పుష్పక విమానము (సినిమా)
ఇది ఒక తెలుగు సినిమా గురించిన వ్యాసం. పురాణాలలో వర్ణించిన వాహనం గురించి పుష్పక విమానము వ్యాసం చూడండి.
పుష్పకవిమానం | |
---|---|
దర్శకత్వం | సింగీతం శ్రీనివాసరావు |
స్క్రీన్ ప్లే | సింగీతం శ్రీనివాసరావు |
కథ | సింగీతం శ్రీనివాసరావు |
నిర్మాత | సింగీతం శ్రీనివాసరావు, శ్రీంగర్ నాగరాజ్ |
తారాగణం | కమల్ హాసన్, అమల |
ఛాయాగ్రహణం | బి. సి. గౌరీశంకర్ |
సంగీతం | ఎల్. వైద్యనాథన్ |
నిర్మాణ సంస్థ | మందాకినీ చిత్ర ప్రైవేట్ లిమిటెడ్ |
విడుదల తేదీ | 27 నవంబరు 1987 |
సినిమా నిడివి | 124 నిమిషాలు |
దేశం | భారతదేశం |
తెలుగులో పుష్పక విమానము గానూ, మిగిలిన భాషలలో పుష్పక్ గానూ 1988లో విడుదలైన ఈ చిత్రం సంభాషణలు లేకుండా కేవలం వాద్య సంగీత సహకారంతో నిర్మించారు. ఈ సినిమ�� ఒక రోజు రాజుగా అనే కథను మూలంగా చేసుకుని, బెంగుళూరు నగరాన్ని నేపథ్యంగా తీసుకొని నిర్మించారు. ఇది సంభాషణలు లేని సినిమా. కనుక ఏ భాషకైనా చెందవచ్చును. ఈ సినిమా చిత్రీకరణ కలరులో, అవసరానికి తగిన శబ్ధాల సహకారంతో తీసారు. పూర్వపు మూకీ చిత్రాల్లో లాగా పాత్రలు పెదవులతో మాటలు పలికించవు. అందుకు భిన్నంగా ఈ చిత్రంలో సంభాషణలకు తావిచ్చే సన్నివేశాలే లేవు. సన్నివేశంలో సంభాషణలు వినిపించేందుకు వీలుకాని విధంగా కెమెరాను అమర్చి ఛాయాగ్రహణపు యుక్తితో మూకీని సాధించారు.[1]
ప్రేక్షకాదరణ
[మార్చు]మాటలు లేకుండా ఉండే సినిమాను మళ్లీ పరిచయం చేయటం, శారీరక బాధ ద్వారా కలుగజేసే హాస్యం (slapstick comedy), సమాజంలోని అసమానతలపై వ్యంగ్య సన్నివేశాలు, మొదలైనవన్నీ సమపాళ్లలో ఉండటం వలన, అసాధారణమైన ముగింపు, కమల్ హాసన్ యొక్క అద్భుత నటనా చాతుర్యము యొక్క మేలుకలయిక ఐన ఈ చిత్రం దక్షిణ భారతదేశంలో నిర్మించిన అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ చిత్రము కేన్స్ చిత్రోత్సవ న్యాయనిర్ణేతలతో సహా అనేక మంది సినీ విమర్శకుల ప్రశంసలందుకున్నది. సాధారణ జనాలను సైతం విశేషంగా ఆకర్షించిన ఈ సినిమా ఆర్ధికంగా పెద్ద విజయం సాధించలేకపోయింది. ఐఎండిబీలో 10కి 9.4 మార్కులతో అత్యధికంగా విలువకట్టిన సినిమాలలో ఒకటిగా నిలిచింది.[2]
కథాగమనం
[మార్చు]ఈ చిత్రం పేద యువకులు కనే కలలకు అద్దం పడుతుంది. అలాంటి ఒక పేద నిరుద్యోగి పాత్రలో కమలహాసన్ నటించాడు. చిత్ర కథానుసారం - ఎంప్లాయిమెంట్ ఎక్స్‌చేంజీ వద్ద లైనులో ఉండే నిరుద్యోగులతో మొదలవుతుందీ చిత్రం; వాళ్ళలో ఒకడు కమలహాసన్. మధ్యతరగతి నిరుద్యోగ యువకులు అధికంగా నివసించే ఒకానొక వీధిలో ఒక మేడపైన చిన్న గదిని బ్రహ్మచారి కమల్ హాసన్ అద్దెకు తీసుకుని ఉంటాడు. మేడకు ప్రక్కగా సినిమా హాలు ఉంటుంది. ఉదయాన్నే లేవటం, కలకృత్యాలు తీర్చుకొని ఉద్యోగాణ్వేషణకు బయలుదేరడం అతడి రోజువారీ దినచర్య. ఈ సన్నివేశాల చిత్రీకరణ దర్శకుడి ప్రతిభాపాటవాలకు అద్దం పడుతుంది - మరుగుదొడ్ల వద్ద లైనులో కమల్ పాట్లు, సబ్బు లేక చొక్కా చంకలవద్ద మాత్రమే ఉతకం, టీ కప్పును బొత్తాములతో నింపడం, క్రింద బాత్రూములో స్నానం చేసే ఆమెను చూసేందుకు ప్రయత్నించడం లాంటివి.
ఉద్యోగాన్వేషణలో తిరుగుతూ ఉన్న అతనికి ఒక రోజు రాత్రి తాగిన మత్తులో రోడ్డు ప్రక్కన పడి ఉన్న కోటీశ్వరుడు (సమీర్ కక్కర్) తారసపడతాడు. మొదట సహాయం అందించటానికై అతని వద్దకు వెళ్ళినవాడు అతడిని పరిశీలించిన తరువాత వేరే ఆలోచన రావడంతో! కోటీశ్వరుడిని అతికష్టం మీద ఎవరికంటా పడకుండా తన గదికి చేరుస్తాడు. కొంతసేపు తను చేసేది తప్పా రైటా అని కొంతసేపు మధనపడి, ఆ తరువాత కోటీశ్వరుని జేబులు వెతికి పుష్పక్ హోటలు తాళంచెవి, పర్సులోని డబ్బు, మిగిలిన వాటిని తన జేబులో పెట్టుకొంటాడు. అతడు కదిలితే, అతని జేబులో ఉన్న బ్రాందీ తాగించి, నోటిని టేపుతో బంధించి ఒక కుర్చీలో చేతులు వెనుకకు విరిచి కట్టేస్తాడు. మరుసటి రోజు ఉదయం తలుపులు లోపలి వైపుగా తాళం వేసి కిటికీ ద్వారా బయటికొచ్చి దానిని మూసేస్తాడు.
తన వద్ద ఉన్న డబ్బుతో మంచి బట్టలుకొని హోటలుకు బయలుదేరుతాడు. తనవద్ద గల తాళం చెవి నంబరు చూసి ఆగదికి వెళ్ళి గదిని పరిశీలిస్తాడు. చాలా డబ్బుతో ఒక సూట్కేసు, కొన్ని సూట్స్, ఖరీదైన వాచీ, లిక్కర్ బాటిల్స్ లాంటివి ఉంటాయి. అటుపై కోటీశ్వరునిలా పరకాయప్రవేశం చేసి అతని మాదిరిగా సౌకర్యాలను అనుభవించుట మొదలెడతాడు. ఇక ఇక్కడ తన పాత రూములో బంధించిన కోటీశ్వరుని పర్యవేక్షణ కొరకు కమల్ చేసే విన్యాసాలు అనేకం - అతని నోటిగుడ్డపై చిన్న రంధ్రం చేసి దానిలో గరాటు పెట్టి మందు పోయటం, కొంచెంగా విప్పి అతను అరిచేలోగా అతనినోట్లో బ్రెడ్ కుక్కి వెంటనే కట్టేయడం, కుర్చీ క్రింద పెద్ద రంధ్రం చేసి అతడి పాంటును కిందికిలాగి కొంతసమయం అతడి ప్రకృతి పిలుపు కోసం వేచి ఉండటం, అతడి కార్యక్రమం పూర్తి అయ్యాక దానిని నీటుగా ప్యాకింగ్ చేసి పారేసేందుకు తీసుకెళ్ళడం ఇలా అనేక సంఘటనలు.
హోటల్లో హాయిగా గడుపుతున్న అతనికి ఆదే హోటల్ ఎదురు రూములో దిగిన ఒక ఇంద్రజాలికుని (కె.యస్.రమేష్) కూతురైన అమల తో పరిచయం ఏర్పడుతుంది. కమలహాసన్ కోటీశ్వరుడని అనుకొని ఆమెకూడా అతడితో సాన్నిహిత్యంగా ఉంటుంది. వీళ్ళ కథ ఇలా నడుస్తుండగా కోటీశ్వరుని చంపేందుకు కోటీశ్వరుని భార్య యొక్క ప్రియుని ద్వారా ఒక వ్యక్తి (టిను ఆనంద్) అదే హోటల్లో దిగుతాడు. కమలహాసనే కోటీశ్వరుడని భావించి కమల్‌ను చంపేందుకు అతనిని అనుసరిస్తూ ఆ ప్రయత్నంలో చాలా సార్లు విఫలమవుతాడు. తనను చంపేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారనే విషయం తెలుసుకొన్న కమలహాసను. అతడిని అనుసరిస్తాడు అతని గురించి తెలుసుకొనేందుకు. కోటీశ్వరుని ఇంట్లో అతడి, అతడి భార్యప్రియుల మధ్య వాగ్వివాదంలో తను చంపవలసింది వేరే మనిషినని టిను ఆనందుకు , కోటీశ్వరుని స్థానములో వేరే ఎవరో ఉన్నారని భార్య ప్రియునికి, తన భర్తను చంపించాలని తన ప్రియుడు ప్రయత్నిస్తున్నాడని కోటీశ్వరుని భార్యకు {రమ్య కృష్ణ}, మొత్తం జరిగిన విషయం కమల్ హాసనుకు అర్ధమవుతుంది.
కమలహాసన్ అప్పుడప్పుడూ ఒక బిక్షగాడిని{పి.యల్.నారాయణ} చూస్తూ ఉంటాడు. తన వద్ద ఉన్న రూపాయిని చూపించి తన ఆధిక్యతను ప్రధర్శించాలనుకొన్నప్పుడు బిక్షగాడు తన గోనె పట్టా క్రింద గల వేల రూపాయలను చూపిస్తాడు. మరొకరోజు అదేబిక్షగాడు రోడ్డుపై చనిపోయి పడి ఉండటం చూసి అతడిని లేపే ప్రయత్నంలో చెల్లాచెదరుగ పడ్డ అతని డబ్బుకోసం బిక్షగాడి శవాన్ని పక్కన పడేసి డబ్బుకోసం కొట్టుకుంటున్న జనాన్ని చూస్తాడు. ఈ రెండు సంఘటనలద్వారా అతనిలో మార్పు కలుగుతుంది. డబ్బుకోసం వాళ్ళు చేసిందీ తనుచేసిందీ ఒకేలా అనిపిస్తుంది. దానితో తను చేసిన వాటిని సరిదిద్దుకోవాలని తను పేదవాడినని తన గురించి వివరిస్తూ ఒక లెటర్ రాసి అమలకిస్తాడు. ఆరాత్రి హోటల్ రూమ్కెళ్ళి మొదట్లో ఉన్నట్టుగా అన్నిటినీ సర్ధిపెట్టి తన పాత బట్టలు చెప్పులు ధరించి తన పాత గది నుండి కోటీశ్��రుని తీసుసొచ్చిన ప్రదేశంలోనే వదిలేస్తాడు.
ఉదయం మెలకువొచ్చిన కోటీశ్వరుడు తనున్న పరిశరాలను చూసి జేబులు చెక్ చేసుకొంటే హొటల్ రూమ్ తాళం, అన్నీ కనిపిస్తాయి. అటునుండి హొటల్కెళ్ళి తన గదిలో చూస్తే అన్నీ మునుపట్లా ఉన్నా అప్పటి వరకూ వాడబడినట్లుగా గమనిస్తాడు. టేబులుమీద ఒక ఉత్తరం కనిపిస్తుంది చదివిన తరువాత విషయం తెలుస్తుంది. రూమ్ కాళీచేసి వెళ్ళిపోయేప్పుడు అతని భార్య ఏడుస్తూ అతనివద్దకొస్తుంది. ఆమెను తీసుకొని తన వద్దగల బ్రాందీ సీసాలను రోడ్డుప్రక్క మందు అలవాటును మానేస్తున్నట్టుగా పగులగొట్టేస్తాడు. వాళ్ళెళ్ళిన కొంత సేపట్లో అమల కుటుంబం కూడా హొటల్ కాళీచేసి బయటికొస్తారు. దూరంగా నిలబడి వాళ్ళనే చూస్తున్న కమల్ హాసన్ కనిపిస్తాడు ఆమెకు. అతడు ఎవరయినా తనకు ఇష్టమేనని తనను తరువాత కలుసుకోమని తన అడ్రసు రాసిన పేపర్ కారులోనుండి ఇతడి వైపుగా విసిరేస్తుంది. అయితే గాలివలన ఆ కాగితం ఎగురుకొంటూ మురికి కాలువలో పడి కొట్టుకు పోతుంది. ఆఖరుగా అన్నీ పోగొట్టుకొని ఎప్పటిలా ఎంప్లాయిమెంట్ ఎక్షేంజ్ ముందు లైనులో నిలుచోవడంతో కథ ముగుస్తుంది.
చిత్ర విశేషాలు
[మార్చు]- మాటలు లేకుండా కేవలం ఆహార్యాలతో కథనం నడవడం.
- సహజమైన సన్నివేశాల నేపథ్యం
- కమలహాసన్ విభిన్న నటనా ప్రతిభ
- బిన్న భాషానటీనటుల ఎంపిక
- కథనానికి తగిన సంగీతాన్నందించిన వైద్యనాధన్ సంగీత ప్రతిభ
తారాగణం
[మార్చు]- కమల్ హాసన్ - ఉద్యోగం లేని బ్రహ్మచారి
- అమల - ఇంద్రజాలికుని కూతురు
- టినూ ఆనంద్ - డబ్బు తీసుకొని హత్యలు చేసే హంతకుడు
- పి.ఎల్.నారాయణ - రోడ్డు మీద అడుక్కొనే బిచ్చగాడు
- ఫరీదా జలాల్ - ఇంద్రజాలికుని భార్య
- సమీర్ కక్కర్ - అదే పేరుతో ఉండే కోటీశ్వరుడు
- రమ్య కృష్ణ - కోటీశ్వరుని భార్య
- లోకనాథ - హోటల్ యజమాని
- కె.ప్రతాప్ పోతన్ - ఒక ప్రేమికుడు
- కె.యస్.రమేష్ - ఇంద్రజాలికుడు
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (27 November 2022). "మాటలు లేకుండా తీసిన సినిమాకు 35 ఏండ్లు.. పుష్పక విమానం స్టోరీ ఇది". Archived from the original on 27 November 2022. Retrieved 27 November 2022.
- ↑ సెప్టెంబరు 27, 2007 సేకరించిన వివరాల ప్రకారం ఐఎండిబీలో పుష్పక విమానం సినిమాకు 429 వోట్లు వచ్చాయి. ఈ వోట్లన్నిటి సగటు 10కిగాను 9.4 ఉంది