Jump to content

పద్మపాదాచార్యులు

వికీపీడియా నుండి
(పద్మపాదులు నుండి దారిమార్పు చెందింది)
పద్మపాదాచార్యుల సమాధి

పద్మపాదాచార్యుడు సా.శ. 9వ శతాబ్దానికి చెందిన తత్త్వజ్ఞుడు, అద్వైత వేదాంతి. శంకరాచార్యుని నలుగురు ముఖ్యశిష్యులలో ఈయన ఒకడు. శంకరాచార్యుడు భారతదేశానికి తూర్పున పూరిలో గోవర్ధన పీఠాన్ని సంస్థాపించి, ఇతనిని అధిపతిగా నియమించాడు.[1]

పూర్వాశ్రమం (సన్యాసానికి ముందు జీవితం)

[మార్చు]

దక్షిణ భారతదేశంలో కావేరీ నదీతీరంలో విమల అనే బ్రాహ్మణునికి సంతానంగా ఈయన జన్మించాడు. బాల్యంలో వేదాలను చదువుకుని, సన్యసించి, కాశీ నగరం చేరుకున్నాడు. అక్కడ శంకరాచార్యుని కలుసుకొని శిష్యునిగా చేరాడు. ఆయనకు శంకరాచార్యుడు "సనందన" అని నామకరణం చేసాడు.[2]

శంకరాచార్యుని వద్ద శిష్యరికం

[మార్చు]

పద్మపాదుడు శంకరాచార్యుని మొదటి శిష్యుడు.[3]

కొత్త పేరు

[మార్చు]

శంకరుని కాశీ ప్రయాణంలో ఒక బ్రహ్మచారి ఆయన వద్దకు వచ్చి నేను బ్రాహ్మణుడను, నా పేరు సనందుడు. నాది చోళదేశం మహాత్ములను దర్శించి జ్ఞానాన్ని ఆర్జించాలని వచ్చాను. మీ వద్ద శిష్యునిగా ఉండే వరమిమ్మని ప్రార్థించాడు. అలా శంకరునకు అత్యంత ఆత్మీయునిగా మారాడు. సదానందుడు శంకరునికి అత్యంత సన్నిహితంగా ఉండడంవల్ల, తోటి శిష్యులకు కొద్దిగా అసూయగా ఉండేది. అది శంకరుడు గ్రహించి, వారిలోని ఆ అసూయను పోగట్టదలచాడు. ఒకరోజు గంగానదికి ఆవల ఉన్న సదానందుడిని పిలిచాడు. వెంటనే సదానందుడు నది మీద నడుచుకొంటూ ఈవలకు వచ్చాడు. నది మీద సదానందుడు అడుగు వేసినచోటల్లా, అతడు మునిగిపోకుండా పద్మాలు వచ్చాయి. అది చూసిన తోటి శిష్యులు, సదానందుడిపై అసూయ పడినందుకు సిగ్గుపడ్డారు. అప్పటి నుండి సదానందుడు "పద్మపాదుడు" అయ్యాడు. పద్మపాదునికి సంబంధించిన మరొక కథ: శ్రీ శంకరులు శ్రీ శైల పరిసరములలో చాలా కాలం తపస్సు చేసాడు. శంకరుడు తపస్సు చేసుకొంటూ, ఆపరిసరాలలో హిందూ ధర్మ ప్రచారము చేయుచున్నకాలమందు శంకరుడు చేయు కార్యములు నచ్చని కొందరు ఆయనను అంతమొందించు యత్నముతో ఆపరిసరాలయందు బీభత్సము సృష్టించుచున్న ఒకపెద్ద దొంగలముఠానాయకుని రెచ్చగొట్టి కొంత ధనమునిచ్చి పంపించారు. అతడు ఇదే ప్రదేశమున పెద్ద కత్తితో మాటువేసి, తపమాచరించుచున్న శంకరుని వెనుకగా ఒకేవేటున తలఎగరగొట్టు ప్రయత్నమున ముందుకురికెను. ఇక్కడ ఇది జరుగుచున్న సమయమున, శంకరుని ప్రధాన శిష్యుడైన పద్మపాదుడు మల్లికార్జునుని దేవాలయమున ఈశ్వరుని ధ్యానించుచూ, కూర్చొని ఉండెను. ఈశ్వరునే మనసున ఉంచి ధ్యానిస్తున్న అతనికి హటాత్తుగా ఈదృశ్యము కనిపించెను. వెంటనే అతడు మహోగ్రుడై, శ్రీలక్షీనృసింహుని వేడనారంభించెను. ఇక్కడ శంకరుని వధించుటకు ఉరికిన ఆ దొంగలనాయకునిపై ఎటునుండొ హఠాత్తుగా ఒక సింహము దాడి చేసింది. అతడి శరీరాన్ని ముక్కలుముక్కలుగా చీల్చివేసి, ఎట్లు వచ్చినదో అట్లే మాయమయినది. తదనంతరము మిగిలిన శిష్యులకు ఈ విషయము తెలిసి, పద్మపాదుని శక్తికి, అతనికి శ్రీ శంకరులయందున్న భక్తికి అతనిని అభినందించారు.

అద్వైత సాహిత్యాన్ని బట్టి చూస్తే, ఈయనకు పద్మపాదుడు అని పేరు రావడానికి వెనుక ఒక కథ ఉంది. ఒక సారి శంకరాచార్యుడు గంగానదికి ఒక వైపు, శిష్యులందరూ మఱొక వైపు ఉండగా, గురువుగారు వారిని నది దాటి రమ్మన్నారట. తక్కిన శిష్యులందరూ ఒక పడవ కోసం చూస్తుండగా, గురువు గారి ఆజ్ఞ విన్న తఱువాత, రెండవ ఆలోచన ఎఱుగని సనందుడు మధ్యలో ఉన్న నది సంగతి మరిచిపోయి, నది మీద పరుగెట్టడం మొదలెట్టాడు. ఆ గురుభక్తిని మెచ్చి, గంగ సనందుడు అడుగు వేసిన చోటల్లా పద్మాన్ని ఉంచి నదిని దాటించింది. అందుకని ఆయనకు పద్మపాదుడు అనే పేరు సంప్రాప్తించింది.[2]

తోటకాష్టకం

[మార్చు]

అద్వైత సాహిత్యంలో తోటకాచార్యు నకు ఆ పేరు ఎందుకు వచ్చిందో ఒక కథ ఉంది. గిరిగా పిలువబడే తోటకాచార్యుడు పెద్దగా చదువుకోలేదని పద్మపాదుడికి కొంచెం చిన్నచూపు ఉంది. ఆ విద్యాగర్వం పోగొట్టేందుకే శంకరాచార్యుడు గిరి చేత తోటకాష్టకం చెప్పించాడు అని ప్రతీతి.[2]

పంచపాదిక

[మార్చు]

పద్మపాదుని ముఖ్యరచనలలో పంచపాదిక ఒకటి. అద్వైతుల సాహిత్యంలో ఈ రచన వెనుక ఒక కథ ఉంది. శంకరాచార్యులు బ్రహ్మసూత్రాల గురించి వ్రాసిన భాష్యాన్ని చదివిన పద్మపాదుడు దాని పైన ఒక టీకాను రచించి గురువుగారికి అర్పించాడు. ఒక సారి పద్మపాదుడు తీర్థయాత్రలకు వెళ్ళాలని సంకల్పించుకున్నాడు. దారిలో శ్రీరంగంలో తన మేనమామను కలిసి తన రచనను చూపించాడు. స్వయంగా కర్మకాండను అనుసరించే తన మేనమామకు వీరి పోకడ నచ్చక ఆ గ్రంథాన్ని తగలబెట్టాడు. అంతే కాక పద్మపాదులకు నల్లమందు పెట్టి మందమతిని చేసారు. పద్మపాదుడు శంకరాచార్యులను కలిసి ఈ దుర్ఘటనను వివరించగా, శంకరాచార్యుడు ఆ గ్రంథాన్ని యథాతథంగా జ్ఞప్తికి తెచ్చుకుని చదివాడు. ఆ టీకా పేరే పంచపాదిక (ఐదు పాదాలు కలది). కానీ, ఇందులో కేవలం నాలుగు భాగాలే ప్రస్తుతం లభ్యమవుతున్నాయి.[4]

ఈ కథ చెప్పిన విద్యారణ్య స్వామి కూడా దీనికి సరైన మూలాలు తెలియవని అనడం వలన ఇది ఎంత వరకు నిజమో ప్రశ్నార్థకమే.[3]

అభినవ గుప్తుని శాపం

[మార్చు]

శంకరాచార్యునిపై అసూయతో అభినవగుప్తుడు ఒక శాపం ఇచ్చాడని, తత్ఫలితంగా శంకరాచార్యునికి భంగంధరం అనే ఒక వ్యాధి వచ్చిందని కొన్ని రచనలు చెప్తున్నాయి. కానీ అభినవగుప్తుడు శంకరాచార్యుని తఱువాతి శతాబ్దంలో ఉండటం వలన ఈ కథ నిజమయ్యే అవకాశం లేదు. వ్యాసాచలుడు అనే అద్వైతి రచన ప్రకారం ఆ శాపం కాపాలికుల పని. శంకరాచార్యుల కాలంలో ఉన్న కాపాలికులకు ఆయన అంటే పడదు కాబట్టి ఇది నమ్మశక్యమైన వాదన. ఏదేమైనా, ఆ శాపాన్ని తిప్పి కొట్టింది పద్మపాదుడు అని ప్రతీతి. ఈ కథపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నది గమనార్హం.[5]

రచనలు

[మార్చు]

కచ్చితంగా వీరి రచన అని తెలిసినది పంచపాదిక. విజ్ఞానదీపిక, ఆత్మానాత్మవివేకము, వేదాంతసారము (శంకరాచార్యుల "ఆత్మబోధ"కి భాష్యం) వీరికి ఆపాదించబడే ఇతర రచనలు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 పద్మపాదాచార్యుని గురించి advaita-vedanta.org లో, "http://www.advaita-vedanta.org/avhp/disciples.html#padma"
  2. 2.0 2.1 2.2 రోషణ్ దలాల్, Hinduism: An Alphabetical Guide, 290వ పుట, అక్టోబర్ 2011, "http://books.google.com/books?id=DH0vmD8ghdMC" ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Roshen" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. 3.0 3.1 Karl H. Potter, Encyclopedia of Indian Philosophy (Volume 3): Advaita Vedanta up to Sankara and His Pupils, 563వ పుట, "http://books.google.com/books?id=TCWU_ua5kxgC"
  4. పద్మపాదుని మేనమామ గురించి kamakotimandali.com లో "http://www.kamakotimandali.com/advaita/dakshinamutt.html Archived 2013-01-16 at the Wayback Machine"
  5. ఎన్. సుబ్రహ్మణ్య శాస్త్రి, Sri Sankaracharya's Life in the Light of Vyasachala's Sankaravijayam, 33వ పుట, "http://archive.org/stream/svuorientaljourn015490mbp#page/n33/mode/1up"