Jump to content

బాలకోటేశ్వరస్వామి దేవస్థానం, గోవాడ

వికీపీడియా నుండి

శ్రీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానం, బాపట్ల జిల్లా, అమృతలూరు మండలం, గోవాడ గ్రామంలోని దేవాలయం.

గుంటూరు నుండి 42 కి.మీ., తెనాలి నుండి 21 కి.మీ. ల దూరంలో, గోవాడ గ్రామానికి ఒక కి.మీ. దూరంలో కొలువై ఉన్న గోవాడ బాలకోటేశ్వరుడు, నమ్మినవారి బాధలు తీరుస్తూ, కోర్కెలు ఈడేరుస్తాడని భక్తుల నమ్మకం.

ఆలయ విశిష్టత

[మార్చు]

జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో గోవాడ శైవక్షేత్రం ఒకటి. ఈ ఆలయం 11వ శతాబ్దినాటిది. అప్పట్లో గోవాడ గుడి ప్రాంతాన్ని "దగ్గుమల్లి" అని పిలిచేవారు. మతఘర్షణలలో ఆలయం శిథిలమైపోగా, స్వామివారి మూలవిరాట్టు మాత్రం, ఒంటరిగా "శ్రీ సోమేశ్వరస్వామి" పేరుతో పానుపట్ట సమేతంగా పూర్తి రూపంలో స్థిరమై నిలిచింది. అప్పట్లో బ్రాహ్మణ కోడూరుకు చెందిన తిరుపతిరాయుడు, కావూరు వెళ్ళివచ్చుచూ, స్వామివారి ఆలయంలో ఒక రోజురాత్రి బసచేసాడు. కలలో స్వామివారిని దర్శించిన ఆయన, 1904 లో గోవాడ గ్రామప్రజల ఆర్థిక సహకారంతో శ్రీ బాలకోటేశ్వరస్వామి నామధేయంతో, ఆలయాన్ని మళ్ళీ యథాస్థానంలో నిర్మించారు. నాటి నుండి నిత్యపూజలు, వార్షిక ఉత్సవాలూ నిర్వహించుచున్నారు. ఈ ఆలయంలో భక్తులు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి,షిర్డీ సాయిబాబా, సరస్వతీదేవి, విఘ్నేశ్వరుని దర్శించుకుంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాల శిలాఫలకాన్ని కన్నులవిందుగా తిలకించవచ్చు. ఈ స్వామిని పూజించుచూ, శ్రీనాధుడు శృ��గారనైషధం గ్రంథాన్ని రచించాడని ప్రతీతి.[1]

మహాశివరాత్రి ఉత్సవాలు

[మార్చు]

మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో ఐదు రోజులపాటు తిరునాళ్ళ ఉత్సవాలు నిర్వహించెదరు. పెద్ద యెత్తున దుకాణాలు ఏర్పాటు చేసెదరు. చెక్కతో తయారు చేసున మంచాలు, బల్లలు, రోకళ్ళు, మేజా బల్లలు తదితర గృహోపకరణాల దుకాణాలు ఒక వారం రోజులపాటు ఇక్కడ ఉంటవి. జిల్లా నలుమూలలనుండి లక్షలాదిమంది భక్తులు ఈ సందర్భంగా ఈ ఆలయాన్ని సందర్శించెదరు. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయానికి తెనాలి, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, బాపట్ల మొదలగు ప్రదేశాల నుండి ప్రత్యేకంగా బస్సులు నడుపుతారు.[1]

పశుప్రదక్షణ

[మార్చు]

మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ పశుప్రదక్షణ విశేషం. పండుగ ముందురోజు, సమీప గ్రామాలకు చెందిన రైతులు వందల సంఖ్యలో తమ పశుసంపదను ఆలయానికి తోలుకొనివచ్చి, ఆలయం చుట్టూ ప్రదక్షణ చేయిస్తారు. బెల్లపు చెరుకుగడలు కొనుగోలు చేసుకొని రైతుపక్షంగా వెనుదిరుగుతారు.

ఇతర వివరాలు

[మార్చు]

శ్రీ బాలకోటేశ్వరస్వామితోపాటు, క్షేత్రపాలకుడు శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ వీరభద్రస్వామి, పార్వతీదేవి అమ్మవారు, విశేషంగా పూజలందుకుంటారు. ఈ ఉత్సవంలో కుటుంబ, వినోద సామగ్రితోపాటు, చాలా సామానులు అమ్మకాలు జరుపుతారు. ముఖ్యంగా చెక్క సామగ్రి, గృహోపకరణాలు, వారం రోజులపాటు అమ్మకాలు జరుపుతారు. సమీప గ్రామాలనుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, వారికి నచ్చిన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. ఈ ఏడాది, 40 అడుగుల ఎత్తయిన ఇనుపగొట్టాలతో తయారు చేసిన ఆలయప్రభ నూతనంగా భక్తులకు దర్శనమివ్వనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా, సౌకర్యాలు కలుగజేస్తారు. భక్తుల విశ్రాంతి కోసం, చలువ పందిళ్ళు ఏర్పాటు చేస్తారు.[2]

ధ్వజస్థంభం

[మార్చు]

ఈ ఆలయానికి 2014, మే-24న దాత పావులూరి బసవపూర్ణచంద్రరావు, రు. 5 లక్షల విలువైన ఒక ధ్వజస్తంభం బహుకరించారు. ఈ ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు, అలంకరణలు చేసియున్నవి.[3]

ఉత్తర ద్వారం

[మార్చు]

హైదరాబాదుకు చెందిన దాతలు కాకాని రఘుకుమార్ దంపతులు, 2016, ఫిబ్రవరి 21 న ఈ ఆలయానికి, 75,000 రూపాయల ఖర్చుతో టేకుతో తయారుచేసిన ఉత్తర ద్వారం బహూకరించారు. ఈ ద్వారం ఏర్పాటుతో ఆలయానికి నూతన శోభ ఏర్పడినది.[4]

శివసదనం

[మార్చు]

గోవాడకు చెందిన పారిశ్రామికవేత్త శ్రీ గడ్డిపాటి శ్రీనివాసరావు (వాసు), ఉమారాణి దంపతులు తమ కుమారుడు దినకరబాబు ఙాపకార్ధం, క్రాప గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రులు శ్రీ పాలడుదు శ్రీకాంత్, సంధ్యారాణి దంపతుల సంయుక్త విరాళం 41 లక్షల రూపాయలతో, దూర ప్రాంతాలనుండి ఈ శైవషేత్రాన్ని సందర్శించే భక్తుల కోసం, శివసదనం పేరుతో ఒక నూతన భవనంం నిర్మించారు.[5]

కాకతీయ అన్నదాన సత్రం

[మార్చు]

గోవాడకు చెందిన గడ్డిపాటి వాసు, గతం నుండి ఆలయంలో పలు భవనాల నిర్మాణానికి విరాళాలు అందజేసినారు. 2012లో 15 లక్షల రూపాయలవ్యంతో, కాకతీయ అన్నదాన సత్రం నూతన భవనం నిర్మించి ఇచ్చారు. మహాశివరాత్రి పండుగ రోజున, భక్తులకు అన్నసంతర్పణ ఇక్కడే జరుగుతుంది. ఆలయానికి దక్షిణభాగంలో 2015లో అభిషేక మండపం నిర్మించారు. ఈ నిర్మాణానికి వీరు 7 లక్షల రూపాయల విరాళం అందజేసినారు. ఈ మండపంలో శివరాత్రి పండుగ రోజున అర్ధరాత్రి నుండి అభిషేకాలు నిర్వహించుచున్నారు.

బ్రాహ్మణ అన్నదాన సత్రం

[మార్చు]

1972లో శ్రీ పావులూరి రామకోటయ్య, 15 సెంట్ల స్థలాన్ని, వితరణగా అందజేసినారు. అప్పటి నుండి ఈ స్థలంలో భీమరాజు పానకాలు ఆధ్వర్యంలో మహాశివరాత్రి పండుగనాడు, తిరునాళ్ళకు వచ్చే బ్రాహ్మణులకు అన్నదానం జరిపేవారు. అనంతరం, 2007 నుండి చెరుకుపల్లి బ్రాహ్మణ సేవాసమితి అధ్వర్యంలో అన్నదానం జరిపించుచున్నారు. స్థలదాత కుమారుడు శ్రీ పావులూరి నాగేశ్వరరావు సౌజన్యంతో, 2016లో ఈ స్థలంలో సత్రం నూతన భవన నిర్మాణం చేసారు. ఈ భవన నిర్మాణానికి దాతలు శ్రీ మొవ్వా వెంకటసుబ్బారావు (రాంభొట్లపాలెం) 3 లక్షలూ, శ్రీ రావూరి ఆంజనేయులు (చెరుకుపల్లి) 2 లక్షలూ, దండిభొట్ల పూర్ణానందం (చెరుకుపల్లి) ఒక లక్షా, ఆర్.వి.ఎస్.ఆంజనేయశర్మ ఒక లక్షా విరాళంగా అందజేసినారు. ఇంకనూ ���ొన్నూరుకు చెందిన దాతలు, ఈ భవన నిర్మాణానికి విరాళాలు అందించారు. నూతనంగా నిర్మించిన ఈ భవనాన్ని, 2017,ఫిబ్రవరి-15వతేదీ బుధవారం ఉదయం 10-30 కి ప్రారంభించారు.[6]

ఆర్యవైశ్య అన్నదాన సత్రం

[మార్చు]

శ్రీ బాలకోటేశ్వరస్వామి, కన్యకా పరమేశ్వరీ ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో, 1965 నుండి సేవలందించుచున్నది. మహాశివరాత్రిరోజున, కొన్ని వేకమంది భక్తులకు అన్నదానం నిర్వహించుచున్నారు. కులమతాలకతీతంగా ఈ సత్రంలో అన్నదానం నిర్వహించుచున్నారు.[7]

పద్మశాలీయ అన్నదాన సత్రం

[మార్చు]

ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రిరోజున, ఉదయం, రాత్రి మొత్తం మూడువేలమంది భక్తులకు అన్నదానం నిర్వహించుచున్నారు.[8]

విశ్రాంత భవనం

[మార్చు]

గోవాడకు చెందిన పారిశ్రామికవేత్త శ్రీ గడ్డిపాటి శ్రీనివాసరావు,ఉమారాణి దంపతులు, క్రాప గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రులు శ్రీ శ్రీకాంత్, సంధ్యారాణి దంపతులు, 15 లక్షల రూపాయల వ్యయంతో, నిర్మించి ఇచ్చిన ఈ భననాన్ని, 2017,ఫిబ్రవరి-24వతేదీ, శుక్రవారం,మహాశివరాత్రి రోజున రాత్రి, వేద మంత్రాలతో ప్రారంభించారు. దీనితో దూఅరప్రాంతం నుండి వచ్చే భక్తులకు ఊరట లభించింది.[9]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 ఈనాడు గుంటూరు సిటీ/వేమూరు; 2016, ఫిబ్రవరి-27; 1వపేజీ
  2. ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2014, ఫిబ్రవరి-24, 2వపేజీ
  3. ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2014, మే-25; 2వపేజీ
  4. ఈనాడు గుంటూరు రూరల్/వేమూరు; 2016, ఫిబ్రవరి-22, 2వపేజీ
  5. ఈనాడు గుంటూరు సిటీ/వేమూరు; 2017 ఫిబ్రవరి-13; 1వపేజీ
  6. ఈనాడు గుంటూరు సిటీ/పొన్నూరు; 2017,ఫిబ్రవరి-16; 3వపేజీ
  7. ఈనాడు గుంటూరు సిటీ/వేమూరు; 2017 ఫిబ్రవరి-21; 2వపేజీ
  8. ఈనాడు గుంటూరు సిటీ/వేమూరు; 2017,ఫిబ్రవరి-21; 2వపేజీ
  9. ఈనాడు గుంటూరు సిటీ/వేమూరు; 2017,ఫిబ్రవరి-26; 1వపేజీ