వనారస గోవిందరావు
వనారస గోవిందరావు రంగస్థల నటులు, నాటకరంగ వ్యవస్థాపకులు.
వనారస గోవిందరావు | |
---|---|
జననం | పకీరప్ప 1867 సురభి |
మరణం | డిసెంబర్ 19, 1953 పొలసనపల్లి, ఏలూరు |
ఇతర పేర్లు | గోవిందప్ప |
ప్రసిద్ధి | రంగస్థల నటులు, నాటకరంగ వ్యవస్థాపకులు |
తండ్రి | గంపరామన్న |
తల్లి | పకీరమ్మ |
తొలిజీవితం
మార్చువనారస గోవిందరావు 1867లో గంపరామన్న, పకీరమ్మ దంపతులకు జన్మించారు. వీరి పెంపుడు తలిదండ్రులు సుంకమ్మ, వెంకోజీరావులు. గోవిందరావు అసలు పేరు పకీరప్ప. పెంపుడు తలిదండ్రులు పెట్టిన పేరు గోవిందప్ప. అదే గోవిందరావుగా మారింది.
రంగస్థల ప్రస్థానం
మార్చువెంకోజీరావు దగ్గర సంగీతం, ఫేడేలు, నంద్యాల జ్యోతి సుబ్బయ్య కంపెనీలో చేరి పాటలు నేర్చుకున్నారు. ఆ కంపెనీలో వేసిన మొదటివేషం సత్యహరిశ్చంద్రలోని విశ్యామిత్రుడు.
మద్రాసులో నాటకాలను చూసిన గోవిందరావు తను కూడా స్టేజి నాటకాలు వేయాలని అనుకొని, సురభి గ్రామంలో కీచకవధ నాటకం ప్రదర్శించారు. అందులో గోవిందరావు నకులుడి పాత్ర ధరించారు. తరువాత 1857లో ‘శ్రీ శారదా మనో వినోదినీ సభ’ అనే నాటక సమాజాన్ని స్థాపించి, స్టేజి నాటకాలు వేయడం ప్రారంభించారు. ఆ సభే నేటి సురభి కంపెనీలకు మాతృసంస్థ.
తరువాత కంపెనీని సంచాల నాటక రంగంగా రూపొందించి, సంచారానికి పనికివచ్చే రేకులు, విద్యుత్ దీపాలు, వైర్ వర్క్ సామాగ్రి సంపాదించి పెద్దఎత్తున్న వివిధ ప్రాంతాలలో నాటక ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. రంగూన్ లో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. స్త్రీలు నాటకాలలో నటించకూడదని అంటున్నకాలంలో తన భార్యాబిడ్డలను నాటకాలలో నటింపజేసి, సురభి నాటక సమాజాన్ని నాట్యశాస్త్ర విహిత సమాజంగా తీర్చిదిద్దారు.
1917లో భీమవరంలో అంకాదహనం నాటకంలో ఆంజనేయ పాత్రలో నటిస్తుండగా గోవిందరావు ధరించిన దుస్తులకు నిప్పంటుకొని దేహం కాలిపోయింది. నాటకాలలో నటించడానికి పనికిరాని పరిస్థితి ఏర్పడింది. అయినా కానీ సమాజాన్ని వదిలిపెట్టలేదు. హస్యం చేప్పేవారు. కాంతామణి నాటకంలో దొంగవేషం వేసి అద్భుతంగా నటించేవారు. అందుకే నాటక ప్రదర్శన కరపత్రాలలో ‘కంపెనీ ప్రొప్రెయిటర్ చే దొంగవేషం ధరింపబడును’ అని అచ్చు వేసేవారు.
1929నాటికే ఆంధ్రదేశంలో నాటకకళ క్షీణదశ ప్రారంభమైందని గ్రహించి ��ానిని సరైన మార్గంలో పెట్టడానికి పెద్దలతో కలిసి ఆంధ్ర నాటక కళా పరిషత్తు స్థాపించారు. ఆ సమయంలోనే ఆ పరిషత్తు ఆయనకు ‘ఆంధ్రనాటక కళోద్ధారక’ బిరుదుతో సన్మానించింది.
చివరిదశలో ఏలూరు దగ్గర పొలసనపల్లిలో స్థిరనివాసం ఏర్పరుచుకొని చాలా దానధర్మాలు చేశారు. ఆయన శిలా విగ్రహాన్ని కళాకారులు ఏలారులో ప్రతిష్ఠించారు.
ధరించిన పాత్రలు
మార్చువిశ్వామిత్రుడు, నకులుడు, ఆంజనేయుడు, దొంగ, అర్జునుడు (సుభద్ర), రాజరాజ నరేంద్రుడు, హరిశ్చంద్రుడు, అనిరుద్ధుడు, రావణుడు, శ్రీరాముడు (సంపూర్ణ రామాయణం), విక్రమార్కుడు, బిల్వ మంగళుడు, జగన్మోహనుడు, హిరణ్యకశిపుడు, రుక్మాంగదుడు.
మరణం
మార్చుజీవితాన్ని నాటకరంగానికి, నాటకోద్ధరణ కోసం ధారపోసిన వనారస 1953, డిసెంబర్ 19న మరణించారు.
మూలాలు
మార్చు- వనారస గోవిందరావు, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 298.