Jump to content

పెమ్మసాని చంద్ర శేఖర్

వికీపీడియా నుండి
(పెమ్మసాని చంద్రశేఖర్ నుండి దారిమార్పు చెందింది)
పెమ్మసాని చంద్రశేఖర్
వ్యక్తిగత వివరాలు
జననం (1976-03-07) 1976 మార్చి 7 (వయసు 48)
బుర్రిపాలెం, గుంటూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీతెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామికోనేరు రత్న
సంతానంఅభినవ్ సహస్ర
వృత్తివైద్యుడు రాజకీయ నాయకుడు

పెమ్మసాని చంద్ర శేఖర్, (జననం 1976 మార్చి 7) ఒక భారతీయ రాజకీయ నాయకుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. చంద్రశేఖర్ వృత్తిరీత్యా వైద్యుడు.[1] పెమ్మసాని చంద్రశేఖర్ 2024 భారత సాధారణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు ఎంపీగా పోటీ చేసి గెలుపొందాడు.[2] జూన్ 9న మోదీ మంత్రివర్గంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

పెమ్మసాని చంద్రశేఖర్ 1976 మార్చి 7న [3] నేటి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, బుర్రిపాలెంలో పెమ్మసాని సాంబశివరావు సువర్ణ దంపతులకు వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. చంద్రశేఖర్ కు రవిశంకర్ అనే సోదరుడు ఉన్నాడు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన చంద్రశేఖర్ చిన్నప్పటి నుంచి సాదాసీదా జీవితాన్ని గడిపారు. పెమ్మసాని చంద్రశేఖర్ బుర్రిపాలెంలో జన్మించినప్పటికీ, తన తండ్రి నరసరావుపేటలో హోటల్ నడపటంతో చంద్ర శేఖర్ తన చిన్నతనంలో కొంత కాలం నరసరావుపేటలో గడిపాడు. చంద్రశేఖర్ 1991లో 10వ తరగతి, 1993లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. డాక్టర్ కావాలనే ఆకాంక్షతో, చంద్రశేఖర్ 1993-94లో ఎంసెట్ [4] లో 27వ ర్యాంక్ సాధించాడు. తరువాత చంద్రశేఖర్ హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీటు పొందాడు. తెలుగు మీడియంలో చదివినా ఇంత మంచి ర్యాంకు సాధించాడని అప్పట్లో చంద్రశేఖర్ పలువురి ప్రశంసలు అందుకున్నాడు.

చంద్రశేఖర్‌ మెడిసిన్ పూర్తి చేసి తరువాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం 2000లో అమెరికాకు వెళ్లి పీజీ, 2005లో అమెరికాలోని పెన్సిల్వేనియాలోని గీసింజర్‌ మెడికల్‌ సెంటర్‌ నుంచి ఇంటర్నల్‌ మెడిసిన్‌లో ఎండీ పట్టా అందుకొని ఆ తరువాత జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీలో ఐదేళ్లపాటు టీచింగ్ ఫ్యాకల్టీగా పని చేశాడు.

వృత్తి జీవితం

[మార్చు]

పెమ్మసాని చంద్రశేఖర్‌ అమెరికాలో మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు సహాయం చేస్తూ చాలా తక్కువకు తాను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ను ఆన్‌లైన్‌ లో అందించేవాడు. ఆ ప్రయత్నానికి మంచి ఆదరణ దక్కడంతో ఆయన రాసిన మెటీరియల్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. చంద్రశేఖర్‌ ఆ తరువాత వైద్య విద్యార్థులకు ఆన్‌లైన్‌ శిక్షణ ఇచ్చేందుకు 'యు వరల్డ్‌' సంస్థను ప్రారంభించాడు. ఇందులో నర్సింగ్‌, ఫార్మసీ, న్యాయ, వాణిజ్యం, అకౌంటింగ్‌ విభాగాల్లో లైసెన్సింగ్‌ పరీక్షలకు శిక్షణ ఇచ్చేవాడు.

సేవ కార్యక్రమాలు

[మార్చు]

పెమ్మసాని చంద్రశేఖర్‌ పెమ్మసాని ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి ఎన్నారైలకు ఉచితవైద్య సేవలు, వైద్య బీమా లేక ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయులకు అండగా నిలిచాడు. ఆయన తన పుట్టిన గడ్డ కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో స్వదేశానికి వచ్చి గుంటూరు, నరసరావుపేట నియోజకవర్గాల్లోని గ్రామాల్లో ప్రధాన సమస్యగా ఉన్న నీటి కొరతను తీర్చాడనికి వందల సంఖ్యలో బోర్‌వెల్స్‌, ఆర్‌వో ప్లాంట్స్‌ ఏర్పాటు చేశాడు. పెమ్మసాని చంద్రశేఖర్‌ గ్రామీణ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను అందించేలా బెస్ట్ బెరీ అని స్కూల్ ను ప్రారంభించాడు. ఆయన పెమ్మసాని ట్రస్టును ఏర్పాటు చేసి పేద ప్రజలకు, స్వచ్చంద సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తున్నాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

పెమ్మసాని చంద్రశేఖర్‌ తండ్రి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ నరసరావుపేట పట్టణ ఉపాధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన తన తండ్రి అడుగుజాడల్లో రాజకీయాలపట్ల ఆసక్తితో 2014 ఎన్నికల సమయంలో రాజకీయ, ప్రచార పనులలో చురుకుగా పాల్గొన్నాడు. చంద్రశేఖర్ 2014లో టీడీపీ నుంచి నర్సరావుపేట లోక్‌సభ టిక్కెట్‌ కోసం ప్రయత్నించగా 2014, 2019లో మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావుకు అవకాశం ఇవ్వడంతో పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ కోసం పని చేసి టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఇండియన్ సెల్‌లో చురుకుగా పాల్గొన్నాడు.

పెమ్మసాని చంద్రశేఖర్‌ 2024లో నరసాపురం అసెంబ్లీ టిక్కెట్ ఆశించాడు కానీ, గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు విరామం ప్రకటించడంతో చంద్రశేఖర్ కు టీడీపీ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం ఇవ్వడంతో ఆయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్యపై 344695 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా 18వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు. పెమ్మసాని చంద్రశేఖర్ జూన్ 9న మోదీ మంత్రివర్గంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[5][6][7]

మూలాలు

[మార్చు]
  1. "A doctor with assets abroad and home, TDP's Guntur candidate at Rs 5,705 crore is richest in fray so far". The Indian Express (in ఇంగ్లీష్). 2024-05-16. Retrieved 2024-05-26.
  2. "NRI Dr Pemmasani Chandrasekhar Gears Up To Contest Lok Sabha Elections From Guntur". The Times of India (in ఇంగ్లీష్). 2024-02-14. Retrieved 2024-05-26.
  3. "Pemmasani Chandra Sekhar biography". www.telugu.asianetnews.com (in ఇంగ్లీష్). Retrieved 2024-05-26.
  4. "Dr. Pemmasani". www.timesnownews.com (in ఇంగ్లీష్). 2024-04-23. Retrieved 2024-05-26.
  5. EENADU (10 June 2024). "తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రుల ప్రస్థానమిది". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  6. EENADU (10 June 2024). "పెమ్మసాని చంద్రశేఖర్‌ అనే నేను..." Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  7. BBC Telugu (10 June 2024). "పెమ్మసాని చంద్రశేఖర్: పోటీ చేసిన తొలిసారే గెలిచి కేంద్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పదవి దక్కించుకున్న డాక్టర్". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.