వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2025 04వ వారం
స్వతంత్ర పార్టీ |
---|
స్వతంత్ర పార్టీ 1959 నుండి 1974 వరకు భారతదేశంలో ఉనికిలో ఉన్న సాంప్రదాయిక ఉదారవాద రాజకీయ పార్టీ. జవహర్‌లాల్ నెహ్రూ ఆధిపత్యంలో ఉన్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సామ్యవాద, స్టాటిస్టు దృక్పథానికి ప్రతిస్పందనగా సి. రాజగోపాలాచారి దీనిని స్థాపించాడు.
స్వతంత్ర పార్టీలో అనేక మంది ప్రముఖ నాయకులు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది పాత కాంగ్రెస్ సభ్యులైన సి. రాజగోపాలాచారి, మినూ మసాని, ఎన్. జి. రంగా, దర్శన్ సింగ్ ఫెరుమాన్, ఉధమ్ సింగ్ నాగోకే KM మున్షీ వంటి వారే. ఆవడి, నాగపూర్ సమావేశాల్లో కాంగ్రెస్ వామపక్ష విధానల వైపు మలుపు తీసుకోవడం ఈ పార్టీ ఏర్పాటుకు మూల కారణమైంది.
లెయిసె ఫెయిర్ విధానాలను వ్యతిరేకించినప్పటికీ స్వతంత్ర పార్టీ, మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ, " లైసెన్స్ రాజ్ "ను నిర్వీర్యం చేయాలనే సిద్ధాంతానికి కట్టుబడింది. భారతీయ రాజకీయ వర్ణపటంలో ఆర్థిక విధానాల పరంగా మితవాదిగా (దక్షిణ పక్ష వాదిగా) పరిగణించబడినప్పటికీ స్వతంత్ర పార్టీ, భారతీయ జనసంఘ్ వంటి హిందూ జాతీయవాది లాగా మతాధారిత పార్టీ కాదు. రాజగోపాలాచారి, అతని సహచరులు స్వాతంత్ర్య పోరాటంలో నెహ్రూకు సహచరులుగా ఉన్నప్పటికీ తాము స్వతంత్ర పార్టీని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందో వివరిస్తూ 1960 లో 21 అంశాల మేనిఫెస్టోను రూపొందించారు. ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ స్వతంత్ర పార్టీని తీవ్రంగా విమర్శించాడు. దానిని "ప్రభువులు, కోటలు, జమీందార్లూ ఉండే మధ్య యుగాలకు" చెందినదిగా వర్ణించాడు.
|