తెలుగులో కవితా విప్లవాల స్వరూపం

తెలుగులో కవితా విప్లవాల స్వరూపం వేల్చేరు నారాయణరావు రచించిన విమర్శ గ్రంథం.

తెలుగులో కవితా విప్లవాల స్వరూపం
తెలుగులో కవితా విప్లవాల స్వరూపం ముఖపత్రం
కృతికర్త: వేల్చేరు నారాయణరావు
ముద్రణల సంఖ్య: 3
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: విమర్శ
ప్రచురణ: తానా పబ్లికేషన్స్(తృతీయ ముద్రణకు)
విడుదల: 1978
పేజీలు: 220

రచనా నేపథ్యం

మార్చు

తెలుగులో కవితా విప్లవాల స్వరూపం అంశంపై నారాయణరావు 1969-71 మధ్యకాలంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. ఈ పుస్తకంలోని ప్రధానభాగం ఆ పరిశోధన కాలంలోనే రూపొందింది. దరిమిలా 1974లో ఆయన థీసిస్ కు విశ్వవిద్యాలయం పి.హెచ్.డి. ఇచ్చింది. ఆ థీసిస్ ను మార్చి, కొన్ని కొత్త భాగాలు చేర్చి, కొన్ని చోట్ల సవరించి తయారుచేసిన పుస్తకం ఇది. ఉత్తమమైన థీసిస్ గా నిర్ణయించి నారాయణరావుకు సర్ రఘుపతి వెంకటరత్నంనాయుడు పేరిట ఉన్న బంగారుపతకాన్ని బహూకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ ఈ పుస్తకం అచ్చుకు ధనసహాయం చేసింది. తొలిముద్రణ 1979లో జరిగింది. ద్వితీయ ముద్రణ 1987లో, తృతీయ ముద్రణ 2008లో పొందింది. మూడవ ముద్రణ తానా ప్రచురణకర్తగా వ్యవహరించింది.

ముఖ్య ప్రతిపాదనలు

మార్చు

విప్లవాత్మక కవితల రూపం, విషయం, వ్యక్తీకరణ – ఈ పార్శ్వాలన్నీ ఆ కవిత పుట్టిన సందర్భాన్ని ప్రతిబింబిస్తాయని ఈ సిద్ధాంతసారం. దీన్నుంచి కొన్ని విప్లవాత్మకమైన ఉపలక్ష్యాలు కూడా వస్తాయి. (అ) కవులు విప్లవాలను తీసుకురారు, (ఆ) తామున్న సమాజ సందర్భాన్ని అర్థం చేసుకున్న కవులు ఆ సందర్భానికి అనుగుణంగా కవిత్వం రాస్తారు, (ఇ) అలాటి వారిలో సమర్థులైన వారు ఆ కవితావిప్లవానికి నాయకులుగా గుర్తింపబడతారు, (ఈ) సమర్థులైనా సందర్భాన్ని అర్థం చేసుకోలేని వారూ, లేదా ఆ సందర్భాన్ని తాము మార్చగలమనుకునే వారూ రాసే కవిత్వం నిలబడటానికి, వారి సమర్థత పాలు సందర్భానికి అనుగుణంగా రాసే వారి కన్నా ఉన్నతమైనదై వుండాలి అనేవి ఈ గ్రంథంలోని ప్రతిపాదనలకు స్థూలమైన సారాంశం.

అంశాలు

మార్చు

కవితా విప్లవాల స��ళిని విశ్లేషిస్తూ నారాయణరావు ఆశుకవిత్వ ధోరణుల కాలంలో తొలి కవితా విప్లవంగా వచ్చిన నన్నయ పురాణ విప్లవం గురించి మొదట వివరించారు.[1] వాగ్రూపంలో సాగే జానపద సాహిత్యంగా పిలవబడే సాహిత్యాన్ని ఆయన ఆశుకవిత్వమనే పేరుతో వ్యవహరించారు. అటువంటి ఆశుకవిత్వానికి, పురాణకవిత్వానికి ప్రక్రియ పరమైన మౌలిక భేదాలు వివరించి పురాణ రచన (కవిత్రయ భారతం వంటివి) కవితా విప్లవమని తేల్చారు. కథ ప్రధానంగా ఉన్న పురాణ కవిత్వం నుంచి వర్ణన ప్రాధాన్యత సంతరించుకున్న ప్రబంధం ఏర్పడడాన్ని తదుపరి విప్లవంగా పేర్కొన్నారు.[2] ఆపై వర్ణనల వల్ల, చిత్ర బంధ కవిత్వాల వల్ల కథను ఆశ్రయించుకున్న కవిత్వ దృష్టి ఏ పద్యానికి ఆ పద్యంగా మారి పూర్తిగా బలహీనపడడాన్ని నిరూపించారు. ఒకవైపు ఈ ధోరణులు, మరోవైపు ముద్రణా యంత్రాల్లో కవి, శ్రోతగా ఉన్న సంబంధం కవి-పాఠకుడుగా మారి చక్షురక్షుర సంయోగం వల్ల కలిగిన మార్పులను తెలిపారు. ఆశు సంప్రదాయాన్ని అనుసరించిన గురజాడ ఎంత గొప్ప కవి ఐనా వాగ్రూపంలోంచి పూర్తిగా లిఖిత రూపానికి వచ్చిన కవిత్వ స్థితికి అనుగుణం కాకపోవడంతో ఆయనది అసంపూర్ణమైన విప్లవమని ప్రతిపాదించారు.[3] మరోవైపు సంప్రదాయ భావాలతోనే వుండి ఆశు కవిత్వానికి తిప్పబోయిన తిరుపతి వెంకటకవుల విప్లవం ఎలా అసలు మొదలేకాకపోయిన వైనం సాధికారికంగా నిరూపించారు. ప్రక్రియ, వస్తువు కూడా కాలానుగుణం కాకపోవడంతో తిరుపతి వెంకటకవుల విప్లవం అసలు మొదలేకాలేక పోయిందని వివరించారు.[4]
ఆపైన నారాయణరావు ఆధునిక కాలంలో తొలి పూర్తిస్థాయి విప్లవంగా గుర్తించిన భావకవిత్వాన్ని గురించి, శైలి, తాత్త్వికత వంటి అంశాల్లో పూర్తిస్థాయి మార్పులను ఎలా తీసుకువచ్చిందనే విషయాన్ని గురించి వివరించారు. సంప్రదాయ విమర్శ, అలంకారిక భావజాలంతో కొత్త కవిత్వాన్ని నిర్వచించలేరనీ, అయినా భావకవిత్వానికి సంప్రదాయవాదుల ఆమోదం కోసం పూర్వ అలంకారిక శాస్త్ర పారిభాషిక పదాలకు వేరే అర్థాలు కల్పించి వాడిన విషయం పేర్కొన్నారు.[5] 1930ల్లో వచ్చిన ఆర్థికమాంద్యం కారణంగా చదువుకున్నవారి జీవితాల్లో ఏర్పడిన కుదుపుల వల్ల అభ్యుదయ కవిత్వ విప్లవం ప్రారంభమయిన క్రమాన్ని[6], అనంతర కాలంలో అభ్యుదయ కవిత్వం కూడా నీరసించిపోయాకా దానిపై నిరసనతో దిగంబర కవిత్వం ప్రారంభమయిన విషయాన్ని[7] సవిస్తరంగా పేర్కొన్నారు.
వాక్సాహిత్యం/ఆశుకవిత్వం అనే ప్రజాకవిత ప్రక్రియ ఏయే సందర్భాల్లో మార్గకవిత్వ ధోరణిని ప్రభావితం చేసిందో, ఎలా మిగిలిన కాలాల్లో పదాలుగా, కృతులుగా, శతకాలుగా మార్గకవిత్వానికి అడ్డులేకుండా ఉండిపోయిందో వివరించారు.[8]

ప్రాచుర్యం

మార్చు

ఈ విమర్శ గ్రంథం చేసిన సిద్ధాంతాలు, ప్రతిపాదనలపై సాహిత్యంలో చర్చలు జరిగాయి. ప్రధానంగా ఈ గ్రంథాన్ని గురించి జరిగిన విమర్శ రచనలు ఇలా ఇవి:[9]

  • అరుణతార పత్రికలో త్రిపురనేని మదుసూధనరావు సమీక్ష
  • ఆంధ్రజ్యోతి పత్రికలో పురాణం సుబ్రహ్మణ్యశర్మ ఆరువారాల పాటు చేసిన సమీక్ష (ఏప్రిల్ 1979 సంపుటి 13, సంచిక 7 నుంచి 13 వరకు)
  • ఆంధ్రజ్యోతి దినపత్రికలో కడియాల రామమోహనరావు రాసిన రెండు సుదీర్ఘ వ్యాసాలు (1979 ఏప్రిల్ 8, 15)
  • త్రిపురనేని మదుసూధనరావు కవిసేనకి సమాధానంగా ప్రచురించిన కరపత్రం తెలుగులో కవితా విప్లవాల స్వరూపం:కవిసేనకి జవాబు శీర్షికన రాశారు (హనుమకొండ:సృజన ప్రచురణ,1980)
  • బూదరాజు రాధాకృష్ణ ఈ పుస్తకంపై వచ్చిన సమీక్షలను దృష్టిలో పెట్టుకుని ఒక వ్యాసం రాశారు (తెలుగు, జూలై-సెప్టెంబర్, 1980)
  • ఎన్నో పరిశోధన వ్యాసాల్లో, గ్రంథాల్లో ఈ పుస్తకంలోని సిద్ధాంతాలను ఆధారంగా చేసుకున్నారు.

మూలాలు

మార్చు
  1. తెలుగులో కవితా విప్లవాల స్వరూపం:వెల్చేరు నారాయణరావు, ఆశు సాహిత్యం, పురాణ విప్లవం అధ్యాయాలు, పీజీలు:2-42
  2. తెలుగులో కవితా విప్లవాల స్వరూపం:వెల్చేరు నారాయణరావు, ప్రబంధ విప్లవం అధ్యాయంలో 47 పేజీ
  3. తెలుగులో కవితా విప్లవాల స్వరూపం:వెల్చేరు నారాయణరావు, ఆశు సాహిత్యం, గురజాడ-అసంపూర్ణ విప్లవం అధ్యాయంలో 86,87 పేజీల్లో
  4. తెలుగులో కవితా విప్లవాల స్వరూపం:వెల్చేరు నారాయణరావు, ఆశు సాహిత్యం, తిరుపతి వేంకట కవులు:మొదలుకాని విప్లవం అధ్యాయంలో 91పేజీ
  5. తెలుగులో కవితా విప్లవాల స్వరూపం:వెల్చేరు నారాయణరావు, ఆశు సాహిత్యం, భావ విప్లవం
  6. తెలుగులో కవితా విప్లవాల స్వరూపం:వెల్చేరు నారాయణరావు, అభ్యుదయ విప్లవం
  7. తెలుగులో కవితా విప్లవాల స్వరూపం:వెల్చేరు నారాయణరావు, ఆశు సాహిత్యం, దిగంబర కవిత్వం అధ్యాయం
  8. తెలుగులో కవితా విప్లవాల స్వరూపం:వెల్చేరు నారాయణరావు, ఆశు సాహిత్యం, ప్రజల కోసం అధ్యాయంలో 172, 173 పేజీలు
  9. తెలుగులో కవితా విప్లవాల స్వరూపం:2008 ముద్రణకు వెల్చేరు నారాయణరావు రాసిన చివరిమాట