2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు 2019 లో జరిగిన ఎన్నికలు

భారత ఎన్నికల కమిషను 2019 మార్చి 10 న సార్వత్రిక ఎన్నికల ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు ప్రకటించింది. ఈ ప్రకటన ననుసరించి 2019 ఏప్రిల్ 11 న శాసనసభకు, లోక్‌సభకు రాష్ట్రమంతటా పోలింగు జరిగింది. వోట్ల లెక్కింపు 2019 మే 23 వ తేదీన జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తరువాత జరిగిన ఈ తొలి ఎన్నికలలో 25 లోక్‌సభ స్థానాలకు, 175 శాసనసభ స్థానాలకూ ప్రతినిధులను ఎన్నుకున్నారు.

2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
భారతదేశం
2014 ←
ఏప్రిల్ 11, 2019 (2019-04-11)
→ 2024

175
మెజారిటీ కొరకు 88 సీట్లు అవసరం
  మెజారిటీ పార్టీ మైనారిటీ పార్టీ ఇతర పార్టీ
 
నాయకుడు వై.ఎస్.జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్
పార్టీ వై.కా.పా తె.దే.పా జనసేన
ఎప్పటి నుండి నాయకుడు 2011 1995 2014
నాయకుని నియోజకవర్గం పులివెందుల[1] కుప్పం గాజువాక (ఓటమి), భీమవరం (ఓటమి)
గత ఎన్నికలో గెలిచిన సీట్లు 67 103 పోటీ చేయలేదు
ప్రస్తుత సీట్లు 44 126 0
గెలిచిన సీట్లు 151 23 1
మార్పు Increase106 Decrease103 Increase1
పొందిన ఓట్లు 1,56,83,592 12,301,741 2,130,367
ఓట్ల శాతం 49.95% 39.2% 6.78%

  నాల్���వ పార్టీ ఐదవ పార్టీ
 
నాయకుడు ఎన్. రఘువీరా రెడ్డి కన్నా లక్ష్మీనారాయణ
పార్టీ కాంగ్రెస్ భాజపా
ఎప్పటి నుండి నాయకుడు 2009 2018
నాయకుని నియోజకవర్గం కళ్యాణదుర్గం(ఓటమి) didn't partispeted
చివరి ఎన్నిక 0 4
గత ఎన్నికలో గెలిచిన సీట్లు 0 4
గెలిచిన సీట్లు 0 0
మార్పు Steady Decrease 4
పొందిన ఓట్లు 368,810 263,849
ఓట్ల శాతం 1.17% 0.84%


ఎన్నికల ముందు
ముఖ్యమంత్రి

చంద్రబాబు
తె.దే.పా

ఎన్నికల తరువాత
ముఖ్యమంత్రి

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
వై.కా.పా

ఈ ఎన్నికలలో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం పార్టీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెసు పార్టీ, జనసేన పార్టీ, భారత జాతీయ కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీ, సిపిఐ, సిపిఎమ్లు పోటీ పడగా, బహుజన సమాజ్ పార్టీ, ప్రజాశాంతి పార్టీలు కూడా పోటీ చేసాయి. జనసేన, సిపిఐ, సిపిఎమ్, బహుజన సమాజ్ పార్టీలు పొత్తు కుదుర్చుకుని పోటీ చేసాయి. పార్టీల మేనిఫెస్టోలలో సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత నిచ్చారు. ప్రచారం జోరుగా సాగింది. తెలుగు దేశం ప్రభుత్వ అవినీతిని, అసమర్ధతను ప్రధాన లక్ష్యంగా ఇతర పార్టీలు ప్రచారం చెయ్యగా, తాము అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను తెలుగుదేశం ప్రచారాంశం చేసుకుంది. అదేకాక, విభజన చట్టంలో భాగంగా కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులను భాజాపా ప్రభుత్వం ఇవ్వకపోవడాన్ని, వైకాపా అధ్యక్షుడు జగన్ తెరాసతో కుమ్మక్కయ్యాడనే ఆరోపణలనూ తెలుగుదేశం తన ప్రచారంలో వాడుకుంది. గత ఎన్నికలలో తెదేపా, భాజపా కూటమికి మద్ధతు తెలిపిన జనసేన, ఈసారి నేరుగా పోటీలో దిగింది.

మొత్తం 175 శాసనసభ స్థానాల్లో 2,118 మంది అభ్యర్థులు, 25 లోక్‌సభ స్థానాల్లో 319 మంది అభ్యర్థులూ పోటీ చేసారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసిన నాయకులు నలుగురు: తెదేపా తరపున చంద్రబాబు నాయుడు, వైకాపా తరపున జగన్మోహనరెడ్డి, జనసేన తరపున పవన్ కళ్యాణ్, భాజపా తరపున కన్నా లక్ష్మీనారాయణ. భాజపా తరపున ప్రధాని నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా బహిరంగ సభల్లో పాల్గొన్నారు.

2019 ఏఫ్రిల్ 11 న జరిగిన పోలింగులో 79.86 శాతం పోలింగు జరిగింది. పోలింగు నాడు అనేక చోట్ల పోలింగు యంత్రాలు పనిచెయ్యక పోవడంతో, వోటర్లు వోటు వెయ్యడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అర్థరాత్రి దాటాక కూడా కొన్నిచోట్ల పోలింగు జరిపారు. హైదరాబాదు, బెంగళూరు వంటి చోట్ల నివసిస్తున్న వోటర్లు తమ స్వస్థలాలకు చేరుకుని మరీ వోటేసారు. దీంతో పోలింగు ముందు మూడు రోజుల పాటు ఈ రెండు నగరాల నుండి ఆంధ్ర ప్రదేశ్‌కు వెళ్ళే రైళ్ళు బస్సులపై తీవ్రమైన వత్తిడి ఏర్పడింది. వోటేసేందుకు ప్రజలు చూపిన ఈ ఉత్సాహాన్ని పత్రికలు కీర్తించాయి.

కొన్నిచోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఇద్దరు మృతి చెందారు. ఎనికలలో పోటీ చేస్తున్నఅభ్యర్థులపై కూడా కొన్ని చోట్ల దాడులు జరిగాయి. పోలింగు నిర్వహణ తీరుపై ఎన్నికల సంఘం పలు రాజకీయ పార్టీలు, నాయకులు, సామాన్య పౌరుల నుండి విమర్శలు ఎదుర్కొంది. కొన్ని పోలింగ్ బూతులలో రీపోలింగ్ నిర్వహించారు.

2019 మే 23 న ఓట్ల లెక్కింపు జరిగింది. వైఎస్ఆర్ పార్టీ 151 స్థానాలలో, తెలుగుదేశం 23 స్థానాలలో, జనసేన 1 స్థానంలో గెలుపొందాయి. మిగతా పార్టీలేవీ ఖాతా తెరవలేదు.

ఎన్నికల షెడ్యూలు

మార్చు
 
భారతీయ ఓటింగు యంత్రం

ఆంధ్ర ప్రదేశ్‌కు సంబంధించి, భారత ఎన్నికల కమిషను ప్రకటించిన ఎన్నికల షెడ్యూలు కింది విధంగా ఉంది.[2]

ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తేదీ 2019 మార్చి 10
నోటిఫికేషను జారీ 2019 మార్చి 18
నామినేషను దాఖలుకు చివరి తేదీ 2019 మార్చి 25
నామినేషన్ల పరిశీలన 2019 మార్చి 26
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 2019 మార్చి 28
పోలింగు తేదీ 2019 ఏప్రిల్ 11
వోట్ల లెక్కింపు 2019 మే 23

వోటర్ల జాబితా

మార్చు
 
వోటు వేసినట్లు వేలిమీద గుర్తు

2019 మార్చి 24 న ఎన్నికల కమిషను జిల్లా వారీగా వోటర్ల జాబితాను ప్రకటించింది. పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం. పురుషులు: 1,93,82,068 మహిళలు: 1,97,95,423 ఇతరులు: 2,019 మార్చి 26న అనుబంధ జాబితా ప్రచురిస్తుంది.[3]

జిల్లా 2019 జనవరి 11

నాటి వోటర్ల సంఖ్య

2019 మార్చి 22

నాటి వోటర్ల సంఖ్య

పెరిగిన వోటర్ల సంఖ్య
శ్రీకాకుళం జిల్లా 20,64,330 21,70,802 1,06,472
విజయనగరం జిల్లా 17,33,667 18,17,635 83,968
విశాఖపట్నం జిల్లా 32,80,028 35,74,246 2,94,218
తూర్పు గోదావరి జిల్లా 40,13,770 42,04,035 1,90,265
పశ్చిమ గోదావరి జిల్లా 30,57,922 32,06,496 1,48,574
కృష్ణా జిల్లా 33,03,592 35,07,460 2,03,868
గుంటూరు జిల్లా 37,46,072 39,62,143 2,16,071
ప్రకాశం జిల్లా 24,95,383 26,28,449 1,33,066
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 22,06,652 23,82,114 1,75,462
వైఎస్‌ఆర్ జిల్లా 20,56,660 21,92,158 1,35,498
కర్నూలు 28,90,884 31,42,322 2,51,438
అనంతపురం 30,58,909 32,14,438 1,55,529
చిత్తూరు 30,25,222 31,79,101 1,53,879
మొత్తం 3,69,33,091 3,91,81,399 22,48,308

మార్చి 26 న ప్రకటించిన అనుబంధ జాబితాను బట్టి -

రాష్ట్రంలో మొత్తం వోటర్ల సంఖ్య: 3,93,45,717

పురుషులు: 1,94,62,339

స్త్రీలు: 1,98,79,421

ఇతరులు: 3,957

పార్టీలు, నాయకులు

మార్చు
పార్టీలు, నాయకులు, కూటములు
పార్టీ నాయకుడు భాగస్వామిగా ఉన్న కూటమి
తె.దే.పా నారా చంద్రబాబు నాయుడు
వై.కా.పా వై ఎస్ జగన్మోహనరెడ్డి
జనసేన కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన+సిపిఐ+సిపిఎమ్+బిఎస్‌పి
కాంగ్రెస్ ఎన్. రఘువీరా రెడ్డి
భాజపా కన్నా లక్ష్మీనారాయణ
సి.పి.ఐ కె.రామకృష్ణ జనసేన+సిపిఐ+సిపిఎమ్+బిఎస్‌పి
సిపిఐ(ఎం) పి మధు జనసేన+సిపిఐ+సిపిఎమ్+బిఎస్‌పి
బహుజన్ సమాజ్ పార్టీ జనసేన+సిపిఐ+సిపిఎమ్+బిఎస్‌పి
ప్రజాశాంతి పార్టీ కిలారి ఆనంద్ పాల్

పార్టీలు, పొత్తులు

మార్చు

ఈ ఎన్నికల్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెసు పార్టీ, జనసేన పార్టీ, భారత జాతీయ కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీలు పోటీ పడ్డాయి. వీటితో పాటు భారత కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు), బహుజన సమాజ్ పార్టీలు కూడా పోటీ చేసాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని ముందే ప్రకటించాయి.[4] జనసేన, బహుజన సమాజ్ పార్టీలు ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మాయావతి సంయుక్తంగా ప్రకటించారు.[5] 2019 మార్చి 18 న తమ నాలుగు పార్టీలూ కలిసి ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించాయి.[6] ప్రజాశాంతి పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు కిలారి ఆనంద్ పాల్ ప్రకటించాడు.

"రహస్య" పొత్తులు

మార్చు

వివిధ పార్టీలు రహస్యంగా పొత్తులో ఉన్నాయని ప్రత్యర్థి పార్టీలు పలు ఆరోపణలు చేసుకున్నాయి. వీటికి ఆధారాలేమీ చూపకపోయినా, ఒకరిపై ఒకరు ఆరోపణలు మాత్రం విస్తృతంగా చేసుకున్నాయి.

తెలుగు దేశం పార్టీ ఆరోపణలు: వైకాపా, తెరాస, భాజపా ఈ మూడింటి మధ్య ఒక అప్రకటిత ఒప్పందం ఉందని తెలుగుదేశం ఆరోపించింది. నరేంద్ర మోదీ, కేసీయార్‌ల ఆదేశాలకు అనుగుణంగా జగన్మోహనరెడ్డి పనిచేస్తున్నారని తెలుగుదేశం ప్రచారం చేసింది. ఫ్యాను ఇక్కడ, స్విచ్చి హైదరాబాదులో, కరెంటు ఢిల్లీలో అంటూ చంద్రబాబు నాయుడు విమర్శించాడు.[7]

వైకాపా ఆరోపణలు: తెలుగుదేశం, జనసేన అప్రకటిత పొత్తులో ఉన్నాయని వైకాపా ఆరోపించింది. జనసేన తెలుగుదేశానికి బి టీమ్ అని ఎద్దేవా చేసింది.[8]

నినాదాలు

మార్చు

ఈ ఎన్నికల్లో కొన్ని ఆకట్టుకునే నినాదాలతో పార్టీలు ప్రజల ముందుకు వెళ్ళాయి.

తెలుగు దేశం

మార్చు
  • మళ్ళీ నువ్వే రావాలి
  • మీ భవిష్యత్తు నా బాధ్యత

వైకాపా

మార్చు
  • నే విన్నాను నేనున్నాను
  • రావాలి జగన్ కావాలి జగన్

ఆస్తులు, నేరస్థులు

మార్చు

ఎన్నికల కమిషను ఆదేశాల ప్రకారం నామినేషనులో ప్రాథమిక సమాచారంతో పాటు సమర్పించే అఫిడవిట్‌లో తమతమ ఆస్తులను, తాము ఎదుర్కొంటున్న నేరారోపణలనూ కూడా రాయాలి.

అభ్యర్థులు వెల్లడించిన ఆస్తుల వివరాలు

మార్చు

పెండింగులో ఉన్న నేరారోపణ కేసులు

మార్చు

చంద్రబాబునాయుడు తన అఫిడవిట్లో తనపై ఒక కేసు ఉన్నట్లు రాసాడు. 2010 లో మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసిన కారణంగా ఈ కేసు పెట్టినట్లు రాసాడు.[9] వైకాపా నేత వై.ఎస్. జగన్మోహనరెడ్డి సమర్పించిన అఫిడవిట్లో తనపై 31 నేరారోపణ కేసులున్నాయని తెలిపాడు.[10] జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ తనపై కేసులేమీ లేవని అఫిడవిట్లో పేర్కొన్నాడు.[11] నేరం రుజువైన కేసులు ఏమీ లేవని అందరూ తమతమ అఫిడవిట్లలో పేర్కొన్నారు.

వై.ఎస్. జగన్మోహనరెడ్డి సమర్పించిన అఫిడవిట్ తెదేపా విమర్శలకు గురైంది. 48 పేజీల ఈ అఫిడవిట్లో 31 కేసులు ఉన్నాయని, ఇవి జగన్మోహనరెడ్డి నేరచరిత్రకు రుజువులనీ తెదేపా నేత చంద్రబాబునాయుడు అన్నాడు. దేశంలో ఎవరి అఫిడవిట్‌లోనూ ఇన్ని కేసులు ఉండవని ఆయన అన్నాడు.[12]

మ్యానిఫెస్టోలు, వాగ్దానాలు

మార్చు

పార్టీలు అనేక వాగ్దానాలను, జనాకర్షక పథకాలనూ తమ తమ మానిఫెస్టోల్లో ప్రకటించాయి.[13]

తెదేపా

మార్చు
 
తెలుగు దేశం పార్టీ జండా

తెలుగు దేశం పార్టీ 2019 ఏప్రిల్ 6, ఉగాది నాడు తన మేనిఫెస్టో విడుదలచేసింది.[14] ప్రధానంగా పంచసూత్ర దార్శనికత (5 పాయింట్స్ విజన్) ప్రకారం ముఖ్యమైనవి.[15]

  1. నదుల అనుసంధానం ద్వారా పంచనదుల మహాసంగమాన్ని చేస్తుంది. 2019 డిసెంబరునాటికి పోలవరం పూర్తిచేయుట. అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయుట.
  2. ప్రపంచంలో 5వ అద్భుత నగరంగా అత్యంత జీవనయోగ్య నగరంగా, నీలి & హరిత నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతుంది.
  3. కోస్తా తీరం పొడవునా బీచ్ రోడ్డును నిర్మాణం
  4. కాలుష్య రహిత ఇంధన వినియోగాన్ని ప్రోత్సాహం. సోలార్ పవర్, బయో ప్లాంట్లను స్థాపన, ప్రతి పంపుసెట్ కు సోలార్ కనెక్షన్. 10 లక్షల విద్యుత్ వాహనాలను వినియోగం.
  5. పారిశ్రామిక రంగంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయటం. మండల స్థాయిలో వ్యవసాయ, పరిశ్రమల, ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానం.

ఇతర ముఖ్యాంశాలు:

  • పట్టణాల్లో చిన్న, మధ్యతరహా పారిశ్రామిక పార్కులు
  • ప్రతి ఏటా అన్నదాత సుఖీభవ కార్యక్రమం; రైతులకు వడ్డీలేని రుణాలు; రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి.
  • వ్యవసాయాన్ని ఉపాధి హామీకి అనుసంధానం; కోటి ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్‌ అభివృద్ధి; 2 కోట్ల ఎకరాలకు నీళ్లు ఇవ్వడమే లక్ష్యం; ఐదేళ్లలో రాష్ట్రంలో నీటి సమస్య లేకుండా పరిష్కారం
  • మాదిగలు, రెల్లి, యానాది కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు; వడ్డెర, బ్రాహ్మణ వర్గాలకు ఎమ్మెల్సీ పదవులు
  • విదేశీ విద్య కోసం పేద విద్యార్థులకు రూ. 20 లక్షలు; వైద్యంలో రూ.5లక్షల వరకు ఉచితం సాయం
  • ఆదివాసీల కోసం ప్రత్యేక బ్యాంక్‌ ఏర్పాటు; మత్స్యకారుల క్రాప్‌ హాలిడేకి రూ.10 వేలు సాయం; పట్టణాల్లో తోపుడుబండ్లకు ఇబ్బంది లేకుండా చేస్తాం
  • ఇంటర్మీడియట్‌ నుంచి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు
  • విద్యుత్‌ వాహనాలకు ప్రోత్సాహం; ప్రతి గ్రామం నుంచి మెయిన్‌రోడ్డుకు బీటీ రోడ్డు;
  • తిరుపతికి ఎలక్ట్రానిక్‌ హబ్‌ ఏర్పాటు; విశాఖలో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ ఏర్పాటు

వైకాపా

మార్చు

వైకాపా మ్యానిఫెస్టోను 2019 ఏప్రిల్ 6 ఉగాది నాడు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి విడుదల చేసాడు.[16][17] జనాకర్షక పథకాలలో కొన్ని:[18]

  • రైతులకు రూ.12,500 చొప్పున నాలుగు దఫాలుగా రూ.50వేలు
  • రైతులకు,కౌలు రైతులతో సహా వడ్డీలేని రుణాలు
  • రైతులకు పగడిపూట 9గంటల ఉచిత విద్యుత్
  • రైతుల కోసం రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
  • ఆక్వా రైతులకు యూనిట్‌ రూపాయికే విద్యుత్
  • రైతు కుటుంబాలకు రూ.7లక్షలతో బీమా
  • ఆరోగ్యశ్రీ పరిధిలోకి అన్ని వ్యాధులు. ఖర్చు రూ. వెయ్యి దాటితే చాలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి
  • కిడ్నీ సహా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10వేలు పింఛన్
  • వృద్ధాప్య పింఛన్ రూ.3వేలకు పెంపు, పింఛన్ అర్హత వయసు 65 నుంచి 60కు తగ్గింపు
  • మూడు దశల్లో మద్యపాన నిషేధం
  • ఖాళీగా ఉన్న లక్షా 30వేల ఉద్యోగాలు భర్తీ

జనసేన

మార్చు

జనసేన తన మ్యానిఫెస్టోను 2019 మార్చి 14 న రాజమండ్రి బహిరంగ సభలో ప్రకటించింది. ఈ మానిఫెస్టోలోని ముఖ్యాంశాలు:[19][19][20]

  • రైతులకు ఒక్కొక్క ఎకరానికి రూ. 8,000. రైతు రక్షణ భరోసా పథకం కింద 60 ఏళ్ళు దాటిన రైతులకు రూ. 5,000 పింఛను.
  • 1 వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకూ విద్యార్థులకు ఉచిత చదువు. డొక్కా సీతమ్మ క్యాంటీన్ పథకం కింద విద్యార్థులకు ఆహారం. విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం
  • ప్రతి మండలంలో ఆర్ట్స్, సైన్సు కాలేజీ. సాంకేతిక కళాశాలల్లో ఇన్నొవేషన్, ఇన్క్యుబేషన్ హబ్‌లు
  • 10 లక్షల ఉచిత ఆరోగ్య బీమా. ప్రతీ మండలంలో సంచార డయాగ్నాస్టిక్ కేంద్రాలు
  • చిన్న పరిశ్రమలకు 75 పైసల వడ్డీతో రూ. 5,000 ఆర్థిక మద్దతు
  • నిరుద్యోగులకు అవకాశాల జోన్లు
  • మహిళా ఉద్యోగులకు శిశు సంరక్షణ కేంద్రాలు
  • గోదావరి జిల్లాల్లో రూ. 5,000 కోట్ల పెట్టుబడితో పండ్లు, ఆహారం, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి తోడ్పాటు. ప్రతి మండలం లోను ఆహార ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటు.
  • వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు తాగునీటి సాగునీటి సౌకర్యం కల్పిస్తాం.

కాంగ్రెసు

మార్చు

కాంగ్రెసు మ్యానిఫెస్టోను 2019 మార్చి 22 న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ప్రకటించాడు. మానిఫెస్టోలోని ముఖ్యాంశాలు:[21]

  • రైతులు, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు
  • రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కి���ద రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం. అన్ని జబ్బులనూ చేరుస్తారు. ఆరోగ్య పరిరక్షణ హక్కు చట్టం
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సమర్థంగా అమలు. కార్పొరేట్‌ స్కూళ్లు, ఆస్పత్రుల దోపిడీ నియంత్రణ. విద్యా హక్కు చట్టం పటిష్ఠ అమలు
  • చేనేత కార్మికులకు అప్పులు పూర్తిగా మాఫీ. వారికి జీఎస్టీ నుంచి మినహయింపు
  • ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పింఛన్‌ విధానం రద్దు
  • పేద కుటుంబానికి ఏడాదికి 4 గ్యాస్‌ సిలిండర్లు ఉచితం
  • వికలాంగులకు రూ.3వేలు పింఛను. 50 - 60 ఏళ్ల వారికి రూ.2వేలు, 60-70 ఏళ్ల వారికి రూ.2,500, 70 ఏళ్లు దాటిన వారికి రూ.3వేలు పింఛను. ఒంటరి మహిళలకు పెన్షన్‌
  • రజకులు, వడ్డెరలను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు, వాల్మీకులు, మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి కృషి, దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించేందుకు కృషి
  • స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధర
  • రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
  • పెట్రోల్‌, డీజిల్‌ ధరలను జీఎస్టీ పరిధిలోకి
  • సంక్షేమ పథకాలకు బయోమెట్రిక్‌ విధానం తొలగింపు
  • ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ లాగా బీసీలు, మైనారిటీలకు చట్టబద్ధతతో సబ్‌ప్లాన్‌

భాజపా

మార్చు

భారతీయ జనతా పార్టీ తమ మ్యానిఫెస్టోను 2019 మర్చి 26 న విడుదల చేసింది. దానిలోని ప్రధాన విశేషాలివి:[22]

  • రాష్ట్రంలోని ఒక్కొక్క లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక్కొక్క జిల్లాగా చేస్తూ 25 జిల్లాల ఏర్పాటు
  • రాయలసీమలో హైకోర్టు
  • తెలుగుదేశం ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ
  • రాష్ట్ర ఉద్యోగులకు కేంద్ర ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు, ఉద్యోగ భద్రత, ఉచిత స్థలం. సీపీఎస్‌ రద్దు; వలస విధానానికి ప్రతీకగా కొనసాగుతున్న బిళ్ళ బంట్రోతు విధానానికి స్వస్తి; హోంగార్డులకు నెలకు రూ.20వేలు.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గీకరణ కోసం ప్రత్యేక కార్యాచరణ;
  • స్టార్టప్‌ ఇండియా, స్టాండప్‌ ఇండియా పథకాలను ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లతో లింకు చేసి, రూ.కోటి రూపాయల వరకు పూచీకత్తు లేని రుణం.

పై ప్రధానాంశాలతో పాటు అనేక ఇతర అంశాలను కూడా మ్యానిఫెస్టోలో చేర్చారు. వాటిలో కొన్ని:

  • వ్యవసాయానికి 16 గంటల విద్యుత్తు; 50% రాయితీతో ఎకరానికి రెండు బస్తాల ఎరువులు; వ్యవసాయ ప్రణాళిక కమిషను ఏర్పాటు.
  • డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు; డిగ్రీ విద్యార్థినులకు 90% సబ్సిడీపై స్కూటర్లు
  • 60 ఏళ్లు దాటినవారికి మండలానికో ఆనందాశ్రమం; నెలకు రూ.3వేల పింఛను.
  • విశాఖ, విజయవాడ, గుంటూరు ప్రాంతం; తిరుపతి కేంద్రాలుగా ప్రాంతీయ అభివృద్ధి కేంద్రాలు.

మ్యానిఫేస్టోల విశ్లేషణ

మార్చు

టిడిపి, వైసిపిల మ్యానిఫెస్టోలు -కీలకాంశాలైన రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన ప్రాధాన్యత తక్కువగా, వ్యవసాయం, భూ పంపిణీ, విద్య, వైద్యం, ఉద్యోగ కల్పన వంటి కీలకాంశాలపై శాశ్వత పరిష్కారానికి చర్యలు ప్రతిపాదించడానికి బదులుగా జనాకర్షక పథకాలతో కూడి వున్నాయి అని పత్రికలలో వార్తలు వచ్చాయి.[23] అలాగే జనాకర్షక పథకాలకు అయ్యే ఖర్చు విపరీతంగా వుంటుందని కూడా విమర్శలు వచ్చాయి.

ప్రచారాలు, విమర్శలు

మార్చు
 
వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్న షర్మిల (2012 నాటి ఫోటో)

ప్రచారాంశాలు

మార్చు

ప్రజాకర్షక పథకాలు ప్రచారం లోని ప్రధానమైన అంశాల్లో ఒకటి. వృద్ధాప్య పింఛన్లు, నిరుద్యోగ భృతి, రైతులకు చేసే ప్రయోజనాలు, మొదలైన అనేక ప్రజాకర్షక పథకాలు పార్టీల ప్రచారంలో చోటు చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై చూపిస్తున్న పక్షపాతం, అందులో భాగమైన ప్రత్యేక హోదా, అభివృద్ధిలో భాగమైన అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం, ప్రభుత్వ అవినీతి, ఆశ్రిత పక్షపాతం మొదలైనవి ఇతర ప్రధాన ప్రచారాంశాలు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి, తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు, ప్రధాని నరేంద్ర మోదీ - ఈ ముగ్గురూ కలిసి తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తూ చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేసాడు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో రహస్య ఒప్పందం ఉన్నదనే ఆరోపణ వైకాపా ప్రచారాస్త్రాల్లో ఒకటి.

వీటితో పాటు కొన్ని ఘటనలు కూడా ప్రచారంలో ప్రముఖంగా చోటు చేసుకున్నాయి: జగన్మోహనరెడ్డి బాబాయి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య, డేటా చోరీ వివాదం, మూకుమ్మడిగా వోట్ల తొలగింపు ప్రయత్నం ఆరోపణలు, జగన్మోహనరెడ్డిపై జరిగిన దాడి.

ప్రచార సరళి

మార్చు

తెలుగు దేశం పార్టీ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో పాల్గొన్నాడు. తాను ఆనవాయితీగా చేస్తున్నట్లే, ఈసారి కూడా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని తిరుపతిలో ప్రచారం మొదలుపెట్టాడు. వైకాపా తరపున ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్ర వ్యాప్త ప్రచారం చేసాడు. దాదాపు సంవత్సరం పాటు చేసిన పాదయాత్రలో అతడు ఈసరికే రాష్ట్రమంతా ఒకసారి పర్యటించాడు. జనసేన తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేసాడు.

చంద్రబాబు నాయుడి కనుసన్నల్లోనే జనసేన పనిచేస్తోందని, అతడి ఆదేశంతోటే మాజీ సీబీఐ అధికారి లక్ష్మీనారాయణ జనసేనలో చేరాడని వైకాపా నాయకుడు జగన్మోహనరెడ్డి విమర్శించాడు.[24]

పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి, వైకాపా తెరచాటు పొత్తులో ఉన్నాయని విమర్శించాడు. గాజువాకలో నామినేషను వేసాక చేసిన ప్రసంగంలో - చంద్రబాబు నాయుడుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంటే రాజమార్గంలో ఆంధ్రకు వచ్చి పోటీ చేయాలని తెరాసకు సూచించాడు.[a] తన రెండవ నామినేషను వేసాక భీమవరంలో చేసిన ప్రసంగంలో - హైదరాబాదులో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందినవారిపై దాడులు చేస్తున్నారని విమర్శించాడు.[25] ఈ ఎన్నికల్లో తెలంగాణ నుండి మా పార్టీ 5 స్థానాల్లో పోటీ చేస్తోంది. మాకంటే పెద్ద పార్టీ ఐన వైకాపా ఎందుకు పోటీ చెయ్యడం లేదు అని అతడు ప్రశ్నించాడు. దీనికి స్పందనగా, జనసేన ప్రతిపక్షమై ఉండి కూడా అధికారపక్షాన్ని ఏమీ అనడం లేదని, తెదేపాతో లోపాయికారీ ఒప్పందం చేసుకుని వైకాపాపై కువిమర్శలు చేస్తోందనీ వైకాపా విమర్శించింది. పవన్ ప్రజల పక్షాన ఉండాల్సింది పోయి తెదేపాకు అండగా నిలబడ్డాడని, ఇది రాజకీయాల్లోకి అతడు తెచ్చిన కొత్త ట్రెండ్‌ అనీ విమర్శించింది.[26] పవన్ చేసిన విమర్శల కారణంగా అతడు వివిధ వర్గాలనుండి ప్రతి విమర్శ ఎదుర్కొన్నాడు.[27][28] అతడిపై హైదరాబాదులో పోలీసు కేసు పెట్టారు.[29]

2019 మార్చి 21 న విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ ఒక కార్యక్రమంలో మాట్లడుతూ, ప్రత్యేక హోదా అనేది విసుగెత్తించే సంగతి (బోరింగు సబ్జెక్టు) అని వ్యాఖ్యానించాడు. దీనిని ఇతర పార్టీలు విమర్శించాయి.[30]

ప్రచారం చివరిరోజుల్లో తెరాస అధినేత కే చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదాకు పోలవరం ప్రాజెక్టుకు తమ మద్ధతు వుంటుందని ప్రకటించాడు.[31] అలా అయితే ఇప్పటివరకు పోలవరానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వేసిన కేసును విరమించుకోవాలని, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాకు సమ్మతిస్తూ కేంద్రానికి లేఖ రాయాలనీ చంద్రబాబు నాయుడు అడిగాడు.

ఫిర్యాదులు, చర్యలు

మార్చు

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వివిధ సందర్భాల్లో ఎన్నికల కమిషనుకు ఫిర్యాదులు చేసాయి. వాటిపై కమిషను తీసుకున్న చర్యల వివరాలు

అధికారుల బదిలీలు

మార్చు

2019 మార్చి 25 రాత్రి ఎన్నికల కమిషను ముగ్గురు ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకుంది. ఇంటెలిజెన్స్ డైరెక్టరు జనరల్ (డీజీ) ఎ బి వెంకటేశ్వరరావు, కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, శ్రీకాకుళం ఎస్పీ అడ్డాల వెంకటరత్నం లను తమతమ బాధ్యతల నుండి తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలిచ్చింది. వారికి ఎన్నికల బాధ్యతలేవీ అప్పగించరాదని తెలిపింది.[32] ఈ ముగ్గురిపై వైకాపా నాయకులు లిచ్చిన ఫిర్యాదుపై కమిషను ఈ చర్య తీసుకుంది. అయితే వెంకతేశ్వరరావు బదిలీని నిలుపు చేస్తూ మార్చి 27 న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరొక ఆదేశాన్ని జారీ చేసింది.[33] కమిషను ఆదేశాలను రద్దు చేయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది. కమిషను ఆదేశాలపై తాము జోక్యం చేసుకోమని, ఇంటిలిజెన్స్ డీజీ బదిలీపై స్టే ఇవ్వలేమనీ మార్చి 29 న కోర్టు తీర్పు చెప్పింది.[34] తీర్పుకు అనుగుణంగా రాష్ట్రప్రభుత్వం ఇంటిలిజెన్స్ డీజీని బదిలీ చేసింది.[35]

ఇదిలా ఉండగా ఎస్పీ లిద్దరూ తమ బదిలీల పట్ల ఆందోళన, అభ్యంతరం తెలియజేస్తూ రాష్ట్ర ఎన్నికల అధికారికి లేఖలు రాసారు. వెంకటరత్నం తనపై ఫిర్యాదు చేసిన వారిపై సివిలు క్రిమినల్ చర్యలు తీసుకుంటానని తెలిపాడు.

ఐపిఎస్ అధికారుల బదీలల ఉత్తర్వులు రద్దుజేసి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠాను విచారించిన తరువాత, ఏప్రిల్ 6 న ఎన్నికల కమిషన్ ఆయనను బదిలీ చేసింది.[36] అతడి స్థానంలో కొత్త సీఎస్‌గా ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పునేఠాను ఎన్నికల విధులకు దూరం పెట్టింది.

పార్టీ మార్పిళ్ళు

మార్చు

ఎన్నికల ముందు నాయకులు యథేచ్ఛగా పార్టీలు మారారు. తామున్న పార్టీలో టిక్కెట్లు అసలు దొరక్కపోవడం, ఒకవేళ దొరికినా అశించిన స్థానానికి దొరక్కపోవడం వంటి కారణాల వలన కూడా పార్టీలు మారారు. అయితే, హైదరాబాదులో తమ పార్టీ నాయకులకు ఉన్న ఆస్తుల విషయంలో ఇబ్బందులు పెడతామని భయపెట్టి, వారిని తెలుగు దేశం పార్ట��� నుండి మారేలా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఒత్తిడి చేస్తున్నదని చంద్రబాబు నాయుడు అరోపించాడు.[37]

పార్టీ మార్పిడుల జాబితా
నాయకుడి పేరు తానున్న పార్టీ మారిన పార్టీ విశేషం
అవంతి శ్రీనివాస్ తెలుగుదేశం వైకాపా
ఆదాల ప్రభాకరరెడ్డి తెలుగుదేశం వైకాపా తెలుగుదేశం సీటు ఇస్తున్నట్లు ప్రకటించాక, పార్టీ మారాడు.
ఎస్ పి వై రెడ్డి తెలుగుదేశం (అనధికారిక సభ్యుడు) జనసేన
బుట్టా రేణుక తెలుగుదేశం (అనధికారిక సభ్యురాలు) వైకాపా
మేడా మల్లికార్జునరెడ్డి తెలుగుదేశం వైకాపా
చలమలశెట్టి సునీల్‌ వైకాపా తెలుగుదేశం
రఘురామకృష్ణంరాజు తెలుగుదేశం వైకాపా
గుణ్ణం నాగబాబు వైకాపా జనసేన పాలకొల్లు నియోజకవర్గానికి వైకాపా టికెట్టు రానందుకు మంస్తాపం చెంది జనసేనలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్నాడు
దాసరి జయరమేష్ తెలుగుదేశం వైకాపా
ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైకాపా తెలుగుదేశం
కొత్తపల్లి సుబ్బారాయుడు తెలుగుదేశం వైకాపా కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు పదవికి, పార్టీకి రాజీనామా చేసి వైకాపాలో చేరాడు.[38]

కొత్తగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశం

మార్చు

ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టరు లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరుతారనే విషయమై పలు వార్తలు వచ్చాయి. 2018 నవంబరులో లోక్‌సత్తా పార్టీలో చేరమని ఆ పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ ఆహ్వానించగా పరిశీలిస్తానని లక్ష్మీనారాయణ చెప్పాడు.[39] లోక్‌సత్తాలో చేరే ఆలోచన వద్దనుకుని, సొంతంగా ఒక కొత్త పార్టీ పెట్టనున్నాడని ఆ తరువాత పత్రికల్లో ఊహాగానాలు వచ్చాయి. పార్టీ పేరు జనధ్వని అని కూడా అవి రాసాయి.[40] ఆ తరువాత 2019 మార్చి 12 న, తెలుగుదేశంలో చేరనున్నాడా? అని ప్రశ్నిస్తూ పత్రికల్లో వార్తలు వచ్చాయి.[41] చివరగా 2019 మార్చి 17 న అతడు జనసేన పార్టీలో చేరాడు. తాను తెదేపాలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలు మీడియా సృష్టించినవేనని అతడు చెప్పాడు.[42] చంద్రబాబు ఆదేశాల మేరకే లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరాడని వైకాపా విమర్శించింది.

ఎన్నికల సమయంలో కొత్తగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన వారు
పేరు ఎందుకు పేరొందారు చేరిన పార్టీ
పెంటపాటి పుల్లారావు ఢిల్లీలో స్థిరపడ్ద రాజకీయ విశ్లేషకుడు జనసేన
నార్నె శ్రీనివాసరావు సినీ నటుడు, జూనియర్ ఎస్టీయార్ మామ వైకాపా
పొట్లూరి వర ప్రసాద్ వ్యాపారవేత్త వైకాపా
వి.వి.లక్ష్మీనారాయణ మాజీ ఐపీఎస్‌ అధికారి జనసేన

ఇతర విశేషాలు

మార్చు
  • ప్రజాశాంతి పార్టీ నేత కిలారి ఆనంద్ పాల్, 2019 మార్చి 22 న నర్సాపురం లోక్‌సభ స్థానానికి నామినేషన్ వేసాడు. అయితే నామినేషన్ పత్రంలో చాలావరకు పూర్తి చెయ్యకుండా ఖాళీగా వదిలేసాడు. అఫిడవిట్‌ను ఇవ్వనే లేదు.[43] అతడు భీమవరం శాసనసభ స్థానంలో కూడా నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే నామినేషన్ గడువు సమయం ముగిసే లోపు సమర్పించనందున అధికారులు అతడి నామినేషన్‌ను స్వీకరించలేదు.[44] అయితే 2019 మార్చి 26 న ఆ రెండు నామినేషన్లను స్వీకరించినట్లు, పరిశీలన తరువాత అంతా సరిగానే ఉన్నట్లూ అధికారులు చెప్పారు.
  • దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైకాపా తరపున పర్చూరు శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చెయ్యగా, ఆయన భార్య పురందేశ్వరి భాజపా తరపున విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసింది.

2014 ఎన్నికల్లో వివిధ పార్టీలు గెలిచిన స్థానాలు

మార్చు

2014 ఎన్నికలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన నిర్ణయం అమలు జరగడానికి ముందు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, భాజపాలు ఎన్నికల పొత్తు పెట్టుకుని పోటీ చేసాయి. జనసేన ప్రత్యక్షంగా పోటీ చెయ్యలేదు గానీ, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెదేపా, భాజపాలకు మద్దతుగా ప్రచారం చేసాడు.

2014 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వివిధ పార్టీలు గెలిచిన స్థానాల జాబితా
క్ర.సంఖ్య జిల్లా మొత్తం

స్థానాలు

తెలుగు దేశం పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెసు పార్టీ జనసేన

(పోటీ చెయ్యలేదు)

భారత జాతీయ కాంగ్రెసు భారతీయ జనతా పార్టీ స్వతంత్రులు
1 శ్రీకాకుళం 10 6 3 0 0 0 0
2 విజయనగరం 9 7 3 0 0 0 0
3 విశాఖపట్నం 15 11 3 0 0 1 0
4 తూర్పు గోదావరి 19 12 5 0 0 1 1
5 పశ్చిమ గోదావరి 15 14 0 0 0 1 0
6 కృష్ణా 16 10 5 0 0 1 0
7 గుంటూరు 17 12 5 0 0 0 0
8 ప్రకాశం 12 5 6 0 0 0 1
9 నెల్లూరు 10 3 7 0 0 0 0
10 కడప 10 1 9 0 0 0 0
11 కర్నూలు 14 3 11 0 0 0 0
12 అనంతపురం 14 12 2 0 0 0 0
13 చిత్తూరు 14 6 8 0 0 0 0
మొత్తము 175 102 67 0 0 4 2

పోలింగు

మార్చు

పోలింగు 2019 ఏప్రిల్ 11 న జరిగింది. అన్ని నియోజకవర్గాల్లోను ఒకే విడతలో పోలింగు జరిగింది. రాష్ట్ర శాసనసభతో పాటు లోక్‌సభకు కూడా ఒకేసారి పోలింగు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 వ తేదీ అర్థరాత్రి వరకు జరిగిన పోలింగు ప్రకారం 13 జిల్లాల్లో సగటున 76.69 శాతం పోలింగ్‌ జరిగిందని ఎన్నికల కమిషను తెలిపింది. కొన్ని కేంద్రాల్లో పోలింగు ఆ తరువాత కూడా కొనసాగింది. అంతిమంగా పోలింగు శాతం 79.64 అని ఎన్నికల సంఘం ఏప్రిల్ 12 న అధికారికంగా ప్రకటించింది.[45] 2014 ఎన్నికల్లో ఈ శాతం 78.41 గా ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో మొత్తం 3.93 కోట్ల మంది ఓటర్లకుగాను 3.13 కోట్ల మంది ఓటేశారు. 2014 ఎన్నికల కంటే ఇది 26 లక్షలు ఎక్కువ.

ఎలక్ట్రానిక్ వోటింగు మిషన్లు సరిగ్గా పని చెయ్యకపోవడం, పోలింగు బాగా నెమ్మదిగా జరగడం, అర్థరాత్రి దాటాక కూడా కొన్ని కేంద్రాల్లో పోలింగు జరుగుతూనే ఉండటం, అనేక చోట్ల హింస జరగడం, రెండు చోట్ల అభ్యర్థులపై దాడి, పోలింగు యంత్రాలను ధ్వంసం చెయ్యడం, పోలింగు స్టేషన్ల వద్ద వోటర్లకు సరైన సౌకర్యాలు కలగజేయక పోవడం వంటి అనేక సంఘటనలు పోలింగు రోజున చోటుచేసుకున్నాయి. పోలింగు నాటి ఘటనల గురించి ఎన్నికల కమిషను తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి:[46] 25 హింసాత్మక ఘటనలు జరిగగా, వాటిలో ఇద్దరు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. 7 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు. అక్కడ కొత్త ఈవీఎంలతో పోలింగ్‌ కొనసాగించారు. ఆరు చోట్ల మాక్‌ పోలింగ్‌ సందర్భంగా వేసిన ఓట్లను తొలగించడంలో పోలింగ్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తాము కోరినన్ని బలగాలు కేంద్రం నుంచి రాలేదని అన్నారు. సాయంత్రం ఆరు గంటలకు వరుసలో ఉన్న వారందరికీ పోలింగ్‌ అవకాశం కల్పించారు.

ఉదయం 7 గంటలకు పోలింగు మొదలైంది. అనేక చోట్ల వోటింగు యంత్రాలు పనిచెయ్యక పోవడంతో వెనక్కి వెళ్ళిన వోటర్లు కొంతమంది మళ్ళీ తిరిగి వచ్చి వోటేసారు. పోలింగు నిదానంగా జరిగిన చోట్ల, గంటల తరబడి లైనులో నిరీక్షించి మరీ వోటేసారు. ఆరు గంటలకు పోలింగు సమయం ముగిసినప్పటికీ, ఆ సమయానికి లైనులో నిలబడ్డ వోటర్లందరికీ వోటేసే అవకాశం కల్పించారు. అలా నిలబడ్డ వాళ్ళు వోటు వెయడం కొన్ని చోట్ల అర్థరాత్రి వరకూ సాగింది. కొన్ని చోట్ల అర్థరాత్రి దాటిన తరువాత కూడా కొనసాగింది. హైదరాబాదు, బెంగళూరు వంటి చోట్ల నివసిస్తున్న వోటర్లు తమ స్వస్థలాలకు చేరుకుని మరీ వోటేసారు. దీంతో పోలింగు ముందు మూడు రోజుల పాటు ఈ రెండు నగరాల నుండి ఆంధ్ర ప్రదేశ్‌కు వెళ్ళే రైళ్ళు, బస్సులపై తీవ్రమైన వత్తిడి ఏర్పడింది. వందలాది అదనపు బస్సు సర్వీసులను నడిపారు. దక్షిణ మధ్య రైల్వే కూడా అదనపు రైళ్ళను నడిపింది. హైదరాబాదు విజయవాడ రహదారిలో పంతంగి రహదారి సుంకం వసూలు కేంద్రం గుండా మామూలుగా రోజుకు 19 వేల వాహనాలు ప్రయాణం చేస్తూండగా, ఏప్రిల్ 10 వ తేదీ ఒక్క రోజునే 37 వేల వాహనాలు వెళ్ళాయి.[47] ఎన్ని అవాంతరాలు ఎదురైనా వోటు వేసి తీరాలనే ప్రజల ఆకాంక్షలను పత్రికలు ముక్తకంఠంతో కీర్తించాయి. "ఓటెత్తిన రాష్ట్రం" అని ప్రజాశక్తి రాయగా,[48] "ఓటెత్తిన ఆంధ్ర" అని సాక్షి రాసింది.[49] "ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలిచింది, ప్రజలు గెలిచారు" అని ఈనాడు వర్ణించింది.[50] "వెల్లువెత్తిన మహిళాలోకం" అని ఆంధ్రజ్యోతి రాసింది.[51] "ఓట్ల వెల్లువ" అనే శీర్షిక కింద రాసిన వార్తలో విశాలాంధ్ర పత్రిక, ఓటు యంత్రాలు మొరాయించినా విసుగు చెందక గంటల తరబడి క్యూలలోనే ఉండి ఓట్లు వేసారని పేర్కొంది.[52]

పోలింగు జరిగిన విధానంపై ఎన్నికల సంఘం అనేక విమర్శలకు గురైంది. వోటర్లకు పోలింగు స్లిప్పులు సరిగా అందకపోవడం, ఈవీయెమ్‌లు పనిచెయ్యకపోవడం, నిదానంగా జరిగిన వోటింగు, వోటర్లకు పోలింగు కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలను ఏర్పాటు చెయ్యక పోవడం వంటి అనేక ఇబ్బందులను వోటర్లు ఎదుర్కొన్నారు. "వోటర్ల స్ఫూర్తికి ఈసీ తూట్లు" అని ఈనాడు విమర్శించింది. ఈసీ విశ్వసనీయతకు తూట్లు అంటూ సంపాదకీయం రాసింది.[50] "ఈసీ ఛీఛీ" అని రాస్తూ, ఆంధ్రజ్యోతి, "పోలింగ్ నిర్వహణలో ఫ్లాప్" అని రాసింది.[51] ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలమైందని పలు రాజకీయ పార్టీలు, నాయకులు విమర్శించారు. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కేంద్రంలో తాగునీటి సౌకర్యాల లేమి, తగినన్ని షామియానాలు ఏర్పాటు చేయకపోవడం, స్లిప్పుల పంపిణీలో అలసత్వం మొదలైన అంశాలపై అక్కడికి ఓటు వేసేందుకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని వోటర్లు నిలదీశారు.[53]

జిల్లా వారీగా పోలింగు శాతాలు

మార్చు

ఎన్నికల కమిషను ప్రకటించిన జిల్లావారీ పోలింగు శాతాలు ఇలా ఉన్నాయి.[54]

క్ర.సంఖ్య జిల్లా మొత్తం

స్థానాలు

2019 2014
1 శ్రీకాకుళం 10 75.14 74.5
2 విజయనగరం 9 80.68 78.97
3 విశాఖపట్నం 15 71.81 71.28
4 తూర్పు గోదావరి 19 80.08 78.5
5 పశ్చిమ గోదావరి 15 82.19 82.25
6 కృష్ణా 16 81.12 79.7
7 గుంటూరు 17 82.37 81.54
8 ప్రకాశం 12 85.93 83.25
9 నెల్లూరు 10 76.68 74.05
10 కడప 10 77.21 76.51
11 కర్నూలు 14 77.67 73.56
12 అనంతపురం 14 81.9 74.28
13 చిత్తూరు 14 81.03 78.04
మొత్తం 175

నియోజకవర్గం వారీగా పోలింగు శాతాలు

మార్చు
 
ఆంధ్రప్రదేశ్ 2019 ఎన్నికలు పోలింగ్ శాతంలో మార్పు (2014 ఆధారం)

నియోజక వర్గం వారీగా పోలింగు వివరాలను ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించాడు.[55] రాష్ట్రం మొత్తంగా నమోదయిన పోలింగ్ శాతం 79.64. ఇది 2014 లో నమోదయిన పోలింగ్ శాతం 77.96 కంటే 1.68 ఎక్కువ. విశాఖపట్నం పశ్చిమలో పోలింగ్ అత్యల్పంగా 58.19 శాతం నమోదు కాగా, అద్దంకిలో అత్యధికంగా 89.82 శాతం నమోదైంది. పోలింగ్ 2014 తో పోల్చితే విశాఖపట్నం దక్షిణంలో గతంలో కంటే 4.36 శాతం తగ్గగా, నందికొట్కూరులో 8.67 శాతం పెరిగింది.

ఈవీఎమ్‌ల పనితీరు

మార్చు

పోలింగులో ఎలక్ట్రానిక్ వోటింగు యంత్రాలు సక్రమంగా పనిచేయకపోవడంతో పలు విమర్శలు వచ్చాయి. అనేక పోలింగు స్టేషన్లలో ఈవీఎమ్‌లు పని చెయ్యలేదు. వాటిని రిపేరు చేసి, లేదా కొత్తవాటిని నియోగించి పోలింగు మొదలుపెట్టారు. పోలింగు మొదలు పెట్టాక కూడా కొన్ని ఈవీఎమ్‌లు మధ్యలో చెడిపోయాయి. కొన్నిచోట్ల పోలింగు మొదలు పెట్టేందుకు మూడు నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది. మొత్తం 384 ఈవీఎమ్‌లు పనిచెయ్యలేదని, వాటిని రిపేరు చెయ్యడం లేదా కొన్నిటిని పూర్తిగా తీసివేసి, వేరే ఈవీఎమ్‌లను నియోగించడం గానీ చేసామని ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పాడు.[56] స్వయంగా ద్వివేది వోటేసేందుకు వెళ్ళిన చోట కూడా యంత్రం పని చెయ్యలేదు. వెనక్కి వెళ్ళిపోయి, మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి ఆయన వోటేసాడు. అయితే, 30% పైగా ఈవీఎమ్‌లు పనిచెయ్యలేదని, రీపోలింగు నిర్వహించాలనీ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించాడు. రాష్ట్ర వ్యాప్తంగా 10% ఈవీఎమ్‌లు పనిచెయ్యలేదని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తపరచాడు.[57]

సమయం ముగిసిన తరువాత కూడా పోలింగు కొనసాగిన పోలింగు కేంద్రాల వివరాలు ఇలా ఉన్నాయి:[58]

  • రాత్రి 9:15 వరకు పోలింగు జరిగిన కేంద్రాలు: 726
  • రాత్రి 10:00 వరకు పోలింగు జరిగిన కేంద్రాలు: 256
  • రాత్రి 10:30 వరకు పోలింగు జరిగిన కేంద్రాలు: 139
  • రాత్రి 11:00 వరకు పోలింగు జరిగిన కేంద్రాలు: 70
  • రాత్రి 11:30 వరకు పోలింగు జరిగిన కేంద్రాలు: 49
  • రాత్రి 12:00 వరకు పోలింగు జరిగిన కేంద్రాలు: 23
  • రాత్రి 12:30 వరకు పోలింగు జరిగిన కేంద్రాలు: 14

పోలింగ్ రోజున ఎన్నికల్లో పలు హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఈ ఎన్నికలను రెండు ప్రధాన పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో వారి కార్యకర్తల మధ్య పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. రాయలసీమ లోను, గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోనూ వర్గ రాజకీయ కక్షలు బహిర్గతమయ్యాయి. అనంతపురం జిల్లాలో ఇద్దరు మృతి చెందారు.[59] సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, కోడెల శివప్రసాదరావుపై ఇనిమెట్ల గ్రామంలో వైకాపా కార్యకర్తలు దాడి చేసారు. అతడి చొక్కాను చింపేసారు. గన్ మెన్లపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కోడెలకు స్వల్ప గాయాలయ్యాయి.[60] చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కలకడ కట్టకిందపల్లె గ్రామంలో వైకాపా అభ్యర్థి ఎమ్మెస్ బాబుపై దాడి జరిగింది. అతడి వాహనం ధ్వంసమైంది. ఈ దాడి టీడీపీ కార్యకర్తలే చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు.[61] కురుపాం నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణిపై జీఎంవలస మండలం చినకుదమ గ్రామంలో తెదేపా కార్యకర్తలు దాడి చేసారు.[62] నరసరావుపేట నియోజక వర్గంలో తెదేపా అభ్యర్థి డాక్టరు అరవిందరావుపై వైకాపా కార్యకర్తలు దాడి చెయ్యగా, తెదేపా కార్యకర్తలు వైకాపా అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై దాడి చేసారు. గుత్తి నియోజకవర్గం జనసేన అభ్యర్థి మధుసూదన గుప్తా ఒక పోలింగు కేంద్రంలోని ��ోటింగు యంత్రాన్ని నేలకేసి కొట్టాడు. అతణ్ణి పోలీసులు అరెస్టు చేసారు.[63]

రీపోలింగు

మార్చు

గుంటూరు జిల్లా లోని రెండు పోలింగు కేంద్రాల్లో రీపోలింగు నిర్వహించాలని విజ్ఞప్తి చేసినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ద్వివేది ఏప్రిల్ 13 న చెప్పాడు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 244 నంబరు పోలింగు కేంద్రం లోను, నరసరావుపేట నియోజకవర్గంలోని 94వ నంబరు పోలింగు కేంద్రం లోనూ రీపోలింగు కొరకు కేంద్ర సంఘానికి విజ్ఞప్తి పంపించారు.[64] అనూహ్యంగా చివరిదశపోలింగు రోజున మరికొన్ని పోలింగు కేంద్రాలలో తిరిగి పోలింగ్ జరపాలని ఎలెక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం వాదోపవాదాలకు కారణమైంది.[65]

ఫలితాలు

మార్చు

వోట్ల లెక్కింపు 2019 మే 23 న ప్రారంభంకాగా, పూర్తి ఫలితాలు 2019 మే 24 నాటికి విడుదలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయి ఆధిక్యతతో అనగా 175 సీట్లలో 151 గెలిచి విజయం సాధించింది.[66] కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాలో పూర్తిగా గెలిచింది. రాయలసీమలో మూడు సీట్లు తప్ప (కుప్పం, హిందూపూర్, ఉరవకొండ) అన్నీ గెలిచింది. తెలుగు దేశం పార్టీ 23 సీట్లకు చరిత్రలో అత్యంత తక్కువ స్థానాలకు పరిమితమైంది. మంత్రివర్గంలో చంద్రబాబు నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, కింజరపు అచ్చనాయుడు మాత్రమే గెలుపొందారు. జనసేన కూటమి రాజోలు స్థానం మాత్రమే గెలుచుకోగలిగింది. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక, భీమవరం స్థానాలు రెంటిలో ఓటమి చవిచూచాడు. జాతీయ పార్టీలైన భారత జాతీయ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ లకు ఒక్క సీటుకూడా సాధించలేక పోయాయి.

పార్టీ పోటీ చేసిన గెలిచిన మార్పు వోట్లు వోటు % వోటు శాతం తేడా
  YSRCP 175 151   84 1,56,83,592 49.9  
  TDP 175 23   79 1,23,01,741 39.2  
  INC 175 0   3,68,810 1.17  
  BJP 175 0   4 2,63,849 0.84  
  JSP 140 1   1 21,30,367 6.78   6.78
  BSP 21 0   0.28  
  CPI(M) 7 0   0.32  
  CPI 7 0   0.11  
  స్వతంత్ర అభ్యర్థులు 175 0   2  
  ఇతర పార్టీలు 0    
  నోటా(NOTA)       1.28  
Total 175
Source: Election Commission of India

జిల్లాలవారీగా

మార్చు
జిల్లా నియోజకవర్గాలు YSRCP TDP JSP
శ్రీకాకుళం 10 8 ( 5) 2 ( 5) 0
విజయనగరం 9 9 ( 6) 0 ( 6) 0
విశాఖపట్నం 15 11 ( 8) 4 ( 7) 0
తూర్పు గోదావరి 19 14 ( 9) 4 ( 8) 1
పశ్చిమ గోదావరి 15 13 ( 13) 2 ( 12) 0
కృష్ణా 16 14 ( 9) 2 ( 8) 0
గుంటూరు 17 15 ( 10) 2 ( 10) 0
ప్రకాశం 12 8 ( 2) 4 ( 1) 0
నెల్లూరు 10 10 ( 3) 0 ( 3) 0
కడప 10 10 ( 1) 0 ( 1) 0
కర్నూలు, 14 14 ( 3) 0 ( 3) 0
అనంతపురం 14 12 ( 10) 2 ( 10) 0
చిత్తూరు 14 13 ( 5) 1 ( 5) 0
మొత్తం 175 151 23 1
BJP, INC ఒక స్థానం కూడా గెలవలేదు.

ఎన్నికల విశ్లేషణ

మార్చు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జాతీయ పార్టీలు ఒక్క స్థానం కూడా గెలవకపోవడంతో ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యం పెరిగింది. జనసేన కూటమి ప్రత్యక్షంగా పోటీ చేయడం, బిజేపీకూడా నేరుగా పోటీ చేయడంతో చాలా చోట్ల బహుకోణపు పోటీలైనా, ప్రధాన పోటీ టీడిపి, వైసిపీ మధ్యనే నడిచింది. జనసేన కూటమి కాపు వర్గపు వోట్లను చీల్చడంతో పాటు, టీడిపీకి వ్యతిరేక ప్రచారం, వైసిపీకి కలిసొచ్చింది.[67]

డబ్బు పంపిణి

మార్చు

ఓట్ల కోసం ఆంధ్రప్రదేశ్ లో అత్యంత భారీగా డబ్బు వెచ్చించారని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) విశ్లేషణ నివేదిక పేర్కొంది. ఓటుకు 1000 నుండి 2000 వరకు సగం పైగా ఓటర్లకు డబ్బు పంపిణీ చేశారని తెలిపింది.[68]

ఎన్నికైన ఎమ్మెల్యేల నేపథ్యం, ఆస్తులు,విద్య

మార్చు

174 ఎన్నికైన ఎమ్మెల్యేల వివరాలను పరిశీలించితే 96 మందిపై క్రిమినల్ కేసులున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఎన్నికైన ఎమ్మెల్యేలలో 163 మంది (94 శాతం) కోటీశ్వరులున్నారు. సగటున ఒక్కో ఎమ్మెల్యే రూ.27. 87 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. అధికంగా ఆస్తులు గల మొదటి మూడు స్థానాలలో చంద్రబాబు, (ఆస్తుల విలువ రూ.668 కోట్లు), వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ఆస్తుల విలువ రూ. 510 కోట్లు), నందమూరి బాలకృష్ణ (ఆస్తుల విలువ రూ. 274 కోట్లు) నిలిచారు. అతితక్కువ ఆస్తులు తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మికి (6 లక్షల 75 వేల రూపాయల విలువైన ఆస్తులు) ఉన్నాయి. 2014లో గెలిచి, 2019లో మళ్లీ ఎన్నికైన 55 మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువ సగటున 60 శాతం పెరిగినట్లు ఏడీఆర్ విశ్లేషణలో వెల్లడైంది. ఆదాయపు పన్ను నివేదికల ప్రకారం అత్యధిక వార్షిక ఆదాయం కలిగిన 2017- 18 ఆర్థిక సంవత్సరంలోరు.25 కోట్లు ఆదాయంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి స్థానంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు 2017-18 ఆర్థిక సంవత్సరానికి తన వార్షి�� ఆదాయం రూ.64.7 లక్షలుగా వుందని తెలిపాడు. 59 మంది ఎమ్మెల్యేలు తమ విద్యార్హతలను 5 నుంచి 12 తరగతి వరకు ఉండగా, 112 మంది తాము డిగ్రీ, అంతకంటే ఎక్కువ చదివారు. ఒక ఎమ్మెల్యే నిరక్షరాస్యుడనని ప్రకటించారు.[69]

ఇవి కూడా చూడండి

మార్చు

వివరణలు

మార్చు
  1. 2018 లో తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో తెదేపా, కాంగ్రెసుతో కలిసి మహాకూటమి ఏర్పరచి పోటీ చేసింది. ఆ సందర్భంగా, పక్క రాష్ట్రపు ముఖ్యమంత్రికి మా రాష్ట్రంలో ఏం పని, చంద్రబాబు తెలంగాణపై అధికారం చెలాయించాలని చూస్తున్నాడు అంటూ తెరాస విమర్శలు చేసింది. ఎన్నికల ఫలితాల తరువాత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెరాస నేత కె.చంద్రశేఖరరావు 'చంద్రబాబు మాకు గిఫ్టు ఇచ్చాడు, అతడికి మేం రిటర్న్ గిఫ్టు ఇస్తాం', అని అన్నాడు.

మూలాలు

మార్చు
  1. Special Correspondent. "Jagan to contest from Pulivendula". The Hindu.
  2. "ఫుల్ షెడ్యూల్ ఆఫ్ 2019 లోక్‌సభ ఎలెక్షన్స్: 7-ఫేస్ పోలింగ్ ఇన్ యుపి, బీహార్". ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్. 10 Mar 2019. Archived from the original on 10 Mar 2019.
  3. "3,91,81,399కు చేరిన ఓటర్లు - రెండున్నర నెలల్లో పెరుగుదల 22,48,308". ఈనాడు. 24 Mar 2019. Archived from the original on 25 Mar 2019. Retrieved 25 Mar 2019.
  4. "జనసేనతో కూటమిగా వెళ్తాం : సీపీఐ". సాక్షి. 10 Nov 2018. Archived from the original on 23 Mar 2019.
  5. "కొత్త పొత్తు". ఆంధ్రజ్యోతి. 16 Mar 2019. Archived from the original on 20 Mar 2019.
  6. "జనసేన,బీఎస్పీ,వామపక్షాలు కూటమిగా బరిలోకి". ఈనాడు. 18 Mar 2018. Archived from the original on 21 Mar 2019.
  7. "ఏపిలో ఫ్యాన్‌..హైదరాబాద్‌లో స్విచ్‌..ఢిల్లీలో కరెంటు!". వార్త. 16 Mar 2019. Archived from the original on 21 Mar 2019.
  8. "'పేమెంట్‌ పెంచినట్టున్నారు.. పవన్‌ రెచ్చిపోతున్నారు'". సాక్షి. 23 Mar 2019. Archived from the original on 23 Mar 2019.
  9. "భారత ఎన్నికల కమిషను వారి ఫారమ్ - 26" (PDF). క్యాండిడేట్ అఫిడవిట్ మేనేజిమెంట్. Archived from the original (PDF) on 23 మార్చి 2019. Retrieved 23 మార్చి 2019.
  10. "భారత ఎన్నికల కమిషను వారి ఫారమ్ - 26" (PDF). క్యాండిడేట్ అఫిడవిట్ మేనేజిమెంట్. Archived from the original (PDF) on 23 మార్చి 2019. Retrieved 23 మార్చి 2019.
  11. "భారత ఎన్నికల కమిషను వారి ఫారమ్ - 26" (PDF). క్యాండిడేట్ అఫిడవిట్ మేనేజిమెంట్. 21 Mar 2019. Archived from the original (PDF) on 23 మార్చి 2019. Retrieved 23 మార్చి 2019.
  12. "దేశంలో ఎవరి అఫిడవిట్‌లోనూ ఇన్ని కేసులు ఉండవు: చంద్రబాబు". ఆంధ్రజ్యోతి. 23 Mar 2019. Archived from the original on 23 Mar 2019.
  13. "ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2019: జనసేన, వైసీపీ, టీడీపీ మేనిఫెస్టోలు ఏ వర్గాలకు ఏ హామీలిచ్చాయి?". BBC. 7 April 2019. Archived from the original on 7 April 2019. Retrieved 7 April 2019.
  14. "టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు". ఆంధ్రజ్యోతి. 6 Apr 2019. Archived from the original on 7 Apr 2019. Retrieved 7 Apr 2019.
  15. "ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టో 2019 (తెదెపా)" (PDF). తెదెపా. Archived from the original (PDF) on 10 April 2019. Retrieved 10 April 2019.
  16. "వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన జగన్.. ప్రధాన అంశాలివే..!". ఆంధ్రజ్యోతి. 6 Apr 2019. Archived from the original on 7 Apr 2019. Retrieved 7 Apr 2019.
  17. "వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 2019" (PDF). YSRCP. Archived from the original (PDF) on 2019-04-07. Retrieved 2019-04-07.
  18. "YS Jagan Manifesto: పేదలకు అండగా పథకాలు, నవరత్నాలు.. వైసీపీ మేనిఫెస్టో ఇదే". Samayam. Archived from the original on 7 April 2019. Retrieved 7 April 2019.
  19. 19.0 19.1 "జనసేన మేనిఫెస్టో 2019" (PDF). Retrieved 10 April 2019.
  20. "జనసేన పార్టీ రిలీసెస్ మ్యానిఫెస్టో ఫర్ 2019 ఎలెక్షన్స్". ది హన్స్ ఇండియా. 14 Mar 2018. Archived from the original on 21 Mar 2019.
  21. "ఏపీ కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల". ఈనాడు. 22 Mar 2019. Archived from the original on 22 మార్చి 2019. Retrieved 7 జనవరి 2020.
  22. "రాష్ట్రంలో 25 జిల్లాలు!". ఈనాడు. 27 Mar 2019. Archived from the original on 27 Mar 2019.
  23. "హోదా దగా!". ప్రజాశక్తి. Archived from the original on 7 April 2019. Retrieved 7 April 2019.
  24. "పార్ట్‌నర్ సినిమాకు నిర్మాత చంద్రబాబే". సాక్షి. 23 Mar 2019. p. 6. Archived from the original on 24 Mar 2019.
  25. "తెలంగాణనా... పాకిస్థానా?". ఆంధ్రజ్యోతి. 23 Mar 2019. Archived from the original on 24 Mar 2019. Retrieved 24 Mar 2019.
  26. "అధికారపక్షాన్ని ప్రశ్నించకపోవడమే పవన్‌ ట్రెండా?". సాక్షి. 24 Mar 2019. Archived from the original on 24 Mar 2019. Retrieved 24 Mar 2019.
  27. "ఆంధ్రవాళ్లను కొడుతున్నారు: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్". 22 Mar 2019. Archived from the original on 24 Mar 2019.
  28. "తెలంగాణలో ఎవరిని కొట్టారో చెప్పాలి". సాక్షి. 24 Mar 2019. Archived from the original on 24 Mar 2019.
  29. "పవన్‌కల్యాణ్‌పై జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో కేసు". ప్రజాశక్తి. 24 Mar 2019. Archived from the original on 24 Mar 2019.
  30. "'హోదా బోరింగా?.. పీవీపీని మార్చండి'". ఈనాడు. 21 Mar 2019. Archived from the original on 21 మార్చి 2019. Retrieved 7 జనవరి 2020.
  31. "హోదాకు మద్దతిస్తాం". ప్రజాశక్తి. 9 April 2019. Archived from the original on 9 April 2019. Retrieved 9 April 2019.
  32. "నిఘా ఛీఫ్ బదిలీ. కడప శ్రీకాకుళం ఎస్పీలూ ట్రాన్స్‌ఫర్". ఆంధ్రజ్యోతి. 27 Mar 2019. Archived from the original on 28 Mar 2019. Retrieved 28 Mar 2019.
  33. "ఇదెక్కడి న్యాయం". ఈనాడు. 28 Mar 2019. Archived from the original on 28 Mar 2019. Retrieved 28 Mar 2019.
  34. "ఐపీఎస్‌ల బదిలీ కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ". ఆంధ్రజ్యోతి. 29 Mar 2019. Archived from the original on 29 Mar 2019. Retrieved 29 Mar 2019.
  35. "ఏపీ ఇంటెలిజెన్స్‌ డీజీ బదిలీ". ఈనాడు. 29 Mar 2019. Archived from the original on 29 Mar 2019. Retrieved 29 Mar 2019.
  36. "ఎన్నికల వేళ ఏపీలో వేగంగా మారుతున్న పరిణామాలు". హెచ్చెమ్ టీవీ. 6 Apr 2019. Archived from the original on 7 April 2019. Retrieved 7 April 2019.
  37. "అవంతి శ్రీనివాస్‌ను అలా బెదిరించారు... చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు". న్యూస్18. 15 Feb 2019. Archived from the original on 21 Mar 2019.
  38. "టీడీపీకి షాక్‌.. వైసీపీలోకి కీలక నేత!". ప్రజాశక్తి. 24 Mar 2019. Archived from the original on 25 Mar 2019. Retrieved 25 Mar 2019.
  39. "లక్ష్మీనారాయణ: నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు... ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తా". BBC News|తెలుగు. BBC. 26 Nov 2018. Archived from the original on 21 Mar 2019.
  40. "CBI former joint director to name his party on December 22?". టైమ్స్ ఆఫ్ ఇండియా. బెన్నెట్, కోల్‌మన్ అండ్ కంపెనీ లిమిటెడ్. 13 Dec 2018. Archived from the original on 21 మార్చి 2019. Retrieved 21 మార్చి 2019.
  41. "తెదేపాలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ?". ఈనాడు. 12 Mar 2019. Archived from the original on 21 Mar 2019.
  42. "ఆ విషయం పవన్ కల్యాణ్ చెప్తారు: వీవీ లక్ష్మీనారాయణ". ఆంధ్రజ్యోతి. 17 Mar 2019. Archived from the original on 21 Mar 2019.
  43. "ఖాళీ పత్రాలతో కేఏ పాల్‌ నామినేషన్‌." ఆంధ్రజ్యోతి. 24 Mar 2019. Archived from the original on 24 Mar 2019.
  44. "భీమవరంలో కె ఏ పాల్ నామినేషన్ తిరస్కరణ". ప్రజాశక్తి. 25 Mar 2019. Archived from the original on 25 మార్చి 2019. Retrieved 25 Mar 2019.
  45. "79.64 శాతం ఓటింగ్‌". సాక్షి. 13 Apr 2019. Archived from the original on 13 Apr 2019. Retrieved 13 Apr 2019.
  46. "పోలింగ్‌ 80 శాతానికి చేరొచ్చు". ఈనాడు. 12 Apr 2019. Archived from the original on 12 Apr 2019. Retrieved 12 Apr 2019.
  47. "రికార్డు స్థాయిలో రైలు ప్రయాణం". ఈనాడు. 12 Apr 2019. Archived from the original on 13 Apr 2019. Retrieved 13 Apr 2019.
  48. "వోటెత్తిన రాష్ట్రం". ప్రజాశక్తి. 12 Apr 2019. Archived from the original on 12 Apr 2019. Retrieved 12 Apr 2019.
  49. "ఓటెత్తిన ఆంధ్ర". సాక్షి. 12 Apr 2019. Archived from the original on 12 Apr 2019. Retrieved 12 Apr 2019.
  50. 50.0 50.1 "వోటర్ల స్ఫూర్తికి ఈసీ తూట్లు". ఈనాడు. 12 Apr 2019. Archived from the original on 12 Apr 2019. Retrieved 12 Apr 2019.
  51. 51.0 51.1 "వెల్లువెత్తిన మహిళాలోకం". ఆంధ్రజ్యోతి. 12 Apr 2019. Archived from the original on 12 ఏప్రిల్ 2019. Retrieved 12 Apr 2019.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  52. "ఓట్ల వెల్లువ". విశాలాంధ్ర. 12 Apr 2019. Archived from the original on 13 ఏప్రిల్ 2019. Retrieved 13 Apr 2019.
  53. "పోలింగ్‌ నిర్వహణలో విఫలం". ఈనాడు. 12 Apr 2019. Archived from the original on 15 Apr 2019. Retrieved 15 Apr 2019.
  54. "ఏ జిల్లాలో ఎంత పోలింగ్ %". ఆంధ్రజ్యోతి. 13 Apr 2019. Archived from the original on 14 Apr 2019. Retrieved 14 Apr 2019.
  55. "ఏపీలో పోలింగ్‌ శాతాలు:. అప్పుడు.. ఇప్పుడు". ఈనాడు. 13 Apr 2019. Archived from the original on 13 Apr 2019. Retrieved 13 Apr 2019.
  56. "చంద్రబాబు ఆరోపణలను ఖండించిన సిఈవో". సాక్షి. 12 Apr 2019. p. 11. Archived from the original on 13 Apr 2019. Retrieved 13 Apr 2019.
  57. "ఈవీఎమ్‌ల వైఫల్యానికి ఈసీదే బాధ్యత: పవన్". ఆంధ్రభూమి. 12 Apr 2019. Archived from the original on 15 Apr 2019. Retrieved 15 Apr 2019.
  58. "అర్ధరాత్రి వరకూ పోలింగ్‌". ఈనాడు. 12 Apr 2019. Archived from the original on 15 Apr 2019. Retrieved 15 Apr 2019.
  59. "రాష్ట్రంలో హింస". No. 12 April 2019. ఆంధ్రభూమి. Archived from the original on 12 April 2019. Retrieved 12 April 2019.
  60. "స్పీకర్ కోడెల శివప్రసాద్ పై దాడి.. పరిస్థితి ఉద్రిక్తం". ప్రజాశక్తి. 11 Apr 2019. Archived from the original on 13 Apr 2019. Retrieved 13 Apr 2019.
  61. "ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: సంతృప్తికరంగా పోలింగ్.. ఆరింటికి '74 శాతం' నమోదు: ఈసీ". బిబిసి తెలుగు. 11 Apr 2019. Archived from the original on 13 Apr 2019. Retrieved 13 Apr 2019.
  62. "విజయనగరం కురుపాం నియోజకవర్గంలోని చినకుదమ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత". ప్రజాశక్తి. 11 Apr 2019. Archived from the original on 13 Apr 2019. Retrieved 13 Apr 2019.
  63. "హింసాత్మకం". ఆంధ్రభూమి. 12 Apr 2019. Archived from the original on 13 Apr 2019. Retrieved 13 Apr 2019.
  64. "2 కేంద్రాల్లో రీ పోలింగ్‌కు ప్రతిపాదనలు". ఈనాడు. 13 Apr 2019. Archived from the original on 13 Apr 2019. Retrieved 13 Apr 2019.
  65. "చంద్రగిరి రీపోలింగ్: పోలింగ్‌కి, రీపోలింగ్‌కి ఇంత వ్యవధి ఇదే తొలిసారి". బిబిసి న్యూస్. 16 May 2019. Archived from the original on 10 June 2019. Retrieved 10 June 2019.
  66. "ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ: కొత్త ఎమ్మెల్యేల పూర్తి జాబితా". BBC News. 2019-05-24. Archived from the original on 2019-06-09.
  67. Karthik KR, Vignesh. "How regional parties gained ground in Andhra Pradesh". IndiaToday. Archived from the original on 8 June 2019. Retrieved 10 June 2019.
  68. "ఆంధ్రప్రదేశ్‌లో ఓటుకు రూ. 2,000.. దేశంలో ఒక్కో లోక్‌సభ స్థానంలో రూ. 100 కోట్ల వ్యయం - సీఎంఎస్ అంచనా". BBC News. 2019-06-04. Archived from the original on 2019-06-10.
  69. "ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ: ఎమ్మెల్యేల్లో 96మందిపై క్రిమినల్ కేసులు, ధనిక ఎమ్మెల్యేలు చంద్రబాబు, జగన్, బాలకృష్ణ- ఏడీఆర్ నివేదిక". BBC News. 2019-05-27. Archived from the original on 2019-06-10.