భండారు అచ్చమాంబ

తొలి తెలుగు కథా రచయిత్రి
  • అచ్చమాంబ పేరుతో వివిధ వ్యాసాలున్నాయి. వాటి కోసం చూడండి.

భండారు అచ్చమాంబ (1874 - 1905) తొలి తెలుగు కథా రచయిత్రి. ఈమె ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం కూర్చిన కొమర్రాజు వేంకటలక్ష్మణరావుకు అక్క.

జీవిత విశేషాలు

మార్చు

అచ్చమాంబ గురజాడ అప్పారావు కన్నా పదేళ్ళ ముందే 1902 నవంబరు నెలలో రాసిన కథ ‘ధన త్రయోదశి’ని ‘హిందూ సుందరి’ పత్రికలో ప్రచురించారు. ప్రథమ స్త్రీవాద చరిత్ర కారణి. అయితే ఈ కథ గ్రాంధిక భాషలో ఉంది. అచ్చమాంబ 1874 వ సంవత్సరంలో కృష్ణా జిల్లా నందిగామ దగ్గర పెనుగంచిప్రోలులో పుట్టింది. ఈమెకు ఆరేళ్ళ వయసపుడే తండ్రి చనిపోయాడు. 10వ ఏటనే ఈమెకు పెళ్ళయ్యింది. పెళ్ళయ్యే నాటికి అచ్చమాంబ ఏమి చదువుకోలేదు. ఆమె తల్లి, తమ్ముడు కూడా ఆమెతో పాటే ఉండేవారు. ఆమె తమ్ముడికి చదువు చెప్పించారు కానీ ఈమెను ఎవరూ ప్రోత్సహించలేదు. ఎమ్. ఏ చదివిన తమ్ముడితో పాటు కూర్చుని తానే చదువుకుంటూ తెలుగు, హిందీ నేర్చుకొన్నది. ఆమెకు ఇంగ్లీషు, గుజరాతీభాషలలో కూడా ప్రవేశం ఉంది.[1]. 1902లో ఓరుగంటి సుందరీ రత్నమాంబతో కలిసి మచిలీపట్నంలో మొదటి మహిళా సమాజం “బృందావన స్త్రీల సమాజం”ను స్థాపించింది. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఎన్నో స్త్రీల సంఘాలు ఏర్పరచింది. చిన్న వయసులో కుమారుడు, కుమార్తె మరణించడం ఆమెకు తీవ్రమైన దు:ఖాన్ని కల్గించింది. అనాథ పిల్లల్ని చేరదీసి చదువు చెప్పించేది. ఆమె ఇంట్లో ఎపుడు ఐదారుగురు పిల్లలుండి చదువుకుంటూ వుండేవారు. 1905 జనవరి 18వ తేదీన ముఫ్ఫై ఏళ్ళకే మరణించింది. వివిధ భాషలలో స్త్రీ సాహిత్యం వ్రాసిన రచయిత్రుల గురించి భండారు అచ్చమాంబ రచనల ద్వారా మనకు తెలుస్తుంది.[2]

కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, ఆయన అక్క భండారు అచ్చమాంబల పరస్పరానురాగం అందరినీ ఆకర్షించేది. ఆమె తమ్ముని విద్యాభివృద్ధికి పాటుపడింది. అక్కగారి సాహిత్యకృషికి, విజ్ఞానానికి తమ్ముడు చేయూతనిచ్చేవాడు. తమ్ముడు ఎంతో సమాచారాన్ని, పుస్తకాలను సేకరించి తోడ్పడగా అచ్చమాంబ అబలా సచ్చరిత్రమాల అనే గ్రంథాన్ని రచించింది. ఇందులో సుమారు 1000 సంవత్సరాల కాలంలో ప్రసిద్ధికెక్కిన భారత స్త్రీల కథలున్నాయి. ఈ గ్రంథాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు తమ చింతామణి ముద్రణాలయంలో ప్రచురించాడు.

అచ్చమాంబ భావాలు

మార్చు
  1. స్త్రీల బుద్ధి పురుష బుద్ధి కన్న మందమనియు, స్త్రీల మెదడు మస్తిష్కము, పురుషుల మస్తిష్కము మెదడు కన్న బలహీనమగుటచే దక్కువ తూగుననియు వ్రాయు వ్రాత బక్షపాతము కలదనుట నిర్వివాదమే- స్త్రీలు నైసర్గిక మూఢురాండ్రనుటకంటె బాల్యము నుండియు వారికి విద్యాగంధమే సోకనియ్యనందున మూఢురాండ్రుగా నున్నారనుట మంచిది- చిన్నతనమున బాలురు బాలికలు సమబుద్ధి కలవారుగా నున్నను శాస్త్ర విషయముల బ్రవేశ పెట్టనందున బురుషులు జ్ఞానాధికులును ఎట్టి తెలివిగలదైనను కన్న తల్లిదండ్రులే యామెను పైకి రానీయక మూల మూలల నణగదొక్కుటచే బాలిక మూర్ఖురాలును అగుచున్నవారు. స్త్రీ యభివృద్ధి లేకుండుటకిట్లు మగవారి పక్షపాతమే మూలం కాని మరొకటి కాదు. పురుషులా పక్షపాతమును విడిచిరేని స్త్రీలు విద్యావతులయి భర్తలకర్ధాంగులన్న ���ామును సార్థకము జేతురు.
  2. స్త్రీలు అబలలనియు, బుద్ధి హీనులనియు వివేకశూన్యులనియు, సకల దుర్గుణములకు -నివాస స్థలమనియు గొందరు నిందింతురు. స్త్రీలపయిన మోపబడిన ఈ దోషారోపణములన్నియు నబద్ధములనియు స్త్రీలలో నత్యంత శౌర్యధైర్యవతులును, అసామాన్య విద్యావిభూషితులునూ… బూర్యముండిరనియు, నిపుడున్నారు.
  3. స్త్రీలకు విద్య నేర్పిన యెడలను, వారికి స్వాతంత్య్రమోసగిన యెడలను, వారు చెడిపోవుదురనియు, బతుల నవమానించెదరనియు, గుటుంబ సౌఖ్యమును నాశనము చేసేదరనియు గొందరు మహానుభావులు వక్కాణించెదరు. ఈ యారోపణములన్నియు నిరర్థకములనియు, స్త్రీవిద్య దురాచార ప్రతీకారానుకూలమగునే కాని దురాచార ప్రవృత్త్యనుకూలము గానేరదనియు స్త్రీ విద్యా స్వాతంత్య్రముల వలన దేశానికి లాభమే గాని నష్టముంగలుగనేరదనియు, స్త్రీ విద్య యత్యంతావశ్యకం.
  4. బాలుడు చిన్నతనమునందెంత మందబుద్ధియైనను వానికైదేండ్లు రాగానే తల్లి దండ్రులు విద్య నేర్పి వానికిగల మాంద్యమును వదిలించి జ్ఞానాభివృద్ధికొరకనేక శాస్త్రములను జదివింతురు…చిన్ననాడు వానికంటే విశేష ప్రజ్ఞ గల వాని యక్క మాత్రము విద్యాగంధమేమియు లేనందున మహా మూర్ఖశిరోమణియై యుండును. ఇట్లు తల్లిదండ్రులు పక్షపాతముచే బురుష సంతతిలోను స్త్రీ సంతతిలోను జ్ఞానమును గురించి మహాదంతరము పడినదే గాని స్త్రీల స్వాభావిక మౌర్ఖ్యము వలన కాదు
  5. మానవ దేహమున కలంకారమయిన విద్యభూషణము వారికి లేకుండ చేసి లోహపు నగలను మాత్రము పెట్టి తమ వేడుక నిమిత్తమయి వారిని తోలుబొమ్మల వలె జేయుచున్నారు. వారిని గృహ యజమానురాండ్రుగా జూడక తమ యుపచారము నిమిత్తమయి దాసులనుగా జేయుచున్నారు. పురుషులు స్త్రీల విషయమున జేసినయిట్టి యన్యాయము వలన స్త్రీలను మూఢురాండ్రనుగా జేసి చెడగొట్టుటయే కాక తామును వారికి తోడిపాటుగా మూర్ఖ శిరోమణులయి జెడిపోవుచున్నారు. ఈ స్థితి యంతయు పురుషుల లోపమువలనను, స్వప్రయోజనపరత్వం వలనను గలుచు చున్నదే కాని స్త్రీల దోషము వలనను మాత్రము గాదు.

విశేషాలు

మార్చు
  • 'భండారు అచ్చమాంబ తొలి తెలుగు కథా రచయిత్రి
  • ఈమె ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం కూర్చిన కొమర్రాజు వేంకటలక్ష్మణరావుకు అక్క.
  • అచ్చమాంబ గురజాడ అప్పారావు కన్నా పదేళ్ళ ముందే 1902 నవంబరు నెలలో రాసిన కథ ‘ధన త్రయోదశి’ని ‘హిందూ సుందరి’ పత్రికలో ప్రచురించారు.
  • ప్రథమ స్త్రీవాద చరిత్ర కారణి.అయితే ఈ కథ గ్రాంధిక భాషలో వుంది మహిళాభ్యుదయానికి తొలి విదూషీణి
  • అచ్చమాంబ 1874 వ సంవత్సరంలో కృష్ణా జిల్లా నందిగామ దగ్గర పెనుగంచిప్రోలులో కొమర్రాజు వెంకటప్పయ్య, గంగమ్మ దంపతులకు పుట్టింది
  • 1902లో ఓరుగంటి సుందరీ రత్నమాంబతో కలిసి మచిలీపట్నంలో మొదటి మహిళా సమాజం “బృందావన స్త్రీల సమాజం”ను స్థాపించింది.
  • 1905 జనవరి 18వ తేదీన మధ్యప్రదేశ్ బిలాస్పూర్ లో ముఫ్ఫై ఏళ్ళకే మరణించింది
  • తమ్ముడు ఎంతో సమాచారాన్ని, పుస్తకాలను సేకరించి తోడ్పడగా అచ్చమాంబ అబలా సచ్చరిత్ర రత్నమాల అనే గ్రంథాన్ని రచించింది.
  • ఇందులో సుమారు 1000 సంవత్సరాల కాలంలో ప్రసిద్ధికెక్కిన భారత స్త్రీల కథలున్నాయి. ఈ గ్రంథాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు తమ చింతామణి ముద్రణాలయంలో ప్రచురించాడు.

రచనలు [3]

మార్చు
కథలు
  • ధనత్రయోదశి
  • గుణవతియగు స్త్రీ (తెలుగుజనానా, 1901 మే)
  • లలితా శారదులు
  • జానకమ్మ (తెలుగు జనానా, 1902 మే)
  • దంపతుల ప్రథమ కలహము (హిందూసుందరి, 1902 జూన్)
  • సత్పాత్ర దానము (హిందూసుందరి, 1902)
  • స్త్రీవిద్య (హిందూసుందరి, 1902)
  • భార్యా భర్తల సంవాదము (హిందూసుందరి, 1903 జూలై)
  • అద్దమును సత్యవతియును (హిందూసుందరి, 1903)
  • బీద కుటుంబము (సావిత్రి, 1904)
  • ప్రేమ పరీక్షణము (1898 - అలభ్యం)
  • ఎరువుసొమ్ము పరువు చేటు (1898 - అలభ్యం) ఇంతదాకా అలభ్యంగా వుండిన 'ప్రేమా పరీక్షణము', 'ఎఱువుల సొమ్ము బఱువుల చేటు' అనే రెండు కథలు సంగిశెట్టి శ్రీనివాస్కు లభించాయి.[4]

ఇతర పుస్తకాలు

  • అబలా సచ్చరిత్ర రత్నమాల (రెండు భాగాలు) (చారిత్రక మహిళల జీవితాలు మృధుమధుర శైలిలో వర్ణితాలు ఇందులో ఉన్నాయి.) [5][6]
  • క్రోషో అల్లిక మీద పుస్తకం (అలభ్యం)
  • ఊలు అల్లిక మీద పుస్తకం (అలభ్యం)
  • ఒక శతకం కూడా రాసారని అంటారు (అలభ్యం)
ఇతర పుస్తకాలు
  • అబలా సచ్చరిత్ర రత్నమాల (రెండు భాగాలు)
  • క్రోషో అల్లిక మీద పుస్తకం (అలభ్యం)
  • ఊలు అల్లిక మీద పుస్తకం (అలభ్యం)
  • ఒక శతకం కూడా రాసారని అంటారు (అలభ్యం)

మూలాలు

మార్చు
  1. https://tethulika.wordpress.com/2016/08/14/%e0%b0%ac%e0%b0%b9%e0%b1%81-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b7%e0%b0%be%e0%b0%95%e0%b1%8b%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b1%81%e0%b0%b2%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%7C బహుభాషాకోవిదులైన తెలుగు రచయితలు
  2. "ప్రథమ స్త్రీవాద రచయిత్రి - భండారు అచ్చమాంబ". భూమిక: 43.
  3. భండారు అచ్చమాంబ సచ్చరిత్ర, కొండవీటి సత్యవతి. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ, 2012.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-08-20. Retrieved 2013-08-20.
  5. అచ్చమాంబ, భండారు (1935). అబలా సచ్చరిత్ర రత్నమాల మొదటి భాగం. కొమర్రాజు వినాయకరావు. Retrieved 2020-07-13.
  6. అచ్చమాంబ, భండారు (1917). అబలా సచ్చరిత్ర రత్నమాల రెండవ భాగం (3 ed.). ఉత్తమగ్రంథాలయం. Retrieved 2020-07-13.

లంకెలు

మార్చు
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: