ఎం.ఎస్. సుబ్బులక్ష్మి
ఎం.ఎస్.సుబ్బు లక్ష్మి | |
---|---|
జననం | మధురై షణ్ముఖవడివు సుబ్బు లక్ష్మి 16 సెప్టెంబరు 1916 |
మరణం | 2004 డిసెంబరు 11 | (వయసు 88)
మరణ కారణం | ఊపిరితిత్తుల న్యుమోనియా, హృదయ సంబంధ సమస్యలతో[1] |
వృత్తి | కర్నాటక సంగీత గాయకురాలు , నటి |
జీవిత భాగస్వామి | త్యాగరాజన్ సదాశివన్ |
పిల్లలు | రాధా విశ్వనాథన్ |
తల్లిదండ్రులు |
|
సంతకం | |
'ఎం.ఎస్.సుబ్బులక్ష్మి లేదా ఎం.ఎస్.గా పేరుగాంచిన మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (1916 సెప్టెంబర్ 16 – 2004 డిసెంబర�� 11) కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని , నటి. ఈమె భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974 లో రామన్ మెగసెసె పురస్కారం పొందినప్పుడు అవార్డు ప్రదాతలు ప్రకటిస్తూ కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి. ఎం. ఎస్. సుబ్బులక్ష్మిని కర్ణాటక సంగీతపు శాస్త్రీయ, అర్థ-శాస్త్రీయ గీతాలాపనలో ప్రస్తుతపు ప్రధాన విశేషంగా పరిగణిస్తారు అని వ్యాఖ్యానించారు.
బాల్యము
[మార్చు]తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో న్యాయవాది సుబ్రహ్మణ్య అయ్యర్, వీణావాద్య విద్యాంసురాలు షణ్ముఖవడివు అమ్మాళ్ కు 1916 సెప్టెంబర్ 16 న జన్మించింది. చిన్నప్పుడు ఆమెను ముద్దుగా కుంజమ్మ అని పిలిచేవారు.[2] తల్లి ఆమె ఆది గురువు. పదేళ్ళ ప్రాయం నుంచే సంగీత ప్రస్థానం ప్రారంభమైంది. అయితే ఆమెలో భక్తితత్వానికి బీజం వేసింది మాత్రం ఆమె తండ్రి అయ్యర్. సుబ్బులక్ష్మి శుద్ధ సంప్రదాయ కుటుంబంలో జన్మించింది కనుక తన జీవితకాలమంతా ఆమె భారతీయ సంప్రదాయాన్ని, సంస్కారాన్ని అమితంగా ప్రేమించింది. బాల్యంలో పాఠశాలలో అకారణంగా టీచరు కొట్టడంతో చిన్నతనంలోనే బడికి వెళ్ళడం మానేసిన సుబ్బులక్ష్మి తన అక్క, అన్నదమ్ములతో కలసి సంగీత సాధన చేసి, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ వద్ద సంగీతంలో శిక్షణ పొంది తన ప్రతిభకు స్పష్టమైన రూపునిచ్చి, తదనంతర కాలంలో జాతి గర్వించతగ్గ అంతర్జాతీయ సంగీత సామ్రాజ్ఞిగా ఎదిగింది. 1926 లో 10 సంవత్సరాల వయసులో గుడిలో పాటలు పాడడంతో తన తొలి సంగీత ప్రదర్శన మొదలైంది. నాటి నుండి సంగీత ప్రియులను తన మధుర స్వరంతో సంగీతంలో ఓలలాడిస్తూనే ఉంది. అప్పుడే తను మొట్టమొదటిసారిగా హెచ్.ఎం.వి కోసం ఆల్బమ్ అందించింది.
జీవితం
[మార్చు]సుబ్బులక్ష్మిలోని ప్రతిభను గుర్తించిన తల్లి మధురై నుంచి చెన్నైకి మకాం మార్చటంతో ఆమె జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది. ఆమె 1933 లో మద్రాస్ సంగీత అకాడెమీలో తన మొట్ట మొదటి సంగీత కచేరీకి శ్రీకారం చుట్టింది. సంగీతపరంగా సుబ్బులక్ష్మి జీవితంలో ఇది ఒక మలుపైతే తన గురువు, మార్గదర్శి, ఆనంద వికటన్ పత్రిక సీనియర్ ఎగ్జిక్యూటివ్, స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది అయిన త్యాగరాజన్ సదాశివన్ తో 1940 లో ఆమె ప్రేమవివాహం అయింది. సదాశివన్ తొలిభార్య కుమార్తె రాదను పెంచుకున్నారు. ఆ వివాహంతో మరో ముఖ్యమైన మలుపు. 1938 సంవత్సరంలో సేవాసదనం సినిమా ద్వారా సుబ్బులక్ష్మి సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టింది. నటేశ అయ్యర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆమె అతడి సరసన సుమతిగా నటించింది. సదాశివన్ సినీ నిర్మాత కూడా కావడంతో సుబ్బులక్ష్మి సినీ సంగీత జీవితానికి ఎటువంటి అడ్డంకులు ఎదురు కాలేదు. తమిళ సినిమాలలో గాయనిగా తెరపై కూడా కనిపించి ప్రేక్షకులను అలరించింది. 1940 వ సంవత్సరంలో శకుంతలై అన్న తమిళ సినిమాలో ఆమె తొలిసారిగా గాయక నటిగా తెరపై కనిపించింది. 1945 వ సంవత్సరంలో నిర్మించబడిన 'మీరా' చిత్రం హిందీలో పునర్నిర్మించబడి కూడా విజయవంతం కావడంతో సుబ్బులక్ష్మి పేరు భారతదేశమంతటికీ సుపరిచితమయింది. 'మీరా' సినిమాలోని ఆమె నటనకు, గాన మాధుర్యానికి జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి. అది ఆమె ఆఖరి సినిమా. భక్తిగాయనిగా సుబ్బులక్ష్మి పేరు ప్రఖ్యాతులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంలో సదాశివన్ కృషి ఎంతో ఉంది.
ఆమె గాత్రం, సోత్రం, గానం, గీతం
[మార్చు]సుబ్బులక్ష్మి పాడుతుంమల్లెపూలు, చేతిలో తంబూర పట్టుకొని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహరిలో మునిగిపోయేవారు. కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. గానం ధ్యానంలా సాగేది. పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలును, శాస్త్రీయ, లలిత గీతాలను, భజనలు, జానపద గేయాలు, మరాఠీలో అభంగాలు, దేశభక్తి గేయాలు కూడా పాడారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బులక్ష్మి ప్రత్యేకత. శృతి, లయ, ఆలపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాళ్ళలో వ్యక్తీకరించడంతోపాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్య��! ముఖ్యంగా సంక్లిష్ట సమాసాలతో కూడిన సంస్కృత భాషలోని భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించడం ఆమె సాధన ద్వారా సాధించుకున్న గొప్ప వరం. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బులక్ష్మి తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు.
మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన వైష్ణవ జనతో, జె పీర్ పరాయీ జానేరే వంటి గీతాలకు ప్రాణం పోసిన వ్యక్తి ఆమె. భజనపాడుతూ అందులోనే అమె పరవశురాలవుతారు. ప్రార్థన సమయములో ఎవరయిన అలా లీనమవాలి. ఓ భజనను మొక్కుబడిగా పాడటం వేరు, అలా పాడుతూ పూర్తిగా దైవ చింతనలో లీనమవడం వేరు అని మహాత్మా గాంధీ ఆమెను ప్రశంసించారు.
ఐక్య రాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు సుబ్బులక్ష్మి. ఆ సందర్భంలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక సుబ్బులక్ష్మిని ప్రశంసిస్తూ తన సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలిగా పేర్కొన్నాయి. రాయల్ ఆల్బర్ట్ హాల్, లండన్లో ప్రదర్శన యిచ్చినపుడు ఇంగ్లండ్ రాణిని కూడా తన్మయురాలిని చేసి ఆమె ప్రశంసలు పొందింది.
స్వర సంకలనం
[మార్చు]గానం | భాష | సంవత్సరం | ఇతర వివరాలు | |
---|---|---|---|---|
వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవ కోసం తిరుమల తిరుపతి దేవస్థానంవారికి గానం |
శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం | తెలుగు | ||
బ్రహ్మ కడిగిన పాదము... |
| |||
వాతాపి గణ పతిం భజే... | ||||
భజ గోవిందం మూడమతే... I | ||||
తిరుమల తిరుపతి దేవస్థానంవారి కోసం | శ్రీ వెంకటేశ్వర పంచరత్నమాల | |||
రేడియో రేసిటాల్స్ వాల్యూమ్ 2 | ఆడ మోడి గలదా...[3] |
| ||
ఆల్బం : సుబ్బులక్ష్మి ఎం.ఎస్ లైవ్ | అంబా నీ...[3] |
| ||
అరుల్ పురివై...[3] |
|
చలనచిత్ర రంగం లో
[మార్చు]ఆధ్యాత్మిక సంగీతంలో తన పటిమతో పాటు ఇటు చలనచిత్ర రంగంలో కూడా తన ప్రతిభాపాటవాలను నిరూపించుకున్నారు ఎం.ఎస్. ఆమె నటించిన కొన్ని చిత్రాలు:[4]
సంవత్సరం (సా.శ.) | చలనచిత్రం | భాష | పాత్ర | దర్శకుడు | సంగీతం దర్శకుడు |
---|---|---|---|---|---|
1938 | సేవాసదనం | తమిళం | సుమతి | కె.సుబ్రమణ్యం | పాపనాశం శివం |
1941 | సావిత్రి | తమిళం | నారద ముని | వై.వీ.రావు | కమలాదాస గుప్త & తురైయుర్ రాజగోపాల శర్మ |
1945 | మీరా | తమిళం | మీరాబాయి | ఎల్లిస్ ఆర్. డంగెన్ | ఎస్.వీ. వెంకటరామన్ |
1947 | మీరాబాయి | హిందీ | మీరాబాయి | ఎల్లిస్ ఆర్. డంగెన్ | ఎస్.వీ. వెంకటరామన్ |
పురస్కారాలు, సన్మానాలు
[మార్చు]తన జీవితకాలంలో సంగీత ప్రపంచంలో బహుశా ఎవరూ సాధించని, ఛేదించని రికార్డులు, రివార్డులు ఆమె అందుకుంది. ఆమె ఎక్కని 'శిఖరం లేదు, పొందని బహుమానం లేదు. అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఎన్నో సుబ్బులక్ష్మి గాత్రానికి దాసోహమంటూ ఆమె ముందు వాలాయి.
పురస్కారం పేరు | బహూకరించింది | సంవత్సరం (సా.శ.) | ఇతర వివరాలు | |
---|---|---|---|---|
పద్మభూషణ్[5] | భారత ప్రభుత్వం | 1954 | ||
బిరుదు | సంగీతకళానిధి | ది మ్యూజిక్ అకాడమి చెన్నై, తమిళనాడు |
1965 | మొట్టమొదటి సారిగా అందుకున్న స్త్రీ గాయకురాలు |
డాక్టరేట్ | శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అంధ్రప్రదేశ్ |
1971 | ||
డాక్టరేట్ | ఢిల్లీ యూనివర్సిటి ఢిల్లీ |
1974 | ||
రామన్ మెగసెసే పురస్కారం[6] | ఫిలిప్ఫీన్స్ ప్రభుత్వం | 1974 | ||
పద్మవిభూషణ్[5] | భారత ప్రభుత్వం | 1975 | ||
డాక్టరేట్ | బెనారస్ యూనివర్సిటి ఉత్తరప్రదేశ్ |
1980 | ||
డాక్టరేట్ | యూనివర్సిటి ఆఫ్ మద్రాస్ తమిళనాడు |
1987 | ||
కాళిదాస్ సమ్మాన్[1] | మధ్యప్రదేశ్ ప్రభుత్వం | 1988 | ||
ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా అవార్డు | భారత జాతీయ కాంగ్రెస్ | 1990 | ||
భారతరత్న[5] | భారత ప్రభుత్వం | 1998 | సంగీత విభాగం క్రింద మొట్టమొదటి సారిగా ఈ అత్యున్నత పురస్కారం అందుకుని చరిత్ర సృస్టించిన వ్యక్తి, స్త్రీ, గాయకురాలు | |
జీవిత సాఫల్య పురస్కారం[7] ( లైఫ్ టైం అచీవమెంట్ అవార్డు ) |
ఢిల్లీ ప్రభుత్వం | 2004 | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి తనకు పురస్కారం క్రింద వచ్చిన 11 లక్షల రూపాయల నగదును స్వర్గీయ కంచి ఆచార్య చంద్రసేఖరేంద్ర సరస్వతీ స్మృతి కట్టడానికి విరాళమిచ్చారు. |
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గురించి ప్రచురణలు
[మార్చు]పుస్తకం పేరు | భాష | సంవత్సరం (సా.శ.) | ఇతర వివరాలు | |
---|---|---|---|---|
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర సంకలన్ పరిచింది. టి.జే.ఎస్.జార్జి[8] |
ఇంగ్లీష్ | 2004 |
పుస్తకం ఆన్ లైన్ ద్వారా కొనుటకు: | |
ఇంటింటా పవిత్ర సుమసుగంధాలను వెదజల్లిన ' సుప్రభాత ' గీతమై ప్రతి ఇంటా ఆధ్యాత్మిక భావనలను విరజిమ్మిన విష్ణు సహస్రనామ నిత్యస్తోత్రమై ఈ ధరణీతలాన్ని కొన్ని దశాబ్దాల పాటు పులకింపచేసిన కర్ణాటక శాస్త్రీయ సంగీత స్వరధార 2004, డిసెంబర్ 11న శాశ్వతంగా మూగబోయింది.[1] కాని ఆమె గొంతు మాత్రం విశ్వం ఉన్నంత కాలం ప్రపంచం అంతా మారుమోగుతూనే ఉంటుంది.
ఇవికూడా చూడండి
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు]- ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గురించి రామన్ మెగసెసె అవార్డ్ వారి అధీకృత వెబ్సైట్ లో సంగ్రహ జీవిత చరిత్ర
- ఎం.ఎస్.సుబ్బులక్ష్మి-20వ శతాబ్దంలొ 100 మంది ప్రముఖ తమిళులు.
- ఎమ్మెస్ సుబ్బులక్ష్మి జీవిత పరిచయం
- యూట్యుబ్ లో ఎం.ఎస్. గురించి ఫిల్మ్స్ డివిజన్ వారు చేసిన ఒక ఆంగ్ల డాక్యుమెంటరీ
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఎం.ఎస్.సుబ్బలక్ష్మి పేజీ
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 హిందూ పత్రిక వెబ్సైట్ నుండి M.S. subbulakshmi passes away, aged 88. Archived 2009-10-19 at the Wayback Machineజూన్ 10,2008న సేకరించబడినది.
- ↑ గార్లపాటి, పల్లవి. "ఎమ్మెస్ ఆవేదనా రాగం ఇది!". eenadu.net. ఈనాడు. Archived from the original on 13 May 2017. Retrieved 13 May 2017.
- ↑ 3.0 3.1 3.2 మ్యూజిక్ ఇండియా ఆన్ లైన్ వెబ్సైట్ నుండి...ఎం.ఎస్. సుబ్బలక్ష్మి Archived 2008-03-27 at the Wayback Machineజూన్ 13,2008న సేకరించబడినది.
- ↑ ఎం ఎస్ సుబ్బలక్ష్మి సినీప్రస్థానం
- ↑ 5.0 5.1 5.2 పద్మభూషణ్ పురస్కారం గ్రహీతల శీర్షిక క్రింద ఎం.ఎస్.సుబ్బలక్ష్మిజూన్ 10,2008న సేకరించబడినది.
- ↑ రామన్ మెగసెసె పురస్కారం గ్రహీతల శీర్షిక Archived 2010-09-01 at the Wayback Machine క్రింద ఎం.ఎస్.సుబ్బలక్ష్మి. జూన్ 10,2008న సేకరించబడినది.
- ↑ హిందూ పత్రిక వెబ్సైట్ నుండి Lifetime Achievement Award for M.S. Subbulakshmi [permanent dead link]జూన్ 10,2008న సేకరించబడినది.
- ↑ హిందూ పత్రిక వెబ్ సైట్ నుండి ఎం.ఎస్. సుబ్బలక్ష్మి జీవిత చరిత్ర Archived 2005-03-29 at the Wayback Machineజూన్ 13,2008న సేకరించబడినది.
- All articles with dead external links
- Pages using infobox person with unknown parameters
- Infobox person using religion
- Infobox person using residence
- భారతరత్న గ్రహీతలు
- రామన్ మెగసెసే పురస్కార గ్రహీతలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- 1916 జననాలు
- 2004 మరణాలు
- కర్ణాటక సంగీతం
- కర్ణాటక సంగీత విద్వాంసులు
- పద్మభూషణ పురస్కారం పొందిన మహిళలు
- పద్మవిభూషణ పురస్కారం పొందిన మహిళలు
- సంగీత కళానిధి పురస్కార గ్రహీతలు
- భారతీయ మహిళా గాయకులు
- కాళిదాస్ సమ్మాన్ గ్రహీతలు
- సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు