వం వలన వైదిక కర్మలతోనూ, సంస్కృతభాషా సాహిత్యాలతోనూ ప్రగాఢంగా పెన వేసుకొని పోయిన హిందూ మతాచారాలు దక్షిణాదిన కొంత స్వతంత్రతను సంతరించుకొన్నాయి.[1] కుల వ్యవస్థను తోసిపుచ్చడం కూడా ఆళ్వారుల జీవితంలోనూ, శ్రీవైష్ణవ సిద్ధాంతాలలోనూ ముఖ్యమైన అంశాలు. ఆళ్వారుల ఔన్నత్యాన్ని గురించి ఎన్నో అలౌకికమైన ఘటనలు, మహత్తులు, నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. ఆళ్వారులు అందరూ దైవాంశ సంభూతులనీ, సామాన్య జనానీకానికి భక్తిని ప్రబోధించి శ్రీమన్నారాయణుని పదపద్మాలను చేరుకొనే మార్గాన్ని ఉపదేశించిన మహనీయులనీ ప్రధానమైన విశ్వాసం.శైవభక్తుల చరిత్రనుగూర్చి పెరియ పురాణము అను గ్రంథముతెలుపునట్లే వైష్ణవాచార్యుల చరిత్రను తెలిపేది గురుపరంపర అనుగ్రంథము. అందు వీరిని గూర్చి అనేకమైన అద్భుత కథలు ఉన్నాయి.
ఆళ్వారులు అంటే
మార్చుఆళ్వారులు అంటే 'దైవ భక్తి లోమునిగి ఉన్నవారు' అని అర్థం. వారు శ్రీమన్నారాయణుని ఆరాధనా సంకీర్తనాదులలో పరవశించి ఉన్నందున వారికి ఆళ్వారులు అన్న పేరు వచ్చింది.[2]
ఆళ్వారులు అనగా జ్ఞానఖని అని మరియొక అర్ధము.
మరొక వివరణ ఇలా ఉన్నది - " భగవద్గుణానుభవము నిరర్గళముగా స్వర్గ గంగవలె వీరి వాక్కులనుండి ద్రవిడ భాషా రూపమున వెలువడినందున వీరికి ఆళ్వారులు అను పేరు కలిగినది. ఆళ్వారు అనిన 'కాపాడువారు' అని వ్యుత్పత్తి. తమ కవితలతో వీరు మనలను కాపాడుటకే అవతరించినారు. భగవదనుభవ పరీవాహ రూపమయిన భక్తిసాగరమున మునకలు వైచి యందలి లోతులను కనుగొన్నవారని కూడ ఈ మాటకు అర్ధము చెప్పవచ్చును. తమపై నమ్మకము కలిగిన బద్ధ జీవులను తమతోబాటు భక్తిరసామృత సింధువున ముంచి యుక్కిరిబిక్కిరి చేసి బ్రహ్మానందమున తేల్చుట కూడ వీరికి వెన్నతో బెట్టిన విద్య".[3]
పన్నిద్దరు ఆళ్వారులు
మార్చుకృష్ణ దేవరాయలు తన ఆముక్తమాల్యదలో ఆళ్వారులను ప్రస్తుతించే ప్రసిద్ధ పద్యం:
- అల పన్నిద్దరు సూరులందును సముద్యల్లీలగావున్న బె
- గ్గలికం దానము బావ నా నిజ మన:కంజాత సంజాత పు
- ష్కల మాధ్వీక ఝురిన్ మురారి పొగియంగా జొక్కి ధన్యాత్ములౌ
- నిల పన్నిద్దరు సూరులం దలతు మోక్షేచ్ఛామతిం దివ్యులన్"
ద్వాదశాదిత్యులు - అనగా పన్నెండు మంది సూర్యులు. వారి వేడిమి తీవ్రత దుర్భరమైనది. ఆ తాప తీవ్రత తగ్గించి మానవుల హృదయాల్లోని అఙ్ఞానాంధకారం దూరం చేసి ఙ్ఞాన దీపం వెలిగించడానికే భూమి మీద ఈ ద్వాదశ దినసూర్యు లవతరించారు. వారికి ప్రణామములు.
ఆళ్వారుల నందరికీ వారి సంస్కృత నామాలు చెప్పి సంగ్రహంగా నమస్కరించే శ్లోకమిది:
- భూతం సరస్చ మహదాహ్వాయ భట్టనాథ
- శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్;
- భక్తాంఘ్రీ రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్
- శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యమ్"
ఈ శ్లోకంలో 11 ఆళ్వారుల పేర్లున్నాయి - వారు (1) పొయ్‌గై యాళ్వార్ (2) పూదత్తాళ్వార్ (3) పేయాళ్వార్ (4) పెరియాళ్వార్ (5) తిరుమళిశై యాళ్వార్ (6) కులశేఖరాళ్వార్ (7) తిరుప్పాణాళ్వార్ (8) తొండరడిప్పొడి యాళ్వార్ (9) తిరుమంగై యాళ్వార్ (10) ఉడయవర్ (11) నమ్మాళ్వార్.
- ఉడయవర్ (రామానుజాచార్యులు) ను ఈ జాబితాలోంచి తొలగించి పదుగురు ఆళ్వారులు అనికూడా అంటారు.
- ఉడయవర్ బదులు మధుర కవి, గోదాదేవి పేర్లు కూడా జోడించి మొత్తం పన్నిద్దరు ఆళ్వార్లని చెబుతారు. ('శ్రీ', 'భక్తిసార' అనే పదాలను విడదీసి 'శ్రీ' అనగా అండాళ్ అని కూడా వివరించడం జరుగుతుంది.
- ఒకోమారు మధుర కవిని కలుపకుండా అండాళ్‌ను మాత్రమే జాబితాకు జోడించి పన్నిద్దరు ఆళ్వారులని లెక్క కట్టడం కూడా కద్దు.
అతి సాధారణంగా చెప్పబడే పన్నిద్దరు ఆళ్వారులు, వారి సంస్కృత నామములు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
- పొయ్‌గయాళ్వార్ - మరొక పేరు సరోయోగి
- పూదత్తాళ్వార్ - మరొక పేరు భూతయోగి
- పేయాళ్వార్ - మరొక పేరు మహాయోగి
- పెరియాళ్వార్ - మరొక పేరు భట్టనాథులు
- తిరుమళిశై యాళ్వార్ - మరొక పేరు భక్తిసారులు
- కులశేఖరాళ్వార్ - మరొక పేరు కులశేఖరుడు
- తిరుప్పాణ్‌ఆళ్వార్ - మరొక పేరు మునివాహనులు
- తొండరడిప్పొడి యాళ్వార్ - మరొక పేరు భక్తాంఘ్రి రేణువు
- తిరుమంగయాళ్వార్ - మరొక పేరు పరకాలయోగి
- ఆళ్వారుక్కు అదియాన్ - మరొక పేరు మధురకవి (శ్రీవైష్ణవ సంప్రదాయానికి ప్రవర్తకులైన 'ఉడయవర్', 'ఎమ్బెరుమనార్' అనే నామాంతరాలుగల భగవద్రామానుజాచార్యుల వారిని కొంతమంది మధురకవికి మారుగా చేరుస్తారు ఈ పన్నిద్దరిలో.)
- ఆండాళ్ - మరొక పేరు గోదాదేవి
- నమ్మాళ్వార్ - మరొక పేరు శఠకోపముని
ఆళ్వారుల కాలం గురించి నిర్దిష్టమైన ఆధారాలు లేవు. వీరు ద్వాపర యుగాంతంనుండి కలియుగారంభం మధ్య ఉద్భవించారని సంప్రదాయ గాథలు. కాని శాస్త్రీయ పరిశోధకులు వీరి కాలం సా.శ. 7వ శతాబ్దం - 9వ శతాబ్దం మధ్యకాలమని అభిప్రాయపడుతున్నారు.
- ఆళ్వారుల అవతరణకు సంబంధించిన పురాణ గాథ
పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ సమయంలో విశ్వకర్మకూ, అగస్త్యునకూ జరిగిన వాగ్వివాదం వలన అగస్త్యుడు సృష్టించిన ద్రవిడభాష నిరసనకు గురై నిరాదరింపబడింది. ఆ భాషకు తగిన గౌరవాన్ని పునస్సంతరించడానికీ, అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న జీవులకు మోక్షమార్గం ఉపదేశించడానికీ దక్షిణ దేశంలో అవతరించమని శ్రీమన్నారాయణుడుతన దేవేరులకు, ఆయుధాలకు, పరివారానికి, చిహ్నాలకూ ఆదేశించాడు. అందుకు అనుగుణంగా భూదేవి గోదాదేవిగానూ, ఇతరులు వేరు వేరు ఆళ్వారులుగానూ అవతరించిరి. విష్ణువే శ్రీదేవీ సమేతుడై శ్రీరంగము, కంచి, తిరుమల వంటి పుణ్యక్షేత్రాలలో అవతరించి వారి సేవలను అందుకొన్నాడు. పొయ్‌గయాళ్వారు పాంచజన్యము అంశ అనీ, నమ్మాళ్వారు విష్వక్సేనుని అంశ అనీ - ఇలా ఒక్కొక్క ఆళ్వారు ఒక్కొక్క విష్ణుసేవకుని అంశ అని చెబుతారు.
సంగ్రహ విశేషాలు
మార్చు- ముదలాళ్వారులు (పొయ్‌గై యాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్)
ఆళ్వారులలో మొదటివారైనందున వీరు ముగ్గురిని ముదలాళ్వారులని అంటారు. వీరు ముగ్గురూ సా.శ. 719 ప్రాంతంలో సమకాలికులు. ఒకమారు వీరు ముగ్గురూ ఒక చీకటిరాత్రి వర్షంలో ఒక ఇంటి అరుగుమీద కలసికొని శ్రీమన్నారాయణుని దర్శనం పొందారని ఒక కథ ఉంది.
- తిరుమళిశై యాళ్వార్ (తిరుమలసాయి ఆళ్వార్)
సా.శ. 720 ప్రాంతానికి చెంది ఉండవచ్చును. పుట్టుక రీత్యా పంచముడు. వైష్ణవం, బౌద్ధం, జైనం సిద్ధాంతాలలో పండితుడు. పెరుమాళ్ళను తన మిత్రునిగా తలచి మంగళాశాసనాలు పాడాడని చెబుతారు. ఈ ఆళ్వారు, అతని శిష్యుడు కాంచీపురం వదల��� వెళ్ళిపోదలిస్తే ఆవూరి గుడిలోని పెరుమాళ్ళు తన చాపను (ఆదిశేషుని) చుట్టగా చుట్టుకొని వారివెంట బయలుదేరాడట. ఈ ఆళ్వారు చెప్పినట్లు చేయడం వలన ఆ దేవునికి 'యధోక్తకారి' అన్న పేరు వచ్చింది.
- తిరుమంగయాళ్వార్ (తిరుమంగై ఆళ్వారు)
సా.శ. 776 కాలంనాటివాడు కావచ్చును. పుట్టుక రీత్యా శూద్రుడు. పూర్వాశ్రమంలో శృంగార పురుషుడు. తరువాత భక్తుడై పెరుమాళ్ళను స్తుతించాడు.
తిరుమంగై ఆళ్వార్ చోళదేశమందలి తిరుక్కరయలూర్ గ్రామవాసి. చోళరాజు వద్ద సేనాధిపత్యము వహించాడు. కొంతకాలమునకు దానిని వదలివేసి, దేశాటనపరుడై సుమారు 80 పుణ్యస్థలములను దరిశించి విష్ణుసంకీర్తనలను జేసినాడు. పెరియ తిరుమొణ్, తిరుక్కురుందాండకం తిరునెడుందాండకం, చిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్, తిరువేము కూరిరుక్కై అను షట్ప్రబంధములను రచించి, మహాకవియై నార్కవిప్పెరుమాన్, అనగా చతుర్విధ కవితా చక్రవర్తి అనుపేరొందినాడు.
జైన బౌద్ధమతాలను, శైవాన్ని కూడా ప్రతిఘటించి వైష్ణవ మతవ్యాప్తిని హెచ్చుగా సాధించాడు. ఒక బౌద్ధమతాలయము లోని స్వర్ణవిగ్రహమును చెరిపించి, ఆసొమ్ముతో శ్రీరంగనాధుని ఆలయమునకు తృతీయ ప్రాకారనిర్మాణము చేయించినాడట. శైవులు శివ పారమ్యాన్ని నిరూపించుటకై అతని దక్షిణ వామాంగములయందు బ్రహ్మ విష్ణు లుద్భవించినారని చెప్పినట్లుగానే, ఈతడు విష్ణువే సృజించి, మూర్తిత్రయ రూపములు దాల్చివిశ్వవ్యాప్తియై యున్నాడని, శమ దమాదులు కలిగి ధర్మమార్గమున ఏకైక భక్తి సల్పువారే ముక్తి బడయగలరని ఈతడు ప్రతిపాదించాడు.
- తొండరడిప్పొడి యాళ్వార్ (తొండరాదిప్పోడి ఆళ్వారు)
సా.శ. 787 ప్రాంతంలో శ్రీరంగంలోని నందన వనానికి తోటమాలి. విప్రనారాయణుడు అని కూడా ప్రసిద్ధుడు. దండలు గుచ్చి శ్రీరంగనాధుని సేవించి తరించాడు.
తొండరడిప్పొడి యాళ్వార్, పెరియాళ్వార్ అను వారలు చోళపాండ్య దేశస్థులు. వీరికే క్రమముగా విప్రనారాయణుడని, విష్ణుచిత్తుడని నామాంతరములు.
- తిరుప్పాణాళ్వార్ (తిరుప్పాన్ ఆళ్వారు)
సా.శ. 701 ప్రాంతం వాడు కావచ్చును. ఉరయూర్‌లో పానార్ ("అంటరాని జాతి" అనబడేది) కుటుంబంలో పెరిగాడు. తన అందమైన పాశురాలతో పెరుమాళ్ళను అర్చించాడు. పది పాశురాలు మాత్రం గల కావ్యం వ్రాసి ఉత్తమకవిగా వాసికెక్కినాడు.
శ్రీ విల్లిపుత్తూరుకు చెందినవాడు. దేవదేవుని తన బిడ్డగా భావించి మంగళాశాసనములు కీర్తించాడు. దేవునికే పెద్ద గనుక పెరియాళ్వారు అనబడ్డాడు. "పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు" అనే పాశురం ద్రవిడ వేదంలో చాలా ముఖ్యమైన స్థానం కలిగి ఉంది.
"ఆముక్త మాల్యద", "గోదా దేవి" అని కూడా అనబడే ఈ తల్లి భూదేవి అవతారంగా పూజింపబడుతుంది. శ్రీరంగనాధుని వలచి పెళ్ళియాడిందని అంటారు. ఈమె పాడిన తిరుప్పావై వైష్ణవ మందిరాలలో ముఖ్యమైన సంకీర్తనా గేయము. తమిళ సాహిత్యంలో సమున్నత గేయము. ఈమె సా.శ. 776 కాలానికి చెంది ఉండవచ్చును.
- నమ్మాళ్వార్ - మరొక పేరు శఠకోపముని
సా.శ. 798 కలంవాడు కావచ్చును. పుట్టుక రీత్యా శూద్రుడు. ఆళ్వారులలో నమ్మాళ్వారుకు చాలా విశిష్టమైన స్థానం ఉంది. మిగిలిన ఆళ్వారులందరూ శరీరం, నమ్మాళ్వారులు శరీరి. జ్ఞాని. శ్రీవైష్ణవం దీక్షను తీసికొనేవారు తమ ప్రస్తుత గురువునుండి నమ్మాళ్వారు వరకూ అంజలి ఘటిస్తారు. దేవాలయాలలో 'శఠగోపం' పెట్టడం అనేది ఈ 'శఠకోపముని' పేరుమీద మొదలయిన ఆచారమే. తన జీవితకాలం అంతా ఒక చింతచెట్టు క్రిందనే గడిపాడు. నమ్మాళ్వారు రచించిన నాలుగు దివ్య ప్రబంధాలూ నాలుగు ద్రవిడ వేదాలుగా ప్రశస్తమయ్యాయి.
ఇతడు యోగాభ్యాసపరుడు. నాధముని, మధురకవి అనువారలీతని శిష్యులు. ఈతడు విష్ణుసారమ్యమును, సర్వ వ్యాపిత్వమును మోక్షదాయకత్వమును గూర్చి తన రచనలలో హెచ్చుగా ప్రతిపాదించాడు. ఈతని కాలమునకు దక్షిణదేశమున జైన బౌద్ధ మతములు క్షీనదశనొంది శైవవైష్ణవములకు గల స్పర్ధకూడ కొంత తగ్గిపోయినట్లు కనబడును.
ఇతను బ్రాహ్మణుడు. తక్కిన ఆళ్వారులు శ్రీమన్నారాయణుని కీర్తించగా మధురకవి మాత్రం తన గురువైన నమ్మాళ్వారునే కీర్తించాడు. ఇతని గురుస్తోత్రం శ్రీవైష్ణవులకు చాలా ముఖ్యమైన ప్రార్థన.
భక్తునిగా మారిన రాజు. ఎక్కువ కీర్తనలలో శ్రీరాముని స్తుతించాడు. తిరుమలలో బంగారు వాకిలి వద్దనున్న మెట్టును ఇతని పేరుమీద కులశేఖర పడి అని అంటారు.
దివ్య ప్రబంధాలు
మార్చుఆళ్వారులు పాడిన పాశురాలు అన్నీ కలిపి నాలుగు వేలు - - ఈ మొత్తాన్ని నాలాయిరం ద్రవిడ వేదం లేదా దివ్య ప్రబంధం అంటారు. తమిళ సాహిత్యంలో ఈ గేయాలకు విశిష్టమైన స్థానం ఉంది. వివిధ ఆళ్వారుల పాశురాల సంఖ్య క్రింది జాబితాలో ఇవ్వబడింది.[4] పదకొండు మంది ఆళ్వారులు తమ పాశురాలలో శ్రీమన్నారాయణుని దివ్యావతారములను కీర్తించారు. కాని మధురకవి ఆళ్వారు మాత్రం తన గురువైన నమ్మాళ్వారునే స్తుతించాడు.
క్ర.సం. | ప్రబంధం పేరు --- | మొదటి పాశురం సంఖ్య | చివరి పాశురం సంఖ్య | మొత్తం పాశురాలు | గానం చేసిన ఆళ్వారు |
---|---|---|---|---|---|
1 | పెరియాళ్వార్ తిరుమొళి | 1 | 473 | 473 | పెరియాళ్వార్/విష్ణుచిత్తుడు |
2 | తిరుప్పావై | 474 | 503 | 30 | ఆండాళ్ |
3 | నాచియార్ తిరుమొళి | 504 | 646 | 143 | ఆండాళ్ |
4 | పెరుమాళ్ తిరుమొళి | 647 | 751 | 105 | కులశేఖరాళ్వార్ |
5 | తిరుచ్చంద విరుత్తమ్ | 752 | 871 | 120 | తిరుమళిశై ఆళ్వార్ |
6 | తిరుమాలై | 872 | 916 | 45 | తొండరడిప్పొడి యాళ్వార్ |
7 | తిరుప్పల్లియేడుచ్చి | 917 | 926 | 10 | తొండరడిప్పొడి యాళ్వార్ |
8 | అమలనాది పిరాన్ | 927 | 936 | 10 | తిరుప్పానాళ్వార్ |
9 | కన్నినున్ శిరుత్తంబు | 937 | 947 | 11 | మధురకవి ఆళ్వార్ |
10 | పెరియ తిరుమొళి | 948 | 2031 | 1084 | తిరుమంగై ఆళ్వార్ |
11 | కురున్ తండగం | 2032 | 2051 | 20 | తిరుమంగై ఆళ్వార్ |
12 | నెడుమ్ తండగం | 2052 | 2081 | 30 | తిరుమంగై ఆళ్వార్ |
13 | ముదల్ తిరువందాడి | 2082 | 2181 | 100 | పొయ్‌గై ఆళ్వార్ |
14 | ఇరందం తిరువందాడి | 2182 | 2281 | 100 | భూదత్తాళ్వార్ |
15 | మూన్రం తిరువందాడి | 2282 | 2381 | 100 | పేయాళ్వార్ |
16 | నాన్ముగన్ తిరువంతాడి | 2382 | 2477 | 96 | తిరుమళిశై ఆళ్వార్ |
17 | తిరువిరుత్తమం | 2478 | 2577 | 100 | నమ్మాళ్వార్ |
18 | తిరువాశిరియం | 2578 | 2584 | 7 | నమ్మాళ్వార్ |
19 | పెరియ తిరువందాడి | 2585 | 2671 | 87 | నమ్మాళ్వార్ |
20 | తిరువెళుక్కుర్రిరుక్కై | 2672 | 2672 | 1 | తిరుమంగై ఆళ్వార్ |
21 | సిరియ తిరుమడల్ | 2673 | 2712 | 40 | తిరుమంగై ఆళ్వార్ |
22 | పెరియ తిరుమడల్ | 2713 | 2790 | 78 | తిరుమంగై ఆళ్వార్ |
23 | తిరువైమొళి | 2791 | 3892 | 1102 | నమ్మాళ్వార్ |
24 | రామానుజ నూరందాడి | 3893 | 4000 | 108 | తిరువరంగతముదనార్ |
మొత్తం పాశురాలు | 4000 |
ఆళ్వారులు, వారి స్వస్థలాలు, జన్మనక్షత్రాలు
మార్చువివిధ ఆళ్వారుల జన్మ స్థానము, వారు జీవించిన కాలము, వారి జన్మ నక్షత్రము క్రింది పట్టికలో ఇవ్వబడినాయి.[5]
క్ర.సం. | ఆళ్వారు | కాలము, స్థలము | ఇతర నామాలు | నెల | నక్షత్రం | అంశ |
---|---|---|---|---|---|---|
1 | పొయ్‌గై ఆళ్వార్ | 7వ శతాబ్దం, కాంచీపురం | సరో యోగి, కాసార యోగి, పొయ్‌గై పిరాన్, పద్మముని, కవిన్యార్పోరెయెర్ | ఆశ్వీజం | శ్రవణ | పాంచజన్యం (శంఖం) |
2 | పూదత్తాళ్వార్ | 7వ శతాబ్దం, మైసూరు | భూతాళ్వార్ | ఆశ్వీజం | ధనిష్ఠ | కౌమోదకి (గద) |
3 | పేయాళ్వార్ | 7వ శతాబ్దం, | కైరవముని, మహాదాహ్వయార్ | ఆశ్వీజం | శతభిష | నందకం (ఖడ్గం) |
4 | తిరుమళిశై ఆళ్వార్ | 7వ శతాబ్దం, తిరుమళిసాయి | భక్తిసారుడు, భార్గవుడు, మగిసారాపురీశ్వరర్ (మహీసార పురీశ్వరుడు), మళిసాయి పిరాన్ | పుష్యం | మఘ | సుదర్శన చక్రం |
5 | నమ్మాళ్వార్ | 9వ శతాబ్దం, తిరునగరి (కురుగూర్) | శఠకోపముని, సదారి, పరాంకుశ స్వామి, మారన్, వకుళాభరణుడు, కురిగైయార్కోనే | వైశాఖ | విశాఖ | విష్వక్సేనుడు (సేనాపతి) |
6 | మధురకవి ఆళ్వార్ | 9వ శతాబ్దం, తిరుకొళ్లూర్ | ఇంకవియార్, అళ్వారుక్కు ఆదియాన్ | చైత్రం | చిత్ర | వైనతేయుడు (గరుత్మంతుడు) |
7 | కులశేఖర ఆళ్వార్ | 8వ శతాబ్దం, తిరువంజిక్కోలమ్ | కొల్లికావలన్, కూదల్‌నాయకన్, కోయికోనె, విల్లివార్‌కోనె, చెయ్‌రలార్‌కోనే | మాఘం | పునర్వసు | కౌస్తుభం (మణి) |
8 | పెరియాళ్వార్ | 9వ శతాబ్దం, శ్రీవిల్లిపుత్తూరు | విష్ణుచిత్తుడు, పట్టణాదన్, బట్టార్‌పిరన్, శ్రీవిల్లిపుత్తూరార్, శ్రీరంగనాధ స్వసూరార్ | జ్యేష్టం | స్వాతి | గరుత్మంతుడు (వాహనం) |
9 | ఆండాళ్ | 9వ శతాబ్దం, శ్రీవిల్లి పుత్తూర్ | చూడికొడుత్తనాచియార్, గోదా, గోదామాత | ఆషాడం | పూర్వఫల్గుణి | భూదేవి |
10 | తొండరాడిప్పొడియాళ్వార్ | 8వ శతాబ్దం, తిరుమందనగుడి | విప్రనారాయణుడు, తిరుమందనగుడియార్, భక్తాంఘ్రిరేణుడు, పల్లియునర్తియపిరాన్ | ధనుర్మాసం | జ్యేష్ట | వనమాల (దండ) |
11 | తిరుప్పాన్ ఆళ్వార్ | 8వ శతాబ్దం, ఉరయూర్ | పానార్, మునివాహనుడు, యోగివాహనుడు, కవీశ్వరుడు | కార్తీకం | రోహిణి | శ్రీవత్సం (చిహ్నం) |
12 | తిరుమంగై ఆళ్వార్ | 8వ శతాబ్దం, తిరుక్కురయూర్ | కలియన్, ఆలినాదన్, నాలుకవి పెరుమాళ్, అరుల్‌మారి, పరకాల స్వామి, మంగైయార్‌కోనే | కార్తీకం | కృత్తిక | శార్ఙ్గము (ధనుస్సు) |
ఇవి కూడా చూడండి
మార్చుమూలములు
మార్చు- ↑ "About Alvars". divyadesamonline.com. Archived from the original on 2007-06-21. Retrieved 2 July 2007.
- ↑ "Meaning of Alvar". www.ramanuja.org. Retrieved 2 July 2007.
- ↑ "ద్వాదశ సూరి చరిత్ర". కె.టి.ఎల్.నరసింహాచార్యులు. Retrieved 25 సెప్టెంబరు 2007.
- ↑ "Table showing details of 4000 pasurams". srivaishnavam.com. Retrieved 20 June 2007.
- ↑ "Birth place and stars of Alvars". srirangapankajam.com. Archived from the original on 2007-09-27. Retrieved 20 June 2007.
- తిరుమల కొండ పదచిత్రాలు - పున్నా కృష్ణమూర్తి - ప్రచురణ : సూర్య పబ్లికేషన్స్, హైదరాబాదు (2002) - ఆళ్వారుల కాలం గురించిన సంవత్సరాలు ఈ పుస్తకం నుండి తీసుకొనబడ్డాయి.
వనరులు
మార్చు- శ్రీ తిరుమంగై ఆళ్వార్
- దివ్యదేశ వైభవ ప్రకాశిక - కిడంబి గోపాల కృష్ణమాచార్యుల రచన - ఎన్.వి.ఎల్.ఎన్.రామానుజాచార్యుల ఆంధ్ర వివరణ
- దివ్య ప్రబంధ మాధురి - కె.టి.ఎల్.నరసింహాచార్యులు
- ద్వాదశ సూరి చరిత్ర - కె.టి.ఎల్.నరసింహాచార్యులు
- ఆళ్వారాచార్యుల సంగ్రహ చరిత్ర - పాలవంచ తిరుమల గుదిమెళ్ళ వేంకట లక్ష్మీనృసింహాచార్యులు
- పరిచయ వ్యాసము
బయటి లింకులు
మార్చు- పన్నిరండు ఆళ్వారులు - దివ్యదేశం ఆన్లైన్
- అళ్వారులు , వైష్ణవం
- ఆళ్వారులు (రామానుజ.ఆర్గ్)
- తమిళనాడు యొక్క ఆళ్వారు సంతులు - జ్యోత్స్నా కామత్
- పరమయోగి విలాసము - తాళ్ళపాక తిరువేంగళనాధుని ద్విపద కావ్యము - తి.తి.దే. ప్రచురణ - వి.విజయరాఘవాచార్య పరిష్కరించినది (1938)