పరిటాల రవి (ఆగష్టు 30, 1958 - జనవరి 24, 2005) (పరిటాల రవీంద్ర) ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, అనంతపురం జిల్లా పెనుగొండ మాజీ శాసన సభ సభ్యుడు, తెలుగుదేశం పార్టీలో ప్రముఖ నాయకుడు.[1] 2005 లో ప్రత్యర్థుల దాడిలో మరణించాడు. ఆయన భార్య పరిటాల సునీత, ప్రస్తుతం రాప్తాడు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. రవి తండ్రి పరిటాల శ్రీరాములు కూడా ఒక ప్రజానాయకుడు. భూపోరాటాల్లో కొద్దిమంది భూస్వాముల చేతుల్లో ఉన్న బంజరు భూములను సాధారణ రైతులకు పంచేలా కృషి చేశాడు. ఈయన కూడా ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాడు. పరిటాల శ్రీరాములు జీవితం ఆధారంగా దర్శకుడు ఎన్. శంకర్ శ్రీరాములయ్య అనే సినిమా తీశాడు. రవి జీవితం నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ, రక్త చరిత్ర పేరుతో రెండు సినిమాలు తీశాడు.

పరిటాల రవి
పరిటాల రవి


నియోజకవర్గం పెనుకొండ

వ్యక్తిగత వివరాలు

జననం (1958-08-30)1958 ఆగస్టు 30
వెంకటాపురం,
నసనకోట పంచాయితి,
రామగిరి మండలం,
అనంతపురం జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్
మరణం 2005 జనవరి 24(2005-01-24) (వయసు 46)
అనంతపురం
రాజకీయ పార్టీ తెలుగు దేశం
జీవిత భాగస్వామి పరిటాల సునీత
సంతానం ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె
నివాసం వెంకటాపురం
మతం హిందూ

ముఠా కక్షలు

మార్చు

1975లో భూస్వాములు, ఫ్యాక్షనిష్టులు కుట్రపన్ని రవి తండ్రి పరిటాల శ్రీరాములును, ఆయన తమ్ముడు పరిటాల సుబ్బయ్యని హత్యచేసారు. తండ్రి చనిపోయేనాటికి పరిటాల రవీంద్ర వయసు పదిహేను సంవత్సరాలు. కుటుంబం అభద్రతాభావంతో బతుకుతోంది. కన్నబిడ్డల కోసం గుండెధైర్యంతో బతుకుతున్న తల్లి నారాయణమ్మకి అండగా నిలబడ్డాడు రవి. తమ్ముడు హరితో పాటు రేయింబగళ్ళు శ్రమించి తండ్రి తాలుకు అప్పుల్ని తీర్చేశారు. తండ్రి అడుగుజాడల్లో నడిచిన తమ్ముడు హరి బూటకపు ఎన్ కౌంటర్ లో మరణించాడు. పరిటాల హరి మరణంతో ప్రాంతమంతట మళ్ళీ చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. అరాచకం ప్రబలింది.

హత్యలు

మార్చు

భూస్వాములు, ఫ్యాక్షనిష్టులు పరిటాల రవీంద్ర మీద దృష్టిని సారించారు. అతనని వెంటాడి వేధించటం ప్రారంభంచారు. కష్టకాలంలో విప్లవ శిబిరం పరిటాల రవీంద్ర ఆశ్రయం కల్పించింది. పరిటాల శ్రీరాములు హత్య వెనుక కుట్ర జరిపిన ముఖ్యుడుని గుర్తించిన పీపుల్స్ వార్ పార్టీ మద్దెలచెరువు గ్రామానికి చెందిన మాజీ శాసనసభ్యుడు నారాయణ రెడ్డిని 1983లో అనంతపురం లో అన్నపూర్ణ వద్ద చంపారు. ఈ హత్యకేసులో పరిటాల రవిని ప్రధాన ముద్దాయిగా చేర్చారు. అజ్ఞాత జీవితం గడుపుతూనే మొదటినుంచి తన కుటుంబానికి బాసటగా వుంటూ వచ్చిన జనాన్ని సంఘటితం చేసుకుంటూ వచ్చాడు పరిటాల రవీంద్ర. 1983 లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసరిగా కాంగ్రసేతర ప్రభుత్వాన్ని స్థాపించి తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది. ఎన్. టి. రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. రాష్ట్ర రాజకీయ వాతావరణంలో ఒక తాజాదనం వెల్లువిరిసింది. 1984లో పరిటాల రవీంద్ర తన స్వగ్రామం చేరుకున్నాడు. 1984 అక్టోబరు 27న ధర్మవరపు కొండన్నగారి పెద్ద కుమార్తె సునీతతో పరిటాల రవి పెళ్ళి జరిగింది. పరిటాల శ్రీరాములు హత్యకసులో ప్రధాన ముద్దాయి సిద్ధప్ప శిక్ష ముగించుకుని జైలునుంచి బైటకి వచ్చాడు. 1986లో పీపుల్స్ వార్ ఆగ్రహానికి గురై దుర్మరణం చెందాడు.

ఈ హత్యకేసులోను పరిటాల రవిని ముద్దాయి చేశారు. మళ్ళీ అజ్ఞాతంలో వెళ్ళిపోయి, కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రహస్య జీవితం గడిపాడు. నక్సలైటు ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖుడు కొండపల్లి సీతారామయ్యతో సన్నిహిత సాంగత్యం ఏర్పడింది. కేసు నుంచి బయటపడి తిరిగి వెంకటాపురం చేరాక, తన తండ్రి తమ్ముడు సాగించిన భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని ఏదో ఒక రూపంలో ముందుకు తీసుకువెళ్ళటమే సరైన మార్గమని భావించాడు. ముఠాకక్షలను నిర్మూలించటమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకు అవసరమైన సాధన సంపత్తులను సమకూర్చుకునే మార్గాల మీద దృష్టిని కేంద్రీకరించాడు. అనతికాలంలోనే పరిటాల రవికి తనదైన ఒక ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఏర్పడింది. ప్రజానాయకుడుగా పరిటాల రవీంద్ర తొలి అడుగులు వేయటం ప్రారంభించాడు. రాష్ట్రంలో జరిగిన తొలి మండల వ్యవస్థ ఎన్నికలలో పరిటాల రవి మద్దతుతో రామగిరి మండల అధ్యక్షపదవికి రంగంలోకి దిగిన దళితుడు ఓబన్న అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించాడు. అదే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలలో పరిటాల శ్రీరాములు హత్య, పరిటాల హరి బూటకపు ఎన్-కౌంటర్ ల వెనుక కీలకమైన వ్యక్తి సానే చెన్నారెడ్డి పెనుగొండ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగాడు. భారీ పోలీస్ బందోబస్తుతో ఎన్నికలు ప్రచారానికి వస్తున్నా చెన్నారెడ్డిని రామగిరి మండలంలో అడుగు పెట్టకుండా ఆత్మాహుతి దళంతో అడ్డుకున్నాడు పరిటాల రవీంద్ర. ఈ సంఘటన ఆ ప్రాంతంలోని బడుగు వర్గాల ప్రజలకు బలాన్నిచ్చింది. ఏడుసంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళి అధికారంలోకి వచ్చింది. కనుముక్కల గ్రామానికి చెందిన సానే చెన్నారెడ్డి శాసనసభ్యుడు అయ్యాడు. శాసనసభ్యుడిగా చెన్నారెడ్డి కక్షకట్టి తనకు వ్యతిరకంగా పనిచేసిన వారి మీద, ప్రధానంగా పరిటాల రవి మద్దతుదారుల మీద పెద్దఎత్తున దాడులు ప్రారంభించాడు. కుంటిమద్ది, గడిగకుంట, ఏడుగుర్రాలపల్లి వంటి అనేక గ్రామాల మీద మారణాయుధాలతో దాడులు జరిపించి బీభత్సం సృష్టంచాడు. అనేక కుటుంబాలను గ్రామాలనుండి తరిమేశాడు.

1991 మే నెల 7వ తేదీన పీపుల్స్ వార్ నక్సలైటులు శాసనసభ్యుడు చెన్నారెడ్డిని కాల్చి చంపారు. చెన్నారెడ్డి అనుచరులు పరిటాల రవీంద్ర స్వగ్రామానికి సమీపంలో వున్నా కొత్త గదిగాకుంట గ్రామం మీదకి మారణాయుధాలతో దాడి చేసి బీభత్సం సృష్టించారు. వెంకటాపురం నుంచి జనం వెళ్లి వాళ్ళను తరిమికొట్టే వరకు అరాచకం కొనసాగుతూనే ఉంది. దాదాపుగా ఊరు ఊరంత బుగ్గిపాలైంది. పెనుగొండ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలలో చెన్నారెడ్డి పెద్దకొడుకు ఎస్.వి. రమణారెడ్డి శాసనసభ్యుడిగా గెలిచాడు. రమణారెడ్డి తమ్ముడు ఓబుల్రెడ్డి, మాజీ శాసనసభ్యుడి కుమారులు సూర్యనారాయణరెడ్డి (సూరి), రఘునాధరెడ్డి వాళ్ళ అనుచరులు సాగించిన అరాచకాలతో పెనుగొండ ధర్మవరం ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. హత్యలు, అపహరణలు, మానభంగాలు నిత్యాకృత్యాలుగా మారిపోయాయి. 1991 నుంచి విశ్రుంఖల స్వైర విహారం చేస్తున్న అరాచక శక్తుల్ని రకరకాల పద్ధతుల ద్వరా ఎదుర్కోవడం వల్ల పరిటాల రవి ప్రజల దృష్టిలో హీరో అయ్యాడు. తననీ, తన అనుచరుల్ని నక్సలైట్లుగా చిత్రించి మట్టుపెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు పరిటాల రవికి సమాచారం అందింది. 1992 లో జిల్లా S.P కెప్టెన్ కె. వి. రెడ్డి సమక్షంలో పోలీసుల ముందు లొంగిపోయాడు.

రాజకీయాల్లోకి

మార్చు

లొంగిపోయిన మరుసటి దినం నుంచే పరిటాల రవి క్రియాశీల రాజకీయల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రచారం ప్రారంభమయింది. ధర్మవరంలో ఓబులరెడ్డి అరాచకాలను బహిరంగంగా ఎదురించిన మొదటి వ్యక్తి షాక్ ముష్కిన్. మాజీ తీవ్రవాది అయిన ముష్కిన్ పరిటాల రవికి సన్నిహితుడు. 1993 సెప్టెంబరు 23న ఎస్వీ సోదరులు, సూరి సోదరులు ముష్కిన్ ని దారుణంగా చంపారు. 1993 జూన్ 7న రవి తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఒక్క అనంతపురం జిల్లా మాత్రమేగాక రాయలసీమకు చెందినా టిడిపి కార్యకర్తలు, సానుభూతిపరులు పరిటాల రవీంద్రకు బ్రహ్మరధం పట్టారు. 1993 అక్టోబరు 24న మద్దలచెరువు గ్రామంలో టి.వి బాంబు సంఘటన జరిగింది. ఈ సంఘటనతో సూరి తమ్ముడు రఘునాధరెడ్డితో సహా ఆరుగురు చనిపోయారు. ఈ సంఘటనకు ప్రధాన కారకుడు పరిటాల రవేనని కాంగ్రెస్ నాయకులు విమర్శల వర్షం కురిపించారు. 1994 జూన్ 17న వై.యస్.రాజారెడ్డి వెంకటాపురం వెళ్ళి పరిటాల రవిని కలిశాడు. రాజారెడ్డి-రవీంద్రల కలయిక కాంగ్రెస్ వర్గాల్లో కలవరం సృష్టించింది. ఆగష్టు 7న హైదరాబాద్ సమీపంలోని షాద్నగర్ లో జంట హత్యలు జరిగాయి. హతులిద్దరూ పెనుగొండ శాశానసభ్యుడు ఎస్.వి.రమణారెడ్డి అనుచరులు.

ఈ కేసులో ప్రధాన ముద్దాయి పరిటాల రవి. వేరే కేసులో పెండింగ్ లో వున్నా వారంట్ కింద రవి న్యాయస్థానం అనుమతితో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. పరిటాల రవి అనుచరులకీ ఎస్వి సోదరులుకీ మధ్య ప్రత్యక్ష పోరాటం ప్రారంభమైంది. జైలునించే పరిటాల రవి నామినే���న్ దాఖలు చేశారు. అన్ని అవాంతరాలను అధిగమించి అత్యధిక ఆధిక్యంతో విజయం సాధించాడు. ఎన్టీఆర్ మంత్రి వర్గంలో కార్మికశాఖ మంత్రి అయ్యాడు. ఆ తర్వాత కాలంలో అనంతపురం జిల్లా చరిత్ర పరిటాల రవీంద్ర అడుగు జాడల్ని అనుసరించింది అంటే అతిశయోక్తి కాదు. అధికార బలంతో శత్రుసంహారం సాగిస్తాడని అనుకున్న ప్రత్యర్థుల అంచనాలను పరిటాల రవీంద్ర చిత్తూ చేశాడు. వివిధ గ్రామాల్లో ఫ్యాక్షన్ గ్రూపుల మద్య రాజీ కుదిర్చాడు. ఫ్యాక్షన్ బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించాడు. మొత్తంగా జిల్లా అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరించాడు. ఎన్టీఆర్ ప్రభుత్వం సంక్షోబంలో పడింది. ఎన్టీఆర్ ను దించి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఎనిమిది మాసాలపాటు కాబినెట్ మంత్రిగా పనిచేసిన పరిటాల, ఎన్టీఆర్ మరణానంతరం శాసనసభ్యుత్వానికి రాజీనామా చేశాడు. ఉప ఎన్నికలులో గెలిచి చంద్రబాబు నాయకత్వంలోని అధికార తెలుగుదేశం పార్టీలో చేరాడు.

1996 లో ఓబుల్రెడ్డి హత్య జరిగింది. 1997 లో తన తండ్రి జీవితకథ ఆధారంగా స్నేహలత పిక్చర్స్ పతాకం కింద "శ్రీరాములయ్య" చలనచిత్ర నిర్మాణం చేపట్టాడు. నవంబరు 19న సినిమా ముహూర్తం సందర్భంగా జరిగిన కారుబాంబు పేలుడుతో తీవ్రంగా గాయపడిన పరిటాల రవి ప్రాణాలతో బైటపడ్డాడు. ఈ దుర్ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పరిటాల రవిని హతమార్చేందుకు మద్దెలచెరువు సూరి, అతని అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు విచారణలో వెల్లడయింది. సూరితో సహా కారుబాంబు నిందుతులందరినీ పోలీసులు గావించి పట్టుకున్నారు. న్యాయస్థానం దాదాపుగా అందరికీ యావజ్జీవ శిక్ష విధించింది. 2001లో రవి తీవ్ర అస్వస్థకి గురియ్యాడు. 2003లో నసనకోట వద్ద శిథిలావస్థలోవున్న రాయల కాలంనాటి దేవాలయాన్ని ఎంతో శ్రమకోర్చి పునరుద్ధరించాడు. దేవాలయ ప్రాంగణంలో దాదాపు రెండున్నర లక్షలమంది జనం సమక్షంలో 550 జంటలకు సమూహిక వివాహాలు జరిపించాడు. 2004 ఫిబ్రవరిలో 1116 జంటలకు పెళ్ళిళ్ళు చేశాడు.

2004 అసెంబ్లీ ఎన్నికలలో కారుబాంబు నిందితుడు సూరి భార్యను, కాంగ్రెస్ పార్టీ పరిటాల రవి మీద పోటికి నిలబెట్టింది. తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయం పాలై అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అనంతపురం జిల్లాలో పరిటాల రవి అనుచరులు ఏరివేత మొదలైంది. రవికి కుడి భుజంగా వున్నా చమన్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. పరిటాల రవి మీద పాతకేసులను తిరగద్రోడడం ప్రారంభమయింది. తన ప్రాణానికి ముప్పు ఏర్పడిందిని, సరైన రక్షణ కల్పించమని పదే పదే ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. ఫలితం,రవికి రక్షణగా వుండే గన్-మేన్ ల సంఖ్యని రెండుకి తగ్గించారు. తనను చంపేందుకు జరుగుతున్న కుట్రలను గురించిన వివరాలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తూ వచ్చాడు. చెర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్న కారుబాంబు నిందితుడు మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డికి,ముఖ్యమంత్రి కుమారుడు వై ఎస్.జగన్మోహన్ రెడ్డికి మధ్య తనను హత్య చేసేందుకు సెల్-ఫోన్ లో సంభాషణలు కొనసాగుతున్నట్టు రవి ఆరోపించాడు. జగన్మోహన్ రెడ్డి పరిటాల రవింద్ర మీద పరువు నష్టం దావా వేశాడు. 2004 డిసెంబరు 23న పరిటాల రవి పులివెందుల కోర్టుముందు హాజరయ్యడు. ఆరోపణలను రుజువుపరిచే సాక్ష్యాధారాలు తన వద్దవున్నాయని విలేఖరుల సమవేశంలో వెల్లడించాడు. రవి ఇళ్ళలో సోదాలు మొదలయ్యాయి. అనంతపురంలోని ఇంట్లో, వెంకటపురంలోని ఇంట్లో పోలీసులు అణువణువు గాలించారు. తెలుగుదేశం అనుచరులు, మద్దతుదారులు మీద దాడులు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. 2004 సెప్టెంబరు 7న రవి అనుచరుడు తగరకుంట ప్రభాకర్ హత్య జరిగింది. అక్టోబరు 9న బళ్ళారిలో వుంటున్న రవి బంధువు రాకియ గురువు అయిన అర్.కే.అలియాస్ (మలపాటి వెంకటేశ్వరరావు) హత్య జరిగింది. పరిటాల రవి ప్రాణాలకు ఏ క్షణంలోనయిన ముప్పువాటిల్లే పరిస్థితి దాపురించింది. మానసికంగా అన్నింటికీ సంసిద్ధం అయ్యాడు. ఎవరెన్ని విధాలుగా చెప్పిన తనను నమ్ముకునివున్న ప్రజలను ఎటువంటి పరిస్థితుల్లోను తన ఒక్కడి ప్రాణాలు కాపాడుకోవటంకోసం వదిలిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదని చెప్పాడు.

2005 జనవరి 24వ తేది. అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం. అనేకమంది అతిరథమహరధులు వంటి పార్టీ రాష్ట్రనాయకులు అక్కడే ఉన్నారు. సాయుధలైన అనేకమంది అంగరక్షకులున్నారు. మధ్యహ్న భోజనం ముగించుకుని ఇంటికి బయలుదేరుదామని పార్టీ కార్యాలయం ఆవరణలోకి అడుగుపెట్టిన ప్రజలమనిషి పరిటాల రవీంద్ర మీద బులెట్ ల వర్షం కురుసింది. శత్రువులు పకడ్బందిగా పన్నిన పద్మవ్యూహంలో పొరపాటున పడిన అతని అడుగు నెత్తుటి మడుగయింది.[2]

మూలాలు

మార్చు
  1. ఖాదర్, మొహియుద్దీన్ (2007). అస్తమించని రవి. అనంతపురం: నారాయణమ్మ ప్రచురణలు. Archived from the original on 2019-01-10. Retrieved 2018-12-07.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-07-07. Retrieved 2017-07-29.

బయటి లింకులు

మార్చు